పెరటి చెట్టు

కని‘కట్టు కథా’పూర్ణోదయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తమి పూతీగెల తూగు టుయ్యెలల పంతా లాడుచుం తూగునా/ కొమరుం ప్రాయపు గుబ్బి గుబ్బెతల అంఘ్రుల్ చక్కగా చాగి మిం/టి మొగంబై చనుదెంచు ఠీవి కనుగొంటే, దివ్య వౌనీంద్ర, నా/క మృగీ నేత్రల మీద కయ్యమునకుం కాలు తాచులా గొప్పెడున్’ - ‘కళాపూర్ణోదయం’ పేరెత్తగానే గుర్తుకొచ్చే పద్యమిది. మణికంధరుడనే గంధర్వ వాగ్గేయకారుణ్ణి అడ్డు పెట్టుకుని, పింగళి సూరన, ఉయ్యాలలూగే కొమరుంప్రాయపు గుబ్బెతల కాళ్లు ఆకాశంవైపు దూసుకుపోవడానికి ఓ భావం అంటగడుతున్నాడు. ద్వారక నగరంలో ఉయ్యాలలూగే కనె్నపిల్లల ఠీవిని చూస్తుంటే వాళ్లు, స్వర్గంలోని లేడికన్నుల అందగత్తెలతో కయ్యానికి కాలు దువ్వుతున్నట్టుగా ఉందనిపించాడు సూరన. అక్కడితో ఆగితే ఆయన ప్రబంధ కవి ఎందుకవుతాడు? అందుకే, ఈ సంభాషణను నారదుడిచేత పొడిగింపచేసి ద్వారకా నగరపు ఎలప్రాయంపు మిటారికత్తెల ‘డోలాచ్చలనోచ్చలనముల్ త్రైవిష్టప స్ర్తిల ఔదల తన్నం చనునట్లు మించెననినం తప్పేమి? ఒప్పే అగున్!’ అనిపించాడు. కయ్యానికి కాలు దువ్వడమేంటయ్యా, స్వర్గంలోని స్ర్తిలను తలదనే్నలా ఉంది ఆ ఉయ్యాలలూగడం అంటే మాత్రం అందులో తప్పేముంది? అనడుగుతున్నాడు కలహభోజనుడయిన ఆ మునిమ్రుచ్చు.
పింగళి సూరన పదహారో శతాబ్దం ఉత్తరార్ధానికి చెందిన కవి. కృష్ణదేవరాయలు కొలువుకూటంలో ఉండేవారని చెప్పే ‘అష్టదిగ్గజాలు’ అనే కల్పిత కవి బృందంలో ఈయన్ను చేర్చి చెప్తుంటారు. కానీ, వీరేశలింగం గారి లెక్క ప్రకారం, సూరన 1560 తర్వాతివాడే తప్ప, ముందటివాడు కావటం ‘తటస్థించదు!’. రాయలు 1529లోనే పోయాడని చరిత్ర చెప్తోంది. ఆయన తర్వాత, కృష్ణరాయల తమ్ముడు అచ్యుత దేవరాయలు రాజయ్యాడు. ఆ తర్వాత సదాశివరాయలు - అచ్యుతదేవరాయలు మేనల్లుడు- రాజయ్యాడు. ఇతగాడి హయాంలో, కృష్ణదేవరాయలు అల్లుడు అళియ రామరాయల పెత్తనమే సాగింది. సదాశివ రాయలకి సామంత రాజుగా ఉన్న నంద్యాల కృష్ణరాజుకే పింగళి సూరన తన ‘కళాపూర్ణోదయం’ అంకితమిచ్చాడు. తాను చాలా కావ్యాలే రాశానని సూరనే - ప్రభావతీ ప్రద్యుమ్నంలో - ఇలా చెప్పుకున్నాడు: ‘జనముల్ మెచ్చగ మున్రచించితి సదంచ ద్వైఖరిన్ గారుడంబును శ్రీరాఘవ పాండవీయము కళాపూర్ణోదయంబున్ మరిన్ తెనుగుం కబ్బము లెన్నియేనియును మత్పిత్రాదివంశాభి వర్ణన లేమిం పరితుష్టి నాకవి ఒనర్పం చాల వంత్యంబునన్’. తిక్కన సోమయాజికి తర్వాత, ఇంత ప్రౌఢంగా కవిత్వం చెప్పిన తెనుగుకవి మరొహడు లేడని ‘గద్యతిక్కన’ సూరనను నోరారా నుతించారు. సూరన రాసిన ద్వ్యర్థి కావ్యం ‘రాఘవ పాండవీయం’. ప్రతి పద్యానికీ, రామాయణం పరంగానూ, భారతం పరంగానూ అర్థం చెప్పుకోవచ్చు. మృదుమధుర సులభ పదాలతో ఇలాంటి ద్వ్యర్థి కావ్యం రాయడం ‘మఱియొకరికి సాధ్యముకాద’ని కందుకూరి తేల్చి చెప్పారు. కాగా, నీ ‘మాధుర్య ధుర్యోరు వాగ్వైచిత్రి’ని సఫలం చేస్తూ, కళాపూర్ణోదయం కావ్యాన్ని ‘నిర్ణిద్ర సారస్య లీలాచిత్రంబగు’ మహాప్రబంధంగా చెప్పి, ‘సుధీలోకం’ చేత ఓహో అనిపించుకోమని కృతిపతి నంద్యాల కృష్ణరాజు సూరనని అడిగాడట. ఆయన అంత పనీ చేశాడని కట్టమంచి రామలింగారెడ్డి మొదలుకుని అనేక మంది విమర్శకులు అన్నారు.
