పఠనీయం

శ్రీ వేంకటేశ్వర సహస్ర నామావళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవేంకటేశ సహస్రనామావళి (వరివస్యా వ్యాఖ్యాసమేతము)
- వ్యాఖ్యాత: డా. కె.వి.రాఘవాచార్య, పేజీలు:374, వెల:రూ.432/-
ప్రతులకు:డా. కె.వి.రాఘవాచార్య, 106, శ్రీపాద కేశవ టవర్సు, 11-35, ఎస్.వి.నగరు,
తిరుపతి- 617502. ఫోన్: 9704342668.
-------------------------------------------------------------------------------------------------------------------
నిరంతర సాహిత్య కృషీవలులు, శ్రీ వేంకటేశ్వర సాహిత్య సేవకుడు అయిన శ్రీ కె.వి.రాఘవాచార్యులవారు శ్రీ వేంకటేశ్వర సహస్రనామాలకు చేసిన అద్భుత వరివస్యావ్యాఖ్యాన గ్రంథమే ఇది.
ఈ వేంకటేశ్వర సహస్రనామాలలోని ఒక్కొక్క నామం ఒక మంత్రమని సంప్రదాయజ్ఞుల విశ్వాసం. అందువలన మొత్తం నామాలన్నీ కలిసి మంత్రశాస్త్ర విధానంలో ఇది ఒక మహామాలామంత్రమవుతుంది. ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో 12వ అధ్యాయంలో వసిష్ట నారద సంవాదతాత్మకంగా ఉన్నది.
రచయిత ఈ గ్రంథానికి ముందుగా వ్రాసిన ‘ప్రరోచన’లో ఈ నామాల చరిత్ర, ఎవరెవరు ఎలా పూజించారో, వాటికి ఆ రాజులచే కేటాయించబడిన ఖర్చులు- వీటి వివరాలు తిరుమల ఆలయానికి గల వివిధ ప్రాకారాలలోని గోడలపైన చెక్కబడిన శాసనాలలో వివరించబడినది ఇచ్చారు. అలాగే ఈ నామాలు కొన్ని విష్ణుసహస్రనామాలలో సుమారు 130 ఉన్నవని చెప్పారు. ఇంకా వేంకటేశుని చరిత్రను, వేంకటాచలమునకు సంబంధించినవి 56 నామాలు మాత్రమే ఉన్నవని అన్నారు. శ్రీ వరాహస్వామికి సంబంధించిన నామాలు ఏడు, మిగిలిన నామాలు భగవంతుని వివిధ అవతారాలకు, గుణాదులకు సంబంధించినవని చెప్పారు.
శ్రీ ఈ.ఏ.శింగరాచార్యులవారు తమ ముందుమాటలో (వరివస్యావైభవం) వ్రాస్తూ శ్రీ వేంకటేశ్వర సహస్రనామాలను తెలుగులో ఇంత విశదమైన వ్యాఖ్య రాలేదన్నారు. ఇంకా మొదటి 67 నామాలు స్వరూప విశేషాలు, తరువాత సుమారు 400 నామాలు పలు అవతారాల వైభవాన్ని తెలుపుతున్నాయి. మత్స్యావతారం, అమృతమథన, కూర్మ, ధన్వంతరి, మోహినీ అవతారాలు, వరాహావతారం, నృసింహావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కల్కి అవతారం, అంతరాదిత్యరూపం, హయగ్రీవ అవుతారం, గజేంద్ర మోక్షం ప్రస్తావించబడ్డాయని చెప్పారు. ‘శ్రీవేంకటేశాయనమః’ అనే మొట్టమొదటి నామానానికి రచయిత ఇచ్చిన సమగ్రమైన వ్యాఖ్యాన వివరణ వ్యాఖ్యాత యొక్క సమర్థతకు, బహుముఖమైన ప్రతిభకు, విషయ పరిజ్ఞానానికి, విషయ ప్రతిపాదన కౌశలానికి నిదర్శనం. ‘వేం’ ‘కట’ అనే రెండు పదాలకు వివరణ పురాణాలను ప్రమాణంగా చెప్పుతూ వివరించారు. అలాగే ‘సేతుకృతే నమః’ వ్యాఖ్యకు రచయిత ఎన్నో సాక్ష్యాలు తంజావూరు గ్రంథాలయం నుంచి సంపాదించి దీనిలో వేసిన చిత్రపటం, వీరి నవీన పరిశోధనా నైపుణ్యాన్ని వ్యక్తపరుస్తున్నది.
అలాగే ‘సర్వభక్త సముత్సుకాయ నమః’ నామాన్ని వ్యాఖ్యానించేటప్పుడు, కాకినాడ కోర్టులో 15-10-1888న శ్రీ వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రత్యక్షమై తన భక్తుని రక్షించటానికై సాక్ష్యమిచ్చాడు (పే.185). తన భక్తుడైన నల్లప్ప శెట్టి రెండు వేల రూపాయలు అతడి మిత్రుడైన ఖాసిం సాహెబు నుంచి అప్పుగా తీసుకుని తరువాత తీర్చేసినా, ఖాసిం తన అప్పు తీర్చలేదని శెట్టిమీద దావా వేస్తే స్వామి సాక్షిగా కోర్టుకు వచ్చి సాక్ష్యమిచ్చాడట. ఆస్తికులు ఇది నమ్మినా అప్పు తీసుకున్న రూపాయలు అనగా రెండువేలు - ఇది కొంత అనౌచిత్యముగా ఉన్నది. ఎందుకంటే అప్పుడు రెండు వేలు అంటే చాలా పెద్ద మొత్తము. ఇంకొక నామం ‘బ్రహ్మోత్సవ సముత్సుకాయ నమః’ నామానికి వ్యాఖ్యత సుదీర్ఘ వ్యాఖ్యానం చేశారు (పు.330). బ్రహోత్సవ ఆవిర్భావం, దాని వైశిష్ట్యము, ఆంగ్లంలో ఇచ్చిన ఎక్స్‌ట్రాక్ట్- ఇలా అన్నీ ఇవ్వటం వ్యాఖ్యాత యొక్క విషయ పరిజ్ఞానానికి నిదర్శనం. గ్రంథం చివరలో అకారాది క్రమంలో నామాలు, పుట సంఖ్య, అలాగే స్తోత్రం, విడిగా నామాలు ఇవ్వటం పాఠకులకు ఎంతో ఉపయోగిస్తుంది. ఇటువంటి అద్భుతమైన వ్యాఖ్యాన గ్రంథాన్ని సరళంగా తెలుగులో అందించి ఇచ్చిన వ్యాఖ్యాత పాండిత్యాన్ని విషయ కౌశీలతను, విషయ పరిజ్ఞానాన్ని- అంతటికీ మించి శ్రీ వేంకటేశ్వరుని సేవలను మరియొకసారి అభినందిస్తున్నాను. ప్రతి ఆస్తికుడు పఠించి తెలుసుకొనవలసిన గ్రంథమిది.

-నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ 9849793649