పఠనీయం

వేదాంతాది భావాలు గల భక్తియే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహగిరి వచనములు - కృష్ణమాచార్య
ప్రణీతము. సంపాదకుడు, పరిష్కర్త: డా.ఎం.కులశేఖరరావు, తెలుగు సాహిత్య అకాడమీ ప్రచురణ, కళాభవన్, రవీంద్రభారతి, హైదరాబాద్-4, వెల:రూ.40/-
===================================================================

పద్యం, వచనం రెండూ వున్నవాటిని చంపూ కావ్యాలంటారు. నిజానికి సాహిత్యపరంగా పద్యం రాయడం కంటే మంచి వచనం రాయడమే సాహితీ వైదుష్యానికి నికషోఫలంగా భావించాలి. వచనరచనం కావ్యమునకు ప్రశస్తమైనదని, పాఠకులకు సుబోధకమయినదని గుర్తించి తెలుగు భాషలో అందునా వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి వచన రచనము చేసినది కృష్ణమాచార్యులవారే. ‘సింహగిరి వచనములు’ తొలి గద్య రచన. 14వ శాతాబ్దిలో వైష్ణవ మత భక్తి వ్యాప్తికై కృష్ణమాచార్యులవారు సృజించిన కొత్త ఒరవడి ‘సింహగిరి వచనాలు’. 1968 వరకు వ్రాతప్రతిగానే ఉండిపోయిన దీనిని తొలుత ఆంధ్ర రచయితల సంఘంవారు ముద్రించగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పక్షాన ఇరివెంటి కృష్ణమూర్తిగారు రాము కార్యదర్శిగా వుండిన 1980లో దీనిని పునర్ముద్రించారు.
కృష్ణమాచార్యులవారి ‘సింహగిరి వచనాలు’ వ్రాతప్రతిని పరిష్కరించి, ప్రామాణికమైన పీఠికను సంతరించి ఇచ్చినవారు ఆచార్య ఎం.కులశేఖరరావుగారు. ఆంధ్ర వచన వాఙ్మయ పరిశోధకులయిన వారి చేతిలో ఈ గ్రంథం ఎంతో విలువను సంతరించుకుంది. 14వ శాతాబ్దనాటి తెలుగు వచనాన్ని, తెలుగుసమాజాన్ని, తెలుగు భాషను అవగతం చేసుకోవడానికి ఎంతో ఉపకరించే ఈ గ్రంథాన్ని తాజాగా తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించడం ఎంతయినా అభినందనీయం. కృష్ణమాచార్యులది మహబూబ్‌నగర్ జిల్లా సంతవూరు గ్రామం. తెలంగాణ ప్రత్యేక అధ్యయనాల ఛిత్తికపై ఈ గ్రంథం ఇలా ఈ తరానికి అందించడం ఆనందదాయకం.
‘సింహగిరి వచనములు’లో వేదాంతాది భావాలు వున్న భక్తియే ప్రధానం. శరణాగత భావమే హృదయదఘ్నంగా ‘స్వామీ! సింహగిరి నరహరీ, నమో నమో దయానిధీ’ అనే మకుటంతో ఇందులోని అరవై వచనాలూ శైవసారళ్యంతో ద్యోతకమవుతున్నాయి. సాధారణంగా కావ్య పురాణాదులలో ఫలశ్రుతి ముగింపులో చెప్పబడుతుంది గానీ ఇందులో కృష్ణమాచార్యులు ఆదిలోనే - నీ దివ్య నామ సంకీర్తన వినినందుకు, ఈ వచనాలు ఎవరు చదివినా, విన్నవారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు నీవు కృప చేతువు అని ఆరంభంలోనే పేర్కొంటాడు. వేయి పుణ్యంబులు చేసి నరుడై జన్మిస్తాడనీ, రెండు వేల పాపంబులు చేసి స్ర్తియై జన్మిస్తాడనీ, పదివేల పాపంబులు చేసి పంచాంగం చెప్పే బ్రాహ్మణుడై జన్మించుననీ, పనె్నండు వేల పుణ్యాలు చేసి శ్రీమద్భాగతులై, శ్రీవైష్ణవులై జన్మింతురనీ వెల్లడించే భావాలు ఈనాడు అంత ఆమోదయోగ్యాలుగా లేకపోయినా ఆనాడు వైష్ణవ మత వ్యాప్తినుద్దేశించి చేసిన రచనలు కనుక అట్టి భావాభివ్యక్తీకరణం జరిగిందనుకోవచ్చు.
కృష్ణమాచార్యులు రచించిన సంకీర్తనలనబడే ఈ వచనాలు తంజావూరు సరస్వతీమహల్ గ్రంథాలయం తాళపత్రాలలో నిక్షిప్తమై లభించాయి. లభించిన మేరకు పరిష్కరించి ఇలా గ్రంథంగా కూర్చబడ్డాయి. కృష్ణమాచార్యుల జీవితం గురించి ఏకామ్రనాథుడు రచించిన ‘ప్రతాపచరిత్ర’ అనే వచనగ్రంథంలో కొన్ని విశేషాలు లభించాయని కులశేఖరరావుగారు ఉపోద్ఘాతంలో వివరించారు. కృష్ణమాచార్యులు సంపన్నుడై గ్రామాధికారం వహించడానికి ఓరుగంటి రాజు ప్రతాపరుద్రుని ఆదరణ ఉందని తెలుస్తోంది. రాగి రేకులపై వచనాలను చెక్కించే సంప్రదాయం కృష్ణమాచార్యులే స్థాపించారనీ తాళ్ళపాక అన్నమాచార్యులు అదే ఫణితిలో తన సంకీర్తనలను భద్రపరిచారనీ అంటారు. 1265-1270 ప్రాంతాలలో కృష్ణమాచార్యులు జన్మించి వుంటారని ప్రతాపరుద్ర చక్రవర్తిని ఆయన దర్శించిన వృత్తాంతం ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనంగారి సిద్దేశ్వర చరిత్రలో వుందనీ కులశేఖర్‌రావుగారు పేర్కొన్నారు.
కృష్ణమాచార్యుల ఈ సింహగిరి వచనాలులో వైష్ణవుల యొక్కయు, విష్ణ్భుక్తి యొక్కయు ప్రాశస్త్యాన్ని తెలిపే కొన్ని గాథలు కూడా వర్ణింపబడ్డాయి. కొన్ని అద్భుత సంఘటనల ప్రస్తావనలున్నాయి. అవి పరంపరాగత కథలు కావడంవల్ల కృష్ణమాచార్యులవారు గ్రహించి వుండవచ్చు.

-సుధామ