పఠనీయం

విలువను తెల్పేవి వైరుధ్యాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవుడికి సాయం (కథా సంపుటి)-
వెల:రూ.80/-
రచన: కొల్లూరి సోమశంకర్
ప్రతులు దొరుకు చోటు: H.No. 1-30-28, తిరుమలనగర్, కనాజిగూడ, సికింద్రాబాద్-15,

------------------------------------------------------------------------------------------------------------------

అనువాదకునిగా, యాత్రా కథకునిగా ప్రతిభామతి అయిన శ్రీ కొల్లూరి సోమశంకర్‌గారి స్వంత తెలుగు కథల సంపుటి ‘దేవుడికి సాయం’. 2005-2012 మధ్య రాసిన పదహారు కథలు ఇందులో వున్నాయి. ఈ కథల్లోని అంశాలు కాలిక స్పృహను అధిగమించి వర్తమాన పాఠకులనూ అలరించగలవు. అందుకు హేతువు ఆయన స్వీకరించిన ఇతివృత్తాలు నేటి సమాజంలోనూ ప్రచురితంగా కానవస్తున్నవే.
సోమశంకర్‌గారు కథలు ఎత్తుగడలోనే ఉత్సుకతకు ప్రేరకాలుగా వుంటాయి. అందువల్ల పఠానాసక్తి అనివార్యంగా అలవడుతుంది. మానవ మనస్తత్వ చిత్రణలకు అద్దంపట్టే ఈ కథలు పలు సమస్యాత్మక జీవనాలకు సందేశ స్ఫోరకాలు కూడాను. కథల సంపుటి పేరిటా ‘దేవుడికి సాయం’ కథ మానవసేవయే మాధవసేవ అనే సూక్తిని బలపరిచేదిగా వుండడమే కాదు చమత్కారంగా ముగింపులో కథకుడి సహాయం అందుకున్న వికలాంగుడైన బిచ్చగాడి పేరు ‘దేవుడు’ కావడం విశేషం.
రాగాలా.. సరాగాలా.. సాగే సంసారం కథలో డైరీ పుటలను కథాగమనంలో వినియోగిస్తూ దంపతులమధ్య కమ్యూనికేషన్ ప్రధానమనీ, అది లేకుంటే సుఖ సంసారానికి విఘాతమేర్పడే ప్రమాదముందనీ హెచ్చరించారు. కన్య్సూమరిజం పెరిగిపోయి గ్లోబలీకరణవల్ల హైపర్ మార్కెట్ల సంస్కృతి విస్తరించి అవ్యవస్థీకృత రంగంలోని చిరువ్యాపారులు ఎలా దెబ్బతింటున్నదీ అమ్మకందారుకు కొనుగోలుదారుకు నడుమ ఒకప్పుడున్న మానవీయ బంధం కూడా ఎలా తెగిపోతున్నదీ ‘కొట్టు కనబడుటలేదు’ కథ కమనీయంగా వివరిస్తుంది.
‘అందగత్తె’ కథ అసలు ‘అందం’ అంటే ఏమిటో మిస్ ఇండియాగా ఎన్నికైన రూపకే పోలమాంబరూపంలో తెలియపరుస్తుంది. అందమంటే లావణ్యం, మేధస్సుల కలబోతగా తలపోసే రూప అసలు అందం దయలో, నిస్వార్థగుణంలో, త్యాగంలో వుందని పోలమాంబగారి వలన గ్రహించి ఆమె ఆటోగ్రాఫ్ తీసుకోవడంగా కథ ముగుస్తుంది. ఒక విలువైన సందేశం సంకలించుకున్న కథ.
సాఫ్ట్‌డ్రింక్స్ తయారీకి భూగర్భ జలాలను మల్టీనేషనల్ కంపెనీలు ఎలా వాడేసుకుంటున్నాయో లెక్చరిచ్చే ఒక బస్సు ప్రయాణికుడు ఎం.ఆర్.పి రేటుకన్నా ఎక్కువకి లిక్కర్ కొనడం గురించి ఆలోచించడం అతని అలవాటు కారణంగా కుటుంబం బాధపడుతుందని కథకుడు బలహీనతను అధిగమించే ప్రయత్నం చేయమనడం ‘ఎం.ఆర్.పి’ కథలో కానవస్తుంది.
‘‘నేను అప్పుడప్పుడు కథలు రాస్తూంటాను. రాసేదెక్కువ - పడేవి తక్కువ అని మా ఆవిడ వేళాకోళం చేస్తూంటుంది’’ అని మొదలయ్యే ‘మీ నెంబరు మాకు తెలుసు’ కథ పత్రికలవారు రచనతోబాటు రచయిత సెల్ నెంబర్ ముద్రించడం వలన ఎదురయ్యే అనవసర పరిణామాలను వాస్తవికంగా చిత్రించింది.
‘చోటు’ పర్యావరణ పరిరక్షణావశ్యకతను చాటి చెప్పే కథ కాగా, ‘రైతుకు రొక్కం’ రియల్ ఎస్టేట్ దందాలు రైతు పాలిట ఎలా శాపాలవుతున్నాయో సెల్‌ఫోన్‌ల, మోడరన్ గాడ్జెట్ల దుష్పరిణామాలు ఎలా వుంటున్నాయో అన్న ఎరుకతో సహా వివరించే కథానిక. ఏమయినా క్లుప్తతో, గాఢతతో సోమశంకర్‌గారి కథలు మానవ జీవన వైవిధ్యాలను, వైరుధ్యాలను చూపుతూ బ్రతుకు విలువకై సందేశాలను సంఘటనాత్మకంగా విశదపరిచే కథలు. రచయిత బహుదా అభినందనీయులు.

-సుధామ