పెరటి చెట్టు

జంట కవిత్వానికి శాశ్వత చిరునామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంట కవిత్వం తెలుగు వారికి కొత్తేం కాదు. ‘ప్రబోధ చంద్రోదయం’ తదితర కృతులు చేసిన నంది మల్లయ - ఘంట సింగన తెలుగు సంప్రదాయ కవిత్వంలో మొట్టమొదటి కవుల జంట అంటారు. ఈ జంట కవులు, పదిహేనో శతాబ్దికి చెందినవాళ్లు. వారికి నాలుగు వందల ఏళ్ల తర్వాత పుట్టిన తిరుపతి వెంకట కవులు జంట కవిత్వానికి శాశ్వత చిరునామాగా నిలిచారు. దేవులపల్లి సోదర కవులు, వేంకట రామకృష్ణులు, కొప్పరపు కవులు తిరుపతి వెంకట కవులకు సమకాలికులయిన జంటకవులే. వాళ్లందరూ కూడా అవధాన కళను అద్భుతంగా ప్రదర్శించిన వాళ్లే. తిరుపతి వెంకట కవులకి - ముఖ్యంగా చెళ్లపిళ్ల వేంకట శాస్ర్తీకి - శిష్యులయిన వారిలో కూడా పింగళి - కాటూరి లాంటి జంటలు లేకపోలేదు. కానీ, జంట కవులనగానే ఎవరికయినా గుర్తుకు వచ్చేది మాత్రం తిరుపతి వెంకట కవులే. అనేక రాజాస్థానాలను సందర్శించి, అవధానాది విద్యలు ప్రదర్శించి, బహుమానాలు - బిరుదులు మూట కట్టుకుని తమ సాహిత్య యాత్రను జైత్రయాత్రగా సాగించిన వారీ జంటకవులు. తమ యాత్రానుభవాల సారాన్ని ‘నానారాజ సందర్శనం’ పేరిట గ్రంథస్థం చేశారు తిరుపతి వెంకట కవులు. ‘పెడితే పెళ్లి - పెట్టకపోతే తద్దినం’ అన్నట్లు ప్రవర్తించి, ఆయా ఆస్థానాలూ - సంస్థానాల్లోని స్థానికులపై తొడచరిచి, మీసందువ్వి ‘ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినా’మని చెప్పుకున్నవారీ జంట కవులు. ‘పరస్పర సహకారముతో అవధానములు, ఆశుకవితలు, ఆకాశ పురాణములు ప్రదర్శించుటచే, వీరి పేరు త్వరలో ప్రశస్తి కెక్కినది. అవధాన కళకు గౌరవము తెచ్చినవారు, చులుకదనము కల్పించిన వారును తిరుపతి వెంకట కవులే’ అన్నారు మధునాపంతుల సత్యనారాయణ శాస్ర్తీ. అయితే, ‘తిరుపతి వెంకట సుకవుల తిట్టుకవిత ఫలితంగా, తెలుగుసీమ మారెకదా కవితా సంకలితంగా’ అన్నాడు శ్రీశ్రీ. అందుకే, ‘కొన్నినాళ్లాంధ్ర కవితా సామ్రాజ్యము నేకచ్ఛత్రముగ పరిపాలించిన’ వారు ఈ తిరుపతి వెంకట కవులేనని కూడా అదే మధునాపంతుల వారికి చెప్పక తప్పలేదు. కవులు నిరంకుశులయినట్లే, వారి గురించిన సత్యం కూడా అలాంటిదే మరి!
