పఠనీయం

పూలజడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూలజడ పరిచయం
వెల:రూ.80/-
ప్రతులకు:స్వప్నిక్ పబ్లికేషన్స్, సృజన చిల్డ్రన్ హాస్పిటల్, నియర్ ఓల్డ్ బస్‌స్టాండ్, సిరిసిల్ల-505301
=======================================================

‘‘బంగారు జడ కుప్పెలు వేసుకుని, మల్లెపూల పెద్ద జడ వేసుకుని,, పట్టులంగా జాకెట్ వేసుకుని, చెవులకు బుట్ట లోలకులు, మాటీలు, చెంప స్వరాలు పెట్టుకుని, కాళ్లకు ఘల్లు ఘల్లుమనే మువ్వల సవ్వడితో ఆడపిల్ల నట్టింట్లో తిరుగుతుంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి వచ్చినట్లే ఉంటుంది’’ అనే ఒక నాయనమ్మ ముద్దుల మనవరాలు రాణి.
అయినింటి ఆడపడుచు, అపురూపంగా పెరిగిన అందాల బాల. పాటలు పాడడం, బొమ్మలు వేయడం, ఇంట్లోనూ బళ్లోనూ బోలెడు ఆటలు, స్నేహ సంపదను ప్రోది చేసుకోవడం, బుద్ధిగా చదుకోవడం, చిన్నప్పటినుండే మంచిని మర్యాదించడం, పెద్దలను గౌరవించడం, ప్రత్యేక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే దిశగా పుస్తక పఠనం, కమనీయ కవిత్వం రాయడం - ఇలా అనేకానేక విద్యలు నేర్చి ఏమీ మరువకుండా అనుభవాల అనుభూతుల్ని గుండెలో పదిలపరచుకున్న భాగ్యశాలి కందేపి రాణీప్రసాద్.
ఒక జ్ఞాపకం చాలు వేయి వసంతాలు విరియడానికి. గతంలో ‘పూలతోట’, ‘సీతాకోకచిలుక’కు జతగా తాజాగా ఈ పూలజడ. ఈ శీర్షికలే చెబుతాయి తూనీగలా ఎగిరే రచయిత్రి మనోభావనల్ని. ఆత్మగతానుగతంగా ఊహ తెలిసినప్పటినుంచి ఈనాటిదాకా ‘‘బాల్యం ప్రతి మనిషి జీవితంలో వరం. ప్రస్తుతం వున్న ఒత్తిళ్ల యుగంలో కాసేపు సరదా సన్నివేశాలు కానీ బాల్యపు అనుభూతులు కానీ చదవడమో, చూడటమో చేయడం వలన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. రేపటి మన భవిష్యత్‌తరమైన పిల్లలు మంచి దారిలో నడవాలంటే మంచి సమాజాన్ని మంచి ఆలోచనలని, మంచి సాహిత్యాన్నీ అందించాలి. అది మన బాధ్యత. మానసిక ఒత్తిళ్లు తగ్గాలంటే కళలు అవసరం’’ అంటూ ఒక లక్ష్యంతో, హృద్యంగా విభిన్న అనుభవానుభూతుల అ సుమాలతో తీర్చిదిద్దిన పూలజడ ఇది.
ఇందులోని పదహారు గల్పికలు ప్రతి పఠితనూ బాల్య స్మృతులలో ఓలలాడిస్తాయి. గొప్ప నాస్టాల్జియా! వేటపాలెం, చీరాల, ఇంకొల్లులో జీవనయానం సాగిన తీరు రచయిత్రి ఆటోబయోగ్రఫీలా రాశారు. పిల్లలూ పెద్దలూ కూడా ఎంతో ఇష్టపడే, రచయిత్రికే ప్రత్యేకమైన ముచ్చటైన కథన శైలి. చక్కని భావుకతతో కూడిన భాష, కించిత్ హాస్యం, నిజాయితీ, స్పష్టత ఆమె వ్యక్తిత్వానికి అద్దం పట్టాయి. స్కూల్లో రేడియో క్లాస్ ఉంటే ఏ పీరియడ్ బుక్స్ ఆ టైం టేబుల్ ప్రకారం పట్టుకు రావాలని టీచర్ చెప్పారని ఇంటినుండి తనూ స్నేహితురాలూ కలిసి రేడియోని స్కూల్‌కి మోసుకెళ్లడం, ప్రధానోపాధ్యాయుడి చేత అక్షింతలు వేయించుకోవడం, హిందీ పరీక్షలో ‘కిసాన్’ అన్న పదానికి అప్పట్లో సోడాలో కలుపుకుని తాగే వేసవి పానీయం అని రాయడం వంటి అమాయకత్వంతో కూడిన ప్రహసనాలు చదువరి మనసును మురిపిస్తాయి. చదివి, పిల్లలకి వినిపింపజేయాల్సిన విషయ పరిజ్ఞానం అందించిన రచయిత్రి అభినందనీయురాలు. బాల సాహిత్య కౌముది, బాల సాహితీ పూర్ణిమ బిరుదాంకితురాలు. పదకొండు సంవత్సరాలు వార్త మొగ్గ పేజీలో ‘సరదా సరదా బొమ్మలు’ శీర్షిక నిర్వహించిన, చిత్రకారిణి, హస్తకళాకారిణి, సైన్స్ రచయిత్రి, పలు గిన్నీస్ అవార్డులు పొందిన ఇంటలెక్చ్యువల్ డాక్టర్ కందేపి రాణి తమ సృజన చిల్డ్రన్ హాస్పిటల్లో వైద్య చికిత్సతోపాటు సాహిత్య చికిత్స కూడా చేస్తున్నారు. ఇంతగా ఎందుకు చెప్పడం అంటే ఈ తరహా వ్యక్తిత్వం, సాహిత్య రచన అరుదుగా జతగూడుతుంది.
గుడిపాటి ముందుమాట సంతరించిన పూలజడ నిజంగా అచ్చమైన జ్ఞాపకాల సమాహారం. పూలజడ వేసుకుని మురిసిపోయే ఆడపిల్లలందదరికీ అంకితం. అందుకోవాలనుకున్నవారికి అపురూప కానుక.

-కె.బి.లక్ష్మి