పెరటి చెట్టు

తెలుగు ఎత్తిన జయధ్వజము తిక్కన యశము!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్రయ మహాభారతం లేని తెలుగు సంప్రదాయ కవిత్వం లేనట్లుగానే, తిక్కన గారు లేని తెలుగు భారతమూ లేదు. మహాభారతంలోని పద్దెనిమిది పర్వాల్లో, పదిహేనింటిని ఆయన ఒక్క చేత్తో నిర్వహించాడన్న వాస్తవం ఒక్కటి చాలదూ, తిక్కన ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవడానికి? ఒక్క భారతంలోనే తిక్కన పదహారు - పదిహేడు వేల పద్యాలను చెప్పారు. ఇక, ‘నిర్వచనోత్తర రామాయణం’లోని పది ఆశ్వాసాలనూ కూడా కలుపుకుంటే, బహుశా తిక్కన రికార్డును అధిగమించగల ప్రాచీన కవులు లేరేమో! ఆయన రాశారని చెప్పే సూర్య (కృష్ణ) శతకం, కవివాగ్బంధనమనే లక్షణ గ్రంథం దొరకనే లేదు కనక ఇప్పటికి దొరికిన వాటి లెక్క మేరకి చూడ్డం న్యాయం. ఈ లెక్కన కూడా, శ్రీనాథాదులు రాశారని చెప్పే రచనలన్నింటినీ కలుపుకున్నా, తిక్కనగారికి సమీపానికి రారేమో అనిపిస్తుంది. నన్నయ్య తరహాలో, తత్సమాలతో నిండిన పద్యధార కురిపించడంలోనే కాదు- ప్రాంతీయమయిన పలుకుబడులతో కూడిన అచ్చతెనుగు పద్యాలను అలవోకగా అల్లడంలోనూ అంతే దిట్టతనం చూపించిన కవి తిక్కన. తెలుగు సంప్రదాయ సాహిత్యంలో ఎవరే ప్రయోగం చేసినా, దాని మూలాలు తిక్కన కవిత్వంలో కనిపించేంత ప్రమాణంలో విస్తరించి వుంది ఆయన సాహిత్య విరాట్స్వరూపం. దాదాపు వెయ్యేళ్ల తర్వాత, ఈ ఇరవయ్యొకటో శతాబ్దిలో, తెలుగు సాహిత్య చరిత్రలో ఆయన కీలక ప్రాముఖ్యాన్ని గురిచి నొక్కి చెప్పడం హాస్యాస్పదం అనిపించుకుంటుంది కూడా. ఒక్కమాటలో చెప్తే, తిక్కన లేని తెలుగు కవిత లేదు!
నన్నయ్య తన కాలానికి ఉనికిలో ఉన్న కావ్యరచనా రీతులకు భిన్నమయిన మార్గం తొక్కి ఆదికవిగానూ, వాగనుశాసనుడిగానూ సువిఖ్యాతుడయ్యారు. కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు, ఆర్యభోజుడు, తిక్క యజ్వ, తిక్కన సోమయాజి, తిక్కనామాత్యుడు తదితర బిరుదనామాలతో సువిఖ్యాతుడయిన కొట్టరువు తిక్కన పుట్టిపెరిగిన వాతావరణంలోనే కవిత్వం వుంది. మూలఘటిక కేతన, మంచన తదితరులు తాము కవిబ్రహ్మ తిక్కనగారి శిష్యులమని బోరవిరుచుకుని గర్వంగా ప్రకటించడాన్నిబట్టి చూస్తే ఆయన కథ అప్పటికే సజీవ చరిత్రగా మారిందనిపిస్తుంది. శైవ, వైష్ణవ మతాభినివేశం ముమ్మరంగా ఉన్న దశలో మహాభారతంలో పదిహేను పర్వాలు అనువాదం చేసేందుకు తలపెట్టిన తిక్కన మంత్రి దాన్ని హరిహరనాథుడికి అంకితం చెయ్యడం ఆయన రాజకీయ చతురతకి నిదర్శన. ఇక ఎర్రన అరణ్యపర్వ శేషాన్ని పూరించేందుకు నడుం కట్టేనాటికి నాలుగయిదు వందల సంవత్సరాల సాహిత్య సంప్రదాయం సిద్ధాన్నంలా సిద్ధంగా ఉంది. అంతకుమించి, అప్పటికే తిక్కన మూర్తిమత్వం మేరునగ ప్రమాణానికి పెరిగి సాహిత్య చరిత్రలో కొండ గుర్తుగా నిలిచి వుంది.