కేవలం అవధానాలూ, నానారాజ సందర్శనాలతోనే తిరుపతి వెంకట కవులకి ఈ ప్రతిపత్తి రాలేదు. పండితుల పంచల్లోపడి ముక్కిపోతూండిన తెలుగు పద్యాన్ని రోడ్డెక్కించిన ఘనత సొంతం చేసుకున్నందువల్లనే వారికి ఆ స్థారుూ, ఆ స్థానం దక్కాయి. తిరుపతి వెంకట కవులు ఈ పని చేసేనాటికే పద్యశోభ దిగుముఖం పట్టింది. ఇక వర్తమానానికి వస్తే, తెలుగునాట పద్య కవితకి కాలం చెల్లిపోయి దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ, ఇప్పటికీ పల్లెల్లో ‘బావా! ఎప్పుడు వచ్చితీవు?...’ ‘చెల్లియొ చెల్లకో...’ ‘అలుగుటయే ఎరుంగని..’ ‘సంతోషంబున సంధి సేయుదురె..’ లాంటి పద్యాలను రాగవరసలో పాడేవాళ్లు కనిపిస్తూనే వుంటారు. (ఈ మధ్యనే ‘జెండాపై కపిరాజు’ అనే పేరుతో ఓ సినిమా కూడా వచ్చింది!) వాళ్లలో నూటికి తొంభయి మందికి పాండవోద్యోగ విజయాల కథ తెలిసుండదు. ఆ పద్యాలు రాసిన కవుల పేరు కూడా వాళ్లు విని వుండరు. అయినప్పటికీ, ఆ పద్యాలు పాడుకోవడానికి వాళ్లకి అభ్యంతరం లేకపోయింది కదా! అదే తిరుపతి వెంకట కవుల కవిత్వం చేసిన చమత్కారం. రాజాస్థానాల బంగారు పంజరాల్లో చిక్కడిపోయిన పద్యాల పంచవనె్నల రామచిలకల్ని విశాఖ విహాయసం అంచుల దాకా ఎగరేశారు ఈ జంటకవులు. అతిసామాన్యులకు సయితం అర్థమయ్యే భాషలోనూ, పలుకుబడితోనూ ఈ పద్యాలను అల్లారు తిరుపతి వెంకట కవులు. అత్యంత క్లిష్టమయిన అష్టావధాన, శతావధాన ప్రక్రియల వల్ల వాళ్లకి బోలెడంత డబ్బూ, అంతకు పదింతలయిన పేరు ప్రతిష్టలూ పోగుపడి వుండొచ్చు. కానీ, తెలుగువాడి హృదయపీఠం మీద తిరుపతి వెంకట కవుల కంచు విగ్రహాలని ప్రతిష్ఠించిన ఘనత మాత్రం ‘ఉద్యోగ విజయాల’కే దక్కాలి.
మనకందరికీ తెలిసిన ఈ విషయం లోలోపలి- అంతర్గత - తర్కం అంత ప్రచురం కాదనిపిస్తుంది. పద్యకవితకి దశాబ్దాల కిందటే కాలం చెల్లిపోయింది కదా! వీధికి రెండున్నర సినిమా హాళ్లు కట్టి, రోజుకి మూడున్నర ప్రదర్శనలు చూపిస్తున్నారు కదా! ఒక్కో సినిమాకీ అరడజను పాటలతో చావగొట్టి చెవులు మూస్తున్నారు కదా! ఇంత రణగొణ ధ్వని మధ్య తిరుపతి వెంకట కవులు ఎన్నడో రాసిన పద్యాలు ఇంకా ఎందుకు బతికివున్నాయి? ఏ జీవధాతువు వాటిని ఇంకా బతికిస్తోంది? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం అంత తేలిక కాదు. మొట్టమొదటి విషయం, మన సినిమా పాటల్లో ‘పాఠం’ మొదటిసారి వినగానే అర్థంకాదు. రెండోది, అది ఒకానొక బాణీకి - మట్టుకి - అనుగుణంగా అల్లింది కావడంతో ఎన్నో అసహజమయిన పదాలూ పదబంధాలూ అందులో కనిపిస్తుంటాయి. ఈ వరసలు కూడా ఒకదానికి మరొకటి చాలా దగ్గిరగా ఉండడం వల్ల వాటిని గుర్తుంచుకోవడం - ఒకదానికీ మరోదానికీ తేడా గ్రహించడం చాలా కష్టమయిన విద్య. ఇక, ఒకదాని వెనక మరొకటిగా వస్తూపోయే ఈ పాటల ఆయుష్షు అత్యల్పం కావడం సహజం. కానీ, తిరుపతి వెంకట కవుల పద్యాలు అలా కాదు. మనం రోజూ మాట్లాడుకునే భాషకి వీలయినంత దగ్గిరగా ఉండేలా ఈ పద్యాలు ఉంటాయి. సామాన్య శ్రోతలు వినివిని విసుగుచెంది వున్న బాణీల్లో ఉండవీ పద్యాలు. మన పాతతరం నట గాయకులు - షణ్ముఖి ఆంజనేయ రాజు, పీసపాటి నరసింహ మూర్తి లాంటి వాళ్లు - హిందూస్తానీ బాణీల్లో ఈ పద్యాలు పాడడం కూడా వాటిని శ్రవణపేయంగా మార్చింది. పైగా, చెప్పే కథకి ఓ ‘పవిత్రత’ ఆపాదించడం కూడా దాని మీద గురి కలిగేట్లు చేస్తుంది. తిరుపతి వెంకట కవుల పద్యాలు ప్రజల నాలుకల మీద నాట్యమాడుతూ ఉండడానికి కారణాలివి!
తిరుపతి వెంకట కవుల కవిత్వం ప్రాచీనతకు భరతవాక్యం - నవీన కవిత్వానికి నాందీ ప్రస్తావన, అన్నారట ‘కృష్ణా పత్రిక’ సంపాదకులు ముట్నూరి కృష్ణారావు. ఈ జంట చెప్పిన కవిత్వంలో ‘ఎచ్చట చూచినను సౌకుమార్యము, పౌరుషము, జీవము’ గోచరిస్తాయని కూడా ఆయన అన్నారట. తిరుపతి వెంకట కవుల రచనలు ఎక్కువగా వాళ్ల సొంత జీవితాలకే చెందినవి కావడం చేత, ఆ కవిత్వం ఆత్మగౌరవాన్ని ప్రతిష్ఠించుకుందని కృష్ణా పత్రికాధిపతి చెప్పిన మాట గమనార్హం. ఇది ఇద్దరు కవుల వ్యక్తిగత లక్షణం కాదు - తిరుపతి వెంకట కవుల కవిత్వంలో ప్రస్ఫుటంగా వ్యక్తమయిన ఈ గుణం ఓ యుగ లక్షణమని చెప్పొచ్చు. పందొమ్మిదో శతాబ్ది చివర్లో మొదలయి, ఇరవయ్యో శతాబ్ది ప్రథమార్ధం వరకూ వారి కవిత్వం వెలువడిన సంగతి అందరికీ తెలిసిందే. (దివాకర్ల తిరుపతి శాస్ర్తీ 1919లోనే కన్నుమూసినప్పటికీ, ఆ తర్వాత మూడు దశాబ్దాలపాటు తిరుపతి వెంకట కవుల పేరిట రచనలు వెలువడిన సంగతి మనకి తెలుసుగా!) ఈ ‘ఆత్మగౌరవ ప్రతిష్ఠాపన’ ఆనాటి స్వాతంత్య్రేచ్ఛకి ప్రాతిపదిక. వ్యక్తినిష్ట లక్షణంగా మొదలయి, వస్తుగత రూపం తీసుకున్న విచిత్ర స్వభావమిది. నిజానికి, ఈ లక్షణం గురించిన నిలువుకోత విశే్లషణ - జరగవలసినంతగా - జరగలేదని చెప్పాలి. అలాంటి విశే్లషణ చేసుకుంటే తప్ప తిరుపతి వెంకట కవులూ, వారి శిష్యుల సాహిత్య మూర్తిమత్వాలు సంపూర్ణంగా మన ముందు ఆవిష్కృతం కావనిపిస్తుంది.

-మందలపర్తి కిషోర్ 81796 91822