పెరటి చెట్టు

అజ్ఞాత ఐతిహాసికుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగువాళ్లకి మహాభారతమంటే కవిత్రయ మహాభారతమే. వేదవ్యాసుడనే కృష్ణద్వైపాయనుడు రచించిన భారతాన్ని కాక, వేరే భారతాలను కనీసం ఇద్దరు ప్రముఖ కవులు అనువదించిన సంగతి సువిఖ్యాతమే. పదిహేనో శాబ్దంలో పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమిని భారతాన్ని జయప్రదంగా అనువదించాడు. మరో రెండు వందల సంవత్సరాల తర్వాత సముఖం వెంకట కృష్ణప్ప నాయకుడు కూడా జైమిని భారతానే్న పునః అనువదించాడు. ఈ రెండింటికీ మధ్యలోనూ, ఆ తర్వాతా కూడా భారతంలోని ఆఖ్యానాలనూ ఉపాఖ్యానాలనూ ఇతివృత్తాలుగా తీసుకుని ఎందరో ఎన్నో కావ్యాలు రాశారు. పదహారో శతాబ్దంలో - పొనె్నకంటి తెలగనార్యుడు మహాభారతంలోని ఓ కథని తీసుకుని ‘యయాతి చరిత్రం’ రాశాడు. అదే శతాబ్దానికి చెందిన అద్దంకి గంగాధర కవి మహాభారతంలోని మరో కథని తీసుకుని ‘తపతీ సంవరణోపాఖ్యానం’ రాశాడు. అదే శతాబ్దానికి చెందిన గౌరన భారతంలోనిదే వేరే కథని తీసుకుని ‘హరిశ్చంద్రోపాఖ్యానము’ కావ్యాన్ని రాశాడు. అయినప్పటికీ, నన్నయ్య అనువదించిన రెండున్నర పర్వాలు - తిక్కన ఒంటిచేత్తో అనువదించిన పదిహేను పర్వాలు - ఎర్రాప్రెగ్గడ పూనుకుని పూరించిన అరణ్య పర్వ శేషం - కలిసిన ఇతిహాసానికి మాత్రమే ‘మహా’్భరత ప్రతిపత్తి లభించింది మన గడ్డమీద. మరి, వ్యాసప్రోక్తమయిన ఈ మహేతిహాసాన్ని సంపూర్ణంగా అనువదించే ప్రయత్నం మరెవ్వరూ చెయ్యలేదా? చెయ్యలేదని చెప్పడం ఎంత కష్టమో ఫలానా కవి ఈ ఘనకార్యం సాధించాడని చెప్పడం కూడా అంతే కష్టం! ఎందుకంటే, ఈ విషయం ఎక్కడా సూటిగా నమోదు కాలేదు. అయితే, ఈ మాట ఎంత నిజమో, ప్రామాణిక లక్షణ గ్రంథాల్లో ఈ ప్రయత్నాల గురించిన పరోక్ష ప్రస్తావనలున్న విషయం కూడా అంతే వాస్తవం.
మిగతా వాళ్లందరి సంగతెలా వున్నప్పటికీ, కనీసం ఒక కవి గురించయితే లక్షణ కర్తలకూ, తెలుగు సాహిత్య చరిత్రకారులకూ, పండిత పరిశోధకులకూ కచ్చితంగా తెలుసు. అంతేకాదు - అప్పకవీయం’, ‘వికృతి వివేకం’ వివాదం పుణ్యమాని ఈ కవి పేరు ఛందోశాస్త్ర విద్యార్థులందరికీ సుపరిచితమే. తిక్కనగారి సమకాలికుడని భావిస్తున్న ఈ కవి నన్నయ్యగారు అసంపూర్ణంగా వదిలేసిన మహాభారతానువాద భాగం - రెండున్నర పర్వాల - జోలికి పోనేలేదట. స్వతంత్రంగా వ్యాస మహాభారతాన్ని సంపూర్ణంగా అనువదించే ప్రయత్నం చేసి ఈ కవి సఫలుడయ్యాడని ఒక వర్గం చరిత్రకారుల విశ్వాసం. ఆ కవి పేరు అధర్వణుడు. ఆయనే్న అధర్వణాచార్యుడని కూడా వ్యవహరించడం కద్దు. ఈ కవి పండితుడు ‘అధర్వణ కారికావళి’ ‘త్రిలింగ శబ్దానుశాసనం’ అనే రెండు వ్యాకరణ గ్రంథాలనూ, ‘అధర్వణ ఛందస్సు’ అనే లక్షణ గ్రంథాన్నీ కూడా రాశాడని అంటారు. ‘అధర్వణ కారికావళి’కే ‘వికృతి వివేకం’ అనేది మరో పేరని ఒకప్పుడు ప్రచురంగా ఉన్న నమ్మకం. అయితే, ఈ ప్రచారంలో సత్తా లేదని కందుకూరి వీరేశలింగం, చాగంటి శేషయ్య తదితర సాహిత్య చరిత్రకారులు ఏనాడో రుజువు చేశారు. ఆయా పేర్లతో వున్న రచనల్ని అధర్వణుడు నిజంగానే చేసి వుండొచ్చుకానీ, ఇప్పుడు వ్యాప్తిలో ఉన్న అధర్వణ కారికావళికీ ఈ కవిగారికీ దూరపు చుట్టరికం కూడా లేదన్నది పరిశోధకుల నిరూపణ.
కారణం స్పష్టంగా తెలియదు కానీ, అధర్వణుడి పట్ల మన సాహిత్య చరిత్రకారులు ఎందుకో నిష్పక్షపాతంగా వ్యవహరించలేదనిపిస్తుంది. సంప్రదాయ సాహిత్యంతో చెప్పుకోదగిన పరిచయం ఉన్నవాళ్లకి కూడా ఈ కవి పేరయినా తెలియదు. పోనీ, అధర్వణుడి ప్రతిభ ఏమయినా ఆషామాషీదా అంటే అదీ కాదు! ఈ కవిని గురించి, అందరికన్నా ముందు ప్రస్తావించిన వాడు - పదిహేనో శతాబ్దానికి చెందిన - గౌరన మంత్రట. ఆయన రాసిన ‘లక్షణ దీపిక’లో అధర్వణ ఛందం గురించి గౌరన ప్రస్తావించాడట. కస్తూరి రంగకవి రాసిన ‘రంగరాట్ఛందం’లో అధర్వణుడి ఛందోగ్రంథంలోంచి కొన్ని పద్యాలను ఉటంకించాడట. మాతృకా పూజా విధానం గురించిన ఈ పద్యాలు గొప్పగా వున్నాయి. విప్రకుల మాతృకను - మనం రోజూ చూసే రవివర్మ సరస్వతి పెయింటింగ్ మాదిరిగా - ధగధగలాడేలా వర్ణించాడు అధర్వణ కవి. కొప్పులో కలువలు తురుముకుని, ఒళ్లంతా శ్రీగంధం పూసుకుని, మెరిసే ముత్యాల నగలు ధరించుకుని, తెల్లని - సన్ననేత చీర కట్టుకుని, ఓ చేత రత్నాల వీణ - మరోచేత పుస్తకం ఉంచుకుని, అరవిరిసిన మొల్లమొగ్గలా ఉంటుందని విప్రకుల మాతృకను వర్ణించాడు కవి. తర్వాతెప్పుడో పోతన రాసిన ‘శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార...’ పద్యం గుర్తుకు రావడంలేదూ? సంప్రదాయ కవిత వేళ్లు శతాబ్దాల లోతుల్లో పాతుకుపోయి ఉంటాయంటారు అందుకే మరి!
