పెరటి చెట్టు

నిక్కమయిన మంచి నీలమొక్కటి చాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కులము కల్గువారు గోత్రంబు కలవారు విద్యచేత విర్రవీగువారు
పసిడి కల్గువాని బానిస కొడుకులు విశ్వదాభిరామ వినుర వేమ!’ - ప్రసిద్ధమయిన ఈ పద్యం, ప్రత్యక్షరంలోనూ వేమన ఆత్మను ప్రతిధ్వనిస్తోంది. వాస్తవానికి, వేమన పద్యాలుగా చెలామణీ అవుతున్న పద్యాల్లో సగం పైన సామాజిక విషయాలపై రాసినవే. వాటిల్లో తొంభై శాతం ఆ యథార్థవాది హృదయ స్పందనలుగానే అనిపిస్తాయి. ‘పుత్తడి కలవాని పుష్టంబు పుండైన వసుధలోన చాల వార్తకెక్కు; పేదవాని యింట పెండ్లైన ఎరుగరు!’ - అనే పద్యం చదివిన వారికి, ఇది నేటి ప్రసార మాధ్యమాల వెర్రిమొర్రి పోకడలను దగ్గిర నుంచి చూసి చెప్పిన పద్యమనిపించడం లేదూ? ‘కలిగిన మనుజుండు కాముడు, సోముడు, మిగుల తేజమునను మెరయుచుండు; విత్తహీనుడెంత రిత్తయై పోవును!’ - డబ్బు బలం, జబ్బ బలం, అధికారపు గబ్బుబలం వున్న వారిని ఆశ్రయించుకుని బతుకీడ్చే నేటికాలపు నట - విట - గాయక బృందాల గురించి క్షుణ్ణంగా తెలిసినవాడే ఆ పద్యం చెప్పినట్లు అనిపించడం సహజం! ‘శిలను ప్రతిమ చేసి, చీకటింటను పెట్టి, మొక్కవలదు మూఢభక్తులార; ఉల్లమందు బ్రహ్మముండుట ఎరుగరా’ - అనే పద్యం చూస్తే ఈ కవికి ‘యథార్థవాది - లోక విరోధి’ అనే బిరుద నామం ఎందుకు దక్కిందో అర్థమయిపోతుంది. ‘్భమిలోన పుట్టు భూసారమెల్లను, తనువులోన పుట్టు తత్త్వమెల్ల; శ్రమములోన పుట్టు సర్వంబు తానౌను!’ లాంటి పద్యాలు చూస్తే అవి నాలుగు వందల ఏళ్ల కిందట, మారుమూల గ్రామ సీమల్లో తిరిగే దేశదిమ్మరి కవి చెప్పినవంటే నమ్మడం కష్టమే. కానీ, ఇవన్నీ వేమన చెప్పిన పద్యాలే.
