పెరటి చెట్టు

బాటలు వేసిన బాటసారి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టేకుమళ్ల కామేశ్వరరావు ఎనభై, ఎనభై అయిదేళ్ల కిందట ఓ కథ రాశారు. తెలికిచెర్ల వెంకటరత్నం గారి ‘ప్రతిభ’లో చదివిన గుర్తు. ‘రొజా’ దాని పేరు. కోదు భాషలో రొజా అంటే బాట, దారి అని అర్థమట. వెదుళ్లు నరికి బండిలో తోలుకొచ్చే కోయదొర, బొర్రన్న కథ అది. వెదురుతోపుల మధ్య నడుస్తూండగా, మోళ్లు తగిలి ఓ ఎద్దు కాలు విరిగి కూలిపోతుంది. గూడెంలో పిన్నా పెద్దా దాన్ని కోసుకు తినేసి, ఆ సంగతి అక్కడితో మర్చిపోతారు. కానీ, పోయిన ఎద్దుని బొర్రన్న దొర మర్చిపోలేక పోతాడు. కచ్చా ‘రొజా’ అయినా లేనందువల్లనే కదా, బంగారం లాంటి ఎద్దు బలయిపోయిందని బాధపడతాడు. మరుసటి రోజు నుంచీ, పనీపాటా వదిలేసి మోళ్లు తవ్వి రొజా వెయ్యడం మొదలుపెడతాడు. అతనికి పిచ్చెక్కిందనే గూడెమంతా అనుకుంటుంది. కానీ, బొర్రన్న దొరకి ఓ మేనల్లుడుంటాడు. అతగాడికి పదిమంది స్నేహితులుంటారు. వాళ్ల దృష్టిలో బొర్రన్న నిజంగానే మహానుభావుడు. అతను రొజా వేసిన తర్వాత, ఒక్క పసరం కూడా దెబ్బ తినకపోవడం గురించి - పశువుల్ని తోలుకునే - కుర్ర దొరలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే, వాళ్లు ఒక్కొక్కళ్లూ వచ్చి దొరకి సాయం చేస్తుంటారు. అలా వచ్చిన వలంటీరు కుర్రాడి పనిభారం మిగతా కుర్రదొరలు పంచుకుంటారు. నానాటికీ బక్కచిక్కిపోయి బొర్రన్న - రొజా మీద పని చేసుకుంటూనే - దేవుడయిపోతాడు (అంటే, కన్నుమూస్తాడు) దొర మధ్యలో వదిలేసిన రొజా పని పూర్తి చెయ్యడానికి కుర్రకారు నడుం కడుతుంది. త్వరలోనే, మల్లెపువ్వులా రొజా మలిచేస్తారు. మందీ మార్బలంతో అట్టహాసంగా వచ్చిన కలకటేరు బొర్రన్న దేవుడి గురించి విని ఆశ్చర్యపోతాడు. కథ కంచికి...
చరిత్రలో బొర్రన్న దేవుడు ‘అవతరించని’ ఊరు లేదు, నాడు లేదు. ఎటొచ్చీ, కొద్దిమంది మాత్రమే చరిత్ర పుస్తకాల కెక్కుతారు. మాఝీ లాంటి కొద్దిమంది మీదే డాక్యుఫిక్షన్ సినిమాలయినా వస్తాయి. మరి కొందరు తామే స్వయంగా చరిత్ర పుస్తకాలు రాస్తారు. ఇంకా, కన్నుతెరవని కసిగందులకు వైతాళిక గీతాలు పాడతారు. మీకు ఆటాపాటా చేతకాదని విర్రవీగిన దారినపోయే దానయ్యల నోళ్లు మూయించడానికి, తమ జాతి జనులు తరతరాలుగా పాడిన పాటల్ని పోగేస్తారు; గుదిగుచ్చి తర్వాతి తరాల వాళ్లకి అందిస్తారు. పక్కవాడి ‘గొడవ’ మనకెందుకని ఈ బొర్రన్నలు అనుకోరు - పావురాల్ని మచ్చికచేసి, ఒకరి కుశలం మరొకరికి తెలియచేసే వ్యవస్థని నిర్మిస్తారు. వాడకట్టులోని పిల్లాపాపలకి పెద్దదిక్కుగా నిలబడతారు; వాళ్లకి నాలుగు అక్షరమ్ముక్కలు ఒంటబట్టాలని దేవులాడతారు. పట్టుబట్టి గుంట ఓనమాలు దిద్దిస్తారు. ఇవన్నీ చెయ్యాలంటే, ఈ బొర్రన్నలకి సొంత పని చేసుకునే వెసులుబాటు ఎక్కడుంటుంది? తమ వృత్తులు తాము వెలగబెట్టుకుని అర్ధాపావలా పోగు చేసుకునే అవకాశం ఎక్కడ దక్కుతుంది? అయినా, అలా అనుకునే వాళ్లు బొర్రన్నలయి, ఆ మీదట దేవుళ్ళెందుకవుతారు - మన పిచ్చి కాకపోతే! తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ నిర్మాత సురవరం ప్రతాపరెడ్డిగారు అలాంటి దేవుడే! తెలంగాణ తొలితరం ‘కథకుడూ, విమర్శకుడూ, కవీ, పండితుడూ, చరిత్రకారుడూ, పరిశోధకుడూ, పత్రికా సంపాదకుడూ, గ్రంథాలయ ఉద్యమ నాయకుడూ, అరుంధతీయ ఉద్యమ భాగస్వామీ, నాయకుడూ, భాషాభిమానీ, తొట్టతొలి నైజామాంధ్ర మహాసభ అధ్యక్షుడూ’ ప్రతాపరెడ్డిగారే. ఇంత వైవిధ్యాన్ని, ఒక మాటతో సూచించడం కష్టమే మరి! ఉన్నంతలో, సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమ నిర్మాత అనే మాటే సమగ్రమయిందని అనిపిస్తోంది.