కారణం స్పష్టంగా తెలియని మరో విషయం ఏమిటంటే, అధర్వణుణ్ణి నిన్న మొన్నటి వరకూ ‘జైనుడు’గా భావించారు మన సాహిత్య చరిత్రకారులు. దాదాపు రెండు దశాబ్దాల కింద అయ్యప్ప ఫణిక్కర్ సంపాదకత్వంలో వెలువడిన కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురణ ‘మధ్యయుగాల భారత సాహిత్యం - అధ్యయనాలూ ఎంపికలూ’ (ళజూజళ్ప్ఘ నిశజూజ్ఘశ జజఆళ్ఘూఆఖూళ డఖ్పూళకఒ ఘశజూ డళళషఆజ్యశఒ) అనే పుస్తకంలోని తెలుగు విభాగంలో కూడా అధర్వణుడి భారతాన్ని జైన సాహిత్యంలో భాగంగా పరిగణించారు. ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ సంపుటాల్లో ఆరుద్ర ఉటంకించిన అధర్వణుడి పద్యాలను చూస్తే, అతగాడికి జైన వాసనలున్నట్లు అనిపించదు. అయినా, జైనులు రాసిన సాహిత్యం అంతా జైన సాహిత్యం అవుతుందా? జైనులు కాకుండా, జైన సాహిత్యం రాయకూడదా? తమిళ పంచమహాకావ్యాల్లో (అయిం పెరుం కాప్పియగళ్) ఒకటయిన ‘శిలప్పదిగారమ్’ రాసిన ఇళం గో అడిగళ్ ఓ జైన సాధువే. పూర్వాశ్రమంలో ఆయన రాజకుమారుడు కూడానట. ఆ కావ్యంలో లౌకిక కావ్యాలకి వుండాల్సిన ఏ లక్షణమూ లోపించిందని ఎవరూ అనలేదు. పైపెచ్చు ఇళంగో ఈ కావ్యాన్ని క్రీ.శ.రెండు - మూడు శతాబ్దాల్లోనే రాశాడన్నది తమిళుల అంచనా. వాళ్లకెంత డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ, ‘శిలప్పదిగారాన్ని’ క్రీ.శ.నాలుగో శతాబ్దంకన్నా ముందుకు లాక్కు రావడం కష్టం! తమిళుల్లో ఉదారంగా ఆలోచించేవాల్లలో కొందరు - అతికొద్దిమంది మాత్రమే - ఇళంగో కాళిదాసుకు సమకాలికుడనీ, క్రీ.శ.నాలుగో శతాబ్దానికి చెందినవాడనీ ఒప్పుకుంటారు. అన్నిటికన్నా ముఖ్యమయిన విషయమేమిటంటే - శిలప్పదిగారాన్ని కానీ, దానికి పొడిగింపుగా వెలువడిన ‘మణిమేగలై’ని కానీ, ద్రావిడ సాహిత్య నిపుణులు జైన సాహిత్యంగా పరిగణించరు. మరి అధర్వుణుడి భారతానికి ఆ గుర్తింపు ఎందుకు వచ్చిందో? సాహిత్య చరిత్రలో నిశ్చల నిశ్చితాలకు తావులేదన్న శాశ్వత సత్యాన్ని ఒక్కసారి మననం చేసుకుని, మన చరిత్రకారులు అధర్వణ కవికి ఇప్పటికయినా న్యాయం చెయ్యాలి. నేను చూసినంతలో, ఈ కవిచరిత్ర ఇతివృత్తంగా పుస్తకాలేం రాలేదు. అసలు తెలుగు గడ్డమీద జైనం అంతరించిపోయిన పరిణామం మీద కూడా లోతయిన అధ్యయనం జరిగినట్లు కనిపించదు. చీమకుర్తి శేషగిరిరావు గారు రాసిన ‘శ్రీ ఉత్పత్తి పిడుగు’ లాంటి పుస్తకం ఒకటి ఈ పరిణామం గురించి కూడా రావల్సిన అవసరం ఉంది. అధర్వణుడి చరిత్రను ఆధారంగా చేసుకుని అలాంటి రచన వెలువడితే కొంతలో కొంతయినా న్యాయం జరుగుతుందేమో!

-మందలపర్తి కిషోర్ 81796 91822