పెరటి చెట్టు

ఓ మరణానంతర జీవితం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గురజాడ 1915లో చనిపోలేదు - అప్పుడే ఆయన జీవించడం ప్రారంభించా’డన్నారట దేవులపల్లి కృష్ణశాస్ర్తీ. ఇది కేవలం చమత్కారం కోసం చేసిన మాటలాట కాదు సుమా! బతికివుండగా గురజాడను మన ప్రధాన స్రవంతి సాహిత్య ప్రపంచం పెట్టిన బాధలను తీవ్రంగా అభిశంసిస్తూ కృష్ణశాస్ర్తీ చేసిన విమర్శ అది. ముప్పయ్యేళ్ల ప్రాయంలోనే - 1892లో - ‘కన్యాశుల్కం’ లాంటి చరిత్రాత్మక నాటకాన్ని రాయగలిగిన మహాకవి కీర్తికాయానికి, దుమ్మూ దూగరలో దొల్లాడే ‘సాహిత్య చెదపురుగులు’ చెయ్యగల హాని యేమీ వుండదన్నదే ఆ విమర్శ సారాంశం. ‘కవియు మరణించె నొకతార గగనమెక్కె’నని జాషువా ఇదే భావాన్ని వేరే మాటల్లో, వేరే సందర్భంలో చెప్పారు! ఒక్క వ్యక్తి - బతుకంతా తీవ్రమయిన అనారోగ్యంతో పోరాడి అలిసిపోయి యాభయ్యి మూడేళ్ల వయసులోనే కన్నుమూసిన అర్భకుడు - కవిత్వం, కథానిక, భాషాపరిశోధన, చరిత్ర పరిశోధన, శాసన శోధన తదితర రంగాల్లో అసాధారణ ప్రజ్ఞ కనబర్చడం ఎంత అరుదయిన విషయమో ఆ వ్యక్తి మరణించి నూట మూడేళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంటుందేమో!
ఒక్క గురజాడ రచనలకే కాదు - ఇరవయ్యో శతాబ్ది తెలుగు సాహిత్యానికంతటికీ - తలమానికమయిన కళాఖండం ‘కన్యాశుల్కం’ నాటకం. ‘కన్యాశుల్కం’ బీభత్స రస ప్రధానమయిన నాటకమని అయలసోమయాజుల నరసింహ శర్మ 1943లోనే సూత్రీకరించి చెప్పగా, అది ‘బీభత్స రసప్రధానమయిన విషాదాంత నాటక’మని ఆ తర్వాత అన్నారు శ్రీశ్రీ. ‘కన్యాశుల్కం’ రెండో కూర్పు వెలువడిన నూరేళ్ల తర్వాత - 1992లో - సెట్టి ఈశ్వరరావు ఆ నాటకాన్ని ‘ఆధునిక భాషా సాహిత్యాలకి ఆదికావ్యం’గా అభివర్ణించారు. ఒక్క రచనని - రచయిత తన ముప్పయ్యేళ్ల ప్రాయంలో రాసిన నాటకాన్ని - ఇంతమంది మహానుభావులు ఇన్ని విధాలుగా విశే్లషించడం దాని అపూర్వతకి నిదర్శనం. అందుకేనేమో - ‘తెలుగువాడయితే ‘కన్యాశుల్కం’ చదవకపోవడమెట్లా? ‘కన్యాశుల్కం’ చదవని వాడు తెలుగువాడెట్లా?’ అని నిలదీశారట భమిడిపాటి కామేశ్వరరావు మేస్టారు.
ఇది చదివితే, తెలుగు సాహిత్యంలో ఆధునికత గురజాడ అప్పారావుతోనే కలిసి పుట్టిందనే పొరపాటు అభిప్రాయం ఏర్పడవచ్చు. తెలుగులో ఆధునిక - అభ్యుదయ భావాలకి ఆలవాలమయిన రచనల్ని - అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునే స్థాయిలో నాటకాలూ, కవితలూ, కథానికలూ, భాషా పరిశోధనలూ, శాసన పరిశోధనలూ, చరిత్ర రచనలూ - అపూర్వమయిన రీతిలో సృజించిన ఘనత కచ్చితంగా గురజాడకే దక్కాలి. కానీ, ఆయన పుట్టడానికి మూడు దశాబ్దాలకి ముందే తెలుగులో ఆధునిక సాహిత్యం రూపుదిద్దుకున్న వాస్తవాన్ని ఈ సందర్భంగా చెప్పుకుని తీరాలి. వ్యావహారిక భాషావాదానికి - గిడుగుతో కలిసి - గురజాడే శ్రీకారం దిద్దారనే నమ్మకం కూడా వాస్తవం కాదని 1920 దశకంలోనే గిడుగు రామమూర్తి ముద్దుకృష్ణకి చెప్పారట. 1910లో, గురజాడ ‘దిద్దుబాటు’ లాంటి గొప్ప కథానిక రాయడానికి దాదాపు దశాబ్దం ముందే భండారు అచ్చమాంబ, రాయసం వెంకట శివుడు తదితరులు ఆధునిక కథానికలు రాసి వుండిన వాస్తవం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. కట్టమంచి రామలింగారెడ్డి, గురజాడ కన్నా - దశాబ్దం ముందే - ఆధునిక కావ్యం రాసివున్నారు. నరహరి గోపాలకృష్ణమ చెట్టి, గురజాడ పదేళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడే తొలి తెలుగు నవల రాశారు. ఈ వాస్తవాలేవీ గురజాడ గొప్పతనాన్ని తగ్గించవనే వాస్తవం - ఎవరికి తెలిసినా తెలియకున్నా - ఉత్తమ సంస్కారి అయిన అప్పారావుకి కచ్చితంగా తెలుసు! ఎందుకంటే, ‘అత్యధిక సంఖ్యాకులయిన సామాన్య జనానికి విద్యాబుద్ధులు నేర్పడమనేది మన సనాతన సంప్రదాయంలో ఎన్నడూ భాగం కాదు’ అని చెప్పినవాడు గురజాడ ఒక్కడే! ‘సాహిత్యమూ, చదువు సంధ్యలూ బ్రాహ్మణుల గుత్తసొత్తేమీ కాద’ని మరెవ్వరూ అనలేదు - గురజాడ తప్ప. దేవుడు చేసిన మనుషులనే కాకుండా, మనుషులు చేసిన దేవుళ్లని సైతం ‘మీ పేరేమిటి?’ అని నిలదీయగల ధైర్యం, స్థైర్యం - నాటికీ నేటికీ - గురజాడ మాత్రమే ప్రదర్శించారు. చారిత్రికంగా, గురజాడ తన తరంకన్నా ఎంత ముందున్నాడో చాటి చెప్పే ప్రకటనలివి.
