పెరటి చెట్టు

‘ఉద్ధతుల మధ్యమున పేద కుండతరమె?’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎల్లరు మెచ్చని మత్కృతి నుల్లంబున మెచ్చుగాక ఒక దుష్టక్రులం/ బొల్లని పల్లవితామ్రము కొల్లలుగా పొగడనొక్క కోయిల లేదే?’ - నా కవిత్వాన్ని అందరూ మెచ్చకపోవచ్చు గానీ, దాన్నీ మెచ్చుకునే వాడొకడు ఉంటాడు. లొట్టిపిట్టలకు కిట్టని మావి చిగురు రుచిని వేనోళ్ల పొగిడే కోయిల పిట్ట ఉండదా? అని అడిగిన కవి అటు ఆత్మగౌరవాన్నీ, ఇటు ఆత్మ విశ్వాసాన్నీ తన మూర్తిమత్వంలో సమపాళ్లలో నింపుకున్న విశిష్టుడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతగాడి పేరు సంకుసాల నృసింహ మహాకవి. కర్నూలు జిల్లా, కర్నూలు మండలంలోని సుంకేశుల ఈ కవిగారి స్వస్థలమనీ, ఆ సుంకేశులే కాలక్రమంలో సంకుసాల అయిందనీ ఎక్కడో చదివాను. అదే నృసింహ కవి ఇంటిపేరయిందంటారు. ‘సఙ్క’ అనే మాటకి జవ్వాజి (పిల్లి) మదం అనే అర్థం ఉందని వావిళ్ల వారి సంస్కృతం - తెలుగు నిఘంటువు చెప్తోంది. ఈ సుగంధ ద్రవ్యాన్ని పరిశుభ్రపరిచి, భద్రపరిచే కొట్టును ‘సఙ్కసాల’ అంటారని అన్వయం చెప్పుకోవచ్చు. ఘంటసాల, టంకసాల, గోసాల లాంటి ఇంటి పేర్ల మాదిరిగానే ‘సంకుసాల’ కూడా ఓ ఇంటిపేరయి ఉంటుందనిపిస్తుంది. ఈ విషయంలో అదనపు - విశ్వసనీయమయిన సమాచారం దొరికేంతవరకూ, కవిగారి ఇంటి పేరును విన్నది విన్నట్లుగా వాడడమే సమంజసమనిపిస్తుంది. సాహిత్య సంపన్నత విషయానికి వస్తే ‘కవికర్ణ రసాయనం అనే మాంధాతృ చరిత్రం’ కావ్యం ఉత్తమ శ్రేణికి చెందుతుందనడంలో సందేహం లేదు. ఈ కవిని తృతీయ శ్రేణి కవిగా పరిగణించింది ‘శబ్ద రత్నాకరం’. ఇదే శబ్ద రత్నాకరం కృష్ణరాయల్ని, కంకంటి పాపరాజునీ, ఏనుగు లక్ష్మణకవినీ, చేమకూర వెంకట కవినీ నాలుగో తరగతి కవులుగానూ - పాల్కురికి సోమన, గౌరన తదితరులను అయిదో తరగతి కవులుగానూ పరిగణించిన వాస్తవం మనసులో పెట్టుకోవాలి.
