పఠనీయం

వృత్తి జీవుల జీవన పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెక్కాడినంతకాలం.. నవల - రచన: సుంకోజి దేవేంద్రాచారి, వెల:రూ.200/-
ప్రతులకు:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్ మరియు విశాలాంధ్ర బుక్ హౌస్
==============================================
రెక్కాడినంత కాలం.. రెక్కాడుతుంది, డొక్కాడదు. ఇదీ బడుగు జీవుల కథ. కాదు వ్యధ...
రమణ, శివమ్మ దంపతులుది రాయలసీమలోని ఓ మారుమూల పల్లెటూరు. వడ్రంగి వృత్తితో పొట్టపోసుకుంటూ, కూలి పనికి వెళ్తుంటారు. ఒక పాప, బాబు సంతానం. బ్రతుకుదెరువుకు వున్న ఊరు వదిలి వేరే ఊరుకు పోవటంతో నవల మొదలవుతుంది. రమణలో ఎంతటి ప్రతిభ వున్నా, ఆయన అమాయకత్వంతో ఏ రోజుకారోజు గడవటమే కష్టంగా ఉంటుంది. వడ్రంగిగా రైతుగా శ్రమ దోపిడీకి గురి అవుతూ ఉంటాడు. విశ్వకర్మకు వారసులమని అందరికీ అన్నిరకాల పనిముట్లు చేసి ఇచ్చి అందరి జీవనోపాధికి ఊతమిచ్చే శివయ్య మాత్రం తన జీవితాన్ని బాగుచేసుకోలేక పోతుంటాడు. కాలక్రమేణా కూతురు లక్ష్మికి పెళ్లయి అత్తారింటికి వెళుతుంది. అక్కడ కూడా శివయ్య తాను అల్లుడికి వాగ్దానం చేసిన సొమ్ము ఇవ్వలేకపోతాడు. కొడుకు నరేంద్ర చదువులో చురుకైనవాడు. అయినా కూడా కొడుకు చదువు కొనసాగించలేకపోతాడు. తండ్రితోపాటు వడ్రంగి పనికి చదువుకు అనుబంధంగా వెళ్తూంటాడు. అయినా దారిద్య్రం ఆ కుటుంబాన్ని వెన్నంటే వుంటుంది. తండ్రికీ తనకూ తిరుపతిలో ఉద్యోగావకాశాలుంటాయని భావించిన నరేంద్ర తల్లిదండ్రులను తిరుపతి రమ్మని ఉత్తరం రాయటంతో నవల ముగుస్తుంది. పల్లెలను, పల్లీయులను మింగుతున్న నగర జీవితం రమణ శివమ్మ దంపతులను డొక్కాడేట్లు చేస్తుందా? లేదా అన్నది పాఠకుల ఊహకు వదిలిపెడుతూ నవల ముగిస్తాడు రచయిత. కథాకాలం 1975 దరిదాపుల్లోది. స్కైలాబ్ పడుతుందన్న వార్తతో ప్రపంచం అతలాకుతలం అవుతున్న సమయం. వర్ణవివక్షతకు బలికావటం, అగ్ర కులాలు నిమ్నకులాల మధ్య పైకి చెప్పలేని వివక్షత, ఆర్థిక లేమి, ప్రస్ఫుటమవుతుందీ నవలలో. ఎన్నోసార్లు నరేంద్ర ప్రతిభ ఉండి కూడా అణిచివేయబడటం.. అగ్ర కులాల వారితో పోల్చుకుంటూ, తమ దారిద్య్రాన్ని నరేంద్ర ప్రశ్నించుకోవటం, దేశం ఇంకా కుల మతాల కంపులోనే కొట్టుమిట్టాడుతున్నదన్న అంశం విశదమవుతుంది. అయితే ఈ పరిస్థితి ఇంకా ఇట్లే వుంది అని నేటి కాలంలో అనుకోలేము. ‘‘జీవితానుభవాలను కాలానుగుణంగా పేర్చుకుంటూ సాగిందన్న ఈ నవల సజీవ జీవన శకలాల కూర్పు’’ అని మధురాంతకం నరేంద్ర గారు, ‘‘తెలుగు శ్రామిక వర్గ నవలా సాహిత్యంలో ఈ నవల మరో చేర్చుక్క’’ అని ప్రముఖ విమర్శకులు శ్రీ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గారలు ఇచ్చిన ‘కితాబులు’ ఎంతో సమంజసంగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ 2014లో నిర్వహించిన పోటీలో ఈ నవలను ఎంపిక చేశారు. రెక్కలు ముక్కలు చేసుకున్నా కడుపు నిండని, గూడు దొరకని వృత్తి పనివారలకు ఈ నవలలోని పాత్రలు ప్రతీకలు.

-కూర చిదంబరం.. 8639338675