పఠనీయం

అద్భుతంగా ఆవిష్కరింపబడిన ‘అక్షరం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వనయన
-ఆచార్య కడారు వీరారెడ్డి
వెల: రూ.100.. పేజీలు: 68
ప్రతులకు: రచయిత, ఇం.నెం.8-12-20
బృందావన్‌నగర్, రోడ్ నెం.8, హబ్సిగూడ
హైదరాబాద్-500 007
9392447007

మనసులో మెదిలే భావజాలాల మాలలో పొదిగిన పరిజ్ఞాన పరిమళ సుమం ‘అక్షరం’ అంటూ కవి ఆచార్య కడారు వీరారెడ్డి ‘విశ్వనయన’ పేరుతో ఓ దీర్ఘ కవితను వెలువరించారు. తన ఎనిమిదో పుస్తకంగా ప్రకటించిన ఈ కావ్యంలో.. అక్షరాన్ని విభిన్న కోణాల్లో అద్భుతంగా ఆవిష్కరించారు. శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఉద్యోగ విరమణ చేసిన కవి కడారు గారు రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలచుకున్నారు.
ఈ గ్రంథంలో.. పది ఖండికల్లో అక్షరం గురించి కవి పండించిన భావాలు కవితాత్మకంగా ఉన్నాయి. విశ్వాన్ని నేడు ఎవరైనా చూడాలన్నా, అంచనా వేయాలన్నా, ఉన్నది చెప్పాలన్నా.. రెండు కళ్లు చాలవు.. విశ్వనయనమైన అక్షరం కావాలి.. కనుక అక్షరాన్ని దాని ప్రాశస్త్యాన్ని తెలియజెప్పేందుకు.. గ్రంథానికి ‘విశ్వనయన’ అని పేరు పెట్టడంలో కవి యొక్క ఔచిత్యాన్ని అభినందించి తీరుతాం!
మొదటి ఖండికలో.. అక్షరం భాషకు ఆత్మరూపమని తేల్చి చెప్పారు..
ప్రేయసీ ప్రియుల ప్రేమాయణానికీ అక్షరమే ఆలంబనమని.. సకల ఆలోచనలకు మూలం.. అనుభవాలకు ఆలవాలం అక్షరమని.. అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలిపారు.
రెండో ఖండికలో.. అక్షరం.. అక్షయం.. సరళంగా సాగే రేఖలకు సరసమైన నుడికారంగా వర్ణించారు.
అక్షరం కాదెవరికీ బందీ.. అక్షర బందీలే అందరు అంటూ చమత్కరించారు. అక్షరం తలపుల తలుపులు తెరిపించే అపూర్వ దివ్యాస్త్రంగా పేర్కొనడం బాగుంది.
అక్షర చమత్కారం కవిత్వానికి కట్టు అని.. రకరకాల రచనలకు రసపట్టు అంటూ.. మూడో ఖండికలో రాసిన పంక్తులు పాఠకులను ఇట్టే ఆకట్టుకుంటాయి! అక్షరం.. శబ్ద స్వరాలకు వరమని.. అక్షర సముదాయం రాగతరంగాలకు రమణీయ రూపమని చెప్పడం బాగుంది.
నాలుగో ఖండికలో.. అక్షరం.. ఒక అద్భుతం.. ఓ జ్ఞాన గుళిక.. బలమైన బ్రతుకుదెరువుకు మార్గసూచికగా అక్షరాన్ని వర్ణించారు. అక్షరం అంటనివాడే నిజమైన ‘అంటరాని’ వాడుగా వ్యాఖ్యానించారు. ఐదో ఖండికలో.. అక్షరం ప్రగతికి సంకేతమని.. ఆటవికతకు చరమగీతమంటూ కొనసాగించారు.
అక్షరాలను వౌన పరిమళాలను వెలువరించే భావసుమాలుగా వర్ణించారు. అక్షరంతోనే విద్య వికసిస్తుందని నొక్కి చెప్పారు.
