పెరటి చెట్టు

కొట్టరువు వారంటి నట్టరుగు, కవిజనులు కొలువుండు మెట్టరుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు మహాభారతాన్ని ‘కవిత్రయ మహాభారత’మనడం కద్దు. కానీ, అందులో ఆరింట అయిదు వంతులు తిక్కన ఒంటిచేత్తో రాసిందే! అలాంటి తిక్కన కొట్టరువు వారింట పుట్టి పెరిగినవాడు. ఆ వంశంలో ఆయన కనీసం మూడో తరం కవి. ఇక, కొట్టరువు వారింటి నట్టరుగు, బుధజనులు కొలువుండే మెట్టరుగు అని ఎవరయినా అంటే దాన్ని కాదనేవారెవరు? తిక్కన తన ‘నిర్వచనోత్తర రామాయణం’లో తాతగారయిన మంత్రి భాస్కరుడి గురించి చెప్పనే చెప్పారు. ‘మంత్రి భాస్కరు, మత్పితామహుని దలచియైన, మన్ననమెయి లోకమాదరించు’నని తిక్కనగారు విశ్వాసం ప్రకటించారు. కానీ, పెత్తండ్రి - భాస్కర మంత్రికి సయానా కుమారుడు - అయిన భాస్కరుని కేతన గురించి కవిబ్రహ్మ ఏమీ చెప్పలేదు. తాతగారేం చేశారో చెప్పనివాడు, పెత్తండ్రి పేరయినా ఎత్తకపోవడంలో వింతేముంది? కానీ, తిక్కనగారి శిష్యరికం చేసి తరించిన మూలఘటిక కేతన తన గురువు గారికి ‘దశకుమార చరిత్ర’ అంకితమిచ్చుకుంటూ, ఆయన తాత గురించీ పెత్తండ్రి గురించీ కూడా వివరంగానే ప్రస్తావించాడు. ఎలాగయితేనేం, మొత్తానికి కొట్టరువు వారి అక్షరధామం గురించిన వివరాలు లోకానికి తెలిశాయి.
ముందుగా భాస్కర మంత్రి గురించి ప్రస్తావించుకుందాం. తిక్కన అంతటివాడు తన కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకున్న భాస్కరుడు ఆషామాషీ కవి అయి వుండడు. పైగా, ఆయన కీర్తి అప్పటికే- పదమూడో శతాబ్ది పూర్వార్థానికే - సువ్యాప్తమయి ఉండాలి. కానీ, ‘్భస్కర రామాయణం’ మంత్రి భాస్కరుడి రచనేనని ప్రగాఢంగా నమ్మి, ‘పెనగులాడిన’ సాహిత్య చరిత్రకారులు (చాగంటి శేషయ్య, నేలటూరి వెంకట రమణయ్య, నిడుదవోలు వెంకటరావు గారలు) సయితం, ఆయనే ఆ రామాయణం రాశాడని నిరూపించలేక పోయారు. చిత్రమేమిటంటే, తమ తాతగారిని ‘సారకవితాభిరాముడు’గా అభివర్ణించిన తిక్కన గానీ, భాస్కర మంత్రిని ‘సాహిత్య విద్యాపారీణు’డని కీర్తించిన కేతన గానీ - ఆ మాటకొస్తే, మరే ఇతర ప్రాచీన కవి పండితుడు కానీ - ఆయనే రామాయణం రాశాడని చెప్పలేదు. మరి, మన సాహిత్య చరిత్రకారులు భాస్కర రామాయణాన్ని భాస్కరమంత్రే రాసి వుండాలని ఎందుకనుకున్నారు? దానికి ఓ కారణం ఉంది! ‘ఉభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునన్ బారగుడ’నయ్యానని చెప్పుకుంటూ - వచనం ముక్కయినా లేకుండా - ఉత్తర రామాయణం రాయగలిగిన తిక్కన, పూర్వ భాగం జోలికెందుకు వెళ్లలేదనే ప్రశ్న నుంచే ఈ ఊహ పుట్టుకొచ్చింది. సదరు పూర్వ రామాయణం తన తాతగారయిన భాస్కరమంత్రి రాసి వున్నందువల్లనే, తిక్కన దాని జోలికి వెళ్లలేదన్నది ఈ ఊహ నుంచి పుట్టిన వాదం. తాను రాస్తున్నది ఉత్తర రామాయణం కనుకనే, తాతగారేం రాశారో ప్రత్యేకంగా చెప్పలేదని వాళ్లు సర్దిచెప్పుకున్నారు. అంతకు మించిన ఆధారం మరెక్కడా చూపించలేక పోయారు. ఈ పరిశోధక వరేణ్యులు.