తెలంగాణ విషయానికి వస్తే, ప్రతాపరెడ్డిగారే కందుకూరి - ఆయనే గురజాడ - గిడుగూ ఆయనే. ఆయనే కాశీనాథుని నాగేశ్వరరావూ. ఆయనే టంగుటూరి ప్రకాశం కూడా. మల్లంపల్లి సోమశేఖర శర్మ చేసిన పనీ, అయ్యంకి వెంకట రమణయ్య చేసిన పనీ కూడా సురవరం ప్రతాపరెడ్డే చెయ్యాల్సి వచ్చింది. ఆ మాటకొస్తే, ప్రతాపరెడ్డి చేసిన చాలా పనులు - అభివృద్ధి చెందిందనుకునే - ఆంధ్ర ప్రాంతంలోని పెద్దలు కానీ, వేరే ప్రాంతాల్లోని ప్రముఖులు కానీ చెయ్యనే లేదు. ఉదాహరణకి, ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ లాంటి పుస్తకం మరొకటి ఏ భాషలోనూ లేదు! సాహిత్య చరిత్రకయినా, ప్రధాన స్రవంతి చరిత్ర రచనకయినా, ప్రజాజీవనమే ప్రాతిపదిక కావాలని అలనాడే ప్రకటించిన చారిత్రాత్మక రచన ‘సాంఘిక చరిత్ర’. వాస్తవానికి అలాంటి రచనల్ని ఏదో ఒక ప్రాంతం ప్రత్యేక అవసరాలు తీర్చడానికి ఉపయోగపడిన రచనలుగా చూడ్డం తప్పు. ‘సాంఘిక చరిత్ర’లో కేవలం శిల్పవాదులకి ప్రతాపరెడ్డి వేసిన మొట్టికాయలు చాలాచాలా అవసరమయినవి; సమాజ ఆరోగ్యానికి ముఖ్యమయినవి కూడా. అనేక సాహిత్యాంశాలపై ఆయన రాసిన వ్యాసాలు కూడా తెలుగు జాతి సర్వతో ముఖాభివృద్ధికి దోహదం చేసినవే. అంచేతనే, ప్రతాపరెడ్డి కృషి ఒక్క ప్రాంతానికి పరిమితమయిందేం కాదనేది.
