పెరటి చెట్టు

మట్టివాసనలు వెదజల్లే మాణిక్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కన కోర డొకనాడు కన్నుల పరవధూ లావణ్య, సౌభాగ్య లక్షణములు/ విన కోర డొకనాడు వీనుల కింపుగా కొలుచువారల మీది కొండెములను/ చిత్తంబు వెడలించి జిహ్వాగ్రమున కోరి పలుకడు కాఠిన్య భాషణములు/ తలప డించుక యైన ధనకాంక్ష యేనాడు బంధు మిత్రాశ్రీత ప్రతతి చెరుప/ సతత గాంభీర్య ధైర్య భూషణపరుండు - వార్త కెక్కిన రాజన్య వర్తనుండు/ సకల భూపాల జనసభా సన్నుతుండు - ధర్మ తాత్పర్య నిరతుండు దశరథుండు’ - ఈ పద్యం ఎవరి గురించి రాసిందో అందులోనే ఉంది. రాసినామె మొల్ల. వైఎస్‌ఆర్ కడప జిల్లా బద్వేల్ సమీపంలోని గోపవరం, ఆమె స్వగ్రామం. ఆమె తండ్రి కేసన సెట్టి శైవాచార సంపన్నుడట. కేసన తన కూతురిని బసివిగా దేవుడి సేవకి కేటాయించాడంటారు. బసివి అనేది దేవదాసికి మరో పేరు. మహారాష్టల్రో మాతంగి, గోవాలో భావిని - కళావంతి, ఒడిశాలో మహారి, మరికొన్ని ప్రాంతాల్లో వెంటసాని, జోగిని అనే పేర్లతో ఉండే ఈ దేవదాసీలు ‘దేవుడి సేవకే అంకితమయిన స్ర్తిలు’. వాస్తవానికి, వారివి ఊరుమ్మడి బతుకులు. మొల్ల బసివి అవునో కాదో ఆ బసవణ్ణకే తెలియాలి. తాను బసివినని ఆమె మాత్రం ఎక్కడా చెప్పలేదు. తనను తాను ‘గౌరీశ్వర వరప్రసాద లబ్ధ, గురులింగ జంగమార్చన వినోద, నిత్య శైవాచార సంపన్న, సూరిజన వినుత కవితా చమత్కా రాతుకూరి కేసన సెట్టి తనయ, మొల్ల నామధేయ’గా మాత్రమే చెప్పుకుంది ఈ కవయిత్రి. తెలుగు కవులకి ఎంచుకునే స్వేచ్ఛనిస్తే వాళ్లు ఎన్నుకునే తొలి రచన ‘రామాయణ’మే అవుతుందన్నారు గిడుగు సీతాపతి. బహుశా, ఇది రచయిత్రుల విషయంలో మరింత నిజమేమో! మిగతా వాళ్ల మాట ఎలా వున్నా మొల్ల విషయంలో మాత్రం ఇది అక్షర సత్యం. కానీ, నిలవ నీటి మడుగుగా నిలిచిపోయి కంపుకొట్టే ‘సంప్రదాయం’ ఆమెని కుమ్మరి మొల్ల అనే పిలిచేది. రామా అండ్ కో సంస్థ 1937లో - రెండో ముద్రణగా - వెలువరించిన ప్రచురణ ముఖచిత్రం మీదనే ‘గ్రంథకర్త్రి: కుమ్మర మొల్ల’ అని - ప్రముఖంగానో విముఖంగానో - అచ్చుగుద్దిన సంగతి ఈ లింక్‌లో చూడొచ్చు:
https://archive.org/ stream/ MollaRamayanamu/ Ramayanamumolla #page/n0/mode/2up
మట్టిని మనకింత కూఢు కుడిపే చట్టిగానూ, వంటకు పాత్రగానూ, పూజకు మూర్తిగానూ మలచడం మొల్ల కులవృత్తి. రచయిత్రిగా కూడా ఆమె చేసిన పని అదే మట్టిపుట్టలో పుట్టిన మహాకవి - ఆదికవి - వాల్మీకి రాసిన రామాయణాన్ని మట్టివాసనలతో కూడిన రచనగా మలచింది మొల్ల. ‘ఈయమ కుమ్మరకొలపు రతనము’ అని ఘనంగా చెప్పి, ఆమె భర్త పేరు చెప్పలేదు కనుక, బాలవితంతువై వుండి ‘గ్రంథ రచనా లాలసయై జీవయాత్ర గడపినట్లు తలం’చిన ఈ గ్రంథ పరిష్కర్త ఆమె ఏ కాలానికి చెంది వుండవచ్చునో ఊహించే శ్రమ మాత్రం తీసుకోలేదు. పదిహేనో శతాబ్దం ఉత్తరార్థంలో పుట్టిన మొల్ల పదహారో శతాబ్ది ప్రథమార్ధంలో తన రామాయణం రాసి ఉంటుందని పరిశోధకుల అంచనా.