నృసింహ కవి కృష్ణదేవరాయల సమకాలీనుడని చెప్పే ‘చమత్కార పద్య కథలు’ సాహితీ లోకంలో ప్రచురమే కానీ, వాటి చారిత్రికత మాత్రం అనుమానాస్పదమే. అలాంటి ఓ కథను వీరేశలింగం గారు తన ‘ఆంధ్ర కవుల చరిత్ర’లో ‘సంక్షేపించి’ చెప్పారు. అదేమిటో చూద్దాం. ‘్భవన విజయం’లో ప్రవేశపెడతానని ఆశపెట్టి పెద్దన నృసింహ కవిని విజయనగరాని పిలిపించాడట. కానీ, అతని కావ్యపటిమకి అసూయపడి రాయల సముఖానికి తీసుకుపోలేదట. రాజధానిలో రోజు గడుపుకునే నిమిత్తం కవిగారు అమ్మకానికి పెట్టిన ఓ పద్యం రాయలు కూతురు మోహనాంగి కొనుక్కుందట. ఆమెతో చదరంగమాడే వేళ, కూతురు నోటమ్మట ఆంధ్రభోజుడు ఆ పద్యం విన్నాడట. తర్వాత విచారిస్తే, విషయం వెల్లడయింది. పెద్దన సంకుచిత మనస్తత్వానికి బాధపడి, నృసింహ కవి కోసం కబురు చేసేటప్పటికీ అతగాడు తన ‘కవికర్ణ రసాయనం’ శ్రీరంగనాథుడికి అంకితం చేసేశాడట. రాయలుతో మోహనాంగి చదరంగమాడడం వరకూ బాగానే ఉంది కానీ, ‘ఒత్తుకొనివచ్చు కటికుచోద్వృత్తి చూచి, తరుణి తనుమధ్య మెచటికో తరలిపోయె, ఉండెనేనియు కనబడకునె్న అహహ, ఉద్ధతుల మధ్యమున పేద కుండతరమె?’ అనే పద్యం ఒకానొక కూతురు తన తండ్రితో చెప్పిందనడంలో ఎంత మాత్రం ఔచిత్యముందో ఈ కథ కల్పించిన మహానుభావుడు ఆలోచించినట్లు లేడు. అంతకుమించి, నృసింహ కవి రాయలు - పెద్దన్నలకు సమకాలికుడని చెప్పడానికి రుజువుగా నిలిచే ఒక్క చారిత్రికాంశం కూడా మన సాహిత్య చరిత్రకారులు చూపించలేదు. అయినప్పటికీ, ‘ఉద్ధతుల మధ్యమున పేద కుండతరమె?’ పద్యాన్ని ఉటంకించని ‘చరిత్రకారులు’ అరుదు.
మహామంత్రయిన తిక్కన, మహారాజయిన రాయలు మాత్రమే కాదు - తిక్కన శిష్యుణ్ణని గర్వంగా చెప్పుకున్న నాచన సోమన, సంకీర్తనాచార్య అన్నమయ్య, తనలో తానే పాడుకున్న తాత్విక కవి ధూర్జటి, మట్టిపిసుక్కుని బతికిన రైతన్న పోతన్న, మట్టిలోనే పుట్టి పెరిగిన మొల్లమ్మ - తదితరులనేకులు తమ కావ్యాల్లో అత్యుత్తమమయిన వాటిని ‘మనుజేశ్వరాధములకు’ అంకితమివ్వనూ లేదు; వాళ్లిచ్చే పురాలూ వాహనాలు పుచ్చుకోనూ లేదు. ఇదే కోవకి చెందినవాడు నృసింహ కవి కూడా. రాయల్ని కాకపోయినా, పదిహేనో శతాబ్ది తుదినాళ్లలో ఓ వెలుగు వెలిగిన చిల్లర దేవుళ్ల నెవరినో ఆశ్రయించాలని ప్రయత్నించే వుంటాడనిపిస్తుంది. బహుశా రాజాస్థానాల్లో నిలబడి నిలబడి కాళ్లు పీకిన తర్వాతనే, మన కవివరేణ్యుడు శ్రీరంగం దారిపట్టినట్లు అనిపిస్తుంది. ‘కవికర్ణ రసాయనం అనే మాంధాతృ చరిత్రం’ కావ్యంలో ‘నరకృతిపతిత్వ గర్హణము’ అనే భాగం కింద నృసింహ కవి రెండు పద్యాలూ చిన్న వచనం రాసి సరిపుచ్చాడు. అందులోని - ఎత్తుగీతితో కూడిన సీసంలో - ‘ప్రభు దురాత్ములనెవ్వాడు ప్రస్తుతించు?’ అని ప్రశ్నిస్తూ పాలక పుంగవులను ‘సవికృతాకృతుల పిశాచ జనులు’గానూ, ‘జీవచ్ఛవములు’గానూ (‘అధికార రోగపూరిత బధిరాంధక శవము చూడ పాపము సుమతీ’ అన్న బద్దెన మాటలు గుర్తుకు వస్తున్నాయి కదూ?), ‘చేరబోరాని బర్బూర తరులు’ (ముళ్ల తుమ్మచెట్లు)గానూ, ‘దుష్ట ఫణులు’గానూ దుమ్మెత్తిపోశాడు. అక్కడితో ఆగితే సంకుసాల నృసింహ మహాకవి ఎందుకవుతాడు? నరగుణాంకితమయిన కావ్యం కుక్కముట్టిన పాలకుండలా అవుతుందనీ, హరిగుణాంకితమయిన కావ్యం ‘హారసూత్రంబు గతి హృదయంగమంబు’ అవుతుందనీ కూడా అన్నాడు కవిగారు.
