పఠనీయం

ఏకార్తల ఏ‘కాంతా’క్షరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏకార్త’
రచన: కవయిత్రి మంజు యనమదల
ప్లాట్ నెం. 202, సీతారామ రెసిడెన్సీ
ఈనాడు వెనుక, పటమట లంక
విజయవాడ -520010
9490769585
*
వర్తమాన కవిత్వం అనేక సాహితీ ప్రక్రియలకు ఊపిరి పోసి పలు లఘు కవితా రూపాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసింది. వీటిలో అత్యాధునిక కవితా రూపమే ‘ఏకార్త’. దీని సృష్టికర్త కవయిత్రి మంజు యనమదల. 28 అక్షరాల పరిమితికి లోబడి, ఏక వాక్య కవితా ప్రయోగంతో వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టరు. రెండు వాక్యాలను ఏక నిడివితో కలుపుతూ చిరు కవితలుగా మలిచి ‘ఏక్ తారల’గా ఆవిష్కరించారు. గాఢత, స్పష్టత, సరళతలు వీటి ప్రత్యేకతలు. షడ్రుచులుగా చెప్పబడే తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు శీర్షికలతో ఈ లఘు కవితా ప్రక్రియను పరిపుష్టం చెయ్యగలిగారు.
ఇవి రాశిలో కన్నా వాసిలో మిన్నగా అనిపిస్తాయి. అనుభవసారం నిండిన కవితాత్మక తాత్విక సత్యాల్ని తార్కికబద్ధంగా ధ్వనింపజేస్తాయి. నర్మగర్భితమైన జీవన సందేశాల్ని కళాత్మకంగా, సున్నితంగా, సహజంగా, సాహిత్యపరంగా విప్పి కప్పి లోతైన భావాలతో ప్రతిఫలింపజేస్తాయి. మార్మికత పొడసూపే విభిన్న మానసిక సంఘర్షణల భావోద్వేగాలను, అనుభూతులను, సందర్భాలను ఒకచోట కుప్పగా పోసి, పాఠకులను అలరించి రసార్ద్భ్రరితం చేస్తాయి. స్వతహాగా భావుకురాలైన మంజు యనమదల వీటిని ‘ఏ‘కాంతా’ క్షరాలు’ శీర్షికతో కవితా సంపుటిగా తీర్చిదిద్ది అందించారు.
‘నిరాశకు చరమగీతం - నిశిలో సైతం వెలుగుల పూల వర్షం’ అని చెబుతున్నపుడు- ఒకరకమైన ఆశావహ దృక్పథం తొణికిసలాడుతుంది. నిరాశను నిశికి ప్రతీకగా చేసి, వెలుగును ఆశావాదానికి ప్రతిబింబంగా నిలుపుతుంది ఈ ఏకవాక్య కవిత. ఈ కాంతి పూల వర్షం వెల్లువలో చైతన్యం వెల్లివిరిసి, చీకటిని పోలిన నిరాశను చరమగీతం పాడవచ్చనే భావన ఈ స్వల్ప అక్షరాల్లో ధ్వనిస్తుంది. ఇదే ఈ వచన రచన పరమార్థం. ఇందులో తాత్వికత అంతర్లీనంగా ప్రవహిస్తుంది.
‘అమాయకత్వంలో ఆహ్లాదం - విడువలేని పసితనపు ఛాయలు’ అంటూ మరోచోట కవిత్వీకరిస్తారు మంజు యనమదల. బాల్యం అంటేనే అమాయకత్వానికి ప్రతిరూపం. ఎలాంటి కల్మషత్వం ఎరుగని సున్నితమైన పసిమనసుల నిర్మల మనోభావాలు ఇందులో ప్రతిఫలిస్తాయి. ‘స్వప్నమూ మెలకువలోనే - గాయాలను నిదురపుచ్చలేక’ అని వాపోతున్నపుడు నిలువెల్లా గూడుకట్టిన మానసిక జీవ సంఘర్షణతో సుడులు తిరుగుతున్న వేదన అడుగడుగునా వర్ణనాతీతంగా మిగిలిపోతుంది.
‘చుక్కల సందడితో - గగనమంతా నవ్వులే’ అంటున్నపుడు భావుకత పరాకాష్టకు చేరుకుని వెనె్నల నవ్వుల్ని కురిపిస్తాయి. వెనె్నల ఆహ్లాదానికి సంకేతం. చల్లదనానికి ప్రతిబింబం. ఇది ఆకాశంలో పరచుకుని చుక్కల మధ్య కాంతివంతంగా మెరిసిపోతుంది. ఈ తారల మెరుపులసందడికి గగనమంతా విచ్చుకున్న నవ్వుల విశ్వంగా మారిపోతుంది. ‘ముక్కలైన మనసులో - ఎక్కడ చూసినా నీ ప్రతిబింబమే’ అంటారు ఇంకోచోట మంజు.