ఇక, భాస్కరుని కేతన - తిక్కన గారి పెత్తండ్రి - గురించి కూడా తలచుకుందాం. ముందే చెప్పినట్లు తిక్కన ఈయన గురించేం చెప్పలేదు. కానీ, ఆయన శిష్యపరమాణువు మూలఘటిక కేతన మాత్రం భాస్కరమంత్రి కుమారుడయిన కేతన - భాస్కరుని కేతన - గురించి వివరంగానే చెప్పాడు. భాస్కరుని కేతన ‘కవితకు ముఖ్యు’డనీ, ‘నవరస భావకుం’డనీ, ‘కీర్తిచంద్రికా ధవళిత దిక్కు’డనీ మూలఘటికుడు ప్రశంసించాడు. ఈ కేతన కూడా గురువుకు తగ్గ శిష్యుడే. తిక్కన రచనల గురించే ఏమీ చెప్పని ఈ పెద్ద మనిషి ఆయన తాతగారి, పెత్తండ్రిగారి రచనల పట్టికలు ఇవ్వాలని ఆశించడం దుస్స్వార్థం మాత్రమే అనిపించుకుంటుంది! అలాంటి వివరాలేమీ మూలఘటికుడు వెల్లడించకపోయినా, భాస్కరుని కేతనే తెలుగులోకి ‘కాదంబరి’ని అనువదించి ఉంటాడని వేటూరి ప్రభాకరులు మొదలుకుని ఆరుద్ర వరకూ ఎందరో భావించారు. దీనికీ పరోక్ష సాక్ష్యానే్న ఆధారంగా తీసుకోవడం గమనార్హం. క్రీ.శ.ఏడో శతాబ్దిలో బాణుడు రాసిన వచన శృంగార కావ్యం ‘కాదంబరి’. దీన్ని కొందరు నవలగా పరిగణిస్తున్నారు. ఆ చర్చ ఇక్కడ అప్రస్తుతం. కాదంబరి వచ్చిన శతాబ్దం తర్వాత - క్రీ.శ.8వ శతాబ్దిలో - దండి ‘దశకుమార చరిత్ర’ కూడా వచన కావ్యంగానే వెలువడింది. ఈ రెండింటిలో కాదంబరి మేలయిన రచన అనేది పండిత పరిషత్తు తీర్మానం. కాగా, మూలఘటిక కేతన బాణుడి ‘కాదంబరి’ని వదిలి, దండి ‘దశకుమార చరిత్ర’ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం ఎక్కడా దొరకలేదు. దాంతో వేటూరి ప్రభాకరులు ఈ ఊహను కొంచెం పొడిగించారు. భాస్కరుని కేతన అప్పటికే ‘కాదంబరి’ అనువదించి ఉండడం వల్లనే మూలఘటిక కేతన ‘దశకుమార చరిత్ర’ను ఎంచుకుని వుండొచ్చునని ఆయన ఊహించారు. ఇంతకు మించిన ఆలంబన ఈ ఊహకు ఎక్కడా దొరకలేదనే చెప్పాలి. పెద్దలకు పేరు పెట్టడం కాదు కానీ, ఫలాని రచన కర్తృత్వం నిర్ధారించడానికి మరింత బలమయిన రుజువులు అవసరమని నా అభిప్రాయం.
మహాభారతంలో పదిహేను పర్వాలను అద్భుత దృశ్యకావ్యంగా మలచిన మహాకవి తిక్కన మీద ఆదరాభిమానాలు మనకందరికీ ఉండి తీరాల్సిందే! కానీ, తిక్కన మీద ప్రేమను ఆయన తాతగారి ఖాతాలోనో, పెత్తండ్రిగారి ఖాతాలోనో జమ చెయ్యడం ఏ మాత్రం సమంజసం కాదు. పైగా, అది చారిత్రిక సత్యాలతో నిమిత్తంలేని వ్యక్తిపూజ ఎన్నటికీ కాకూడదు. మహాకవుల పట్ల అభిమానం వాళ్ల బావమరుదుల పట్లా - కులోపకులాల పట్లా దురభిమానంగా మారకూడదు. అలాంటి అంధాభిమానమే, నన్నయ్య తిక్కనలను వైదికి-నియోగులుగా పంపకాలు చేసుకుందుకూ పురికొల్పింది; వారి సాహిత్య వారసత్వాన్ని కుక్కలు చింపిన విస్తరిగానూ దిగజార్చింది! సాహిత్య చరిత్రకు సత్యాన్ని మించిన ప్రమాణం వేరేదీ వుండకూడదని ఈ పరిణామం మరోసారి రుజువు చేసింది.

-మందలపర్తి కిషోర్ 81796 91822