పఠనీయం

కన్నీరు పెట్టించే ఎడారిపూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడారి పూలు (నవల)
రచన - సలీం , వెల:రూ.150/-
ప్రతులకు : జె.వి.పబ్లికేషన్స్ ప్రచురణ,
ఫ్లాట్ నెం.82/206, లక్ష్మీనారాయణ అపార్ట్‌మెంట్స్, 3-6-164, హయత్‌నగర్, హైదరాబాద్-29.
=======================================================
తెలుగు కథ, నవలా సాహిత్యంలో తనదైన విలక్షణతను నిలబెట్టుకుంటున్న ప్రముఖ రచయిత ‘సలీం’ కొత్త పుస్తకాల్లో ఒకటి ‘ఎడారి పూలు’. పేద ముస్లిం ఆడపిల్లల జీవన విషాదానికి అద్దం పట్టే నవల ఇది. ఆర్థికావసరాలు సృష్టిస్తున్న అలజడులతో, మధ్యవర్తుల మాటలు విశ్వసించి అరబ్ దేశాలకు పూవుల్లాంటి తమ ఆడపిల్లలను ముసలి షేక్‌లకు పెళ్లి పేరుతో బలిచేస్తున్న కుటుంబాల దీనగాథలెన్నో. అరబ్ దేశాలకు పనిమనుషులుగా వెళ్ళే ఆడవాళ్ళు, డబ్బు సంపాదనపై యావత్ కుటుంబాన్ని వదలి కోటి కలలతో ఎడారి దేశాలకు వలసపోయే అభాగ్య కూలీలు- ఇలాంటి వారందరి వ్యథాభరిత గాథల యథార్థ చిత్రణమే ‘ఎడారి పూలు’ నవల.
తనను నిఖా చేసుకున్న వ్యక్తి ఎలా వుంటాడో పధ్నాలుగేళ్ల ఆ జుబేదాకి తెలియనే తెలియదు. జాల్వా సమయంలో అద్దంలో మొహం చూపిస్తారు కదా అనుకుంటే ఆ తంతునే లేకుండా చేశారు. తన నసీబ్‌లో నలభై ఏళ్ళనాడు రాసిపెట్టబడ్డాడని సర్ది చెప్పుకున్నా తీరా సుహాగ్‌రాల్‌లో అతడు అరవై ఏళ్ళ వృద్ధుడని బయల్పడితే ఆ పసికందు ఏం చేయగలుగుతుంది. ‘‘తండ్రంటే సంరక్షకుడు కదా.. ఇలా కూతుర్ని నూనెలో వేయించిన మాంసం ముక్కలా చేసి ఓ ముసలి అరబ్ పళ్ళెంలో విసిరేసే తండ్రులు కూడా ఉంటారా?’’ అన్న జుబేదా ఆర్తికి ఏదీ పరిష్కారం?
అలాగే ఇద్దరు భార్యలున్న రషీద్‌కు నిఖా అయి వెళ్లిన రెహనా, కనీసం ఉంపుడుగత్తెగానయినా కాక అతని హింసాత్మక రాక్షస రతికి బలి అయ్యే విషాదం, అతని చేతిలోనే కాక అతని భార్యల చేతిలోనే పడ్డ బాధలు గుండెలను పిండేస్తాయి. ఆమెను వేశ్యగా మార్చబోయిన రషీద్‌ను కత్తితో పొడిచి జైలుపాలవుతుంది రెహనా.
జుబేదా, రెహనా వంటి ఆడపిల్లల బ్రతుకులు అరబ్ దేశాలలో ఎంత దయనీయంగా వుంటున్నాయో ఈ నవల విశదపరుస్తుంది. అఫ్జల్ అహ్మద్, బాబూమియా వంటి మంచి మనుషులుండటంవల్ల ఒక ఆశావహ స్థితిని నవల ప్రోదిచేస్తుంది.
‘‘మన దేశాలు వేరైనా, భాష వేరైనా, మతమేదైనా మనందరిదీ ఒకటే జాతి. కార్మిక జాతి. మనం చాలా సందర్భాల్లో సోదర కార్మికులు ప్రమాదవశాత్తు క్రిందపడి మరణించినపుడు సదరు యాజమాన్యాలతో సంఘటితంగా పోరాడి అతని కుటుంబానికి నష్టపరిహారం అందేలా చేశాం. ఇపుడు హైదరాబాద్ నుంచివచ్చిన మన సోదరి మోసపోయి జైల్లో మగ్గుతోంది. ఆమె చేసిన తప్పు తన కన్నా వయసులో పెద్దవాడైన ఓ దుబాయ్ షేక్‌ని నమ్మి నిఖా చేసుకోవడం. అతను పెట్టే హింసని భరించలేక ఎదురుతిరిగినందుకు కోర్టు ఏడాది శిక్షతో బాటు పదివేల దిర్హమ్‌ల జరిమానా విధించింది. ఆ సోదరి మనలానే పేదరికంలో మగ్గుతోంది. సోదర కార్మికులారా.. మీ అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే. ఒక్కొక్కరు ఒక్క దిర్హమ్ దానం చేయండి’’ అంటూ అహ్మద్‌మియా కార్మికులను సంఘటితం చేయడం, బాబూమియా రెహనా విడుదలకు పూనుకోవడం మానవత్వం బ్రతికే వుందని నిరూపిస్తాయి.
అరబ్ దేశాలకు అమ్ముడుపోతున్న పేద ముస్లిం స్ర్తిల, కార్మికుల విషాద జీవనాలకు అద్దంపట్టిన నవల సలీం ‘ఎడారి పూలు’. చదివి ఆలోచింపజేసే ఓ మంచి నవల.

-సుధామ