ఈ పలుకుల్లోని అంతరార్థాన్ని గ్రహిస్తే, తునాతునాకలైన మనసు బీభత్సాన్ని ఉద్వేగభరితంగా కళ్ళకి కట్టిస్తారు ఆమె. ఇంకోచోట ‘నిలబడే ఉంది - నీడలో నిజం’ అనడం వెనుక సజీవమైన ఒక భౌతికసత్యాన్ని తర్కబద్ధమైన కోణంలో ఆవిష్కరిస్తారు. నిప్పులాంటి నిజం నిలబడే నీడలో దాగివుందనే స్పృహను తేటతెల్లం చేస్తారు. ‘ఒక్కో చినుకే - వేల జీవాలకు ప్రాణధారంగా’ అంటూ చెప్పినపుడు జీవకోటి మనుగడకి ఆధారభూతమైన చినుకు చుక్క ఉనికి ఈ లోకానికి ఎంతవసరమో స్పష్టంగా విపులీకరిస్తారు. తాగడానికి, జీవజాలం మొలకెత్తడానికి, శుభ్రపరచుకోవడానికి నీటి ఆవశ్యకత ప్రాధాన్యతను తెలియజేస్తారు. జలం లేనిదే ప్రాణి బతికి బట్టకట్టలేదు.
వీటితోపాటు కవితాత్మక వాక్య ప్రయోగాలు ఈ సంపుటిలో కోకొల్లలుగా దర్శనమిచ్చి సృజనాత్మకతు గీటురాయిగా నిలుస్తాయి. మచ్చుకు వీటిలో కొన్ని రుచి చూద్దాం. ‘చుక్కల దుప్పటి ఎగిరిపోయింది’, ‘కాలం రాల్చిన కలలు’, ‘వౌనం మాటలు పరిచింది’, ‘వెనె్నలకే వర్ణాలన్నీ’, ‘అసూయ నల్లపూసైంది’, ‘సరిగమలు ఒలికిపోయాయి’, ‘నిరీక్షణ ఓ రాగమైంది’, ‘ఒళ్ళంతా కళ్ళుగా మారిన క్షణాలు’, ‘వెనె్నల ఆరబెట్టుకుంటుంది’, ‘గాయపడ్డ వేణువుగానం’, ‘రెప్పచాటు స్వప్నాలు’, ‘చీకటి చిరునామా చెరిగిపోయింది’, ‘రాలుతున్న పూల రాగాలు’, ‘వాలిపోతున్న పొద్దులో వర్ణాలు’, ‘మనసు చెమ్మ మదిని తాకింది’, ‘పగిలింది నిశ్శబ్దం’, ‘చిరుస్పర్శే విశ్వమంతగా మారింది’, ‘పిలుపు పిల్లనగ్రోవిలో సాగి’, ‘వెనె్నల దోసిళ్ళలో ఒదిగిపోయింది’, ‘పెదవి అంచున చిరునవ్వవుతావా’, ‘వౌనమూ మాటలు కలిపింది’, ‘నీ నవ్వుల్లో రాలిన ముత్యాలు’, ‘తూరుపు సింధూరమై మెరుస్తోంది’, ‘అనంతమై నన్ను చుట్టేశావు’, ‘సంతోషం ఉప్పెనయ్యింది’, ‘తాకినది మది వౌన తరంగం’, ‘చిరునవ్వుల వౌనాన్ని నేను’, ‘నేల రాలినా నిత్య పరిమళమే’, ‘కలం కాలాన్ని సిరాగా ఒంపుకుంటుంది’, ‘గువ్వల్లా ఒదిగిన జ్ఞాపకాలు’- ఇలా బహుముఖ అంశాల వెల్లువలో సేదతీరిన ఈమె కవిత్వం ‘ఏకార్తల ఏ‘కాంతా’ క్షరాలు’గా కొలువుదీరి సామాజిక చైతన్యాన్ని ఉద్దీపింపజేస్తుంది. లోతైన భావజాలంతో పలు పార్శ్వాలకు అక్షరాలతో ఊపిరి పోసిన కవయిత్రి మంజు యనమదలకు సాదర ఆహ్వానం పలుకుతూ సాహితీ లోకంలోకి స్వాగతిద్దాం.

-మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910