పఠనీయం

వ్యక్తావ్యక్త లోలకం లాంటి కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేహనది (కథలు)
రచన:బుర్రా లక్ష్మీనారాయణ
వెల:రూ.100/-
కాపీలకు: రచయిత,
2-2-647- 235-18ఎ, జమ్ జమ్ కేఫ్
ఎదురుగా, బాగ్ అంబర్‌పేట,
హైదరాబాద్-13. మరియు
పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1,
విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్,
మలక్‌పేట,
హైదరాబాద్-30
*
కొన్ని కథలుంటాయి. చదివిన ఉత్తరక్షణం మరిచిపోతాము. మరికొన్ని కథలు.. ‘మంచి కాలక్షేపం’ అనుకుంటాము. ఇంకొన్ని కథలుంటాయి. ఏకబిగిన చదవలేము. చదువుతూ, అక్కడక్కడ ఆగి భాషా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, ఒక్కోసారి వెనక్కి వెళ్లి మళ్లీ ముందుకు సాగుతూ చదువుతుంటాము. ఆదరాబాదరాగా మేసినప్పటికంటే తీరిగ్గా నెమరువేసుకుంటున్నపుడు ఎక్కువ ఆనందం కలుగుతుందట!
బుర్రా లక్ష్మీనారాయణగారి కథలు చివరి కోవకు చెందుతాయి. పాఠకుడు తన కళ్ళను అక్షరాల వెంట ‘హౌరామెయిలు’లా పరిగెత్తించలేడు. కారణం- వీరి వస్తువు, శిల్పం ఒకదానితో మరొకటి పోటీపడుతూ సాగుతున్నాయా అనిపిస్తుంది. ఒక్కోచోట కథనం కథకంటే పైచేయిగా అగుపిస్తుంది. ‘కల చాలనమ్’తో మొదలైన వీరి ప్రస్థానం, ‘నాలుగు పుంజీలు’తో మిగతా కథకుల కంటె రెండు పుంజీలు ఎత్తున నిలబడ్డారు. ‘మట్టి అరుగు’లో వీరిపై అభిమానం ‘దేహానది’తో తలెత్తుకు చూడాల్సినంత ఎత్తుకు ఎదిగిపోయారు. పాఠకులు చలించరు. సంచలించిపోతారు. ప్రకాశకులు ఈ పుస్తకాన్ని పాఠకులకు అందిస్తూ ‘సౌందర్యభరితం’ అన్నారు. ‘సారవంతం’ అన్నారు. ‘వాస్తవికత, భావుకత, ఊహాశాలిత’ కలగలిపి కధకు క్రొత్త అందాన్ని తెచ్చాయన్నారు. వస్తువు ఏదైనా సమ్మోహితుల్ని చేసే శిల్ప సంవిధానం అన్నారు. కళాత్మకమైన వ్యక్తీకరణ అన్నారు. ఇవి నూటికి నూరుపాళ్ళు నిజం.
విద్యార్థి దశలో అసంకల్పితంగా, వర్షంలో తడుస్తున్న ‘ముత్తెం’ను చూస్తాడు. ఒక బలహీన క్షణం. ముత్తెం తల్లి అవుతుంది. తన పోలికలు లేవని భర్త నిరాదరణ. గౌలీగూడ బస్ డిపోలో టిక్కట్లిచ్చే కౌంటర్ దగ్గర.. ముత్తెం పిచ్చిదై కనబడుతుంది. కథకుడిని చీదరించుకుంటుంది. అది సామాన్యమైన చీదరింపు కాదు. గుండెల్ని తొలిచేసే చీదరింపు. ప్రయాణం మధ్యలో ఆగి వెనుదిరిగి వస్తాడు. దోవలో ఆ పిచ్చితల్లి చావు చూస్తాడు. సూరీడు ఫక్కుమంటాడు. ‘ఒదిగిపోతున్నాను’ కథలో ఆసాంతం గుండె పొరలు పొరలుగా విడిపోయే వర్ణనలు. అవ్యక్త్తావ్యక్తం స్పష్టాస్పష్టం.
మహాకవి సి.నారాయణరెడ్డి ఇలా అంటారు- ‘కప్పి చెప్పేవాడు కవి. విప్పి చెప్పేవాడు విమర్శకుడు’ అని. మరి కథలు చెప్పేవాడు? పై రెంటికి మధ్యగా నడుస్తూ, అసిధారావ్రతం చేసేవాడు అనుకోవాలి.
పై ఒక్క కథలోనే కాదు, సంకలనంలోని మిగతా 16 కథలూ అంతే!
రాజగోపాలరావు గారిది భువనమంత భవంతి. పెద్ద పెద్ద ప్రహరీ గోడలు. బృందావనమంత తోట. కొడుకు ఆనందరావు, మనవలు చంద్ర శేఖరం, సూర్యశేఖరం, శరత్ శేఖరం. మహాశివునికి సహస్ర ఘటాభిషేకం. ప్రహరీ అవతల కలకలా ఓ అభాగ్య జీవి మరణం. యాదృచ్ఛికంగా తోటలోని చందనపు చెట్టు వాడి వత్తయిపోవటం. విరిగిపోయిన, ఆ ఎండిపోయిన చందన వృక్షం ఆ అభాగ్య జీవికి చితికట్టెలవటం. అంతా యాదృచ్ఛికం, తర్వాతి లైనులో, ఆ తర్వాతి పేరాలో ఏం జరుగనున్నది అంటూ పాఠకుడు ఉగ్గబట్టుకోవటం. లక్ష్మీనారాయణగారొక్కరే ఇలా రాయగలరు అన్న విభ్రమ, దిగ్రభమ.
ఇంతటి సీరియస్ రచయిత సరళమైన సరసం ఏం రాయగలడు? అని అనుకుంటే పొరపాటే నఖక్షతాల ‘కిలికించితాల’తో ప్రణయం సృష్టించగలడు. ‘ఆల్చిప్పలో అల’లు రేకెత్తించగలరు. భారతీదేవి కాటుక కంట నీరు పోతన చూడగలిగినట్లు ప్రేయసి కంఠంమీది పచ్చ నరాలను చూడగలడు (పే.34). కథల నిండా ఎన్నో భావనా వీచికలు. మచ్చుకు- బాధపడకు.. (బంధువులు దూరమయ్యారని) ఎందుకంటే నీవు ఒంటరిగానే జయించగలవని వారు నమ్మినందుకు సంతోషించు (జయ జయ జయహే.. పే.117). ఇంతకన్నా గొప్పగా మనకు మనం ఓదార్చుకోగలమా?
ఒక్కో కథకు- కథంత నిడివి సమీక్షించినా సరిపోని ఊహలు, పోహళింపులు.
అందుకే... పాఠకులే స్వయంగా ఈ కథల్ని ఆస్వాదించాలి. స్వాదించాలి. మనసుల్లోకి దించుకోవాలి.
సముద్రంలోని క్షార శాతం మరింతగా ఒక్కసారి విపరీతంగా పెరిగిపోతే (అలకంఠమెత్తిన కలగానం (పే.49) ఏమవుతుంది?
ఏదో తెలియని హాయైన భావం గుండె మూలల్లోంచి పెదవులపైకి వస్తుందట! పాఠకులే సంకలనం చదివాక పరీక్షించుకోవాలి..

-కూర చిదంబరం 8639338675