పఠనీయం

మా అమ్మమ్మ - ఈవిడ కథో హిస్టరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా అమ్మమ్మ సుబ్బలక్ష్మి
-మైథిలీ శివరామన్
వెల: రూ.100
ప్రతులకు: నవ తెలంగాణ
పబ్లిషింగ్ హౌస్

అమ్మమ్మ సుబ్బలక్ష్మి ఇది ఒక జీవన చిత్రం కాదు చారిత్రక సాక్ష్యం - స్వాతంత్య్రానికి పూర్వం సనాతన, ఛాందస కుటుంబంలో కరుగుతూ వెలిగిన ఒక సామాన్య గృహిణి అసాధారణ జీవిత గమనం-
ఆడపిల్ల చదవరాదు - స్వాతంత్య్ర భావాలు కలుగరాదు - కలిగిననూ పెరగరాదు-
ఇంటి పని చేసే యంత్రంగా, సంతానాన్ని కనిపెంచే సౌభాగ్యవంతమైన నిర్భాగ్య జీవితం ఆనాటి స్ర్తిల శాపం - ఆమె ఎంత సంస్కారవతి అయినా సంసార కూపస్థ మండూకం ఓ పెద్దమనిషినిచ్చి పెద్దమనిషి కాకుండానే పెళ్లి, శోభనం జరిపే అనాగరిక అరాచకం ఆ రోజుల్లో ఆడపిల్లల జీవన గమనం - చచ్చేవరకూ బ్రతకడం - చచ్చినట్లు బతకటం స్ర్తికి పట్టిన గ్రహచారం - వీధిబడికెళ్లే అవకాశం గగనమే-
అలాగే సాగిన సుబ్బలక్ష్మి జీవితాన్ని అత్యద్భుతంగా కళ్లకట్టినట్లు రాసిన కన్నీటి గాథని మనవరాలు అక్షరీకరించి ‘అమ్మమ్మ’కి చూపిన మైథిలీ శివరామన్ నవల కాని నవల ఈ గ్రంథం - ఆద్యంతం ఏకబిగిన చదివించిన సరళమైన తెలుగులో రాసిన అనువాదం చేసిన వి.వి. లక్ష్మి మొదట అభినందనీయురాలు - వందేళ్లు దాటిన అమ్మమ్మ జీవితాన్ని రచయిత్రి సేకరించి రాసిన వైనం ఓ చక్కటి ప్రయాణం - ఈ సేకరణ - సమీకరణలో...
తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెప్పుడూ చరిత్రకెక్కరు. శాసనాలు, శిలాఫలకాలు, విజయస్థూపాల్లో పేరు నమోదు చేసుకోగల సత్తా ఉన్న ప్రముఖుల కోసం మాత్రమే చరిత్ర కొన్ని పేజీల్ని కేటాయించ గలుగుతుంది. అలాంటి వాళ్లనే అసామాన్యులుగా గుర్తించి శిరసు కెత్తుకుని మరీ ముందు తరాల వారికి పరిచయం చేస్తుంది. జననం నుంచి మరణం వరకూ ఏ ప్రత్యేకతా లేకుండా గడిపేసే సామాన్యులు చరిత్ర దృష్టిలో అనామకులే.
శతాబ్దాల్ని తవ్వి సత్యాన్ని శోధించే శక్తి, ఆసక్తి ఉంటే అలాంటి అనామకులకీ చరిత్రలో కాస్తయినా చోటు దక్కుతుందని చెప్పడానికి అచ్చమైన, స్వచ్ఛమైన ఉదాహరణ ‘మా అమ్మమ్మ సుబ్బలక్ష్మి.’
నిజానికి, అమ్మమ్మ.. అనే పదంలోనే అంతులేని ఆప్యాయత వ్యక్తమవుతుంది. మనవలు, మనవరాళ్లను కంటికి రెప్పలా కాపాడుకునే పెద్దదిక్కు అమ్మమ్మలో సాక్షాత్కరిస్తుంది. నట్టింట్లో నడయాడే చిట్టిపొట్టి చిన్నారుల్ని ఒళ్లోకి తీసుకుని బుజ్జగించడం, గోరుముద్దలు పెట్టి ఆకలి తీర్చడం, బళ్లోకి వెళ్తే వచ్చేదాకా గుమ్మంలో ఎదురుచూడడం.. ‘అమ్మమ్మ’ అనగానే ఎవరి కళ్ల ముందైనా బొమ్మ కట్టే అపురూప దృశ్యాలివే. ఆమెకి తెలిసిన పెద్ద ప్రపంచం సంసారం. అయితే, అలాంటి అమ్మమ్మల్ని కూడా చరిత్ర గుర్తుంచుకోవాలంటూ ‘మా అమ్మమ్మ సుబ్బలక్ష్మి’ పుస్తకం నొక్కి వక్కాణిస్తుంది. కారణం... సామాన్యంగా కనిపిస్తూనే భిన్నమైన జీవన శైలిని ఆచరించడమే ఈ సుబ్బలక్ష్మి ప్రత్యేకత. అయితే, తను బతికున్న కాలంలో ఏ చిన్ని ప్రశంసకు కూడా నోచుకోని ఈ అభాగ్యురాలు చనిపోయిన పోయిన పాతికేళ్ల తర్వాత (1897-1978) ఆ అమ్మమ్మ అంతరంగంలోకి తొంగి చూసిన ఆమె మనవరాలు ఘటించిన అక్షర నివాళి ఇది.
