పెరటి చెట్టు

ఇభరాముడి ఇష్టసఖుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘చివురుం తామరపాకులన్ సలలిత శ్రీఖండ పంకంబులన్/ అవనీహార జలాభిషేచనములన్ నాళీక పాళీ మృణా/ళ వితానంబుల వౌక్తిక గ్రధిత మాల్య శ్రేణులన్ బాల ప/ల్లవ తల్పంబుల శీతల క్రియలు చాలం చేసిరయ్యింతికిన్’ - పెద్దనాదులు దిద్దబెట్టిన ప్రాబంధిక ధోరణికి అన్ని విధాలా తగినట్లున్న ఈ పద్యం అద్దంకి గంగాధర కవి రాసిన ‘తపతీ సంవరణోపాఖ్యానం’లోనిది. ఈ ఉపాఖ్యానాన్ని అంగారపర్ణుడనే గంధర్వుడు అర్జునుడికి చెప్పినట్లు వ్యాసభారతం చెప్తోంది. ‘కవిత్రయ’ మహాభారతం ఆదిపర్వంలో తపతీ, సంవరణుల ఉపాఖ్యానాన్ని నన్నయ్య ఇరవై చిల్లర పద్యగద్యాల్లో వర్ణించారు. దానే్న, గంగాధర కవి పెంచి, పోషించి అయిదు ఆశ్వాసాల కావ్యంగా రాశాడు. అందులో, అన్ని ప్రబంధాల్లోనూ ఉండే రీతిలోనే, అష్టాదశ వర్ణనలూ - ముఖ్యంగా స్ర్తి పాత్రల అంగాంగ వర్ణనలూ - గుప్పించాడు గంగాధరుడు. ఇతగాడు మహమ్మద్ ఇబ్రాహిమ్ ఖుత్బ్‌షాహ్ (మాలిక్ ఇబ్రాహీం) అనే ఇభరాముడి కొలువు కూటంలో ఆస్థాన కవిగా ఓ వెలుగు వెలిగినవాడు; ఇభరాముడికి ఇష్టసఖుడిగా మెలిగినవాడు. షట్చక్రవర్తులకు నిలయమయిన ఈ గడ్డ మీద, ఇభరాముణ్ణి సప్తమ చక్రవర్తిగా కీర్తించాడు తెలుగు కవులు. పదహారు కళలున్న చంద్రుడే మనకి తెలుసు. ఇభ రామచంద్రుడు పదిహేడో రాజు (చంద్రుడు)గా మన కవుల ప్రశంసలందుకున్నాడు. ‘ఏడు కులాద్రులెక్కి, వెసనేడు పయోధులు దాటి, లీలమై ఏడవు దీవులం దిరిగి, ఏడుగడన్ విహరించి, కీర్తి ఈరేడు జగమ్ములన్ వెలయ నేలిన మల్క్భి రామచంద్రుడే ఏడవ చక్రవర్తి, పదునేడవ రాజు ధరాతలమ్మునన్’ అంటూ ఒళ్లు మరిచి గానం చేశారు మన కవులు. ఈ కవి గాయక బృందానికి ‘్భజన సమ్రాట్’గా వ్యవహరించిన ఖ్యాతి గంగాధర కవికి సొంతమయింది. కృష్ణా జిల్లాలో ‘ఇభ రామపురం’ అనే గ్రామాన్ని కూడా నిర్మించుకున్నారని వీరేశలింగం తన ‘ఆంధ్ర కవుల చరిత్ర’లో రాశారు. తెలుగులు ఎంతకయినా తగినవాళ్లు మరి!
