పెరటి చెట్టు

ఓ సజీవ ప్రశ్న !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పందొమ్మిదో శతాబ్ది మన ప్రపంచంలో ఎన్నో మార్పుల్ని తెచ్చిపెట్టింది. ఈ శతకంలోనే బానిస వ్యవస్థ రద్దయింది. రెండో పారిశ్రామిక విప్లవం జరిగింది. పట్టణాలూ నగరాలూ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. శ్రమ విభజన అనే అందమయిన పేరు మాటున ఓ క్రూరమయిన వ్యవస్థ పుట్టుకొచ్చి, ఉత్పాదకతని ఇబ్బడి ముబ్బడిగా చేసిందీ ఈ శతాబ్దిలోనే. వందల ఏళ్లు ఏలుబడి సాగించిన స్పెయిన్ - ఫ్రాన్స్ - రోమన్ - మొగల్ మహా సామ్రాజ్యాలు పతనమయిందీ ఈ శతాబ్దిలోనే. బ్రిటన్ - రష్యా - అమెరికా - జెర్మనీ - జపాన్ వలసవాద శక్తులుగా ఆవిర్భవించిందీ ఈ శతాబ్దిలోనే. ఈ శక్తులే, వలసల పంపిణీ కోసమే, తర్వాతి శతాబ్దిలో రెండు ప్రపంచ యుద్ధాలను తెచ్చిపెట్టాయి. దాదాపు అర్ధ శతాబ్దిపాటు ప్రపంచాన్ని ప్రచ్ఛన్న యుద్ధం మంగలంలో వేయించి పారేశాయి. ఇలాంటి అమానుష వ్యవస్థలకి బీజాలు పడింది మాత్రం పందొమ్మిదో శతాబ్దిలోనే. అటువంటి పరీక్షా సమయంలో సయితం చెక్కుచెదరని సామాజిక వ్యవస్థ భారతదేశంలో వర్థిల్లింది. రెండున్నర శతాబ్దాల విదేశీ పాలన కూడా ఈ సామాజిక వ్యవస్థని కూల్చలేక పోయింది. అదీ మన దేశంలో సువ్యవస్థితంగా నిర్మితమయిన వివక్ష వ్యవస్థ బలం! దీనికి రెండు ముఖాలు. సామాజిక జీవనంగా ఇది నాలుగు స్తంభాల మంటపం. ఆ నాలుగు స్తంభాలూ పోతపోసిన చతుర్వర్ణాలు. ఇక, సంసార జీవితం విషయానికి వస్తే అది ఒంటిస్తంభపు మేడ. మగతనమే దాని పునాది. అత్తగారిగానో, ఆడపడుచుగానో, సవతి తల్లిగానో, చిన్న రాణిగానో - అంతో ఇంతో - మగతనం ఆపాదించుకుంటేనే, ఇక్కడ ఆడదానికి కూడా - కొద్దో గొప్పో - అధికారంలో వాటా దక్కుతుంది. అటువంటి వివక్షపూరితమయిన కుటుంబ వ్యవస్థను ప్రశ్నించిన సాహసి గుడిపాటి వెంకటచలం పుట్టింది కూడా పందొమ్మిదో శతాబ్దిలోనే.