సుప్రసిద్ధ ఇతిహాసాలు రామాయణ భారతాలు రెండింటినీ రచించిన మహాకవి తిక్కన, తన గురించి ఎన్నో వివరాలను గ్రంథస్థం చేశారు. తన తాతగారయిన కొట్టరువు భాస్కర మంత్రి గురించే కాదు - పెత్తండ్రుల పేర్లను సైతం ఆయన రికార్డు చేశారు. ఆ వంశంలో ఆయన మూడో తరం కవి. తిక్కనగారి తాత భాస్కరుడు. పెత్తండ్రి (్భస్కరుని) కేతనల రచనలు దొరక్కపోయినా, వాళ్లూ కవులేననడంలో సందేహం లేదు. తనకు సమకాలికుడు, నిర్వచనోత్తర రామాయణం కృతిభర్త అయిన మనుమసిద్ధి గురించి కూడా తిక్కన వివరంగానే చెప్పారు. ఈ వివరాల కారణంగానే, తిక్కనగారి జీవిత సాహిత్యాల గురించి వివాదాలకు తావు లేకుండా పోయింది. తండ్రి తాతల మాదిరిగానే, తిక్కన ఓ చేత్తో సాహిత్యాన్నీ, మరో చేత్తో చాణక్యాన్నీ అద్భుతంగా నిర్వహించారు. కాకతీయ సామ్రాజ్య అధినేత గణపతి దేవుడితో దౌత్యం నెరపి మనుమసిద్ధిని గట్టెక్కించారని కూడా చెప్తారు. నూట రెండేళ్ల కిందట, వావిళ్ల సంస్థ ప్రచురించిన ‘నిర్వచనోత్తర రామాయణం’ కావ్యానికి ముందు మాట సమకూరస్తూ ఉత్పల వేంకట నరసింహాచార్యులు తిక్కన క్రీ.శ.1200 - 1258 సం.ల మధ్య ‘తప్పక సశరీరుడై యుండెననుట నిర్వివాదంశ’మని తేల్చి చెప్పారు. క్రీ.శ.1254లో కృష్ణా మండలంలోని ఇనిమళ్లలో మనుమసిద్ధి వేయించిన ప్రసిద్ధ శాసనంతో సహా అనేక శాసనాల్లో దొరికిన సమాచారం ఆధారంగా ఆచార్యులు ఈ నిర్ణయం చేశారు.
దురదృష్టం ఏమిటంటే, తెలుగు సాహిత్య సీమలో - నాటికీ నేటికీ కూడా - విమర్శ ఓ నాస్తిత్వం. నన్నయ్య, తిక్కన, ఎర్రనల రచనా శిల్పాన్ని నిక్కచ్చిగానూ నిశితంగానూ విశే్లషించగల ధైర్యమున్న విమర్శకులు మనకి బహు తక్కువ. కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్లపల్లి అనంతకృష్ణ, నోరి నరసింహశాస్ర్తీ తదితరులు మినహాయింపులు మాత్రమే. వారిలో వైతాళిక స్థానం కట్టమంచి వారిదే! ఇక, ‘తిక్కన తీర్చిన సీతమ్మ’ అనే వ్యాసంలో రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ గారు గొప్ప విశే్లషణ చేశారు. మచ్చుకి ఒక్కటి - ఉత్తర రామాయణంలో వాల్మీకి సీతారాముల వన, జల, లీలా విహారాలను వర్ణించిన సందర్భంలో వారి చేత ‘మైరేయ మాంస సేవ’ కూడా చేయించాడట. మైరేయమంటే, పులిసిన చెరుకురసంతో చేసే కల్లు, ఇక, మాంసం సంగతి చెప్పేదేముంది? కానీ, నిర్వచనోత్తర రామాయణం ఎనిమిదో ఆశ్వాసంలో తిక్కన - వాల్మీకికి భిన్నంగా - ‘మైరేయ మాంస సేవ’ మాట చల్లగా జార్చినాడని రాళ్లపల్లివారు ప్రత్యేకంగా చెప్పారు. ‘తిక్కన బ్రాహ్మణ దృష్టిలో ఆ రెంటికీ చోటు లేదాయెనేమో!’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే, వాల్మీకి సీతారాముల సాన్నిహిత్యాన్ని పది శ్లోకాల్లో వర్ణిస్తే, తిక్కనగారు 64 పద్యాల్లో ఈ వైభవాన్ని శృంగారరస ప్రపూరితంగా అభివర్ణించారని రాళ్లపల్లి ఎత్తి చూపించారు.
తిక్కన సాహిత్య - కళాత్మక - పరిణామం గురించి నిర్భయంగా మాట్లాడిన కొద్దిమందిలో నోరి నరసింహ శాస్ర్తీ ముఖ్యులు. నిర్వచనోత్తర రామాయణం రాసిన తిక్కనామాత్యుడికి, మహాభారతం పదిహేను పర్వాలు రాసిన తిక్కన సోమయాజికీ మధ్య ఉన్న వైవిధ్యం గురించి శాస్ర్తీగారు సవివరంగానూ, సోదాహరణంగానూ రాశారు. వాటిల్లో ముఖ్యమయినది తిక్కన కావ్యాదర్శం గురించిన విశే్లషణ. ‘అమలోదాత్త మనీష నేనుభయ కావ్య ప్రౌఢి శిల్పమునం బారగుడం కళావిదుడ’నని చెప్పుకున్న నిర్వచనోత్తర రామాయణ కర్తను ప్రధానంగా శిల్పవాదిగా గుర్తించారు నోరి. ‘కేవలము శిల్పకళ గల కావ్యము ఉత్తమ కావ్య మనిపించుకో’దని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాదు - శబ్ద రత్నాకరం నాలుగో తరగతి కవిగా పరిగణించిన కంకంటి పాపరాజు రాసిన ఉత్తర రామాయణమే - తిక్కనగారి నిర్వచనోత్తర రామాయణంకన్నా - ఎక్కువమందిని ఆకర్షించిందని కూడా శాస్ర్తీగారు తేల్చి చెప్పారు. ఈ ముగ్గురు విమర్శకులూ రచయితగా తిక్కనను మనుష్యమాత్రుడిగా చూశారు. అలా చూడ్డం వల్లనే తెలుగు కవిజనావళికి మేలు జరుగుతుంది. మానవమాత్రులు సయితం, చిత్తశుద్ధితో కృషిచేస్తే, ఒకనాటికి తిక్కన అంతటి మహాకవులు కాగలరన్న ఆత్మవిశ్వాసం పాదుకుంటుంది. అది సాహిత్యానికి మాత్రమే కాదు - మొత్తం సమాజానికంతటికీ మేలు చేస్తుంది.

-మందలపర్తి కిషోర్ 81796 91822