పఠనీయం

మనోవికాస ‘వ్యాసికా’ సంకలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అంతటా.. అతడే’ (్వ్యస సంకలనం)
ఠచయత: నీలంరాజు లక్ష్మీప్రసాద్, పుటలు : 184, వెల : రూ. 150/- లు సోల్ డిస్ట్రిబ్యూటర్స్, నవోదయా బుక్‌హౌస్, ఆర్యసమాజ్ ఎదురువీధి, కాచీగూడా, హైదరాబాద్ -27
==============================================================
జీవితానుభవం అందరికీ వుంటుంది. పఠనానుభవం చాలామందికుంటుంది. అది అధ్యయన పూర్వకంగా కొంతమందికే వుంటుంది. అధ్యయనం చేసినదాన్ని అందంగా, ఆకర్షణీయంగా, అభిరుచి పరికల్పంగా చెప్పటం చాలా కొద్దిమందికే ఉంటుంది. ఈ చివరి కోవకు చెందిన భావుక రచయిత శ్రీ నీలంరాజు లక్ష్మీప్రసాద్. ‘నీ స్వధర్మమేమిటో కనుక్కో’, ‘ఆలోకన (1, 2), ‘నీతోనే నీ నీడ’ మొదలైన ఎన్నో జీవిత తత్త్వ, ఆధ్యాత్మిక, సామాజిక విషయ వికాస దర్శన గ్రంథాలు రాసి, ప్రశంసలందుకున్న లక్ష్మీప్రసాద్ ఇటీవల ‘అంతటా.. అతడే’ అనే మరొక అలాంటి మంచి పుస్తకం వెలువరించుకున్నారు.
ఇందులో ‘నరుడు - దేవుడు’, ‘నౌకరే గురువు’ ‘విసుగు’ లాంటి శీర్షికలతో విసుగుపుట్టని రీతిలో - ఏ వ్యాసమూ రెండు పుటలకు మించకుండా - పుస్తకం మొత్తం ఒకే ఊపులో చదివించే చక్కని సంభాషణాత్మక- వివరణాత్మక నిపుణతతో 83 ‘అంశిక’లమీద రాసిన ‘వ్యాసిక’లున్నాయి.
‘వికసిత హృదయం’ వ్యాసంలో ‘‘నీ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోకుండా ప్రపంచంలోని ఎక్కడెక్కడి ప్రదేశాలలోని ముళ్ళు తొలగిస్తూ కూర్చోలేవు. నీవు గట్టి బూట్లు వేసుకుంటే సమస్య పరిష్కారమైపోతుంది. ఈ ప్రపంచాన్ని నందనవనంగా నీవు ఏనాటికీ మార్చలేవు. నీ హృదయాన్ని మార్చుకోగలిగితే ఈ ప్రపంచం నీకు నందనవనం అవుతుంది’’- ఇలా కేవలం రెండు మూడు వాక్యాల్లో బింబ - ప్రతిబింబ భావాత్మకమైన ‘దృష్టాంతా’లంకారలో, ఎంతో భావ గాంభీర్యంతో సుందర సందేశాత్మకంగా చెప్పటం ఈ పుస్తకంలో చాలా చోట్ల చూస్తాం.
67వ పుటలో ‘‘్భగవంతుడు లోకాన్ని సృష్టించేటప్పుడు ఒక్కొక్క జాతి జంతువులను, పక్షిని, జలచరాన్ని, జీవరాశికి నాయకత్వం వహించే బాధ్యత స్వీకరిస్తారా అని అడిగాడట. ‘మావల్ల కాదని’ అందరూ తప్పుకుంటే ‘ప్రేమికుడైన’ మనిషి ఆ బాధ్యత తనమీద వేసుకున్నాడు. మొత్తం సృష్టిని ప్రేమిస్తూ, దానికి మార్గదర్శకత్వం వహిస్తూ దానిని కాపాడుతాను అన్నాడట. కానీ తన మాట నిలబెట్టుకోలేదు. ఆ బాధ్యత నుంచి మనిషి దూరంగా తొలగిపోయి కాపట్యంతో స్వలాభం చూసుకోనారంభించాడు. సృష్టి వినాశనానికి ప్రధాన కారకుడవుతున్నాడు’’ అన్న భావుకతాత్మక వాస్తవికతా చిత్ర కథలో దారితప్పిన ఆధునిక మానవుని చెంప ఛెళ్ళుమనిపించిన ‘్ధ్వని’.
