పెరటి చెట్టు

తొలి తెలుగు కథయత్రి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వమంటే ఏమిటో నిర్వచించమని అమెరికన్ మహాకవి రాబర్ట్ ఫ్రాస్ట్‌ని ఎవరో అడిగారట. ‘అనువాదంలో లుప్తమయిపోయేదే కవిత్వం’ అన్నాడట ఫ్రాస్ట్. ‘రోకటి పాట రాతల్లో లుప్తమయిపోయే సత్యమే సాహిత్య చరిత్ర’ అని మనం కొత్త నిర్వచనం చెప్పుకోవాలేమో! మన సాహిత్య చరిత్రకి తెలియని మహావిద్య అప్‌డేషన్. 1898లోనే ఆధునిక తెలుగు కథానిక రాసేందుకు ప్రయత్నించిన భండారు అచ్చమాంబ లాంటి వాళ్ల విషయంలో చరిత్రకారులు ప్రదర్శించిన అలసత్వం చూస్తే ఎవరికయినా ఇలాగే అనిపించడం సహజం. ఇరవయ్యో శతాబ్ది తొలినాళ్లలోనే - గురజాడ ‘దిద్దుబాటు’ అచ్చవడానికి దాదాపు ఓ దశాబ్దం ముందరే - భండారు అచ్చమాంబ ‘్ధన త్రయోదశి’ లాంటి క్లిష్టమయిన - నైతిక కథను రాయగలగడం చూస్తే, ఈ ప్రక్రియ విషయంలో ఎప్పట్నుంచో ప్రయత్నాలు జరుగుతూ ఉండాలనిపిస్తుంది. రాయసం వెంకట శివుడు చెప్పిన మాటలు కూడా దానే్న బలపరుస్తున్నాయి. మొత్తం మీద, తొలి తెలుగు కథ పదవికి చాలా రచనలనే పోటీకి దించారు మన పరిశీలకులు. గురజాడ సాహిత్యంలోని అభ్యుదయాంశని పదేపదే ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఉండిన పరిశీలకులు కూడా తొలి తెలుగు కథానిక ‘దిద్దుబాటు’ కాదని చాలా కాలంగా వాదిస్తూనే ఉన్నారు. పురిపండా అప్పలస్వామి వారిలో ఒకరు. ఆయన లెక్క ప్రకారం ఆ స్థానం, ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ 1903లో రాసిన కథనిక ‘లలిత’కు దక్కాలి. శర్మగారు నడిపించిన ‘కల్పలత’ పత్రికలోనే, 1904లో అచ్చయిన, ‘విశాఖ’ కథ చేత కూడా కొందరు విమర్శకులు నామినేషన్ వేయించారు. ఆయనే, అదే పత్రికలోనే రాసిన ‘అపూర్వోపన్యాసము’ను మొదటి కథగా పరిగణించే పరిశీలకులు కొందరున్నారు. ఈ కథలు వెలువడడానికి ముందే, 1902లోనే, హిందూ సుందరి మాస పత్రిక జనవరి - ఫిబ్రవరి సంచికలలో అచ్చయిన భండారు అచ్చమాంబ కథలు ‘్ధన త్రయోదశి’ - ‘స్ర్తి విద్య’ రెండింటిలో దేన్నో ఒకదాన్ని మొట్టమొదటి తెలుగు కథానికగా పరిగణించాలని ఒక వర్గం పరిశీలకులు పట్టుబడుతున్నారు. అయితే, సాంఖ్యాయన శర్మగారి కథలు గ్రాంథిక భాషలో విరచితమయి వున్నందువల్ల వాటిని తొలి తెలుగు ఆధునిక కథానికలు అనలేమని సెట్టి ఈశ్వరరావాదులు వాదించారు. వ్యావహారిక గ్రాంథికాల ప్రస్తావన తెస్తే కథ చాలా మలుపులు తిరుగుతుంది. గురజాడ కవితల్లో కూడా వ్యావహారికేతరమయిన ప్రయోగాలు చాలా వున్నాయన్న సంగతి పెద్దలకి తెలియంది కాదు. అంతమాత్రం చేత అవి ఆధునికం కాకుండా పోతాయా? ఇదిలా వుండగా, 1910లో కొమర్రాజు వెంకట లక్ష్మణరావుగారు ‘ఆంధ్ర పత్రిక’లో రాసిన ‘ఏబదివేల బేరము’ కథానికనే మొట్టమొదటిదిగా గుర్తించాలని మరి కొందరు పరిశోధకుల భావన. ‘ఆంధ్ర భారతి’లోనే, 1912లో అచ్చయిన మాడపాటి హనుమంతరావుగారి కథానిక ‘హృదయ శల్యము’నే తొలి తెలుగు కథానికగా పరిగణించాలని పరిశోధక - విమర్శక - సంపాదకులు కొందరి అభిప్రాయం.
