పెరటి చెట్టు

బహుపద ద్వంద్వం - భాస్కర బృందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిక్కనగారి తాతగారు - ‘సార కవితాభిరాముడ’నీ, ‘సాహిత్య విద్యాపారీణు’డనీ అనిపించుకున్న - భాస్కరమంత్రి. ‘మంత్రి భాస్కరు, మత్పితామహుని దలచియైన, మన్ననమెయి లోకమాదరించు’నని కవిబ్రహ్మ స్వయానా చెప్పడాన్నిబట్టి ఆయన పెద్దకవే అయి వుండాలనిపించడం సహజం. అంతటి వాడి స్థాయికి తగినట్లుగా ఆయన ఏదయినా గొప్ప కావ్యం రాసి వుంటే - కనీసం అనువదించి ఉంటే - నిజంగానే శోభించేది. కానీ మంత్రి భాస్కరుడు అలాంటిదే చేసినట్లు లేడు. అందుకే తిక్కనగానీ, గురువుగారి తాతగారిని నోరారా కీర్తించిన కేతన గానీ మన మంత్రి మహోదయులు ఏం రాశారో మాటమాత్రం కూడా చెప్పలేదు. దాంతో, మంత్రి భాస్కరుడు అనువదించిన మహాకావ్యమేదో కనిపెట్టాల్సిన భారం సాహిత్య చరిత్రకారుల భుజాల మీద పడింది. అలాంటి అవకాశం వచ్చినప్పుడు మనవాళ్లు వెనకాడతారా? ‘్భస్కర రామాయణం’ మన మంత్రిగారి సృజనేనని ఓ ప్రతిపాదన చేసేశారు. కానీ, ఆ సిద్ధాంతాన్ని ఏ చారిత్రిక సాక్ష్యం బలపరచని నేపథ్యంలో, అందులో ఒక కాండనయినా మంత్రి భాస్కరుడు రాసి వుంటాడని చెప్పి సర్దుకున్నారు. కానీ, ఆ రచనను అంకితం పుచ్చుకున్న వ్యక్తి, మంత్రి భాస్కరుడికే కాదు - ఆయన మనవడికి కూడా తర్వాతి కాలానికి చెందినవాడని బయటపడ్డంతో నాలిక్కరుచుకోక తప్పలేదు. అయితే, సృజనాత్మక చరిత్రకారులను ఎవ్వరూ అడ్డుకోలేరు. దాంతో ‘్భస్కర శతకం’ మంత్రి భాస్కరుడే రాశారని కొత్త వాదం తెరమీదికొచ్చింది. పాత అనుభవం ప్రాతిపదిక మీద, ఈ ప్రతిపాదనను బలపరిచేందుకు ఎక్కువమంది ముందుకు రాలేదు. ఆలోగా, పదహారు - పదిహేడు శతాబ్దాలకు చెందిన మారద వెంకయ్య ఈ శతకం రాశాడనే విషయాన్ని మన పరిశోధకులు క్రమంగా ఆమోదిస్తూ రావడంతో, మంత్రి భాస్కరుడు చివరికి రాయని భాస్కరుడిగానే మిగలక తప్పలేదు.
రాయని భాస్కరుడి సంగతి అలా వుంచండి. ఎవరో ఒకరు రాస్తేనే కదా, ‘్భస్కర రామాయణం’ పుట్టుకొచ్చింది. మరి, దాన్ని రాసిన భాస్కరుడెవరు? ఆయనకి ఎవరయినా సహకరించారా? వాళ్లెవరు? ఏ కాలానికి చెందినవాళ్లు? ఈ రామాయణాన్ని అంకితం పుచ్చుకున్నదెవరు? ఈ కావ్యం లక్షణాలేమిటి? విశిష్టతలేమిటి? తెలుగు సాహిత్యంలో ‘్భస్కర రామాయణం’ స్థానమేమిటి? ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం కొంత ఆలస్యంగానే మొదలయినా, సత్ఫలితాలనే ఇచ్చింది. పందొమ్మిదో శతాబ్దం చివర్లోనే - 1898లో - ‘విమర్శకాగ్రేసర’ కాశీభట్ట బ్రహ్మాయ్య శాస్ర్తీ ‘్భస్కరోదంతం’ పేరిట చేసిన రచనలో ‘్భస్కర రామాయణం’ హుళక్కి భాస్కరాదులు రాసిందేనని తేల్చి చెప్పారు. ఈ కావ్యాన్ని సాహిణి మారన అంకితం పుచ్చుకున్న సంగతి కావ్యంలోనే ఉంది. ‘సకల సుకవిజన సంస్తూయమాన యశోమూర్తి’ అనిపించుకున్న హుళక్కి భాస్కరుడు పదమూడో శతాబ్దం చివర్లో పుట్టి, పధ్నాలుగో శతాబ్దం తొలి పాదంలో మరణించాడని ఒక చరిత్రకారుడు లెక్కతేల్చారు. ఈ కవి ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉన్నాడన్నది ఒక అంచనా.
ఇంతకీ, ముగ్గురు సాయం పట్టినా ‘్భస్కర రామాయణం’ అసంపూర్ణంగా మిగిలిపోవడానికీ, దాదాపు నూరేళ్ల తర్వాత అయ్యలార్యుడు నడుంకట్టి ‘యుద్ధ కాండ’ రాస్తే గానీ పూర్తి కాకపోవడానికీ కారణం ఏమిటి? హుళక్కి భాస్కరుడు కేవలం 34 ఏళ్లే జీవించాడా?అదే ఈ పరిణామాలకి మూలకారణమయి ఉంటుందా? ఇంత చిన్న వయసులోనే హుళక్కి భాస్కరుడు ‘దశగతులు’ అనే కావ్యం కూడా రాశాడట. అతని కుమారుడు మల్లికార్జున భట్టు సంస్కృతాంధ్రాల్లో కావ్యాలు రాశాడని శేషాద్రి రమణ కవులు చెప్పిన సమాచారాన్ని మిత్రులు సుంకిరెడ్డి తన ‘ముంగిలి’లో ప్రస్తావించారు. దాన్నీ భాస్కర కవి సాహిణి మారనకే అంకితమివ్వడాన్నిబట్టి అతగాడు ఇతగాణ్ణి ఆశ్రయించి బతికి ఉంటాడని గ్రహించడం కష్టం కాదు. కాగా, ఈ రామాయణంలోని అరణ్యకాండను విస్తృతంగా రాసిన హుళక్కి భాస్కరుడు, యుద్ధకాండలో 1140 పద్యాలు కూడా రాశారని సుంకిరెడ్డి లెక్క. భాస్కర కవిపుత్రుడు మల్లికార్జునుడు బాల, కిష్కింధ, సుందరకాండలను రాయగా, సాహిణి మారన కుమారుడు - హుళక్కి భాస్కరుని శిష్యుడు కూడా - రుద్రదేవుడు అయోధ్యకాండను అనువదించాడు. హుళక్కి భాస్కరునికి నూరేళ్ల తర్వాతివాడయిన అయ్యలార్యుడు యుద్ధకాండ శేషాన్ని పూరించడంతో భాస్కర రామాయణం సంపూర్తిని సంతరించుకుంది. పదకొండో శతాబ్దంలో మొదలయిన కవిత్రయ మహాభారతానువాదం పధ్నాలుగో శతాబ్ది మధ్యలో పూర్తయింది. అయినప్పటికీ, దాదాపు అయిదున్నర శతాబ్దాలుగా తెలుగులో వచ్చిన సంప్రదాయ సాహిత్యంలోని ‘ప్రామాణిక’ రచనల జాబితాలో కవిత్రయ మహాభారతానికే అగ్రస్థానం దక్కుతోంది. దానితో పోల్చడం కాదు కానీ, నలుగురు రచయితలు, నూరు - నూటయాభై సంవత్సరాలపాటు సాగించిన కృషి ఫలితంగా రూపుదిద్దుకున్న భాస్కర రామాయణం కూడా అనేక చారిత్రిక కర్తవ్యాలు నిర్వర్తించింది. రంగనాథ రామాయణంతో కలిసి, ఈ కావ్యం - కనీసం, తెలంగాణ ప్రాంతంలో - వైష్ణవ భావాలను తిరిగి చెలామణీలోకి తీసుకొచ్చింది.
ఏ వత్తిడీ లేని పక్షంలో, మన కవులు ముందుగా రామాయణ రచన వంకే మొగ్గుతారని గిడుగు సీతాపతి తన ‘హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్’లో పేర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే. రంగనాథ రామాయణం, భాస్కర రామాయణం దాదాపు ఒకే సమయంలో వెలువడ్డానికి అదే కారణమయి ఉండొచ్చు. అయితే, భాస్కర రామాయణానికీ, రంగనాథ రామాయణానికీ కొట్టొచ్చినట్లు కనిపించే తేడా ఒకటుంది. రంగనాథ రామాయణం ద్విపద ఛందస్సులో, జన సామాన్యానికి అందుబాటులో ఉండే రీతిలో రాసిన కావ్యం. ఇది ప్రధానంగా పాడుకోవడానికి ఉద్దేశించినది. భాస్కర రామాయణం స్వభావం వేరు. నన్నయ్య, తిక్కనల పౌరాణిక మార్గానికి కొంచెం భిన్నంగా మహాకావ్య రీతిలో సాగింది భాస్కర రామాయణ రచన. బహుకర్తృత్వం కారణంగా, ఈ కావ్యం ఆద్యంతం ఒకేలా ఉండదు. అయితే, అరణ్య - యుద్ధ కాండల్లో హుళక్కి భాస్కరుడు సూచించిన నిర్దేశకత్వాన్ని మిగతా కవులందరూ చాలామట్టుకు పాటించారు. ఫలితంగా ఓ మేరకి ఏకసూత్రత సాధ్యమయింది. స్వతంత్ర రచనగా భాస్కర రామాయణం సాధించిన ఘన విజయమంటూ ఏదీ లేకపోవచ్చు. అయితే, సాహతీలోకంలో కావ్య - ప్రబంధ ధోరణులకూ, వైష్ణవ భక్తి భావనలకూ ఆమోద యోగ్యత సంపాదించి పెట్టడంలో ఈ రచన పెద్ద పాత్రే పోషించింది. దీనే్న చారిత్రిక కర్తవ్యం అంటారు. భాస్కర రామాయణం కళాత్మక కర్తవ్యం గొప్పగా నిర్వర్తించలేక పోయినా, ఈ చారిత్రిక కర్తవ్యాన్ని మాత్రం చక్కగా నిర్వర్తించింది. అందుకే, ఏడెనిమిది శతాబ్దాల తర్వాత కూడా ఆ రచన గురిచి మనం మాట్లాడుకుంటున్నాం.

-మందలపర్తి కిషోర్ 81796 91822