పఠనీయం

సామాజిక న్యాయాలపై ఆగ్రహజ్వాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడోకన్ను-
రచన: చలపాక ప్రకాష్,
వెల: రూ.100/-
ప్రతులకు: రచయత
1-4/3-36, సంజయ్‌గాంధీ కాలనీ,
విద్యాధరపురం విజయవాడ- 520012,
9247475975
*
చలపాక ప్రకాష్ కవి, కథకులు, కార్టూనిస్టు, పత్రికా సంపాదకులు, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి. నానీలమీద పరిశోధనకు కేంద్ర ప్రభుత్వ ఫెలోషిప్ పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎన్నో కవితా సంపుటాలను రచించిన వీరు ఇటీవల వీరు ప్రచురించిన కవితా సంపుటి ‘మూడోకన్ను’. శివుడు మూడో కన్ను తెరిస్తే ఎదుటివాళ్ళు భస్మవౌతారు. మహాశివుడికే కాదు మహాకవులకూ మూడోకన్ను వుంటుంది. సమాజంలో అన్యాయాలు జరుగుతున్నపుడు, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల హక్కులు హరించబడుతున్నప్పుడు కవి మూడో కన్ను తెరుస్తాడు. అక్రమాలను నిలదీస్తాడు. ప్రజల్లో చైతన్యం కలిగిస్తాడు. అలాంటి కవే శ్రీ చలపాక ప్రకాష్. ఈ సంపుటిలోని కవితలన్నీ సామాజిక సమస్యలను ప్రతిబింబించేవే.
ఈ ప్రపంచంలో యుద్ధమేఘాలు ముసరని క్షణాలు లేవు. కురుక్షేత్ర యుద్ధం నుంచి రెండవ ప్రపంచ యుద్ధం వరకు రక్తంతో తడవని చరిత్ర పుటలే లేవు. యుద్ధం వచ్చాక ఏ దేశంలోనైనా సాధించిన అభివృద్ధి అంతా సర్వనాశనమైపోతుంది. దీనే్న కవి అనే్వషణలో ‘ఇందాక / యుద్ధమేఘమొకటి వచ్చి / పలకరించిపోయింది /’ అని అంటారు. యుద్ధం వస్తే డబ్బులన్నీ యుద్ధానికే ఖర్చుపెడతారు. తిండిగింజలు దొరకవు. ఏ క్షణంలో ఏ విపత్తు వచ్చి మీద పడుతుందానని ప్రజలు అభద్రతాభావంతో తల్లడిల్లిపోతారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రతి దేశంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి.
చిన్న చిన్న కొట్లు అంతరించి షాపింగ్ మాల్స్ వచ్చాయి. అక్కడ దొరకనిదేమీ ఉండదు. పెద్ద పెద్ద వస్తువుల దగ్గరనుంచి చిన్న చిన్న వస్తువుల వరకు దొరుకుతాయి. కానీ లోపలికి వెళ్ళే వినయోగదారులకు అనేక పరీక్షలు వుంటాయి. ప్రతి మాల్‌లో సిసి కెమెరా వుంటుంది. వచ్చినవాళ్ళు మాల్‌లో ఏం తీస్తారో అని అనుమానంతో నిఘా కళ్ళతో పరిశీలిస్తుంది కెమెరా. ఐనా ప్రజలందరూ మాల్స్‌కి వెళ్ళి కొనటానికి అలవాటు పడిపోయారు. దీనినే అ(వ)నుమానితుడు’ కవితలో సిసి కెమెరా ఒక అరలో దోషిగా బంధించి నిలబెడుతోంది అంటూ మా కష్టాల్ని మీ కాళ్ళముందు కుప్పగా ధారబోసిన/ వినియోగదారులం/ మాల్స్‌కెళ్లి దండగని పండుగగా చేసుకొనే వాళ్ళం / ఎంట్రన్స్‌లోనే దొంగని చూసినట్లు ఒంట్లోని అణువణువుని చెక్ చేయించుకొని మరీ పోయే అనుమానితగాళ్లం అని అంటారు. ఈనాడు మన భారతదేశంలో ఇంటింటికీ ఒకళ్ళు, ఇద్దరో విదేశాలకు వలస వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళాక డాలర్ల మత్తులో మన జన్మ స్థలాన్ని మరచిపోయినపుడు, ఇక్కడ మిగిలేది పండుటాకులు మాత్రమే. దీనే్న ‘పోతూ పోతూ’ కవితలో ‘కొడుకు / విదేశాలకి వలసపోతూ పోతూ దేశానే్న వృద్ధాశ్రమంగా / చేసిపోయాడు ఎంచక్కా’ అని అంటారు. యువతరం విదేశాలకు రెక్కలు విప్పి ఎగిరిపోతే తండ్రులు, తాతలు మాత్రం ఇక్కడ ఒంటరిగా మిగిలిపోతారు.