‘మా అమ్మమ్మ సుబ్బలక్ష్మి’ శీర్షికతో ఆలిండియా డెమొక్రటిక్ విమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) వ్యవస్థాపక సభ్యురాలైన మైథిలి శివరామన్ వెలువరించిన ఈ పుస్తకంలో ఇప్పటికి సరిగ్గా నూట ఇరవై సంవత్సరాల క్రితం పుట్టిన ఒక తమిళ బ్రాహ్మణ మహిళ జీవితం ఆద్యంతం ఆవిష్కృతమైంది. తను బతికి ఉన్న కాలంలో నోళ్లు తెరుచుకుని కబళించే సంప్రదాయాలు, కట్టుబాట్లు, వేనవేల కన్నీటిబొట్ల మధ్య కూడా తన ఉనికిని, వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తనవైన ఆలోచనల్ని గౌరవించేందుకు సుబ్బలక్ష్మి పడిన తపన, చేసిన తపస్సు అంతాఇంతా కాదని ఈ పుస్తకం స్పష్టం చేస్తుంది. పైకి కనిపించే సుబ్బలక్ష్మిలో కనిపించని కోణాలెన్నింటినో ఈ పుస్తకం పరిచయం చేస్తుందంటే అతిశయోక్తి కాదు. అసలు... మైథిలీ శివరామన్‌కి అమ్మమ్మ గురించి రాయాలని ఎందుకనిపించింది? చిన్నతనంలో ఈ సుబ్బలక్ష్మి అందరి అమ్మమ్మల్లాంటి అమ్మమ్మ కాదని, ఏదో తేడాగా ఉందనుకుంది. రాకుమారి కథలు చెబుతూ గోరుముద్దలు తినిపించడం, ఎత్తుకోవడం, జోలపాడడం, పేచీలు పెడితే దగ్గరికి తీసుకుని సముదాయించడం, నాకంటే పెద్దవాళ్లయిన అక్క, అన్నల నుంచి రక్షించడం లాంటి పనులేవీ చేయలేదనే భావన ఆమెలో మెండుగా ఉండేది. పెరిగి పెద్దయ్యాక అమ్మమ్మని అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోవడంతో ఆమెలో ఓ ‘నాయిక’ కనిపించింది. సుబ్బలక్ష్మి చనిపోయిన కొనే్నళ్ల తరువాత ఒకసారి పుస్తకాలు తిరగేస్తుండగా మైథిలీ శివరామన్ దృష్టికి ఎడ్గార్ స్నో రాసిన ‘చైనా పై అరుణతార’ పుస్తకం కనిపించిందట. అది చూసాకే సుబ్బలక్ష్మి జీవితంపై పని చేయాలనిపించిందంటారు మైథిలి. అంతేకాదు, సుబ్బలక్ష్మి నోట్సు పుస్తకంలో రాసుకున్న డైరీని కూడా ఆమె చదివాక ఆమె సంకల్పం మరింత బలపడింది. ‘సుబ్బలక్ష్మి రహస్య జీవితం’పై చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా సుబ్బలక్ష్మి ట్రంక్ పెట్టెలో ‘విశ్వభారతి’ పుస్తకాల్ని తిరగేస్తుంటే కనిపించిన ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా ఆమెని ఉత్తేజురాల్ని చేసింది. ‘గోబీ ఎడారిలోని ఇసుక కుప్పల కింద కూరుకుపోయిన ఒక ప్రాచీన రాతప్రతిని చూసినప్పుడు ఇలా అనిపించింది. శిథిలావస్థలో ఉన్న ఆ రాతప్రతిలో అంతుబట్టని లిపిలో ఉన్న ఆ అక్షరాలను చూస్తుంటే ఒకానొకప్పుడు చైతన్యంతో వర్థిల్లిన ఒక వ్యక్తి మేధ మళ్లీ సరికొత్తగా మన మధ్య జీవం పోసుకోవాలని తాపత్రయపడుతున్నట్లనిపించింది. అది రాసిన మనిషి, ఆ పరిసరాలు ఇప్పుడు లేవు. కానీ, ఆ రాతప్రతిలో పొందుపరిచిన తన ఆలోచనలు జవసత్వాలు కూర్చుకుని, జీవం పోసుకుని ఒక తరం నుంచి ఇంకో తరానికి ప్రవహించాలన్న ఆశతో మనవైపు చేతులు చాస్తున్నట్లనిపించింది..’ ఇది చదివిన మైథిలీ శివరామన్‌కి సుబ్బలక్ష్మి జీవితానికి సంబంధించిన ప్రాజెక్ట్‌పై స్పష్టత వచ్చింది. ఇదీ ఐద్వా వ్యవస్థాపక సభ్యురాలు మైథిలీ శివరామన్ ‘మా అమ్మమ్మ సుబ్బలక్ష్మి’ పుస్తకం ద్వారా నవతరం స్ర్తిలకు అందించే సందేశం.

-బి.ఎస్.శర్మ