పఠనీయం

విశ్వాసం పెంపొందించే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం కథలు మరియు ఓ చిరునవల
-అమరవాది రామచంద్రమూర్తి
వెల: రూ.100
ప్రతులకు: రచయిత
11-405, స్కైలా గేటెడ్ కమ్యూనిటీ, పుప్పాలగూడ హైదరాబాద్-89

** ** *** ************

మానవ ప్రయత్నం లేకుండా, ఏ దేవుడూ తనకు తాను ప్రత్యక్షమై ‘నరుడా, నీ భక్తికి మెచ్చాను. ఇదిగో నువ్వు కోరుకున్న వరం’ అంటూ ఇవ్వడు. ప్రయత్న ప్రస్థానంలో ఎవరో మనకి తెలియని, లేదా తెలిసిన వ్యక్తి తారసపడతాడు. సాయం చేస్తాడు. అంతదనుక పరిష్కారం అసాధ్యం అనుకున్న సమస్య కాస్త చిక్కుముడి వీడిపోయినట్లు వీడిపోయి సుఖాంతం అవుతుంది. ధైర్యాన్ని వీడక, ఆశను చంపుకోక ‘ఆయన’ మీద పూర్తి విశ్వాసం ఉంచి ప్రయత్నించమని ప్రబోధించే కథలివి. వీటిని సంఘటనల చిత్రణ అనాలో, కథలు అనాలో, వ్యాసాలు అనాలో తెలియదు. వాస్తవిక సంఘటనలకు, నాటకీయత పులిమి అల్లబడిన కథలు. రచయిత వీటిని ‘కథలు’ అంటున్నాడు. కనుక మనమూ అలానే వ్యవహరిద్దాం.
రచయిత మూడు దశాబ్దాల క్రితం భద్రాచలంలో, తాను అధ్యాపక వృత్తి సాగిస్తున్న సమయాన, తన ఎరికలోకి వచ్చిన, కొన్నింటిని తాను స్వయంగా ఎదుర్కొన్న సంఘటనలను ‘విశ్వనాథం’ అన్న పాత్ర ద్వారా చెప్పారనిపిస్తుంది. కొన్నింటి కథాకాలం రెండు మూడు రోజులైతే, మరి కొన్నింటి కథాకాలం కొన్ని ఏళ్లు పట్టింది.
దైవం మీద చెరగని విశ్వాసంతో, తన కర్తవ్యం తాను నిర్వహిస్తే, ఆ భద్రాచల రాముడు తప్పక విజయం చేకూర్చుతాడు అన్న సందేశం అంతర్లీనంగా, ప్రతి కథలోనూ కనిపిస్తుంది.
పోగొట్టుకున్న ఒరిజినల్ సర్ట్ఫికెట్ బజార్లో ఊడ్చేసిన చెత్తకుప్పలో దొరకటం, భద్రాద్రి నుండి కరీంనగర్ ట్రాన్స్‌ఫర్ అయి కూడా, విచిత్రంగా భద్రాద్రిలోనే ఉండగలగటం, అసలు రాములవారి గర్భగుడి దర్శనమే అసంభవం అనుకున్న క్షణాన, ఏకంగా గర్భగుడిలోకే పిలువబడి, మనసు నిండుగా ఆయన్ను దర్శించుకోవటం - ‘ఇవన్నీ, శ్రీరాముని దయ చేతను’ అంటారు రచయిత.
పుస్తకం మీది ‘్భద్రాచలం కథలు’ అన్న టైటిల్‌కు అనుగుణంగా, ఈ కథలన్నీ, ఆనాటి భద్రాచలం పట్టణ వీధులు (రాజవీధి, తాతగుడి సెంటర్) సత్రాలు (పమిడిఘంటం వెంకటరమణ హరిదాసు సత్రం, టిటిడి వారి సత్రం) గోదావరి నది, వరదలు, అధ్యాపకుడిగా కాలేజీ ముచ్చట్లు, భజనమండలులు, అనుకోకుండా వచ్చిన అతిథులు/ అధికారులు, వారిని ‘డీల్’ చేయటంలో విశ్వనాథం అనే పాత్ర ఎదుర్కొన్న కష్టాలు, విశ్వనాథం శ్రీమతి శశికళ ఇచ్చిన సహకారం - ఇవన్నీ - ఒక అనుభవాల ప్రపంచం వెనుక దాగి ఉన్న ఆత్మవిశ్వాసం, భగవద్భక్తీ ద్యోతకమవుతాయి. ఒక్కోచోట ‘విశ్వనాథం’ ఎదుర్కొన్న సంకటాల్ని గమనిస్తే, తిరుపతి తిరుమల దేవస్థానం వారి నాటి కమీషనర్ స్వర్గీయ పి.వి.ఆర్.కె. ప్రసాద్‌గారి ‘సర్వ సంభవామి’ గుర్తుకు వస్తుంది.
భద్రగిరి పుట్టుపూర్వోత్తరాలు (పే.13), శ్రీరాముడి పట్ట్భాషేకం, మహాపట్ట్భాషేకానికున్న తేడా (పే.21) గోదావరి నదికి ఆ పేరు ఎలా వచ్చింది? (పే.37) విజయవాడకు బెజవాడ అన్న పేరు ఎలా వచ్చింది? (పే.44) భద్రాచలం, భద్రాచలం రోడ్‌కు గల తేడా (పే.64) లాంటి విషయాలపై వివరణ బావుంది. నదీ ప్రవాహాన్ని తదేకంగా చూస్తే, దూకేద్దామన్న భ్రాంతికి లోనవుతామట! (పే.42) తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు కనిపించి, నేడు కనుమరుగైన ‘పాపిడి గొట్టాలు’ (పే.130) గురించి రాయటం, ఆనాటి వారి ‘నోస్టాల్జియా’ ను సున్నితంగా తాకి గిలిగింతలు పెడుతుంది.
కథల చివర ‘అధ్యాపకుడి ఆత్మానందం’ అన్న చిరు నవల కూడా ఇవ్వబడింది. ఏడు పేజీల వర్ణచిత్రాలు కూడా ఇవ్వబడ్డాయి.
ఆంధ్రభూమి మాసపత్రికలో ధారావాహికంగా వచ్చిన కథలకు పుస్తకరూపం ఈ సంకలనం.
కర్తవ్యపాలన, ఆత్మవిశ్వాసం, భగవంతుని మీద భక్తి పెంపొందించే సంకలనమిది.

-కూర చిదంబరం.. 8639338675