భారతంలోని సుప్రసిద్ధమయిన తపతి - సంవర్ణుల కథ ఇది: సూర్యుడికి ఛాయ వలన పుట్టిన కూతురు తపతి. సప్తాదిత్యుల్లో ఒకడయిన సవితృని సోదరి ఆమె. త్రిలోకాల్లోనూ తపతిని మించిన సుందరి లేదట. ఆమె అవయవాల పొందిక లోపరహితమట. నల్లని, విశాలమయిన నేత్రాలు ఆమె సొమ్ములట. అందంలో అప్సరసలను తలదన్నుతుందట తపతి. శీలసంపదలో ఆమె కాలిగోటికి కూడా దేవతలు పోలరట. అటువంటి తపతికి వివాహయోగ్యమయిన వయసు వచ్చేసరికి తండ్రి సంబంధాల వేటలో పడతాడు. ఏ వంకా పెట్టడానికి వీల్లేని తన కూతురికి తగిన వరుడు ఈ సృష్టిలో లేనేలేడని - ఒక దశలో - సూర్యుడు నిస్పృహ చెందాడట. అంతలో ఒకరోజు, సంవరణుడు సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ, అతగాడి దృష్టిలో పడ్డాడు. అతన్ని చూస్తూనే, ‘ఇస్తే, నా కూతుర్ని ఇతగాడికే ఇవ్వాల’ని సూర్యుడు తీర్మానించుకున్నాట్ట. అక్కణ్ణుంచి, సంవరణుడు తిన్నగా వేటకి వెళ్లాడు. అక్కడ అతని కళ్లు జిగేల్మనిపింపచేసే సుందరి ఒకామె ఎదురయింది. ఆమే తపతి. ‘నువ్వెవరివి? ఏ ఊరిదానివి? ఈ నిర్జనారణ్యంలో ఎందుకున్నావు? నీ వివరాలు చెప్పి నన్ను మన్మథాగ్ని నుంచి బయటపడెయ్’ అంటూ ముక్కుసూటిగా అడిగేశాడు సంవరణుడు. కానీ, తపతి తబ్బిబ్బయిపోయి, అక్కణ్ణుంచి అదృశ్యమయిపోయింది. ఆమె కోసం వెతికి వెతికి చివరికి సంవరణుడు మూర్ఛపోయాడు. అప్పుడు తపతి అతన్ని కనికరించి మళ్లీ కనబడింది. ‘నువ్వూ నా హృదయం దోచుకున్న మాట నిజమే కానీ, ఇలాంటి విషయాల్లో స్వతంత్రించి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ నాకు లేదు. నేను ఫలానా వారి అమ్మాయిని, మా పెద్దలతో మాట్లాడమ’ని చెప్పి తపతి మళ్లీ మాయమయింది. సూర్యుణ్ణి మెప్పించి, అతగాడి కూతుర్ని తనకిచ్చేలా ఒప్పించే నిమిత్తం సంవరణుడు తపస్సు చేశాట్ట. ఈ ప్రేమ వ్యవహారంలో చిలక దౌత్యం ఒకటి ప్రవేశపెట్టాడు గంగాధరుడు. చివరికి వశిష్ఠుడు జోక్యం చేసుకోవడంతో వాళ్లిద్దరికీ పెళ్లయింది - కథ కంచికెళ్లింది!
వీరేశలింగంగారు - ఈ కావ్యాన్ని పొగుడుతున్నాననుకుని - ‘తపతీ సంవరణము సరసమయినదయి, మంచి కల్పనలు కలిగి, దాదాపుగా ‘వసు చరిత్రము’ ను బోలి వరలుచున్న’దన్నారు. ‘అముద్రిత గ్రంథ చింతామణి’ సంపాదకులు పూండ్ల రామకృష్ణయ్య కందుకూరి ప్రశంసతో విభేదిస్తూ ‘వసుచరిత్రమునకు వసుచరిత్రమే సాటిగాని, మరియొక గ్రంథము మన భాషలో నిప్పటికి లే’దని తేల్చి చెప్పారు. ‘తపతీ సంవరణోపాఖ్యానం’ కావ్యాన్ని కొర్లపాటి శ్రీరామమూర్తి పిల్ల వసుచరిత్రగా పరిగణించారు. (కందుకూరి, కొర్లపాటిల అభిప్రాయాల మధ్య ఎంతో తేడా వున్న సంగతి గమనార్హం!) కాగా, ‘ముంగిలి’ వీరు ముగ్గురితోనూ విభేదించింది. ‘వసు చరిత్ర’కన్నా ‘తపతీ సంవరణోపాఖ్యాన’మే ముందొచ్చిందనీ, అంచేత