మళ్లీ ఒక్కసారి పైన చెప్పుకున్న పద్యాన్ని చూద్దాం. ఎత్తుగీతితో కూడిన ఈ సీసం దశరథుడి గుణగణాల్ని చెప్తోంది. ముగ్గురు రాణుల్ని పెళ్లాడిన వాడు కావచ్చు కానీ, దశరథుడు పరవధూ లావణ్య సౌభాగ్య లక్షణాలను ఎన్నడూ పట్టించుకోలేదట. మహారాజుగా పాలన వ్యవహారాల్లో తలమునకలుగా ఉండినప్పటికీ, తన చేతికింద పనిచేసేవాళ్ల మీద చాడీలు చెప్తే ఎన్నడూ వినలేదట. పట్టపగ్గాల్లేని పెత్తనం చేతిలో వున్నా, నోటికొచ్చినట్లు కటువుగా ఎప్పుడూ పేలలేదట. అతనికి డబ్బుపిచ్చి లేదట. గాంభీర్యం, ధైర్యాలను భూషణాలుగా ధరిస్తాడట. రాజన్యుడిగా ప్రసిద్ధుడట. బీదాబిక్కీ జనానికీ, మగ మృగరాజ్యంలో ఆడవారికీ ఏయే గుణగణాలంటే గౌరవమో అవే లక్షణాలు దశరథుడికి కట్టబెట్టింది మొల్ల. అలా చెయ్యడానికి ఆమె వాల్మీకిని గానీ, మరే కవినిగానీ అనుసరించలేదు - అనుకరించనూ లేదు. జీవితం నేర్పిన పాఠాన్ని మాత్రమే దిక్సూచిగా తీసుకుని ఆమె ఈ పద్యం రాసింది. అనగా, ఇవి రాజుల్లో మొల్ల మెచ్చిన లక్షణాలన్నమాట! ఇదే ధోరణి ఆమె కావ్యమంతటా కనిపిస్తుంది. నిజానికి, ఇంతకి మించిన విశిష్టత మొల్ల కవితలో లేదనే చెప్పాలి. ఆమె రామాయణంలో అందుకే ‘అవాల్మీకాలు’ పుష్కలంగా కనిపిస్తాయి. అయితే, కాండారంభాల్లోనూ, కాండంతాల్లోనూ సూచించిన దాని ప్రకారం, నారదుడు వాల్మీకికి చెప్పిన రామాయణ గాథను యథాతథంగా మొల్ల మనకి నివేదించింది. అందుకే, అంతా కలిపి, ‘మొల్ల రామాయణం’లో తొమ్మిది వందల పద్యాలు కూడా లేవు. కిష్కింధ కాండ కేవలం ఇరవయ్యేడు పద్యాల్లోనే ముగించింది కవయిత్రి. గుహుడి కథ ఒకే పద్యం, ఒకే వచనంతో కట్టిపెట్టింది. శతాబ్దాల తర్వాత చలం చెప్పిన ‘ఇకానమీ ఆఫ్ థాట్స్ అండ్ వర్డ్స్’ మొల్ల అలనాడే ప్రదర్శించింది.