నవనాగరికుడైన మనిషి చెప్పులు లేకుండా నడువలేడు. ఎప్పుడైనా చెప్పు తెగిపోతే కుట్టిస్తాము. మరీ పనికిరాకపోతే పారేస్తాము. మనిషికి చెప్పులతో వున్న అనుబంధాన్ని చెప్తూ ‘పాత.. కొత్త’లో ‘అది పాతదై విసిరివేయబడ్డప్పుడు / చచ్చిన దేహాన్ని వదలిపోతున్నట్లు/ కొత్త జతలై వచ్చినప్పుడు/ పునర్జన్మలో మళ్లీ నా చెంతకుచేరి/ కొత్త ఊపిర్లూదుకున్నట్లు తలుస్తూ/ ప్రేమతో అద్దుకొని నమస్కరిస్తా!’’ అని పాదరక్షల్లో ఒక జీవన తాత్వికతను ఆవిష్కరిస్తారు.
ఈ ప్రపంచంలో మానవుడికి తొలి గురువు అమ్మ. చిన్నపుడు గోరుముద్దులు తినిపించి పిల్లల ఆకలి తీర్చే అమ్మ, పిల్లలు పెద్దయ్యాక వారికి విద్యాబుద్ధులు నేర్పించే జ్ఞాన గురువుగా మారుతుంది. కవి తన మాతృమూర్తి చెప్పిన మాటను గుర్తుచేసికొంటూ ‘అమ్మలో నేను’ కవితలో ‘బతుకుబండిలో చెమట చుక్కలు ధారలై కారుతున్నా/ లక్ష్యసిద్ధిలో గమ్యంవైపు ఒంటరిగా పరిగెడుతున్నా/ అలుపెరుగని పోరాటంతోనే విజయం తథ్యమని/ దీవించి నిలిపింది’’ అని అమ్మ గొప్పదనాన్ని అక్షరీకరిస్తారు.
ఇక ముఖపత్ర కవిత మూడో కన్నులో తన కవితా లక్ష్యాన్ని వ్యక్తీకరిస్తూ ‘విజయమొక్కటే విజయకేతనంగా / ఎగిరి వెలిగిపోదు / అపజయమెపుడూ కిందే వుండిపోదు! పడి లేచే కెరటంలాగా/ శక్తియ్తులన్నీ మారుతున్నపుడు / నే మూడోకన్ను తెరుస్తాను!’ అని కవి తాను మూడో కంటిని ఎప్పుడు తెరుస్తారో చెప్తారు. అక్షరమంటే క్షరం కానిది. కొన్ని కొన్ని అక్షరాలు జీవితాలను వెలిగింపజేస్తాయి. స్ఫూర్తి పతాకాలౌతాయి. అక్షరం శక్తిని తెలుపుతూ ‘అక్షరానికో నమస్కారం’ కవితలో కొనియాడుతారు. బహుగ్రంథ రచయిత ఐన శ్రీ చలపాక ప్రకాష్‌గారు మరెన్నో కవితా సంపుటాలు రచించి తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వెయ్యాలని మనసారా ఆకాంక్షిస్తున్నారు.

-మందరపు హైమవతి