మొట్టమొదట చెప్పుకున్న నృసింహ కవి కంద పద్యం మళ్లీ ఒక్కసారి చూద్దాం. ఏ సమాజమయినా, పొరలు పొరలుగా, అంచెలంచెలుగా వేరయి వుంటుందని నృసింహ కవికి తెలుసు. అందరి ఆలోచనలూ, రుచులూ, అభిరుచులూ ఒకేలా వుండవు. ఉష్టక్రులం మావిచిగురును ఇష్టపడదంటాడు కవి. (ఇక్కడ ‘ఉష్టక్రులం’ అంటే ఒంటెలనే నైఘంటికార్థమే వర్తిస్తుం దనుకుంటున్నాను. అది నిప్పుకోడి అనే ఉష్టప్రక్షికి కూడా వర్తిస్తుందేమో విజ్ఞులు చెప్పాలి. అలా అన్వయం కుదిరే పక్షంలో మరింత ఉచితంగా ఉంటుందేమో పద్యం అనిపించింది. కాకపోయినా నష్టమేం లేదు!) మావిచిగురు నిజంగానే వగరుగా ఉంటుంది. అది ఉష్టక్రులానికి నచ్చకపోవచ్చు. అయితే, కోయిలకి మావి చిగురంటే ఇష్టమనీ, చిగుళ్లు మేసిన పుంస్కోకిల - గొంతు కసరెక్కి - విలక్షణమయిన స్వరంలో పాడుతుందనీ కవిసమయం. ఆ పాటలో వగరు చిగురు రుచుల పొగడ్త దాగుందని కల్పించడం నృసింహ కవి సృజనాత్మకత. అదే విధంగా, తన కవిత్వమంటే ఇష్టపడి అభిమానించే వాళ్లూ ఉంటారు లెమ్మని ఆత్మ తృప్తి ప్రకటించుకుంటున్నాడు కవి. వీరేశలింగం గారికి ఈ ఆత్మతృప్తే, ‘స్వాతిశయ భావము’గా కనిపించింది. లోకో భిన్నరుచిః! అసమ సమాజంలో ఉద్ధతుల పెత్తనమే నడుస్తుంది. ఎంతటి ప్రతిభావంతులయినా - నృసింహ కవి లాంటి- పేదలకి ఈ ఉద్దతుల మధ్య ఉండడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే, దిక్కులేని వాడికి దేవుడే దిక్కనుకుని, తన ‘కవికర్ణ రసాయనం’ కావ్యాన్ని శ్రీరంగనాథుడికి అంకితమిచ్చి ఓ దణ్ణం పెట్టుకుని దయచేశాడు మన మహాకవి. నిజమయిన, ప్రతిభావంతులయిన కవుల దుస్థితి నాటికీ నేటికీ పెద్ద భిన్నంగా లేదనిపిస్తుంది.

-మందలపర్తి కిషోర్ 81796 91822