మొల్లకీ, పోతనకీ చాలా పోలికలు కనిపిస్తాయి. ఇద్దరూ శైవులుగా పుట్టినా వైష్ణవ గాథలను ఇతివృత్తాలుగా తీసుకుని రాశారు. సాక్షాత్తూ విష్ణువు కథనే భాగవతంగా పోతన రాయగా, అవతార పురుషుడయిన రాముడి కథను మొల్ల రాసింది. ఎటొచ్చీ పోతన మాదిరిగా నోటికి పట్టే శబ్దాలంకారాలను ప్రయోగించగల ప్రభుతను మొల్ల ఎక్కడా ప్రదర్శించలేదు. అయితే, సీతా స్వయంవరానికి వచ్చిన ‘ద్రవిడ, కర్ణాటాంధ్ర, యవన, మహారాష్ట్ర, పాండ్య, ఘూర్జర, లాట, బర్బర, మలయాళ, గౌళ, కేరళ, సింధు, కాశ, కోసల, సాళ్వ, మగధ, మత్స్య, కళింగ, మాళవ, నేపాళ, ఉత్కల, కొంకణ, ముద్ర, పౌండ్ర, వత్స, గాంధార, సౌరాష్ట్ర, వంగ, చోళ’ ఛప్పన్న రాజ సుతుల జాబితా కట్టే సందర్భంగా ఆమె పోతన్ననే గుర్తు చేస్తుంది.
పాఠక సమాజంలోని స్ర్తిగణం పురాణేతిహాస కావ్యాల్లోని స్ర్తి పాత్రలతో - ముఖ్యంగా సీతమ్మతో - సునాయాసంగా లీనం కాగలగడానికి ఓ కారణం ఉంది. స్ర్తిజాతి అనుభవించాల్సి వచ్చే అన్ని రకాల కష్టనష్టాలూ ఒక్క సీతమ్మకే సంప్రాప్తించాయి. పుడుతూనే కన్నతల్లికి దూరమయిందామె. కట్టుకున్న వాడు కారడవుల పాలుచేశాడు. కాముకుడెవడో ఎత్తుకెళ్లి కడలి దాటించి, తన పెరట్లో కట్టేసుకున్నాడు. కష్టాలన్నీ కడతేరాయనుకున్న దశలో ఎవడో వదరుబోతు ఏదో కూశాడని - నిండు గర్భిణి అనయినా చూడకుండా - తిరిగి కానలపాలు చేశాడు భర్త. దాదాపు అలాంటి రాతే ద్రౌపదిది కూడా. యాజ్ఞసేనిగా పుట్టి, కవాలనే కుంతికి కోడలయింది. అత్తగారి ఆదేశాన్ని మన్నించి - అసిధారా వ్రతంలాంటి - అయిదుగురు భర్తలతో కాపురం చేసింది. ఆడపడుచు భర్త సైంధవుడు, కామంతో కళ్లు మూసుకుని ప్రవర్తిస్తే, బుద్ధి చెప్పింది, చెప్పించింది. చివరికి, దుస్సల పసుపు కుంకాలను సయితం ఆమే కాపాడింది. ఆశ్రయమిచ్చిన రాజుగారి బావమరిది కదాని, కీచకుడికి కూడా - నా జోలికి రాకుండా - బతికి బాగు పడమనే హితవు చెప్పింది. ప్రభుభక్తి ప్రదర్శించుకునేందుకు అశ్వత్థామ - నిద్రలో వున్న - తన బిడ్డల గొంతులు కోసినా దిగమింగి వూరుకుంది తప్ప దుశ్శాసనుడికి పట్టించిన గతి ఆ ‘న-హంతవ్యుడి’కి కూడా పట్టించమని పట్టుబట్టలేదు. అందరినీ, అన్నిటినీ అంతగా పట్టించుకున్న కారణంగానే, స్వర్గారోహణ పథంలో అందరికన్నా ముందు ఆమే కుప్పకూలిపోయింది. ఏకపత్నీ వ్రతమయినా, బహుపతివ్రతమయినా ఆడదాని జీవనంలో పెద్ద తేడా చూపించలేదు మన కావ్యేతిహాసాలు. ఒకరికి అరణ్యవాసం - మరొకరికి అజ్ఞాతవాస క్లేశం, అంతే తేడా! యుద్ధకాండతో తన కావ్యాన్ని ముగించకుండా, మొల్ల లాంటి కవయిత్రి ఉత్తర రామాయణం కూడా రాసి ఉంటే, ఈ కోణం మరింత స్ఫుటంగా వర్ణితమయి వుండేదేమో!

-మందలపర్తి కిషోర్ 81796 91822