చలం పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో. ఆయన పుట్టిందీ - పెరిగిందీ - మనుగడ సాగించిందీ పరిపూర్ణమయిన మగాడిగానే. కానీ, చలం వివక్షపూరితమయిన కుటుంబ వ్యవస్థను సమర్థించలేదు. పైపెచ్చు, అడుగడుగునా దాన్ని నిలదీశాడు. అతని పుట్టుక - అతని జెండర్‌లే - చలానికి మొదట్లో ఈ ప్రశ్నించే శక్తిని కలిగించి వుండొచ్చు. కానీ, జీవితాంతం అతన్ని పృచ్ఛకుడిగా కొనసాగింప చేసినవి అవి కాదు కదా! పైగా, ఆ కులంలోనూ, ఆ జెండర్‌లోనూ పుట్టిన వాళ్లలో ఎందరు చలాలు కాగలిగారు? ఎందరు, ఆయన లేవనెత్తిన ప్రశ్నలు వెయ్యగలిగారు? ఎందరు వీరేశలింగాన్నీ, రఘుపతి వెంకట రత్నం నాయుణ్ణీ చలంలా సమర్థించగలిగారు? అలా సమర్థించిన వాళ్లలో మరెందరు చలం సంధించిన ప్రశ్నలను తామూ సంధించగలిగారు. నిరంతరం అవ్యవస్థల పాలయి, వుండడానికి అద్దె ఇల్లు కూడా దొరికించుకోలేక, పిల్లాపాపాతో వుంటున్న కొంపను తగలబెట్టిన నైష్ఠికుల ద్వేషాగ్నిని ఖాతరు చెయ్యకుండా తాను నమ్మిన విలువల కోసమే బతకడమంటే మాటలు కాదు. కాదు కనకనే, మరో చలం పుట్టడానికి సాహసించలేక పోయాడు!
కుటుంబ వ్యవస్థలోని వివక్షతో ఏ దశలో రాజీపడిపోయినా, చలాన్ని నెత్తిన పెట్టుకుని ఊరేగించి వుండేవారు మన పెత్తందార్లు. కానీ, అలా చెయ్యకపోగా, అరుణాచలం వెళ్లినా తన యుద్ధం కొనసాగిస్తూనే పోయాడు చలం. తన మీద కత్తిగట్టిన నవ్య సంప్రదాయ వాదుల్ని నిలువునా కడిగేయడానికి ఎన్నడూ జంకలేదు చలం. ‘నేల మీద, రాళ్లమీదా, రూపాయల మీదా వుండే హక్కుల్ని, ప్రచండ మారుత అధికారాల్ని, మత ధిక్కారాల్ని, ఐశ్వర్య గర్వాల్ని మండపెట్టే అగ్నిశిఖలు ప్రపంచమంతా రేగుతో వుంటే ఈ ఆడది నాది! ఈ పిల్లలు నా అధికారానికి లోబడాలి! ఇది నా ధర్మం! ఇది హిందూ వేదం! ఇదీ వివేకం! ఈ బాధ్యతలు పోతే లోకం ఏమవుతుందని, రుూనాడు ఘోషిల్లే పాలుతాగే పాపాయిలు తెలుగు సారస్వత లోకంలో చెలామణీ ఐ పత్రికలు నడుపుతున్నా’రనడానికి ఒక్క క్షణం కూడా వెనకాడలేదు. ‘యుద్ధాలు వొస్తున్నాయి; క్షామాలు వొస్తున్నాయి; రాజ్యాలు తలకిందు లవుతున్నాయి. బుద్ధిమంతులు యెట్లా లోకానికి మంగళం, క్షేమం కలగజేద్దామా అని శ్రమపడుతున్నారు. ఆంధ్ర రచయితలు మాత్రం ప్రణయాలూ, భక్తులూ, తపస్సులూ, పురాతనపు రెడ్లూ, చచ్చిన భోజులూ, మా నాన్నగారూ, తాతయ్యగారూ, శంకరాచార్లూ, నేను చూసిన పిల్లా, మాయమైన కన్యా, అనుకుంటూ కూచున్నా’రని కుండబద్దలు కొట్టేశాడు చలం.
