పఠనీయం

కమనీయ కావ్యం- కమ్మని వ్యాఖ్యానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శృంగార శాకుంతలము
(అచ్చ తెలుగు కావ్యము);
కావ్యకర్త:కీ.శే. కేసిరాజు సీతారామయ్య, వ్యాఖ్యాత :డాక్టర్ పాలకోడేటి జగన్నాథరావు,
వెల: రూ.300/-,
ప్రతులకు: ఆస్పెన్ అపార్ట్‌మెంట్స్,
స్పెన్సర్ సూపర్ మార్కెట్ దగ్గర, తార్నాక,
హైదరాబాద్-500 017.
*
‘కావ్యేషు నాటకం రమ్యం- నాటకేషు శకుంతలా (కావ్య ప్రక్రియలలో నాటకం మనోహరం; నాటకాలలో శాకుంతలం రమణీయం)’’ అన్నారు విజ్ఞులు, రసజ్ఞులు. ప్రక్రియ సరే. భాష విషయానికివస్తే జాను తెనుగుకు కావ్య గౌరవం కలిగించాడు ననె్నచోడ ‘రాజకవి’. జిలుగు తెలుగు పలుకులకు పట్టంగట్టారు శివకవులు.
‘యయాతి చరిత్ర’ పేరున ఏకంగా మొట్టమొదటి అచ్చతెలుగు కావ్యమే రాసి సెబాసనిపించుకున్నాడు పొన్నగంటి తెలగన్న. తెనుగుదనము వంటి తీయందనము లేదు అన్నాడు కరుణశ్రీ తన ‘తెలుగు బాల’ శతకంలో. ఈ రకమైన ప్రక్రియ- భాషల ఉదాత్తతను మనసులో పెట్టుకొని దృశ్య కావ్య లక్షణాల ఛాయలతో జిలిబిలి తెలుగు నుడుల జిలుగులలో గత శతాబ్దంలో కీ.శే. కేసిరాజు సీతారామయ్యగారు కూర్చిన ముచ్చటైన అచ్చతెలుగు కావ్యం ‘శృంగార శాకుంతలం’. ఇది ప్రఖ్యాత పండిత కవి డాక్టర్ పాలకోడేటి జగన్నాథరావు కృత వ్యాఖ్యాన పూర్వకంగా నేటి సాహితీ నవ్యాతి నవ్య వీధిలో ఒక సందీప్తిమంత విద్యుద్దీపంలా వెలుగొందుతోంది.ఒక ప్రబంధానికి ఉండాల్సిన అన్ని హంగులను, సకల సల్లక్షణాలను ఈ కావ్యంలో కనగలం- ముఖ్యంగా అలంకారాలు, రసోద్దీప సన్నివేశ వర్ణనలు.
కాళిదాసు యొక్క కల్పనలోని దుర్వాస మహర్షి శాప సన్నివేశాన్ని మాత్రం తీసుకొని, అభిజ్ఞానపు ఉంగరాన్ని చేప మింగేయటాన్ని, దానివల్ల శకుంతలకు సంప్రాప్తమైన సంకట సంక్షోభాల సంగతిని వదిలేసి, కథను నేరుగా దుష్యంతుని కొలువులోనే ముగించాడు ఈ కృత్తికర్త. దుష్యంతుడు గాంధర్వ వివాహం సందర్భంగా తనకిచ్చిన అభిజ్ఞాన అంగుళీయకాన్ని శకుంతల ‘‘ఓ చెన్నటి ఱేడ! (ఓ దుర్మార్గ రాజా!) నాడు నన్ను నీవు చేపట్టి యుండకపోతే నీరుూ ఉంగరం నాకెట్టువచ్చు’’ అంటూ రాజు ముఖాన విసిరికొట్టింది. అప్పుడు దుష్యంతుడికి గతం గుర్తుకువస్తుంది. పశ్చాత్తాప్తుడై శకుంతలను స్వీకరిస్తాడు. ఇలా ఈ విధమైన కథావుఖాంతత విషయంలో పిల్లలమఱ్ఱి పినవీరద్రుడిని అనుసరించారు సీతారామయ్యగారు.
కాళిదాసకృతిలో శకుంతలకు జరిగిన న్యాయ విలంబనను నాటక కావ్య శిల్ప మర్మజ్ఞులు ‘ప్రకరణ వక్రత’ (కథా గమనపు మలుపు) అనే ఒక విశిష్ట లక్షణాకర్షణ అన్నప్పటికీ అదే ప్రకరణ వక్రత అనే లక్షణాన్ని మరో రసభరిత రీతిలో రమణీయంగా తీర్చిదిద్దారు కేసిరాజువారు అంటూ వ్యాఖ్యత జగన్నాథరావుగారు విడమరచి చెప్పిన తీరు 447 నుంచి 450 వరకుగల పుటలలో సముదాత్తంగాను, సమర్థనీయంగానూ ఉంది.
