పెరటి చెట్టు

బాల రసాల పుష్ప నవ పల్లవ కోమల కావ్య కర్షకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బమ్మెర పోతన చెప్పిన పద్యంగా ప్రసిద్ధమయిన ‘బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్...’ పద్యం (వౌలికంగా) ఆయన సొంతం కాదు. ‘కేయూరబాహు చరిత్రం’ అనే కావ్యం ద్వారా, తెలుగులో కథాకావ్య రచనకు ఒరవడి దిద్దిన మంచన రాసిన పద్యానికి ప్రతిధ్వని అది. కోమల కావ్యకన్యకను చిగురు కొమ్మలతో కూడిన మామిడి మొక్కతో పోల్చారు పోతన. కానీ, అదే కావ్యకన్యకను మామిడి మొక్క తొడిగిన తొలికారు పూతతో పోల్చారు మంచన (బాలరసాల పుష్ప నవ పల్లవ కోమల కావ్య కన్యకన్..) పోతన ఉపమానం కన్నా, మంచన పోలికే బాగుందని ఎందరో రసలబ్ధులు వ్యాఖ్యానించారు. ‘శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార...’ తదితర పద్యాల్లో పోతన ప్రయోగించిన యమక శబ్దాలంకారానికి మూలం కూడా ‘ఆకాశనదీ మరాళ శివకాశ సురాశన తారకేశ నీ కాశతరాధి రోచి రవకాశ వికాస యశోవిశాలుడై..’ లాంటి మంచన పద్యాల్లో కనిపిస్తోందని విమర్శకులు ఎన్నడో చెప్పారు. ఇక, మనుచరిత్రలో పెద్దన రాసిన పద్యం - ఇది కూడా సుప్రసిద్ధమయినదే - ‘ఎవ్వతె వీవు భీత హరిణేక్షణ?’ కూడా మంచన రాసిన ‘ఎవ్వరిదాన వీవు హరిణేక్షణ?’ అనే పద్యానికి అనుకరణే. అంతటి ప్రభావశీలమయిన వౌలిక ప్రతిభ కలిగిన మంచన కూడా ననె్నచోడుణ్ణి అనుకరించిన విషయాన్ని పెద్దలు రుజువు చేశారు. ఈ తరహా అనుకరణలు ఎవరైనా ఎందుకు చేస్తారసలు? ‘అనుకరణను మించిన ప్రశంస లేద’ని సామెత చెప్తారు. తమను ప్రగాఢంగా ప్రభావితం చేసిన ప్రయోగాల్ని కవులు పునః ప్రయోగించడం సామాన్యమే.
పోతన, పెద్దన లాంటి మహాకవుల్ని ప్రభావితం చేసిన మంచన లాంటి కవికి కూడా ఎలాంటి దుర్గతి పట్టిందో చూడండి - మంచన ఏ కాలంలో పుట్టి పెరిగి, కవిత్వం చెప్పాడో వీరేశలింగం మొదలుకుని వెల్చేరు నారాయణరావు వరకూ తరతరాల సాహిత్య చరిత్రకారులు నిర్దిష్టంగా తేల్చి చెప్పలేకపోయారు! ఈ అనిర్దిష్టతకు మంచనను గానీ, చారిత్రికులను గానీ బాధ్యులను చెయ్యడం భావ్యం కాదు. తెలుగు సాహిత్య సంప్రదాయంలో స్థల కాలాలకు సంబంధించిన వాస్తవ స్పృహ కొరవడడం ఈ పరిస్థితికి దారి తీసిందని చెప్పడం మాత్రమే ఇది. ఫలానా కవి ఎప్పుడు పుట్టి పెరిగాడనే విషయంపై అతగాడి రచనల కళాత్మకత ఆధారపడి ఉండదని వాదించే విమర్శకులు అక్కడక్కడా కనిపిస్తుంటారు. ఆ మాట నిజమే అయి వుండొచ్చు కానీ, కవుల వ్యక్తిగత జీవిత వివరాలు వేరు, సాహిత్య పరిణామాలకు సంబంధించిన వాస్తవాలను నమోదు చెయ్యడం వేరు. మనం పట్టించుకోవలసింది రెండో విషయాన్ని.
