పఠనీయం

‘తూగోజి’ యాస, భాషల సొగసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకిబొడ్డు కధలు- రచయిత: చిరంజీవి వర్మ
వెల:రూ.200/-, ప్రతులకు:ఎమెస్కో, విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవోదయ, నవచేతన వగైరా.
*
రమణజీవిగారి అందమైన అట్టమీది బొమ్మ, అంతే అందమైన హార్డ్ బౌండ్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకోగానే ‘‘ఎవరీ చిరంజీవి వర్మ’’ అనుకుంటూ పాఠకుడు ఒకింత ఆశ్చర్యానికి లోనవుతాడు. నిజమే! జర్నలిజంలో నిష్ణాతుడై, అంతరాజలంలో మాత్రమే కథలు రాస్తున్న చిరంజీవి వర్మ మొట్టమొదటి కథా సంకలనం ఇది.
తూర్పు గోదావరి జిల్లాల్లోని కొన్ని గ్రామీణ ప్రాంతాలను నేపథ్యంగా రాసిన కథలివి. ‘రాయటం’ అనటం కంటే ‘చిత్రీకరించిన’ అన్న పదం సబబు అనుకుంటాను.
ఈ పనె్నండు కధల్లోనూ చిరంజీవి బాల్యం ఉంది. కధల్లో వివరించిన సన్నివేశాల్లో రచయిత చిరంజీవి ఉంటాడు. కధాకాలం బహుశా 30-40ఏళ్ళ క్రిందటిదై ఉంటుంది. కధల్లో బాల్యపు అనుభవాలు, కల్పనలు రెండూ ఉన్నాయి. రెంటినీ ఎలా ‘మిశ్రమం’ చేయాలో బాగా తెలిసిన ఈ రచయిత కలం వరద గోదారై ప్రవహించింది.
దంతులూరి సత్యన్నారాయణ, నంబూరి సూర్యనారాయణరాజు, కొండూరి రామరాజుగారు, పేరిచర్ల పెద పరశురాంగారు, వత్సవాయి శివనాగరాజు- వీళ్లందరూ కధల్లోని పాత్రలు. ఇంటిపేరుతో సహా ఇవ్వటంవల్ల ఆ పాత్రలు నిజ జీవితాలకు నిలువుటద్దాలేమో అని అనిపిస్తుంది. తూ.గో యాసలో కధా నిర్మాణం, ఎన్నోచోట్ల పదాల గారడికి పాఠకుడు ముగ్ధుడైపోతాడు. ‘‘మాజీలయిపోయినా ఇంకా తాజాగానే ఉన్నాడట’’ ప్రెసిడెంటు కృష్ణంరాజు, అదే కధలో ఏడుకొండలగారు ‘పేపరు పలారం చేసేత్తన్నాడట’, గంగాధర రాజుగారబ్బాయి మీసాల రామం కాదు-ఆడు సీసాల రామంగాడు, కన్యాశుల్కంలో వెంకటేశం, గిరీశం, అగ్నిహోత్రావధానుల ముందు ఇంగ్లీషు మాటలు గుర్తుకు వస్తాయి. సీత మామయ్య చిరంజీవిని ‘హౌ ఓల్డార్యూ, వాటీజ్ యువర్ నేమ్, పార్డన్’ - మరాద్దప్పేరు కధలో ప్రశ్నిస్తోంటే, ఇక రచయిత అక్షరాల్తో గీచే చిత్రాలకు కధల్లో కొదవేం లేదు. ‘తెల్లగుడ్డలో తన తన్నాడు తున్నాడట (కాకిబొడ్డు), ఆ వచ్చే సుట్టం గాదెత్రాజు కూతురు (నివురుగప్పిన పరువు), ‘పచ్చగా పసుపు కొమ్ములా ఉందట. మచ్చుకి (శాంపిల్) తెచ్చిన వడ్లు ‘బంగారపు గింజల్లా మెరుస్తున్నాయట’ గాదెల్రాజు గారి అరచేతిలో (పే.74). సంకలనంలోని ఒక్కో కధ చదువుతూంటే, ఆ సన్నివేశం మన కళ్ళెదుటే జరుగుతోందన్నంత సహజత్వం ఉంది. మచ్చుకి ఈ వర్ణన చూద్దాం-
