పఠనీయం
స్ఫూర్తినిచ్చే కవితలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
‘సాహసి’ కవిత్వం-
రచన: తంగెళ్ళపల్లి కనకాచారి,
వెల:రూ.100/-,
ప్రతులకు: రచయిత, 1-606, బాలాజీ నగర్, కాప్రా (మం.)- 500 087.
*
జీవితం, కవిత్వం- ఈ రెంటిని విడదీసి చూడగలమా? చూడలేమంటాడు కవి తంగెళ్ళ కనకాచారి. పదహారేళ్ల అధ్యాపక అనుభవం, 14 ఏళ్ళ జర్నలిజం అనుభవంతో వికసించిన జ్ఞాననేత్రం ఆయనది. ఆ జ్ఞాననేత్రంతో, విప్పార్చుకున్న కళ్ళతో తనను, తన చుట్టూ వున్నవారిని, దేశాన్ని, రాష్ట్రాల్ని పరిసరాల్ని, పసిపాపలా పరికిస్తున్నాడీ కవి. దశాబ్దంపాటుగా త్యాగరాజగానసభలో విలేకరిగా రోజూ 5, 6 సాహిత్య కార్యక్రమాలతో తనలో ఇంకిన తాత్త్వికతను కవితాత్మకంగా మనతో పంచుకునే ప్రయత్నమే ఈ ‘సాహసి’ సంకలనం.
అయిదు పదుల జీవితంలో ఆరు కవితా సంకలనాలు ముద్రించగలిగిన ఈ కవి- కమ్- జర్నలిస్టుకు దేశాధినేత కలాం అంటే ప్రేమ. ప్రజానేత కమ్యూనిస్టు యోధుడు కొండవీటి గుర్నాథరెడ్డి అంటే ప్రాణం. తన సంకలనానికి ఈ రెడ్డిగారినే ‘టైటిల్’గా నిర్ణయించాడీ కవి. ఆయన బతుకు ఎజెండా ‘జనవిముక్తి’ అంటూ కొనియాడారు.
70 వచన కవిత్వాలున్న ఈ సంకలనంలో నిత్య జీవిత సత్యాల్ని, కాచి వడపోసిన జీవితాన్ని మన ముందు అతి ప్రతిభావంతంగా నిలిపే ప్రయత్నం చేశాడు. నిత్య సత్యాలను వెల్లడిస్తున్నాడు. మనలోని ద్వైదీభావాన్ని ‘ఒకే దృశ్యం రెండు భావాలుగా / ప్రేమైతే సుందరంగా / ఆవేశమైతే వికారంగా’ ఉంటుందని ఈ ‘చిన్న బ్రతుక్కి ఇన్ని నిర్వచనాలా?’ అంటూ ఆశ్చర్యపోయాడు. ‘రెండు మెతుకులు పొట్టలోకి వెళ్ళేందుకే’ ఈ లోకమంతా (చిలుక- పే.27) అంటూ, ‘పక్కోడి అంగీ తొడుక్కుని సొంత అంగీ గొప్పతనాన్ని హుంకరించవద్దంటాడు (ఎరుక పే.29), ‘ఎవరికీ ప్రేమను అందుకునే ధ్యాస లేదు’ (ప్రేమగోల పే.35) అంటూ నిరసించటమే కాదు; ‘దుఃఖం ఊపిరిని బలిగోరితే / బ్రతుక్కు అర్థం ఏముంది?’ (బహిష్కృతుడు పే.25) అంటూ స్వాంత వచనాలతో ఊరడిస్తాడు. వ్యష్టి జీవితపు సమూహాల్లో దొరకవు(తాళం పే.89) అంటూ ఎవరి సమస్యను వారే పరిష్కరించుకోవాలని తీర్మానిస్తాడు. ‘తాళం మనమే/ తాళం చెవి మనమే / నిజం సుమా’ (పే.89) అంటాడు. ఇంత చిన్న వాక్యంలో ప్రపంచమంతటి నిజం దాగి ఉంది కదూ! ప్రకృతిని ప్రేమించే ఈ కవి చెట్టుకోసం, మొక్క కోసం రేపటి పర్యావరణ పరిరక్షణ కోసం పరి పరివిధాల పరితపిస్తాడు.
‘‘నిన్నటి పునాదులపై నేడు లేచిన భవనం నుంచి రేపటిలోకి తొంగిచూసేవాడే కవి’’ అని కనకాచారికి బాగా తెలుసు. ‘‘నేనేమీ మాట్లాడలేను’’ (పే.95) అంటూనే అన్ని మతాల సారం మానవత్వం అంటూ ‘కాని ధ్వంసరచన సాగుతోంది’ అని తన నిస్పృహను ప్రకటిస్తాడు.
‘‘ఇప్పుడు ఏ ధ్యాసా లేదు / ఉదాసీనతే శ్వాస’’ (ఉద్విగ్నత పే.11) అంటూనే ‘మట్టిని పిండి / అన్నం పెట్టే రైతన్ననూ సృష్టికి మూలమైన మగువను (మగువా నీకు మ్రొక్కెదన్ పే.87) డాక్టరుగా, యాక్టర్‌గా, కలెక్టర్‌గా, గృహిణిగా ఆమె అవతారాలని భక్తిపూర్వకంగా స్మరిస్తాడు (పే.87). తన ఈ సంకలనాన్ని తన అక్కకు అంకితం చేసి, తన మాటల్లో చేతల్లో నిజాయితీ ఉందని నిరూపించుకుంటాడు. అచ్చు తప్పులపైన కవిత్వంలో ఉద్విగ్నత ఉంది. సామాజిక స్పృహ ఉంది. ప్రపంచంమీద, ప్రజలమీద, తెలంగాణ ప్రభుత్వంమీద అచంచల విశ్వాసం ఉంది. ఈ సంకలనంలోని కవితలన్నీ, పాఠకుడికి ఒక క్రొత్త శక్తినిచ్చే విలక్షణతో విరాజిల్లుతున్నాయి.