ఆ కొమ్ము కన్నా ఈ చెవే వాడయిందనీ వాదించింది. వాస్తవానికి మల్క్భిరామ్ (మాలిక్ ఇబ్రాహీం), అళియ రామరాయలు సమకాలికులే కానీ, వారిద్దరిలో రామరాయలే పెద్దవాడయి వుండాలి. తన అన్నగారికి భయపడి, పధ్నాలుగేళ్ల వయసులో, మాలిక్ ఇబ్రాహీం రామరాయల దగ్గిర ఆశ్రయం పొందిన సంగతి చరిత్రకెక్కినదే. కాగా, ఓడలు బళ్ళయ్యాకా, 1565లో రామరాయల్ని రాక్షస తంగడి యుద్ధంలో ఓడించిన వాళ్లలో ఇబ్రాహీం కూడా చేరాడు. అంచేత, రామరాజ భూషణుడు గంగాధరుడికన్నా అర్వాచీనుడని చెప్పడానికి చారిత్రిక ఆధారాలు లేవనే చెప్పాలి. ‘తపతీ సంవరణోపాఖ్యానం’ ‘వసు చరిత్ర’ కన్నా ప్రాచీనమయినదని చెప్పడానికి ‘ముంగిలి’ రెండు ఆధారాలు చూపించింది. మొదటిది, పాటిబండ మాధవ రామశర్మ ఈ రెండింటిలో గంగాధరుడి రచనే ముందు వచ్చిందని చెప్పిన మాటనూ - బహుశా దాని మీదే ఆధారపడి - ఆరుద్ర ఆ మాటను బలపరుస్తూ చెప్పిన మరో మాటనూ ‘ముంగిలి’ ఉటంకించింది. వాస్తవానికి, ప్రబంధాలన్నింటికీ సామాన్యమయిన కొన్ని లక్షణాలు ఈ రెండు కావ్యాల్లోనూ కనిపించే మాట నిజమే. అంతకు మించి, ఈ రెండు కావ్యాల మధ్య ప్రత్యేకంగా చెప్పుకోదగిన పోలిక కూడా కనిపించడం లేదు.
ఉన్నదున్నట్లు చెప్తే, ‘తపతీ సంవరణోపాఖ్యానం’ ఓ తృతీయ శ్రేణి ప్రణయ కావ్యం. చిత్రమేమిటంటే, ఈ కావ్యం తెలుగు సాహిత్యం మీద ఏపాటి ప్రభావం చూపించిందో తెలియదు కానీ, ఉర్దూ సాహిత్యాన్ని అపారంగా ప్రభావితం చేసినట్లుంది. ఆచార్య బిరుదురాజు రామరాజు - ఆరుద్రకి ఓ ఉత్తరం రాస్తూ - వఝీ రాసిన ‘కుతుబ్ ముప్తరీ’ అనే ‘ప్రబంధం’పై గంగాధరుడి కావ్యం ప్రభావం ఉందని అన్నారట. నిజానికి, ‘కుతుబ్ ముప్తరీ’ ప్రబంధం కాదు. కనీసం, తెలుగు సంప్రదాయ సాహిత్యంలో కనిపించే ప్రబంధం లాంటి ప్రక్రియ కచ్చితంగా కాదు. ఆరబిక్ - పార్సీ సాహిత్య సంప్రదాయాల్లో ‘మత్నవీ - లేదా - మస్నవీ’ అనే ప్రక్రియ ఒకటుంది. ఇవి సాధారణంగా ప్రశంసాత్మకమయిన కవితారూపాలు. పరిమాణం విషయంలో ఎటువంటి నిబంధనా లేదంటారు కానీ, అంతర్నిహితమయిన అంత్యానుప్రాసల్లాంటి నియమం ఉందంటారు. కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురించిన ‘మహమ్మద్ కులీ కుత్బ్‌షా’ అనే మోనోగ్రాఫ్ (రచన: మాసూద్ హుసేన్)లో ‘కుతుబ్ ముప్తరీ’ ప్రస్తావన కనిపిస్తుంది (పేజీ 2.) మాలిక్ ఇబ్రాహీం న్యాయదృష్టిని గురించి వఝీ తన ‘మస్నవీ’లో చెప్పాడని మాసూద్ హుసేన్ రాశారే గానీ ఇతరత్రా వివరాలేం లేవు. రామరాజు గారు చెప్పిన మాట చిన్నది కాదు - ‘తెలంగాణ ప్రచురణలు’ లాంటి సంస్థ దీని గురించి లోతుగా పరిశోధింపచేసి మంచి ప్రచురణ తీసుకొస్తే అది గంగాధర కవికి మాత్రమే కాదు - మొత్తంగా తెలుగు కవిత్వానికే గొప్ప నివాళి కాగలదు!

-మందలపర్తి కిషోర్ 81796 91822