మన ప్రపంచం చాలా చిత్రమయింది. చలాన్ని రచయితగా అభిమానించి, తాత్వికుడిగా వ్యతిరేకించే వాళ్లు ఇక్కడ కోకొల్లలు. వ్యక్తిగా అభిమానించి, సంస్కర్తగా వ్యతిరేకించే వాళ్లు బోలెడంత మంది ఉన్నారు. కొందరికి చలం శైలి అంటే ఇష్టం. మరి కొందరికి మహాప్రస్థానానికి రాసిన ‘యోగ్యతా పత్రం’ లాంటి విశిష్టమయిన రచనలంటే ఇష్టం. కొంతమందికి ఆయన ఇంగ్లిషంటే ఇష్టం. మరి కొందరికి చలం కవిత్వం ఇష్టం. తెలియక అడుగుతున్నా - చలమేమన్నా కట్‌పీస్ సెంటరా, ఎవరికి నచ్చింది వాళ్లు సెలెక్ట్ చేసుకోడానికి? మరికొందరు మేధావులు ‘తెలివిగా’ చలాన్ని గొప్ప రచయితగా ‘మాత్రమే’ చిత్రించాలని చూస్తారు. చలమంటే ‘మైదానం’ ‘దైవమిచ్చిన భార్య’ ‘జీవితాదర్శం’ ‘బ్రాహ్మణీకం’ ‘అరుణ’ ‘అమీనా’ ‘బుజ్జిగాడు’ ‘శశిరేఖ’ అనే నవలలూ ‘పాపం’, ‘యవనవ్వనం’ ‘దోషగుణం’ ‘అమ్మగారి అవసరం’ ‘మామగారి మర్యాద’ ‘ఆ రాత్రి’ ‘ఆ నలుగురు’ ‘ఓ పువ్వు పూసింది’ అనే కథలూ ‘మ్యూజింగ్స్’ ‘ప్రేమలేఖలు’ ‘స్ర్తి’ ‘బిడ్డల శిక్షణ’ అనే రచనలూ చేసిన రచయిత మాత్రమే అన్నట్లు మాట్లాడేవాళ్లు ఇప్పటికీ కనిపిస్తూంటారు. కొంతమందికి చలం సాక్షాత్తూ దేవుడే! అది కూడా ఎంతో ఫేషనబుల్ దేవుడు. చలం కావడానికి ఎవరూ దేవుడు కానవసరం లేదు - మనుషులుగా మిగిలితే చాలు! దురదృష్టమేమిటంటే, మనలో చాలామందిమి అలాక్కూడా మిగల్లేకపోతున్నాం! చలం నవలలకన్నా గొప్ప నవలలూ, గొప్ప కథలూ, గొప్ప రచనలూ చేసిన వాళ్లు - వందల్లో కాకపోయినా - డజన్లలో ఉన్నారు లోకంలో. అసలు చలం ఆ నవలలూ, కథలూ, నాటికలూ రాయకపోయినా చలం కాకుండా పోడు. ఆయన చలమయింది వాటివల్ల కాదు. తను బతికిన బతుకు వల్ల, తను పాటించిన విలువల వల్ల, తను వేసిన ప్రశ్నల వల్ల ఆయన చలం అయ్యాడు!
‘చలాన్ని ఇష్టమైన వాళ్లు చదువుతారు. లేనివాళ్లు లేదు. ఎట్లాగయినా సరే చలం రుచి చూపించి విస్తారంగా చదవటానికి పాఠకులను ఉన్ముఖం చెయ్యాలన్న ప్రయత్నం ఎందుకు మీకు? చలం అంత అవసరమా?’ - ఈ ప్రశ్న వేసింది చలం విమర్శకులు కాదు; సాక్షాత్తూ చలంగారే అడిగిన ప్రశ్న ఇది. ఈ ప్రశే్న చలమంటే! నిజానికి, చలమంటే ఓ ప్రశే్న. అయితే, కాలంతోపాటు పాతబడిపోయే ప్రశ్న కాదు చలం. వయసుతో పాటు మెత్తబడిపోయే ప్రశ్న కాదాయన. నాలుగు పిచికలు జేబులో వాలగానే ఎగిరిపోయే ప్రశ్న కాదు చలమంటే. చలమంటే ఓ సజీవ ప్రశ్న. కొక్కెంలా మన మనసుల లోతుల్లో దిగబడి, కాలం బురదలో ఇరుక్కుపోయిన చేదు నిజాల బొక్కెనల్ని కెలికి, వెలికి తీసే పాతాళ గరిగె చలమంటే. అంచేత, చలం ఎల్లెప్పుడూ అవసరమే! ఆ విషయంలో చలానికేమయినా అనుమానం వుందేమో కానీ, తెలుగువాడికే అనుమానం లేదు.

-మందలపర్తి కిషోర్ 81796 91822