కవిత్వానికి కాలక్షేపం కలిగించడానికి మించిన ప్రయోజనం అనూహ్యమయిన దశలో పుట్టిన ధోరణి, ప్రాబంధిక ధోరణి. భాషనూ, భావననూ, కల్పననూ ఊహాకాశం పొలిమేరల వరకూ సాగదీసే అలంకారాలూ, చమత్కారాలూ, ద్వ్యర్థి, త్య్రర్థి తదితర సర్కస్ ఫీట్లతో కావ్యాలను నింపేయడమే ఆ కాలపు కవులకు తెలిసిన విద్య. విశ్వ శ్రేయస్సు లాంటి మహోన్నతాదర్శాలను పక్కకి నెట్టిపారేసి, తెగబలిసిన రాచరిక - భూస్వామ్య శక్తుల్ని మెప్పించే ఏకైక లక్ష్యంతో కావ్యరచన సాగించిన దశ అది. అలా మెప్పించే ప్రయత్నంలోనే కవులు - కొందరు కవయిత్రులు సయితం - స్ర్తిల అంగాంగ వర్ణనలకే అధికతర ప్రాముఖ్యమిచ్చారు. ఇదో ధోరణిగా ప్రబలి, కవి సమయాల్లాంటివి పుట్టుకొచ్చాయి. కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ ధోరణిని బేషరతుగా ఆమోదించింది తెలుగు సాహిత్యం. ఆ దశలోనే ప్రబంధ సాహిత్యం శాఖోపశాఖలుగా విస్తరించింది. ముఖ్యంగా, పదిహేను, పదహారో శతాబ్దాల్లో వచ్చిన కావ్యాల్లో వైవిధ్యం లోపించడం కూడా ఈ ధోరణి కారణంగానే. పిల్ల మనుచరిత్రగా పుట్టిన వసుచరిత్రకి అనేక అనుకరణలు పుట్టుకురావడం క్షీణ ప్రబంధ దశకు ఓ నిదర్శనం. ఈ నేపథ్యంలో, ప్రయోగాల పేరిట రూపవాదం వెర్రితలలు వేసింది. సూరన రామరాజ భూషణుడికి సమకాలికుడే కావచ్చు. 1542 నుంచి 65 వరకూ పెత్తనం చేసిన రామరాయలను భట్టుమూర్తి కొలుచుకోగా, అతనికి సామంతుడుగా ఉన్న కృష్ణరాజును సూరన ఆశ్రయించాడు. వీరేశలింగం గారి లెక్క ప్రకారం ‘వసుచరిత్ర’ ‘కళాపూర్ణోదయం’ కన్నా పదేళ్లు ముందు వచ్చి వుండాలి.