వేమన గురించి తెలియని తెలుగువాళ్లు ఉండరు. అలాగే, వేమన ఎక్కడ, ఎప్పుడు పుట్టాడో- అతని కుటుంబ నేపథ్యం ఏమిటో తెలిసిన తెలుగు వాళ్లూ కనబడరు. ‘ఊరు కొండవీడు ఉనికి పశ్చిమ వీధి, మూగచింతపల్లె మొదటి యిల్లు; ఎడ్డెరెడ్డి కులమదేమని తెల్పుదు’ అనే పద్యాన్ని చూపించి వేమన కొండవీటి ప్రాంతానికి చెందినవాడేనని ఒక వర్గం వాదించగా, కడప జిల్లాలో ఓ మూగచింతపల్లె వుందని చెప్తూ అతగాడు ఆ ప్రాంతానికి చెందినవాడని మరో వర్గం వాదించింది. కర్నూలు జిల్లా క్రిష్టిపాడు వేమన స్వస్థలమని ఒక వర్గం నమ్మితే, గుంటూరు జిల్లా ఇనుకొండ వేమన సొంత ఊరని మరో వర్గం భావించింది. కడప జిల్లాలోనే వున్న చిట్టివేలు వేమన స్వగ్రామమని తనకు కొందరు జానపదులు చెప్పారని బ్రౌన్ నమోదు చేశారు. కాగా, అనంతపురం జిల్లా కదిరి సమీపంలోని కటార్లపల్లెలో వేమన సమాధయ్యాడనేది మరో ప్రచారం. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మాదులు కటార్లపల్లెలో నిద్రించే వేమన, కవి కాడని నిరూపించారు. ఇక, కొండవీడును నూరేళ్లపాటు పాలించిన రెడ్డి రాజుల కుటుంబంలో కడపటి వాడయిన రాచవేమారెడ్డికి తమ్ముడే వేమన అనే కథనం చాలాకాలంపాటు ప్రాచుర్యంలో ఉండింది. ‘త్రోయనేర్చు కుక్క దొంతులు పేర్చునా?’ ‘పండిన చేలోని పల్లేరు కాయలు..’ ‘గడ్డివేసినను పోట్లగొడ్డు కొమ్మాడించు’ ‘పచ్చికుండల నీళ్లు పట్టిన నిలవవు’ ‘కుండ చిల్లిపడ్డ గుడ్డ దోపగ వచ్చు’ ‘కడుపునిండ తవుడు గంపలో పెట్టక చన్ను ముట్టనీదు కొన్న బర్రె’ లాంటి వేమన పద్యపాదాలు చూస్తే అతగాడు రాచకుటుంబానికి చెందినవాడయ్యే అవకాశం లేదని రాళ్లపల్లి వారు నిక్కచ్చిగా చెప్పేవరకూ, ఈ ప్రచారం కొనసాగుతూనే వచ్చింది. వేమన దేశ కాల పరిస్థితులేవో తేల్చిచెప్పడం ఎందుకింత కష్టమయిపోయిందో రాళ్లపల్లివారే ఇలా తేల్చి చెప్పారు: ‘మన చరిత్రములు విచిత్ర సిద్ధాంతముల కాకరములై యుండుటకు ముఖ్యకారణము మనలో చరిత్ర రచనకు పనికివచ్చు బహిరంగ సాధనము లెక్కువగా లేకుండటయే!’ వేమన పద్దెనిమిదో శతాబ్దం మొదట్లో తన పద్యాలను రాసి వుంటాడనీ, ఆయన గండికోట ప్రాంతానికి చెంది వుంటాడనీ తనకు దొరికిన సాధనాల సహాయంతో బ్రౌన్ లెక్కగట్టారు. ఉన్నంతలో ఈ లెక్క సమంజసమనిపించేలా వుంది.