‘‘గదుల పెట్టెలోంచి రెండు వెల్లుల్లిపాయలు తీసి, వాటిని ఆమాందస్తాల్లో రేకులు రేకలుగా విడదీసి పడేసి, బండతోరెండు పోట్లు పొడిచి’’, ‘‘పొడవాటి గరిటలో నూనె పోసి దాన్ని పొయ్యిలోపల సలసల మరగబెట్టి, అందులో కరేపాకు, ఎండుమిర్చి ముక్కలు, వెల్లుల్లిరేకలు వేసి దోరదోరగా వేగనిచ్చి, పొయ్యిమీద ఉడుకుతున్న కూరలో ‘సుఁయ్’మంటూ తాళింపు వేసి, చటుక్కున మూతెట్టేయటం (ఏ నిమిషానికి పే.112)- పాఠకులకు దృశ్య శ్రవణం అవటంలేదూ. బి.టెక్కులు చదివి, హైటెక్కు సిటీలో పనే్జసే నేటి తరానికి ‘గరిటపోపు’ తెలీకపోవచ్చునేమో కానీ, అరవయికి కాస్తిటూ అటూ వున్న వాళ్లందరికీ ఈ ‘గరిటపోపు’ను గుర్తుకు తెస్తాడీ రచయిత.
రచయిత క్లోజ్ అబ్జర్వేషన్‌కు పాఠకుడు ఫిదా అయిపోవాల్సిందే. అప్పట్లో నశ్యం పీల్చేవారు. దానికి ఓ చిన్న పొడుం కాయ వెంట ఉంచుకునేవారు. పొడుంకాయ మూత తీసినప్పుడు ఒక్కోసారి మూతకు కూడా నశ్యపుపొడి అంటుకునివుండి మూత తీయగానే కొంత నశ్యం బయటకు రాలేది. అలా రాలకుండా ఉంటానికి, మూత తీసేముందు మూతపై వేలితో తట్టేవారు. ‘సమఉజ్జీ’ కధలో నశ్యం పీల్చే కాసుగారు కూడా ‘పొడుంకాయ వెండితొడిమీద వేలితో కొడతాడు (పే.3), కులాలవారీ కాదు-గోత్రాలవారీగా కూడా ఊరు విడిపోయిందట (సమఉజ్జీ).
రచయిత కధాశిల్పం అవగాహన కావాలంటే- ‘కాడొరిగింది’ చదవాలి. కాలవగట్టుమీదున్న మాణిక్యాలమ్మని చితకబాదుతున్నాడు రామన్నయ్య. ఆ దెబ్బల ధాటికి ఆవిడ చీర చిరిగి పీలికలవుతోంది (పే.58). ఎవరీ మాణిక్యాలమ్మ అన్న విషయం- ఆవిడ కాలువగట్టు మీదున్న గుడిలో దేవత అని చివరగ్గాని తెలీదు. కధల్లో, ఎక్కడా, మనక్కనిపించకుండా, కధ నడపుతాడు రచయిత. అందుకే పాఠకుడు కధలో ‘మమేకం’ అవుతాడు. టోరీ, తాయితీ, మరకాళ్లు, బలువార, కంచిత్రం ముల్లు, కోస, కూర (పే.46) లాంటి వాడుకలో పాతగా లేని పదాలను జొప్పించి భాషలోని మాధుర్యం చవిచూపుతున్నారు రచయిత. జీవన విధానం మారినపుడు కొత్తనీరు వచ్చి పాత నీటిని కొట్టేసినట్లు పాత పదాలు మూలనబడటం సహజం. కధా సంకలనానికి ముందుమాట రాసిన వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారన్నట్లు- రచయిత ఏ సిద్ధాంతమూ, సందేశమూ చూచాయిగా కూడా చెప్పుడు. ఇదే కధల్లోని గొప్పతనము, రచయిత ప్రతిభ.

- కూర చిదంబరం 8639338675