మంచన విషయానికొస్తే - సాహిత్య చరిత్ర రచయిత లందరిలోనూ మినహాయింపు లేకుండా వ్యక్తమయిన ఏకాభిప్రాయం ఏమిటంటే, మంచన పోతన కన్నా పూర్వికుడు. కొందరి లెక్క ప్రకారం, కేయూరబాహు చరిత్ర రచయిత తిక్కన కన్నా కూడా పూర్వికుడు. అయితే, ఇంతకు ముందు, పోతన శబ్దాలంకారం మప్పిన మంచన పద్యం గురించి చెప్పుకున్నాం కదా - అదే పద్యం (కౌశిక గోత్ర భూసుర శిఖామణి...’లో ‘కేతన భూవరుండు’ అనే ప్రస్తావన కనిపిస్తుంది. ఆ కేతన తిక్కనగారి శిష్య పరమాణువయిన మూలఘటిక కేతనేనని కొందరి విశ్వాసం. కానీ, అది నిజం కాదు. ఇతగాడు మంచన చేత కేయూరబాహు చరిత్రం రాయించిన గుండన మంత్రి తాత, కేతన మంత్రి అనేది నిరూపిత సత్యం. ఈ కేతన క్రీ.శ.1182 నుంచి పాతికేళ్లపాటు పృథ్వీశ్వరుడనే వెల్నాటి చోడుడి దగ్గిర మంత్రిగా పని చేశాడట. పదవిలోకి వచ్చే సరికి సదరు కేతన మంత్రికి యాభయ్యేళ్లున్నాయనుకుంటే, అతడి మనవడయిన గుండన మంత్రి అప్పటికే పుట్టి వుండాలి. గుండన మంత్రికి సమకాలికుడయిన మంచన కూడా పనె్నండో శతాబ్ది చివరికి పుట్టేవుండాలని భావించడం తర్కవిరుద్ధం కాబోదు. ఆ లెక్కన మంచన తిక్కనకు సమకాలికుడై వుండాలి. కేయూరబాహు చరిత్రలో మంచన నన్నయ్యకూ, తిక్కనకూ అంజలి ఘటించాడు తప్ప ఎర్రన పేరెత్తలేదు. ఇతగాడు రాజమండ్రి నివాసా, లేక గుంటూరు మండలంలోని చందవోలు వాడా, అదీకాక తెలంగాణ ప్రాంతానికి చెందినవాడా అనేది నెమ్మది మీద తేలవలసిన విషయం.
‘కేయూర బాహు చరిత్ర’ కథాకావ్యం విశేషాల విషయానికి వస్తే, ఇది ఈ తరహా రచనల్లో మొట్టమొదటిది. సంస్కృత సాహిత్యంలో సుప్రసిద్ధుడయిన రాజశేఖరుడు రాసిన ‘విద్ధ సాలభంజిక’కు ఇది అనువాదం. రాజశేఖరుడి కృతి, కావ్యకథను మనకు కళ్లకు కట్టినట్లు చూపించే ‘దృశ్యకావ్యం’. కాగా, ఆ దృశ్యకావ్యంలోని కథలను మంచన మనకు విప్పి ‘చెప్పా’డు. అంచేత ఈ కథాకావ్యం ‘శ్రవ్యకావ్యం’ అవుతుందని బులుసు వేంకట రమణయ్యగారు అన్నారట. ఈ రీతి కావ్యాలకు ఇదే మొదటిదని ఆయన లెక్క. ఈ కథాకావ్యంలో మూలకథ కాకుండా, 14 ప్రధాన కథలున్నాయి. వాటిలో సుమతి అనే అంతఃపుర దాసీ చెప్పిన ఒకే కథలో ఏడు ఉపకథలున్నాయి. కథ లోపల కథలు పొదగడం భారతీయ సాహిత్యానికి కొత్తేమీ కాదు. క్రీ.పూ. మూడో శతాబ్దిలోనే విష్ణుశర్మ చెప్పిన ‘పంచతంత్రం’ మొదలుకుని క్రీ.శ. ఇరవయ్యో శతాబ్దం చివర్లో పతంజలి రాసిన ‘ఒక దెయ్యం ఆత్మకథ’ వరకూ ఈ సంప్రదాయం కొనసాగుతూనే వస్తోంది. మంచన ఈ పరంపరకే చెందినవాడు.

-మందలపర్తి కిషోర్ 81796 91822