కథానిక ఆధునిక సాహిత్య ప్రక్రియలు అన్నింట్లోకీ అత్యంత ప్రచురమయిన ప్రక్రియ. దానితో పోటీపడగల సత్తా - ఉంటే గింటే - కవిత్వానికేమయినా ఉందేమో! మిగతా సాహిత్య ప్రక్రియలేవీ కథానికతో పోటీ పడలేకపోగా, దానికి సమీపానికి కూడా చేరుకోలేవంటే అతిశయోక్తి కాదు. నవలలూ, విమర్శ లాంటి ప్రక్రియలకి ఆధునిక సాహిత్యంలో అధికతర ప్రాచుర్యం - గౌరవం - దక్కినట్లు కనిపించవచ్చు. కానీ, అవేవీ, కథానికతో సమాన ప్రతిపత్తి సంపాదించుకోలేక పోయాయన్నది కాదనలేని వాస్తవం. ఇంతా చేసి, ఈ ప్రక్రియకి స్వతంత్ర సాహితీ ప్రక్రియ హోదా దక్కింది. పందొమ్మిదో శతాబ్దిలోనే అంటోంది ప్రపంచ సాహిత్య చరిత్ర. ఇంగ్లిష్ భాషలో కథానికలు రాసిన తొలితరం రచయితలుగా రిచర్డ్ కంబర్లండ్, వాల్టర్ స్కట్, ఛార్ల్స్ డికెన్స్, ఛార్ల్స్ బ్రాక్డెన్ బ్రౌన్, వాషింగ్టన్ ఇర్వింగ్, నెథానియెల్ హాథ్రోన్ తదితరులను చెప్తారు. అయితే, ఈ ప్రక్రియకి అంతర్జాతీయ ప్రాచుర్యం సంపాదించి పెట్టిన తొలి వృత్తి రచయిత స్థానం ఎడ్గార్ అలెన్ పో కే దక్కాలి. అదే శతాబ్దంలో కథానికను అంతర్జాతీయ ప్రమాణాలకి తీసుకెళ్లిన రచయితలు గగోల్, చెహోఫ్, మపాసా, మార్క్ ట్వెయ్న్, ఆస్కర్ వైల్డ్, సర్ ఆర్థర్ కానన్ డాయ్ల్, ఎచ్.జీ.వెల్స్.
పందొమ్మిదో శతాబ్దంలోనే మన దేశ భాషల్లోనూ కథానిక రచన మొదలయి పోయిందంటారు. మన దేశ భాషల్లో కథానిక, 1868లో, ఒడియాతో, మొదలయిందని సాహిత్య చరిత్ర చెప్తోంది. ‘్ఛమాణ ఆణ గుంఠ’ (ఆరెకరాల ఎనిమిది గుంటలు) అనే నవల ద్వారా అంతర్జాతీయ ప్రశక్తికి పాత్రుడయిన ఫకీర్ మోహన్ సేనాపతి రాసిన ‘లచ్చనియా’తోనే భారత దేశభాషల్లో కథానిక చరిత్ర మొదలయిందన్నది చరిత్రకారుల సమాచారం. పందొమ్మిదో శతాబ్ది చివరి దశకంలో, బంగాలీ భాషలో, రబీంద్రనాథ టాగూర్ తొలి కథలు రాశాడంటారు. 1891లో తొలి మలయాళీ కథ ‘వాసన వికృతి’ అచ్చవగా, ఇరవయ్యో శతాబ్ది తొలి రోజుల్లో - 1902లోనే - ‘హిందూ సుందరి’ మాసపత్రికలో అచ్చమాంబ రాసిన తొలి తెలుగు కథ ‘్ధన త్రయోదశి’ అచ్చయింది. ఆ తర్వాత మూడేళ్లకి గానీ, సుబ్రహ్మణ్య భారతి రాసిన తొలి తమిళ కథ ‘తులసీబాయి’ అచ్చుకాలేదంటారు. 1925-40 మధ్యకాలంలో డోగ్రీ, రాజస్థానీ, మణిపురీ, మైథిలీ, నేపాలీ, కొంకణీ, కశ్మీరీ తదితర దేశభాషల్లో కథానిక సాహిత్యం మొదలయిపోయింది.
వాదం కోసం వాదంగా కాకుండా, నిజాయితీగా చర్చించే పక్షంలో భండారు అచ్చమాంబకి జరిగిన అన్యాయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అచ్చమాంబ కథానికల్లోని మేలిగుణాలు విశే్లషించి చూపించడం కచ్చితంగా ప్రయోజనకరమే. కానీ, అచ్చమాంబ ‘్ధన త్రయోదశి’, గురజాడ ‘దిద్దుబాటు’ కన్నా మెరుగయిన రచన అని రుజువు చేసేందుకు పడే తాపత్రయం వల్ల లాభంకన్నా నష్టమే ఎక్కువ. ఈ రెండు కథానికల మధ్యా సామ్యాలెన్ని వున్నాయో, వైషమ్యాలూ అన్ని వున్నాయి. ఇవి రెండూ భార్యాభర్తల సంబంధాలను చిత్రించిన కథానికలే. అలాగే, ఈ రెండు కథానికలూ నైతిక సమస్యలనే చర్చించడం మరో సామ్యం. అటు అచ్చమాంబ కథానికలోనూ, ఇటు గురజాడ కథానికలోనూ కూడా క్రియాశీలక పాత్ర పోషించింది కథానాయికలే. దీపావళి పండగ నేపథ్యంలో, చేతిలో పైసా లేక గిలగిల్లాడే ఓ పేద గుమాస్తా, అక్రమార్జనకి దొరికిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు కక్కుర్తి పడబోతాడు. కానీ, అతని భార్య గుమాస్తాని వారించి, అడ్డదోవలో సంపాదించే డబ్బు వలన సుఖశాంతులు దూరమవుతాయని నచ్చచెప్పి పంపుతుంది. పేద గుమాస్తా, పెద్ద గుమాస్తాని కలిసి, తప్పుడు పని చెయ్యడానికి తన అంతఃకరణ ఒప్పుకోవడం లేదని చెప్పి సొమ్ము తిరిగి ఇవ్వబోతాడు. నిజానికి, అదంతా ఓ పరీక్ష! పదవీ విరమణ చెయ్యబోతున్న పెద్ద గుమాస్తా తన వారసుణ్ణి ఎంపిక చెయ్యడానికి ఈ పరీక్ష పెడతాడు. పేద గుమాస్తా - భార్య చెప్పిన మంచి మాటల పుణ్యమాని - ఆ పరీక్షలో నెగ్గి, పదోన్నతి పొందుతాడు. ఈ కథలో సామాజిక సమస్య - నైతిక సంఘర్షణ - వాతావరణ సృజన - పరిష్కారం లాంటి ఆధునిక కథానికా లక్షణాలన్నీ ఉన్నాయి. గురజాడ ‘దిద్దుబాటు’ కూడా భార్యాభర్తల కథే. సమాజ సంస్కరణ పేరు చెప్పి వేశ్యల ఇళ్లమ్మట తిరిగివచ్చే కథానాయకుడు గోపాలరావుకి, చతురురాలయిన అతని భార్య కమలిని చెప్పే పాఠమే ఈ కథానిక ఇతివృత్తం. అతని మీద అలిగి పుట్టింటికి వెళ్లిపోతున్నట్లు కమలిని ఓ ఉత్తరం రాస్తుంది. ఇంటి నౌకరు ద్వారా గోపాలరావుకి ఆ లేఖ అందుతుంది. పశ్చాత్తాపపడిన గోపాలరావు, తన భార్య ఇంట్లోనే దాక్కుని వుందని గ్రహించడంతో కథ ముగుస్తుంది. శిల్ప సంబంధమయిన మెలకువలు గురజాడ కథల్లో కచ్చితంగా మెరుగ్గా ఉన్నాయి. అయితే, రెండు కథలకూ మధ్య ఎనిమిదేళ్ల వ్యత్యాసం ఉన్న సంగతిని పరిశోధకులు విస్మరించకూడదు. తొలి - మలి కథానికల చర్చలో ఏది ముందు వెలువడిందన్న అంశమే ప్రాధాన్యం వహిస్తుంది. అచ్చమాంబ కథానికే ముందు వచ్చిన సంగతి నిర్వివాదం కనక ఆమె కథానికే తొలి కథనిక అవుతోంది. సాహిత్య చరిత్ర సార్థకంగా రూపుదిద్దుకోవాలనుకునే వాళ్లు, చారిత్రిక వాస్తవాలను అంగీకరించక తప్పదు!

-మందలపర్తి కిషోర్ 81796 91822