‘తెలుగు సూర్యుడు’ సీపీ బ్రౌన్, 1829లో, వేమన పద్యాల తొలి సంకలనం రూపొందించాడు. అయిదేళ్లపాటు లోతయిన పరిశోధన చేసిన తర్వాత, రూపొందించిన సంకలనమిది. మరో పదేళ్ల తర్వాత బ్రౌనే మరికొన్ని వందల వేమన పద్యాలను సేకరించి, ఈ సంకలనాన్ని విస్తరింపచేసి, ప్రచురించాడు. ఆనాడు ‘తెలుగు సూర్యుడు’ ఆ పనిచేసి ఉండకపోతే, ఇప్పుడు మన వేమన మనకి దక్కేవాడే కాదు! వాస్తవానికి ఈ కృషి, అప్పటికి దాదాపు నూరేళ్ల కిందటే మొదలయింది. 1732లోనే, ఫాదర్ లా గాక్ అనే ఫ్రెంచ్ మిషనరీ వేమన పద్యాలను -తాళపత్ర గ్రంథం రూపంలో -సేకరించి ప్యారిస్‌కి పంపించాడు. చిత్రమేమంటే, వందల సంవత్సరాల తర్వాత, బంగోరె లాంటి అనేక మంది పరిశోధకులు భగీరథ ప్రయత్నం చేసిన తర్వాత గానీ, ఈ ప్యారిస్ ప్రతి తెలుగు నాట అడుగుపెట్టలేదు. సాహిత్యానికి వుండే భౌతిక శక్తిని ప్రబలంగా నిరూపించిన వేమన లాంటి రచయిత విషయంలో ఇంతటి నిర్లక్ష్యం - కనీసం నిరాసక్తత, నిర్లిప్తత - క్షంతవ్యం కానివి. ‘పరిశోధక రాక్షసుడు’ బంగోరె వేమన గురించీ, బ్రౌన్ లాంటి వౌలిక పరిశోధకుల గురించీ ఎన్నో మంచి విషయాలు వెలుగులోకి తెస్తూ, ఎన్నో ఘోరాలనూ సాహిత్య నేరాలనూ కూడా బయటపెట్టారు. తెలుగు నడమంత్రపు పరిశోధక - పండితంమన్యులు బ్రౌన్ పేరెత్తకుండా ఆయన ప్రచురణలను ఎలా పునర్ముద్రిస్తూ పోయారో ఆధారాలతో సహా నిరూపించారు. నిజాయితీలేని మనుషులను నిలువెల్లా అసహ్యించుకున్న వేమన పద్యాల విషయంలోనే ఇలా జరగడం గమనార్హం! ‘1855లో నేను ఇంగ్లండ్‌కి తిరిగి వచ్చేసిన తర్వాత భారతవాసులు నేను రూపొందించిన ఎన్నో పుస్తకాలను పునర్ముద్రించారు. కానీ, నా ప్రస్తావన ఎన్నడూ చెయ్యలే’దని స్వయంగా బ్రౌనే చెప్పిన చేదు నిజాన్ని కూడా బంగోరె బయటపెట్టారు. పెట్టిన చేతినే కరిచే లక్షణమంటే ఇదే!
అసలు, వేమన సాహిత్యాన్ని సంప్రదాయ సాహిత్య చరిత్రలో భాగంగా పరిగణించడం ఎంతవరకు ఉచితమో విజ్ఞులే తేల్చాలి. ఆయనపై సంస్కృత సాహిత్య ప్రభావం బహు పరిమితం. వేమన ఎంపిక చేసుకున్న ఛందస్సు దగ్గిర్నుంచీ ఈ స్వాతంత్య్రేచ్ఛ వ్యక్తమవుతూనే ఉంది. అసలు, సమాజంలో పేరుకుపోయిన కుళ్లును బరక చీపురుతో ఊడ్చిపారేయడం ఓ సాహిత్య ప్రక్రియ కాగలదా అన్నదే వేమన సాంప్రదాయికుల ముందు నిలబెట్టిన నిలువెత్తు ప్రశ్న. మూఢ నమ్మకాలతో మొదలుపెట్టి సంకుచితత్వం వరకూ ప్రతి దుర్లక్షణాన్నీ ప్రశ్నించగలిగిన ధీరత్వం వేమన సొంతం. అనన్య సామాన్యమయిన అతగాడి వ్యక్తిత్వమే వేమన పద్యాలకు ప్రాణప్రతిష్ట చేసింది. వేమన పద్యాలు ఒకటి రెండయినా చెప్పలేనివాణ్ణి తెలుగువాడనడం నేరం! అంతటి వ్యాప్తిని పొందిన ఈ ‘కవి’ వాస్తవానికి బహుముఖ ప్రజ్ఞావంతుడు. సాహిత్యంలో తాత్వికతకూ, సమాజంపట్ల చైతన్యానికీ, క్లిష్టమయిన జీవితసత్యాలను అలవోకగా - అరటిపండు వలిచిపెట్టినంత తేలిగ్గా - విప్పిచెప్పగలిగిన ప్రతిభకూ శాశ్వత చిరునామా వేమన. మరో వెయ్యేళ్ల తరవాత కూడా కచ్చితంగా నిలబడేది వేమన సాహిత్యమేనేమో!

-మందలపర్తి కిషోర్ 81796 91822