పింగళి సూరన, ‘కళాపూర్ణోదయం’ ద్వారా ఈ ధోరణిలో ఓ పెద్ద మలుపు తీసుకొచ్చి, చరిత్ర సృష్టించాడు. కల్పిత కథ(ల)నే ఇతివృత్తంగా తీసుకుని, ప్రాబంధిక యుగంలో పుట్టి - పాతుకుపోయిన అలంకారాల సాయంతోనే అద్భుత రసం పోషించి, సూరన ఈ లక్ష్యం సాధించాడు. ‘కళాపూర్ణోదయం’ కూడా - సారంలో - మిగతా ప్రబంధాలకు పెద్ద భిన్నమేమీ కానప్పటికీ, రూపంలో పెద్ద మార్పు తెచ్చి పెట్టింది. కథ లోపల కథను పొదిగి, పాఠకుల్లో ఆసక్తి రేకెత్తించే సంవిధానాన్ని సూరన అద్భుతంగా పోషించాడు. అంతకు మించి, పాత్రల మనోవ్యాపారాన్ని తన సంవిధానానికి అనువుగా ఉండే రీతిలో చిత్రించడం సూరన అనుసరించిన శిల్ప రహస్యం. రంభనూ, నలకూబరుణ్ణీ - కలభాషిణినీ, మణికంధరుణ్ణీ మాత్రమే కాదు - బ్రహ్మనూ సరస్వతినీ సయితం - నరనరాన కాముకత్వం నింపుకున్న వారిగా చిత్రించగల తెగువ సూరనకిచ్చింది ఈ ప్రాబంధిక ధోరణే. బ్రహ్మ - సరస్వత్తుల శృంగార క్రీడలూ, వాళ్ల సరసాలూ, అవే కళాపూర్ణుడూ - మధురలాలస - అభినవ కౌముది తదితరుల లలాట లిఖితంగా మారడం లాంటివి సూరన కల్పనా చాతురికి నిదర్శనలు. ఇక సుగాత్రి (సముఖాసత్తి), శాలీనుడు (మణిస్తంభుడు) తదితరుల కథలు చెప్తూ, వరసపెట్టి పునర్జన్మల ఉదంతాలూ, శాక్తేయ, తాంత్రిక ఆచారాలూ కూడా గుప్పించాడు సూరన. అలాంటి మసాలాల మాట అలా వుంచితే, రెండు మూడు వందల సంవత్సరాల తర్వాత కాల్పనిక వచన సాహిత్యం పుట్టుకురావడానికి తెలుగు నేలను పదును చేసిన రచన కళాపూర్ణోదయమే. వాస్తవానికి, తెలుగులో మహాభారత రచన మొదలయిన సమయంలోనే, ప్రపంచంలో మొట్టమొదటి నవల కూడా వెలువడింది. జపాన్ దేశీయురాలయిన మురసాకీ షికిబూ, క్రీ.శ.పదో శతాబ్దంలోనే, రాసిన ‘గెంజీ కథ’ అనేదే ప్రపంచంలో తొలి నవల అంటారు. స్వతంత్ర అవగాహన, పాత్ర చిత్రణపై శ్రద్ధ, పాత్రల మనోవ్యాపారాన్ని నిశితంగా పరిశీలించి పాఠకుల ముందుంచడం లాంటి లక్షణాలన్నీ ఉన్న నవల ఇది. ‘గెంజీ కథ’ వెలువడిన అయిదు వందల సంవత్సరాల తర్వాత తెలుగు ‘కళాపూర్ణోదయం’ వెలువడింది. దానికి కూడా ఈ లక్షణాలన్నీ ఉన్నాయి. అందుకే కట్టమంచి రామలింగారెడ్డి ‘కళాపూర్ణోదయం’ పద్యరూపంలో ఉన్న నవల అన్నారు. మిగతా ప్రబంధ రచయితల మాటెలా ఉన్నా, పింగళి సూరన మాత్రం తెలుగు సాహిత్య చరిత్రలో కలకాలం నిలిచి ఉంటాడు! పురాణం సూర్యనారాయణ తీర్థులు పరిశోధించి, పరిష్కరించిన వావిళ్ల ప్రచురణ - ‘కళాపూర్ణోదయం’ - ఈ లింక్‌లో దొరుకుతుంది.
https://archive.org/ stream/ kalapurnodayam 014930mbp page/n0/mode/2up ఫద్యాల్లో చదువుకోలేని వాళ్లు వచన రూపంలో దొరికే సూరన ‘కనికట్టు కథలను’ ఈ లింక్‌లో చదువుకుని ఆనందించొచ్చు.
https:// eemaata.com/ em/library/ kalaa/ 298.html

-మందలపర్తి కిషోర్ 81796 91822