ఆరో ఖండికలో.. ఆధునిక యుగంలో.. సర్వదా అక్షరమే ఆసరా అని తేల్చి చెప్పారు. మానవ శరీరం.. అక్షరం పలికించే మహత్తర సజీవ శబ్ద పరికరంగా తెలియజెప్పిన తీరు బాగుంది. అక్షరం నాలుకపై నర్తించే మయూరంగా అభివర్ణించారు.
అక్షరం.. మనిషి మేధోపుత్రికగా ఏడో ఖండికలో వివరించారు.
అక్షర గవాక్షమే ప్రపంచ వీక్షణం చదువగలిగితే.. ప్రపంచానే్న శాసించొచ్చని ఎనిమిదో ఖండికను ప్రారంభించిన తీరు బాగుంది.
తొమ్మిదో ఖండికలో.. మెదడును ఆవరించి వికసించిన అక్షరాలు పురివిప్పిన నెమలి పింఛాలని.. అక్షరాలు ఎగరాలనుకుంటే ఈకల రెక్కలుగా, ఎక్కాలనుకుంటే పర్వతాలుగా.. మోయాలనుకుంటే.. దూది పింజలు ఉంటాయని.. కాలేకడుపులకు ఆకలి తీర్చే అన్నం మెతుకులు అంటూ రాసిన పంక్తులు బాగున్నాయి!
పదో ఖండికలో.. అక్షర చైతన్యం జింక పరుగులాంటిదని.. వేగంతోపాటు అందం సమపాళ్లలో రెండు అంటూ వ్యాఖ్యానించారు. అక్షరాస్యతే అసలు స్వాతంత్య్రమని భావించే కవి.. అక్షర పదం.. ప్రగతి పథంగా వర్ణించారు.
అక్షర ప్రజ్ఞ మనిషి బుద్ధికి గీటురాయి అని.. చెప్పడం బాగుంది. గుండె గుడిలో అక్షరం.. గుడిగంటల ధ్వని తరంగం అని.. అంతేగాక.. అక్షరం గుప్పెట బంధించిన జ్ఞాన పరిమళంగా అభివర్ణించారు.
ఇలా కవి ఆచార్య కడారు వీరారెడ్డిగారు అక్షరాన్ని ఈ గ్రంథంలో జీవితకాల కాంతిపుంజంగా పాఠకులకు పరిచయం చేశారు. అక్షరంతోనే నవ నాగరికత పురుడు పోసుకుందని.. సాంకేతికత గూడు కట్టిందని ఈ దీర్ఘ కవిత ద్వారా వివరించే యత్నం చేశారు.
అయితే ఇందులోని కొన్ని ఖండికల్లో కొన్నిచోట్ల కవి ప్రయోగించిన భావాలు కవితాత్మకంగా లేకపోయినప్పటికీ.. అక్షరం పట్ల ఆయనకు ఉన్న అవగాహనను అభినందించి తీరుతాం.. ‘అక్షరం’ అనే కవితా వస్తువును దీర్ఘ కవితలో బంధించే క్రమంలో.. కవి తన మేధస్సునంతా ఉపయోగించి.. అక్షరం ఔన్నత్యాన్ని చక్కగా విశే్లషించారు. ఆలోచనాత్మక ముఖ చిత్రం గ్రంథానికి నిండు శోభను కూర్చింది.. నిరంతర కవి నిత్య చైతన్య సాహితీమూర్తిగా భాసిల్లిన ఆచార్య సి.నారాయణరెడ్డి గారికి ఈ గ్రంథాన్ని అంకితమిచ్చి.. ఆయన పట్ల కవి తమ గౌరవాన్ని చాటుకున్నారు.
అక్షరం నేర్చినవాడు కానరేడు మట్టిబొమ్మ.. అనంతకోటి కన్నులు పొదిగిన బహుముఖ బ్రహ్మగా విశ్వసించే కవి ఆచార్య కడారుగారికి అభినందనలు. మున్ముందు మరింత గాఢమైన కవిత్వంతో మనముందుకు వస్తారని విశ్వసిద్దాం.

-దాస్యం సేనాధిపతి