ముద్దుకృష్ణ ‘వైతాళికులు’ సంకలనం 1935లో వెలువడగా, అంతకు ఓ యేడాది ముందే ‘గోలకొండ కవుల సంచిక’ వెలువరించారు ప్రతాపరెడ్డి. వాస్తవానికి ఈ రెండింటికీ పోలిక లేదు. ‘గోలకొండ కవుల సంచిక’ తెలంగాణ ప్రాంతంలో అప్పట్లో ప్రచురంగా ఉండిన సాహిత్య దోరణులన్నింటికీ ప్రాతినిధ్యం కల్పించింది. కానీ, ‘వైతాళికులు’ కేవలం భావకవుల కవితల్ని మాత్రమే సంకలించిన సంగతి అందరికీ తెలిసిందే. పైగా, కళింగాంధ్రులకీ, సీమాంధ్రులకీ అందులో తగిన ప్రాధాన్యం దక్కలేదన్న విమర్శ ఉండనే ఉంది. కథకుడిగా ప్రతాపరెడ్డి విశిష్టమయిన పాత్ర పోషించారు. ఆయన ‘గోలకొండ’ పత్రికలో ప్రచురించిన చాలా కథలు వాస్తవ సంఘటనల ఆధారంగా రాసినవేనట. ముఖ్యంగా, ‘వింత విడాకులు’ కథానిక వాస్తవ జీవితానే్న కాకుండా, జీవిత వాస్తవాన్ని కూడా చిత్రించింది. కమలమ్మకి బాల్య వివాహం జరిగివుంటుంది. అప్పటి చట్టాల ప్రకారం, ఆమె హిందువుగా కొనసాగినంత కాలం, విడాకులు తీసుకునే అవకాశం లేదు. నంబి నరసింహులు సలహా మేరకి, ఆమె మతం మార్చుకుని ‘కమాల్ బీ’ అయిపోతుంది. విడాకులు పొంది, తనకి నచ్చిన రంగనాయకులుని పెళ్లాడుతుంది. ఈ కథ చదవగానే, 1934లో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్ర్తీ రాసిన ‘ఇలాంటి తవ్వాయి వస్తే..’ కథ గుర్తుకు రాకపోదు. మండువేసవిలో గొంతు తడుపుకోడానికి కూడా గతిలేకుండా పోయిన మాదిగపల్లి యువకుడు విస్సయ్య మతం మార్చుకుని ఇస్మాయిల్ అవుతాడు. జటకా సాయిబుతో కలిసి జబర్దస్తీగా పట్టపగలు పదకొండు గంటలకి ఊరి చెరువులో దిగుతాడు. అది చూసి - గుక్కెడు నీళ్ల కోసం ఊరి జనాన్ని ముష్టెత్తిముష్టెత్తి గొంతెండిపోయిన - మాదిగపల్లి జనమంతా ఆ వెనకే పెద్ద చెర్లోకి దిగిపోతారు. ప్రతాపరెడ్డిగారి కథలోని కమలమ్మ మతం మార్చుకుని సొంత సమస్య పరిష్కరించుకోగా, శ్రీపాద కథలోని విస్సయ్య అదే పని చేసి మొత్తం మాదిగపల్లి సమస్యను పరిష్కరించాడు. ఒకటి రెండు సంవత్సరాల ఎడంలో ఈ రెండు కథలూ ఒకే సమయంలో అచ్చుకావడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే, ప్రతాపరెడ్డిగారిలో ఓ శ్రీపాద కూడా దాగివున్నాడని అర్థమవుతుంది. నాకు తెలిసి ఇంత వైవిధ్యం కలిగివుండిన సాంస్కృతిక జీవి మరొకరు మన దేశంలోనే లేరు!
ఇంతటి వైవిధ్యం, వైశిష్ట్యం, ఆయా వ్యక్తుల సొంత కృషి మీద మాత్రమే సంతరించుకోవడం బహుశా అసాధ్యం. ఇది, చారిత్రిక పరిస్థితుల నుంచి పుట్టుకొచ్చిన వైలక్షణ్యమే అయివుండాలి. అదే మాట చెప్పారు మిత్రులు కె.శ్రీనివాస్. ‘రాజకీయవాదులూ, సాహిత్య సాంస్కృతిక కార్యకర్తలూ, సంస్కర్తలూ, వేరువేరుగా ‘అవతరించేంత’ వ్యవధి కానీ, వెసులుబాటు నుంచి అంగలతో పరుగులెత్తడం దాకా శీఘ్రంగా వేయవలసి వచ్చిన అవసరం అది’ అన్నారాయన. అదేదో వ్యక్తిగతమయిన, కుటుంబపరమయిన అవసరం కాకపోవడం ప్రత్యేకంగా దృష్టిలో వుంచుకోవలసిన విషయం. అలాంటి అవసరాలు తీర్చడానికి ఎవరో ఒకరు పూనుకోకపోతే, ఆ లోటును మొత్తం జాతి అంతా భరించవలసి వస్తుంది. ఆ విషయం బాగా తెలిసిన బాధ్యతాయుతుడు కావడంవల్లనే, సురవరం ప్రతాపరెడ్డి బహుపాత్రలు నిర్వహించడానికీ, విభిన్న కర్తవ్యాలను ఏకకాలంలో నిర్వర్తించడానికీ పూనుకున్నారు. రాజబహద్దూర్ వెంకటరామారెడ్డి ఆయనకి ఆయా బాధ్యతలు అప్పచెప్పడం లాంఛనం మాత్రమే!
మనుషులు ‘కాల శిశువు’లని ఎవరో పెద్దాయన చెప్పాడు. ఆయనకి, సురవరం ప్రతాపరెడ్డిగారు బాగా తెలిసి వుండాలి!

-మందలపర్తి కిషోర్ 81796 91822