పరమ నిరాడంబరుడు, భూదానోద్యమ ఋషి, చోర సంస్కరణ కృషిపరత్వ వినోబాభావేకి ఒకసారి ‘నీవంటి ఉత్తముడిని చూడలేదు’, అలానే మరికొన్ని వాక్యాలతో ఒక ఉత్తరం రాశారు గాంధీజీ. ఆ ఉత్తరాన్ని చదివి, ముక్కలుగా చించేసి చెత్త బుట్టలో పడేశారు వినోబాభావే. అది చూచి వినోబా సహాయకుడు కె.ఎన్.బజాజ్ ‘గాంధీ మహాత్ముడంతటివాడు రాసిన ప్రశంసాపూర్వక లేఖను అలాచించేశారేమిటి?’ అని అడిగాడు. ‘‘మనపై ప్రేమాభిమానాలు చూపించేటప్పుడు గొప్పవారు కొన్ని పొరపాట్లు చేయవచ్చు. కానీ వాటికి మనం ప్రాధాన్యం ఇవ్వరాదు. అందుకే ఉత్తరం చించేశాను’’ అన్నారు వినోబాజీ (‘పొగడ్త -తెగడ్త’ వ్యాసం.
ఇలాంటి ఉన్నతాదర్శ జీవిత సంఘటన వివరణ, అందులోనే ఒక సున్నిత సుకుమార హాస్య స్పందనపూర్వక సందేశం తొంగిచూచూచేట్టుగా రాయటం చాలాబాగుంది. 51వ పుటలోని ‘‘ ‘దయ’ అనే భాషను మూగవాడు మాట్లాడగలడు; చెవిటివాడు అర్థం చేసుకోగలడు’’ అన్న వాక్యంలోని సార్వకాలిక సత్యాన్ని ఎంత చమత్కార భావగర్భ సుందరంగా చెప్పగలిగారో రచయిత.
అలాగే 77వ పుటలో ‘న్యాయబుద్ధి మనిషి హృదయానికి సమీపమైనది. కానీ భగవంతుడి హృదయానికి సమీపమైనది దయార్ద్రత’ అన్న సుప్రసిద్ధ పాలస్తీనా కవి కహిలీల్ జీబ్రాన్ సూక్తిని అందివ్వటంలో మానవత్వం ఉదాత్తమైనదే. కానీ దైవతత్త్వం మహోదాత్తమైనది అనే భావాన్ని ధ్వనింపచేస్తూ ఆ సూక్తిని క్రోడీకరించటం నీలంరాజు వారి రచనా శిల్పం.
జాబాలి మహర్షి తాను జయింపలేకపోయిన అహంకారాన్ని తులాధరుడు అనే మహాతపస్వి యొక్క నిర్వికల్పతతో పోల్చి వింగడించి చెప్పిన 153వ పుటలోని కథ రసవత్తరంగా ఉంది. ఒకప్పటి ప్రభుత్వపు చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్టర్ కె.ఆర్.కె.మూర్తి, చాలాకాలంగా తన ఎడంచేతి చూపుడువేలి నొప్పితో బాధపడుతుంటే రమణమహర్షి తన కుడి చేతితో తన ఎడమ చేతి వేలును నొక్కిపట్టి కొంతసేపు ఉండేసరికి ఎదురుగా వున్న మూర్తిగారి వేలునొప్పి మాయమైపోయింది. 21వ పుటలోని ఈ వృత్తాంతం శ్రీరమణుల మహర్షిత్వానికి, జీవకారుణ్య తత్త్వానికి మంచి తార్కాణం. ఈ సంఘటనను రచయిత ప్రస్తావనా సముచితంగా ఉటంకించారు. ఇంకా ఈ వ్యాసికా సంకలనంలో గౌతమబుద్ధుడు, మలయాళస్వామి, సాధు వాస్వానీ, ఆళవందార్ బాలపండితుడు మొదలైన మహనీయుల అమృతసూక్తులు, ఆదర్శవృత్తాంతాలు, అపురూప జీవిత సంఘటనలు ఎన్నో ఉన్నాయి. దేనికదే, అన్నీ స్ఫూర్తిదాయకాలే. ఆచరణీయ సందేశ ప్రదాయికాలే.
ఈ పుస్తకానికి ‘అంతటా.. అతడే’ అని పేరు పెట్టినప్పటికీ ఇక్కడ అతడే అనే పుంలింగ శబ్దాన్ని ‘అదే’ అనే నపుంసక లింగ శబ్దమైన ‘తత్త్వము’ (తత్+త్వము) లేక సత్త్వము లేక శాశ్వతముగా భావించుకొని సమన్వయించుకుంటే ఈ పుస్తకం మనకు ఎంతో మనోవికాసాన్ని సమకూరుస్తుంది.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 9849779290