గురజాడ మీదా, ‘కన్యాశుల్కం’ మీదా రేగినన్ని గాలి దుమారాలు బహుశా మరే కవి మీదా, మరే రచన మీదా రేగలేదు. ఎవరో గోమఠం (జీసీవీ) శ్రీనివాసాచార్యులు అనే అతి సామాన్య రచయిత ‘కన్యాశుల్కం’ అనే క్లాసిక్‌ని రాయగా, గురజాడ దాన్ని సొంతం చేసుకున్నాడని ఓ సాహిత్య విదూషకుడి చేత కొందరు మహానుభావులు రాయించిన రాతలు చరిత్రకెక్కినవే. శ్రీశ్రీ మనఃస్థిమితం కోల్పోవడంతో కొంతా, కె.రామలక్ష్మికి టైఫాయిడ్ రావడంతో మరికొంతా కుంగిపోయివుండిన తనని ఉద్ధరించడానికే, సదరు విదూషకుడు ఈ కొక్కిరాయి రాత రాశాడని ఆరుద్ర చెప్పిన విచిత్రవాదాన్ని నమ్మినవాళ్లు దాదాపు ఎవ్వరూ లేరు. కాగా, ఈ గోమఠం ఆచారే మరో పుకారు పుట్టించి, పుణ్యం కట్టుకున్నారు. ‘కన్యాశుల్కం’ తొలి ప్రదర్శన రోజున - 1892 ఆగస్టు 13న - ఆ నాటకానికి ‘నాంది’ రచించిన ముడుంబై నరసింహాచార్యులే, సంస్కృతంలో ఆ నాటకాన్ని రాశారనీ, దాన్ని గురజాడ అనువాదం మాత్రమే చేశారనీ గోమఠం వారి కథనం. ఇదే గోమఠం తన పుస్తకం ఒకదాని గురజాడ చేత ముందుమాట రాయించుకుని వుండడం గమనార్హం. నీలగిరి పాటల లాంటివే ఈ గోమఠం ఆచార్లు కూడా రాశారు. వాటిని చూస్తే అతగాడు, ‘కన్యాశుల్కం’ రాయగలడో లేడో ఎవరయినా కనిపెట్టేస్తారు. విజయనగరం సంస్థానంలో గురజాడకి దక్కుతూ వుండిన ప్రాధాన్యం చూసి సహించలేని వాళ్లే ఈ కట్టుకథలు పుట్టించారని సెట్టి ఈశ్వరరావు, కె.వి.ఆర్., అవసరాల, బంగోరె తదితరులు ఏనాడో రుజువు చేశారు. ఇవన్నీ వింటూంటే, ‘రాజదర్బారు’లలో జరిగే కుట్రల గురించి గురజాడ రాసిన పద్యమొకటి గుర్తుకు వస్తోంది. ‘తనకొక మేలు చేకురగ తక్కినవారికి కీడు సేయుటల్ - మనమున లేని భక్తి అభిమానము మాటలలోనె చూపుటల్ - కొనకెటు లాభముల్ కలుగు? కొంకక నాటకమాడ సాగుటల్ - ధనమునకు న్మహోన్నతికి దారులు రాజగృహాంతరంబులన్’ (మాటల మబ్బులు) ‘బిల్హణీయం’ నాటకంలో కూడా ఈ దర్బారీ కుట్రల గురించి రాశారు గురజాడ. బహుశా స్వానుభవాల ప్రాతిపదికపైనే వీటిని రాసివుంటారనిపిస్తుంది.
భాషాశాస్త్ర పరిశోధన రంగంలో గురజాడ కృషి గురించి చాలా కాలం తెలుగు పరిశోధకులు పట్టించుకోనే లేదు. ముఖ్యంగా, 1914లో, మద్రాస్ యూనివర్సిటీ తెలుగు కాంపోజిషన్ సబ్ కమిటీకి గురజాడ సమర్పించిన ‘అసమ్మతి పత్రం’ చారిత్రిక ప్రాధాన్యాన్ని - అయిదున్నర దశాబ్దాల తర్వాత - గుర్తించారు మనవాళ్లు. 1968లో, నాలుగు మాసాలపాటు, ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ఈ ‘డిసెంట్ పత్రం’ అనువాదాన్ని ప్రచురించింది. పోరంకి దక్షిణామూర్తి ఈ చరిత్రాత్మక పత్రాన్ని అనువదించారు. దరిమిలా విశాలాంధ్ర ప్రచురణ సంస్థ దాన్ని పుస్తక రూపంలో వెలువరించడంతో భాషాశాస్త్ర పరిశోధకుడిగా గురజాడ కృషి పదిమందికి తెలిసింది. గురజాడ జీవితకాలంలోనే ఈ పత్రాన్ని వావిళ్ల సంస్థ ప్రచురించింది. కానీ, ఇంగ్లిష్‌లో వున్న ఈ పత్రంలో ఏముందో ఆ భాష తెలియనివాళ్లకి బోధపడలేదు. సీపీ బ్రౌన్ ప్రచురించిన ‘వార్స్ ఆఫ్ రాజాస్’ అనే చిరుపొత్తం ఆధారంగా గురజాడ - చివరి రోజుల్లో - రూపొందించిన ఉపవాచకం, చరిత్ర పరిశోధన రంగంలో ఆయన ఆసక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. అయిదారేళ్ల తర్వాత వావిళ్ల వారు ఆ పుస్తకాన్ని పునర్ముద్రించినా, 2003లో ఈ పుస్తకం (‘అనంతపురం స్థానిక చరిత్ర’) పునర్ముద్రణ జరిగేంత వరకూ ఈ ఉపవాచకం గురించి తెలిసిన వాళ్ల సంఖ్య బహుపరిమితం. ఇక, శాసన పరిశోధన రంగంలో గురజాడ కృషి ఇప్పటికీ రికార్డు కానేలేదు. గురజాడ మొదట్లో ఇంగ్లిష్‌లోనే కవిత్వం రాసేవారు. ‘రీస్ అండ్ రయ్యత్’ (రాజు-రైతు) అనే పత్రిక సంపాదకుడు శంభుచంద్ర ముఖర్జీ గురజాడ దృష్టిని తెలుగు కవిత్వంపైకి మళ్లించారు. ఆయన ఇంగ్లిష్ కవితల సంకలనం - స్వతంత్రంగా - వెలువడనే లేదు. ఇవన్నీ మన తరం ముందు ఇప్పటికీ మిగిలివున్న లక్ష్యాలు.
‘సుకవి జీవించు ప్రజల నాలుకలపైన’ అన్నాడు కవికోకిల జాషువా. గురజాడ అప్పారావు ఈ ప్రకటనకి అక్షరాలా మూర్త్భీవం! నూటపాతికేళ్ల కిందట గురజాడ రచించి, ప్రదర్శింపచేసిన నాటకం ‘కన్యాశుల్కం’లోని డయలాగులు ఇప్పటికీ వీథివీథినా వినిపిస్తూనే ఉంటాయి. నూటపదేళ్ల కిందట గురజాడ రాసిన కవితలు, - ముఖ్యంగా ‘దేశమును ప్రేమించుమన్నా’ పాట - మన పిల్లల నాలుకల మీద నాట్యమాడుతూనే వున్నాయి యిప్పటికీ. ఈ విషయంలో గురజాడతో పోల్చదగిన తెలుగు కవి మరొక్కరే కనిపిస్తారు - ఆయనే వేమన! అటు వేమనయినా, ఇటు గురజాడయినా, సమకాలీన సమాజాలని చీల్చి చెండాడిన వాళ్లే. అయితే ఈ మహాకవులిద్దరి మధ్యా పెద్ద తేడా ఒకటుంది. వేమన ఎవరిని వుద్దేశించి అధిక్షేప పద్యం చెప్పాడో అతగాడు ఒక్కడూ ఏడుస్తాడు - మిగతా వాళ్లంతా నవ్వుతారు. గురజాడ వ్యంగ్య వ్యాఖ్యలు వింటే అందరితోపాటు ఆ బాధితులకీ నవ్వొస్తుంది. అయితే, ఎవర్నో నవ్వించడానికి గురజాడ కలం పట్టలేదు. ఆనాటి సమాజంలో నెలకొనివుండిన సిగ్గుచేటయిన పరిస్థితిని పదిమంది దృష్టికి తీసుకురావడానికే తాను ‘కన్యాశుల్కం’ నాటకం రాశానని గురజాడ ముందుమాటలోనే చెప్పారు. కానీ, ‘కన్యాశుల్కం’ నాటకం ముగింపు చూసి - మనందరితోపాటు కలిసి - నెపోలియన్ ఆఫ్ యాంటీనాచ్ గిరీశం కూడా కడుప్పగిలేలా నవ్వుకునేవుంటాడు! అదీ గురజాడ శిల్పం మహిమ!! అందుకే, ఆయన మరణానంతరం కూడా మన మధ్య మహారచయితగా జీవిస్తూనే వున్నాడు.

-మందలపర్తి కిషోర్ 81796 91822