ఈ రకమైన వ్యాఖ్యాతృ ధిషణా నిపుణత పుస్తకం నిండా అమరింది. ‘అభిజ్ఞాన శాకుంతల’ దుష్యంతుడి యొక్క, ఈ ‘కేసిరాజువారి దుష్యంతుడి’ యొక్క పాత్ర మనస్తత్త్వ చిత్రణలను, ఆలోచనా ధోరణులను, ఆ పాత్రలు కథాక్రమంలోని సంభాషణల్లో సాగిపోయిన వైవిధ్య విలక్షణతలను డాక్టరు పాలకోడేటి వారు విశే్లషించిన తీరు యొక్క సౌరు చదివి రసానందానుభూతులు పొందాల్సిందేగాని అది ఈ స్వల్ప సమీక్షా వ్యాసంలో ఇమడదు.
తృతీయశ్వాసంలోని ‘ఆ జాబిల్లి వెలార్చు చల్వలకు.. ’ అనే పద్యంలోని లలిత శృంగారం మనోజ్ఞం. సన్నివేశం చల్లని వెనె్నల వేళ, దానికితోడు కమ్మని వాసనల మొగలిరేకును, చిగురాకు అనే బాకును, బహు మృదువైన కలువపూవును వెనె్నల అనే వింటినారికి సంధించాడు మన్మథుడు. ఇక విజృంభించాడు. సవ్యసాచిలా రెండు చేతులకూ పని చెప్పాడు అతని విజృంభణకు లోనైన యువతులకు వారి వారి చీర కట్లు వదులైపోయాయి. ఇందులోని లలిత శృంగార రసధ్వనితో పాఠకులు మధురాతి మధుర రసానుభూతి శిఖరాన్ని అందుకుంటారు.
అదే ఆశ్వాసంలోని చీకట్ల వర్ణన చిక్కని చక్కని కవిత్వపు ఖండశర్కర ఖండం. ‘దివి కొమ్మ క్రొమ్ముడి సవరింపఁ బోజాఱి..’ అనే పద్యంలో ‘నింగిలో దివ్యాంగనలు తమ తమ కొప్పులను సవరించుకుంటుంటే క్రిందకు జారిపడిన కొన్ని పొడవైన వెంట్రుకల గములేమో ఈ చీకట్లు! రాత్రి అనే రమణి పగటిపూట కట్టుకున్న తోపు రంగు చీర విప్పేసి తదుపరి కట్టుకున్న కపిల వర్ణపు చీరేమో! భూదేవి తన ఒంటికి రాసుకున్న నల్లని కస్తూరేమో! రాక్షసులు రణరంగంలో ఓడి పారిపోతూ యుద్ధ్భూమిలో విడిచి వెళ్లిన నల్లని గుడారాలేమో! యువకులను సమ్మోహపరచేట్టుగా యువతులకు సమయం అనే వైద్యుడు కాంతల కన్నులు మినుకు మినుకుమంటూ ఆకర్షించటానికి పెట్టిన కాటుకేమో అన్నట్టు చీకట్లు కమ్ముకున్నాయి అనటంలో నిండా రే మనోజ్ఞవర్ణనలో వస్తూత్ప్రేక్ష, ఫలోత్ప్రేక్ష, హేతూత్ప్రేక్షణ అనే త్రివిధ అలంకార సముదాయ శోభ వెల్లివిరిసింది.
‘శాకుంతల’ ద్వితీయాంకంలోని ‘అనాఘ్రాత పుష్పం కిసలయ మనూనం..’ అనే శ్లోకాన్ని అనువదిస్తూ, వ్రాసిన ‘మనుకువఁ దావిమూర్కొనని మువ్వపు గ్రొవ్విరి..’ అనే పద్యం మనుకువ (స్థిరనివాసం), లేత క్రొంజివురు (లేత కొత్త చిగురు), మవ్వపు క్రొవ్విరి (సుతిమెత్తని కొత్తపువ్వు), అనుగు (అందము), మిటూరి చెలువ (సొగసుకత్తె) లాంటి తెలుగు పలుకుల సుకుమారతతో మెరిసిపోయింది. అమాయకపు ముచ్చటైన ముద్దుముద్దు శకుంతములు (పిట్టలు) పెంచిన సుమపేశల సుకుమారియైన ప్రబంధ నాయిక శకుంతలయొక్క శారీరక, మానసిక సౌకుమార్యాన్ని ప్రత్యక్షీకరించే తేట తెలుగు అర్థ శబ్ద సమతూక సౌందర్యం వున్న ఈ పద్యం ఆలంకారిక వామమనుడు చెప్పిన ‘రీతి’ అనే కావ్యాత్మకు మంచి మచ్చుతునక.
సంస్కృత పదాలకు తేట తెలుగు రూపాలను సమకూర్చటం చాలాచోట్ల చక్కగా ఒప్పింది, నప్పింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కావ్యంలోని వివిధ కవిత్వ వస్తువుల పొంగులు, శబ్ద నిర్మాణపు మెళకువల హంగులు లెక్కకు మిక్కిలి. కావ్యమే కాదు వ్యాఖ్యానం కూడా సర్వాంగ సుందరం.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం