పెరటి చెట్టు

తొలి తెలుగు కవయిత్రి ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నవజాతాంబకు డేయు సాయకములన్ వర్జింపగా రాదు, నూ
తన బాల్యాధిక వనంబ మదికిన్ ధైర్యంబు రానీయ ద
త్యనురక్తిన్ మిముబోంట్లకున్ దెలువ నాహా! సిగ్గుమైకోదు, పా
వన వంశంబు స్వతంత్రమీయదు, చెలీ! వాంఛల్ తుదల్ముట్టునే’
- ఈ పద్యం ఓ స్ర్తి, అందునా ఓ రాచపడుచు, రాసిందంటే నమ్మడం కష్టమే మరి. ఉక్కిరిబిక్కిరి చేసే ‘యవనవ్వనం’ ఎవరినీ క్షమించదు. ‘వాంఛల్ తుదల్ముట్ట’డం కూడా సహజమే. సిగ్గు కూడా ఎవరికీ తప్పని ఓ సహజావస్థ. వీటన్నిటికీ తోడు, ‘పావన వంశంబు’లో పుట్టిన వాళ్లకి - ముఖ్యంగా ఆడపడుచులకి - అదనంగా సంప్రాప్తించే దుర్గతి మరొకటి ఉంది; అదే పారతంత్య్రం! అసలు, ఈ స్థితిని కవితా వస్తువుగా గుర్తించగలగడమే ఓ పెద్ద ముందడుగు. ఆ పని పదమూడు పధ్నాలుగు శతాబ్దాల్లోనే - జయప్రదంగా - చెయ్యడం విప్లవాత్మకమయిన ముందంజ. ‘కవి చేసే అంతర్ - బహిర్ యుద్ధారావమే కవిత్వ’మని ఆ మహానుభావుడు సూత్రీకరించడానికి ఆరేడు వందల సంవత్సరాల ముందే, వినిపించిన యుద్ధారావమిది. పైపైన చూస్తే, ఇందులోని తీవ్రత బోధపడదు. ఓ రకంగా ఈ అవస్థ కేవలం అనుభవైకవేద్యం! బహుశా ఆ కారణంచేతనే, ఇంత మంచి పద్యం శతాబ్దాల తరబడి పుస్తకాల పుటల మధ్య ముక్కిపోయింది.
ఈ పద్యం రాసినామె, గోన బుద్ధారెడ్డి కూతురు కుప్పాంబిక. కుప్పాంబిక చరిత్ర కేవల కల్పనా కథ కాదు. శాసనస్తమయిన ఆధారాలు ఉన్న అస్తిత్వం ఆమెది. బుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలో అత్యధిక భాగం ద్విపదగా రాసిన మహాకవి. అతని కొడుకులిద్దరూ కూడా (జంట) కవులే. కాచ భూపతి, విట్ఠల రాజు ద్విపదలోనే ఉత్తర రామాయణం రాశారని ఆ కావ్యంలోనే ఉంది. వాళ్ల సోదరి కుప్పాంబిక. ఈమె మల్యాల గుండన మంత్రి భార్యామణి. భూస్వామ్య భావజాలం ప్రభావంలో పుట్టిపెరిగిన పదజాలం ప్రకారం కుప్పాంబిక వీరపుత్రి - వీరపత్ని కూడా. అయితే 1270 దశకంలో గుండయ్య చనిపోయిన తర్వాత, కుప్పాంబికే పాలన పగ్గాలు చేపట్టిందంటారు. అప్పటికామెకి 35-40 సంవత్సరాల వయసుంటుందేమో. అంచేత ఆమెని వీర వనిత అనడం సబబు. అంతటి వీర వనిత రాసిన సున్నితమయిన కవిత ఇది. పదమూడో శతాబ్దం నాటికే తెలుగులో, అత్యింత సున్నితమయిన స్ర్తిల మనోభావాలు కేంద్రకంగా, కవిత పుట్టుకొచ్చినందుకు ప్రతి తెలుగు కవీ గర్వించాల్సిందే.
తెలుగులో తొలి కవయిత్రి కుప్పాంబికేనని మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్ పదేళ్ల కిందటే నిరూపించాడు. ఈ నిరూపణ ఎందుకు అవసరమయిందంటే, ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ ‘అఖిల భారత (ఆంధ్ర?) కవయిత్రులు’ అనే పుస్తకం రాస్తూ ఖడ్గ తిక్కన తల్లి ప్రోలమ, భార్య చానమలు తొలి తెలుగు కవయిత్రులని నిర్ణయించారట. వేటూరి ప్రభాకరశాస్ర్తీ ‘చాటు పద్య మణిమంజరి’లో ఆమె నిర్ణయానే్న ఉటంకించారు. కవిబ్రహ్మ తిక్కన దాయాది ఖడ్గ తిక్కన. మనుమసిద్ధి దగ్గిర ఈ తిక్కన సైనిక వ్యవహారాలు చూసే మంత్రిగా ఉండేవాడట. యుద్ధంలో ఓడిపోయి, సజీవంగా ఇంటికి తిరిగొచ్చిన ఖడ్గ తిక్కనను అతని తల్లీ - భార్యా రెచ్చగొట్టి తిరిగి రణరంగానికి పంపగా, అతడు ‘విజయియై వీరస్వర్గమలంకరించెనట!’ ఇదీ సందర్భం. ‘చాటు పద్య మణిమంజరి’లో ప్రోలమ - చానమల చాటువులను సంకలించారు. ఇవి సుప్రసిద్ధాలే కానీ ఒక్కసారి మననం చేసుకుందాం-
స్నానాల గదికి నులక మంచం అడ్డంపెట్టి, పసుపూ, కుంకుమ, నలుగుపిండి ఏర్పాటు చేసి చానమ భర్తనుద్దేశించి ఈ పద్యం చెప్పిందట.
‘పగరకు వెన్నిచ్చినచో - నగరే నిను మగతనంపు నాయకు లెందున్?/ ఉముగురాడవార మైతిమి - వగపేటికి జలకమాడవచ్చిన చోటన్’
అవమానాన్ని దిగమించి, స్నానం చేసి భోజనానికి కూర్చున్న ఖడ్గ తిక్కనతో అతని తల్లి ప్రోలమ ఈ పద్యం చెప్పిందట.
‘అసదృశముగ నరివీరుల - మసిపుచ్చక విరిగి వచ్చు మగ పంద క్రియన్/ కసవున్ మేయగ పోయిన - పసులున్ విరిగినవి; తిక్క! పాలున్ విరిగెన్’
వేటూరి ప్రభాకరుల లెక్క ప్రకారం రణ తిక్కనది క్రీ.శ.1260 ప్రాంతం. అంటే, ప్రోలమ - చానమలది కూడా అదే కాలం. ఇక, మిత్రులు సుంకిరెడ్డి నారాయణరెడ్డి ‘ముంగిలి’లో తేల్చిన లెక్క ప్రకారం కుప్పాంబిక 1230 - 1300 ప్రాంతానికి చెందినామె. (కుప్పాంబిక వేయించిన బూదపూర్ శాసనం 1276 నాటిది) అయితే, అదే ముంగిలిలో బుద్ధారెడ్డి క్రీ.శ.1210-40 సంవత్సరాల నాటివాడని లెక్క చూపించారు. ఆయనకి పాతికేళ్ల ప్రాయంలో కుప్పాంబిక పుట్టిందని భావించడానికి విప్రతిపత్తి లేదు కానీ, బుద్ధారెడ్డి కుమారులు కాచయ - విట్ఠలయ్యల కాలం 1320-25గా చూపించారు. తండ్రికీ కొడుకులకూ మధ్య నూరేళ్ల ఎడం ఉంటుందా? ఈ లెక్కలో ఏదో పొరబాటుందనిపిస్తోంది. నా అభిప్రాయం ప్రకారం, కాలక్రమం ఆధారంగా నిర్ణయించ గలిగేది తొలి, మలి కవయిత్రుల లెక్కను మాత్రమే. కానీ, సాహిత్య చరిత్రకు కావ్యవస్తువు ఆధారంగా లెక్కతేల్చే తరతమ లక్షణ పరిగణన అంతకన్నా ముఖ్యమయినది. ఆ లెక్క ప్రకారం చూస్తే కుప్పాంబిక కవితకు యోజనాల దూరంలో ఉన్నాయి. ప్రోలమ - చానమల చాటువులు, చానమ లెక్క ప్రకారం పగవారికి వెన్నిచ్చి, వచ్చినవాడు ఆడదానితో సమానం! అలాంటి ఆడదాన్ని చూసి మగతనం ఉన్న నాయకులు - ఎగతాళిగా - నవ్వుతారు. ఇక ప్రోలమ కన్నకొడుకుని ‘మగపంద’వని తిట్టింది. పంద అనే మాటకి పిరికివాడనేదే సామాన్యమయిన అర్థం. కానీ, ఆడంగివాడనే విశేషార్థం కూడా ఉందని ఆచార్య జి.ఎన్.రెడ్డి పర్యాయపద నిఘంటువు చెప్తోంది. ఒక స్ర్తి సాక్షాత్తూ భర్తనే ఆడదానివని తిట్టగా, మరొకామె కన్నకొడుకుని ఆడంగిరేకుల వాడివని తిట్టింది. మగవాడిలా ఆలోచించే స్ర్తిలు ఈ అత్తాకోడళ్లు. వాళ్లను వీరమాత, వీరపత్ని అంటూ కీర్తించడం - ఈ ఇరవయ్యొకటో శతాబ్దిలో - భావ్యమేనా? ఈ ప్రశ్నకి వచ్చే జవాబును బట్టి, తొలి - ఉత్తమ తెలుగు కవయిత్రి ఎవరనే అంశాన్ని తేల్చుకుందాం.

-మందలపర్తి కిషోర్ 81796 91822