పఠనీయం

రసానందాత్మక ఆధ్యాత్మిక కావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సీతారామంజనేయ సంవాదము -
రచయిత
పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి,
పుటలు: 216, వెల: రూ.50/-,
జూలేపల్లి- సాహితీ మేఖల, చండూరు,
ప్రతులకు: అంబటిపూడి వెంకట సుబ్రహ్మణ్యశాస్ర్తీ, ఇం.నెం.1-36/1/12, సిఎంఆర్ బ్లాక్ 1/101, సిఎంఆర్ రెసిడెన్సీ, ఎం.ఎన్.ఆర్. స్కూలు ఎదురుగా, వినాయకనగర్ కాలనీ రోడ్, చందానగర్ పోస్టు, హైదరాబాద్- 500 050
**
డా.దోనెపూడి నరేష్‌బాబు,
శ్రీ షిరిడీ సాయిబాబా దేవాలయము,
జూలేపల్లి, 518674,
గోస్పాడు (మం), కర్నూలు జిల్లా,
**
ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.
*
వాల్మీకి రామాయణం ఒక రసవత్తర కావ్యం. అందులోని కథానాయకుడైన శ్రీరామచంద్రుడు ఒక మహాతత్త్వవేత్తగా, ప్రధాన పాత్రగా ఆవిష్కృతుడవుతూ రూపుదాల్చిన ఒక ఆధ్యాత్మిక విషయ ప్రధాన గ్రంథం అధ్యాత్మ రామాయణం.
బ్రహ్మాండ పురాణం అధ్యాత్మ రామాయణానికి మూలం. అధ్యాత్మ రామాయణ బాలకాండ ప్రథమ సర్గలో ఉమామహేశ్వర సంవాదంగా ఉన్న శ్రీరామ హృదయం అనే చిన్న వృత్తాంతాన్ని తీసుకొని దానిని ఒక మూడు ఆశ్వాసాల ఆధ్యాత్మిక కవితా ప్రబంధంగా 19వ శతాబ్ది ఉత్తరార్థంలో ఒక పండిత కవి తీర్చిదిద్దాడు. పేరు పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి.
శాంకరీదేవికి శంకరుడు శ్రీరామ మంత్రము (తారక మంత్రము)ను ఉపదేశిస్తూ, ఆ సందర్భంగా అసంఖ్యకమైన తాత్త్విక, వేదాంత, థార్మిక, పుణ్యసాధక, జ్ఞానదాయిక అంశాలను వివరించి చెప్తాడు. ఇదే ఈ కావ్యంలోని కథా వస్తువు.
కథా వస్తువు ఏకవాక్య కథనీయమే గాని ఈ కృతిని కవి రూందించిన రచనా శిల్పం మాత్రం అనేకానేక కవితా వస్తువుల కమ్మని రసాయనం.
తారక మంత్రం అయిన ‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే / సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే’ అనే శ్లోకాన్ని-

తే.గీ శ్రీమనోరామ శ్రీరామ రామ రామ
యనుచు రమియింతు రాముని యంద రామ
నామము వరానన! సహస్ర నామ తుల్య
మట్లుగావున దీని నీవవధరింపు-
అంటూ తేటతెల్లముగా తెలుగుచేస్తూనే చివరి వాక్యమును గిరిజకు హరుడుపదేశిస్తున్నట్టుగా ముగించటం ఒక దృశ్య కావ్య రచనా చమత్కృతి.
‘‘నానా నూనుని..’’ (ఏకాక్షర కందం), ‘‘మేను మనము మాసము..’’ (ద్వ్యక్షర కందం) మొదలైన పద్యాలు ఇంలో చిత్ర కవిత్వానికి తార్కాణాలు (పుట నెం.5,6)
ప్రథమాశ్వాస ప్రారంభమే శుద్ధ సత్త్వావాసమా, శివ పార్వతీ నివాసము, సుమహాభాసము, చిద్విలాసము, కైలాసము అంటూ అంత్యప్రాస మనోహరతతో మొదలవుతుంది.
ప్రథమాశ్వాసంలోని 162వ పద్యం ఈ కవి అర్థాలంకార మనోహర శిల్పానికి మచ్చుతునక. ‘‘కామాది ఖగములు గజిబిజులాడగ..’’ అనే పద్యం తాద్రూప్య రూపకాలంకార శోభితం. సందర్భం ‘జ్ఞాన చంద్రోదయ’ వర్ణన. కామనలు అనే పక్షుల సందడి అణగిపోయింది. దేహాభిమానం అనే రవి అస్తమించాడు. జ్ఞానేంద్రియాలు అనే పద్మాలు నిద్రకుపక్రమించాయి. ఆత్మస్పృహ అనే కలువ వికసించింది. లౌకిక స్పృహ, మఱపు అనే చక్రవాకాలు స్థితి తప్పాయి. అల్పవిజ్ఞానకాంతులు అనే తారకలు వెల వెలబోయాయి. నిర్మలమైన మనస్సు అనే చకోరము యొక్క తపన ఉపశమించింది. ఈ పరిణామాలన్నీ ఎప్పుడు ఎందుకు సంభవించాయి అంటే హృదయం అనే ఆకాశాన్ని విరియజేస్తూ చిదానంద జ్ఞానం అనే చంద్రుడు ఉదయించాడు. అప్పుడు అందుకే.
ఇలా ఆధ్యాత్మిక పరంగా ప్రకృతి దృశ్యాన్ని ప్రతిక్షేపించి వర్ణించిన ఈ తీరు అద్భుతం, మహోదాత్తం, మనోజ్ఞం. ఇలా ఈ కావ్యంలో ఎన్నో అర్థాలంకారాలు అందగించాయి.
ఇక ఛందో వైవిధ్యానికి వస్తే ఇంద్రవ్రజ, ఉపేంద్ర వ్రజ, పృధ్వీ, భుజంగ ప్రయాతం, స్రగ్విణి, మాలిని, మానిని, మందాక్రాంత, వసంత తిలక, దండకం- అబ్బ ఎన్నని! సుమారు పాతిక ముప్ఫైకి పైగా వృత్తాలు, జాతులు ఆయా సందర్భోచితాలుగా, ఛందశ్శిల్ప ప్రదర్శకాలుగా తళతళలాడాయి.
మరి వివిధ యోగాసనాలు, ఉదాత్త గుణ లక్షణాలు, నాద- బిందు- కళాది ఆధ్యాత్మిక విషయాలు, సాంఖ్యాది యోగ లక్షణాలు మొదలైనవి సుమారు నూరు అంశాలు ఈ కావ్యం చదివి తెలుసుకోవచ్చు.
ఈ పుస్తకానికి పరిష్కర్త, సంపాదకులు అయిన అంబటిపూడి వెంకట సుబ్రహ్మణ్యశాస్ర్తీగారు అష్టాంగాలు, ఇష్టకర్మలు, పంచకోశాలు మొదలైన వంద పారిభాషిక పదాలకు వివరణలు, కొన్ని ప్రార్థనా దండకాలు, స్తోత్రాలు గ్రంథాంతంలో జోడించి ఈ కృతికి ఒక సమగ్రతను, గంభీరతను, ఉదాత్తతను, ప్రత్యయాన్ని కలిగించారు.
మొత్తంమీద ఈ ఆధ్యాత్మిక కావ్యం పాఠకులకు ఇహపర సాధకం, కావ్య రసానందదాయకమూను.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం