పెరటి చెట్టు

అద్భుత కథాకావ్య రచనకు కేతనమెత్తిన కేతన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవికను వెతుక్కుంటూ నెల్లూరి సీమకొచ్చిన మూలఘటిక కేతన ఆ ప్రయత్నంలో ఏ మేరకు సఫలుడయ్యాడో యేమోగానీ, అద్భుత కథాకావ్య రచనకు హరిత కేతనమెత్తిన ఆద్యుడిగా ఆత్రం నిలిచిపోయాడు. వేంగినాడు ప్రాంతంలోని వెంటిరాల గ్రామానికి చెందిన కేతన, వెల్నాటి చోడుల పతనానంతరం, నెల్లూరికి తరలివెళ్లాడన్నది ఆయనే చెప్పిన వివరం. చదువుకున్న వాళ్లు వేంగి నుంచి ఇలా తరలి వెళ్లడం పదమూడో శతాబ్దం మొదట్లో మొదలయిందని ఒక అంచనా. ఇవి చారిత్రిక సాక్ష్యాలపైనే కాక, ఊహాపోహల మీద ఆధారపడి రూపొందించిన కథనాలు. వాటి మాటెలా వున్నా, తిక్కనకి తన కావ్యాన్ని అంకితమిచ్చి, కొట్టరువు వారి కొలువుకూటంలో విశిష్ట స్థానం ఆక్రమించగలిగాడు ఈ మూల ఘటికుడు. అందులో సందేహం లేదు! తనను తాను ‘మిత సత్య హిత వచో నిపుణు’డిగా అభివర్ణించుకున్నప్పటికీ, దశకుమార చరిత్రను అంకితమిచ్చే సందర్భంలో తిక్కన ఒక్కడినే కాదు- ఆయన తల్లినీ, తండ్రినీ, పెత్తండ్రినీ కూడా కేతన నోరునొవ్వంగ కీర్తించాడు. అయితే, ఆయన అలా కీర్తించినందువల్లనే, ఎన్నో చారిత్రిక సత్యాలు మనకి తెలియవచ్చాయి. అది వేరే సంగతి!
సాక్షాత్తూ కవిబ్రహ్మ తిక్కన అంతటివాడిచేత, ‘సంస్కృతాద్యనేక భాషాకావ్య రచనా విశారదు’డనిపించుకున్న కేతనకి, తనకన్నా కొంచెం ముందే, మంచన లాంటి వాళ్లు తెలుగులో కథాకావ్య రచనకి శ్రీకారం చుట్టిన సంగతి తెలియకుండా ఉండదు. అందుకే, తిక్కన నోరు తెరిచి తనకు అంకితంగా ఓ కావ్యం రాసిమ్మని అడిగినందుకు, అద్భుత కథలతో నిండివుండే ‘దశకుమార చరిత్ర’ని ఎంచుకున్నాడు. సంస్కృతంలో వచ్చిన గొప్ప వచన కావ్యాల్లో ప్రథమ స్థానం బాణుడి కాదంబరికి దక్కగా, (అ)ద్వితీయ స్థానం దండి దశకుమార చరిత్రకి దక్కిందని చెప్తారు. దండి రాసిన ఈ వచన కావ్యాన్ని తెలిగించినవాడు కేతన. అయితే, ‘దశకుమార చరిత్ర’ని యథామూలంగా అనువదించలేదు కేతన. దాని రూపం విషయంలోనే గొప్ప స్వాతంత్య్రం ప్రదర్శించి, తన రచనను పద్యగద్య సమ్మేళనంగా రూపొందించాడు. అప్పటికే తనకిఅభినవ దండి అనే బిరుదు వుందని కేతన దశకుమార చరిత్రలోనే చెప్పడాన్నిబట్టి, దానికీ ఈ అనువాదానికీ ఏ సంబంధం లేదని తేలుతోంది.
దశకుమార చరిత్ర ఆసాంతం అద్భుత గాథలతో నిండివున్నప్పటికీ, అందులో అడుగడుగునా వాస్తవికత తొంగిచూస్తూనే ఉండడం విశేషం. పేరులోనే ఉన్నట్లుగా, ఇది పదిమంది యువకుల కథ. కలిసిపెరిగిన ఈ యువకులందరూ సాహసయాత్రకు కలిసి వెళ్లి, ఒకరికొకరు వేరవుతారు. తిరిగి కలుసుకున్నప్పుడు వాళ్లందరూ తమ జట్టు నాయకుడి లాంటివాడయిన రాజకుమారుడితో తమతమ విచిత్రానుభవాలను పంచుకోవడమే ఇందులోని ఇతివృత్తం. శాఖోపశాఖలుగా విస్తరించిన కథలూ గాథలు కాండానికి వేరయిపోకుండా నేర్పుగా నిలిపివుంచడమే ఈ సంవిధానంలోని విశేషాంశం. క్లిష్టమయిన ఈ శిల్పాన్ని అలవోకగా పోషించాడు కేతన.
సంస్కృతంలో దశకుమార చరితమ్ రాసింది ఏడో శతాబ్దానికి చెందిన దండి. సాక్షాత్తూ సరస్వతీదేవి చేతనే ‘కవిర్దండి, కవిర్దండి!’ అనిపించుకున్నాడని దండి గురించి ఓ చమత్కార శ్లోక కథ ఉంది. అంతటి మహాకవి రాసిందంతా వచనంలోనే. కవిత్వం ఛందస్సులోనే ఉండనక్కర్లేదని - దండికన్నా ముందే - బాణుడు ఏనాడో రుజువు చేశాడు. కాంచీపురంలో పుట్టి, విదర్భలో రాణించాడని చెప్పే దండి చిన్ననాటనే తల్లిదండ్రులిద్దర్నీ పోగొట్టుకుని ఎనె్నన్నో క్లేశాలను అనుభవించాడంటారు. సమాజం తాలూకు అట్టడుగు పొరలన్నింటినీ అనాథ జీవితం అతని కళ్ల ముందు ఆవిష్కరించి వుంటుంది. అందుకే, దండిని ‘ప్రజాకవి; ప్రజా జీవితాన్ని ఆకళించుకొన్న కవి’గా అభివర్ణించారు తిరుమల రామచంద్ర. ఎన్ని ఎత్తుపల్లాలు చూసినా, నేలవిడిచి సాము చెయ్యకపోవడం దండి వ్యక్తిత్వంలోని విశేషం. అన్ని కష్టాలు పడిన ఈ మహాకవి ‘దండినః పదలాలిత్యమ్’ అనిపించుకునే రీతిలో కవిత్వం చెప్పడం అతని సాహిత్య మూర్తిమత్వంలోని విశేషం. నిజానికి దశకుమార చరిత్రను ఈ అభినవ దండే ఎంచుకున్నాడో, తిక్కనే కోరి రాయించుకున్నాడో స్పష్టంగా ఎక్కడా రాయలేదుగానీ అదే కేతనకు తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించి పెట్టింది.
తర్వాతి రోజుల్లో ‘ప్రబంధ ఫక్కి’గా ప్రచురమయిన రచనారీతికి ఒరవడి దిద్దిన కొద్దిమందిలో కేతన ఒకడు. దశకుమార చరిత్రను తాను ‘అంచిత భాష రసోదయాభిరామం’గా తెలిగించానన్నాడు కేతన. ‘జగతఃపితౌ వందే’ అంటూనే, పార్వతీ పరమేశ్వరుల శృంగార జీవితాన్ని విపులంగా వర్ణించిన సంస్కృత కవుల మార్గంలోనే కేతన తన కృతిని అంకితం పొందుతున్న తిక్కనగారిని కడుపుతున్నప్పుడు ఆయనగారి తల్లి అనుభవించిన దశలన్నీ వివరించాడు. షష్ఠ్యంతాలను అందరికన్నా ముందు కేతనే రాశాడని పండితుల అంచనా. అష్టాదశ వర్ణనలు చెయ్యడం, మాటలతో ఆటలాడుకోవడం లాంటివి కేతనాదులను చూసే ‘ప్రబంధ కవులు’ అనుసరించిన మార్గాలు. ఎన్నిచేసినా, ఏం చూపినా ‘అభినవ దండి’ కేతన కూడా పద లాలిత్యాన్ని ఎక్కడా వదిలిపెట్టలేదు. అంతకుమించి, కథాకావ్యం చెప్పే కవికి అవసరమయిన సారళ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యలేదు. ఇంత విశిష్టమయిన రచయిత కావడంవల్లనే, బ్రహ్మకయినా సాధ్యం కానిది - కవిబ్రహ్మను మెప్పించడం - సాధించగలిగాడీ ఘటికుడు!
‘కావ్యాదర్శం’ రాసిన దండి మాదిరే కేతన కూడా, ‘ఆంధ్రభాషా భూషణం’ అనే లక్షణ గ్రంథాన్ని కూడా రాశాడు. ‘లక్ష్య గ్రంథాలు’గా మనం భావించే కవిత్వ సంపుటులే నిజానికి లక్షణ గ్రంథాలకు ఒజ్జబంతులు. ఈ విషయం స్పష్టంగా చెప్పినవాడు కేతన. తెలుగులో తొలి లక్షణ గ్రంథం ‘ఆంధ్రభాషా భూషణమే’నని పరిశోధకుల భావన. ఈ లక్షణ గ్రంథంలో ఉన్నవి రెండొందలలోపు పద్యాలే. కేతన ఏ సంస్కృత వైయ్యాకరణి చెప్పిన కారికులనూ సూత్రాలనూ యథాతథంగా ఎత్తేయలేదు. నన్నయ భారతానువాద భాగం ఆధారంగానే ‘ఆంధ్రభాషా భూషణం’లోని సూత్రాలను కేతన రూపొందించాడు. బహుశా, ఈ గ్రంథం రాసేనాటికి తిక్కనగారి అనువాద యజ్ఞం ఓ కొలిక్కి రాలేదేమో! అసలప్పటికి, తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ కూడా పూర్తి చేసి వుండరని ఆరుద్రాదుల అనుమానం. కవిత్రయ భారతం ఆధారంగా లక్షణ గ్రంథాలు రాసిన చిన్నయ సూరి, కేతన రూపొందించిన అనేక నియమ నిబంధనలను ఉన్నవున్నట్లుగా స్వీకరించిన సంగతి తెలిసిందే! ఇక, కేతన రాసిన ‘విజ్ఞానేశ్వరీయం’ తెలుగులో తొలి ధర్మశాస్త్రం అంటారు. ‘యాజ్ఞవల్క్య స్మృతి’కి విజ్ఞానేశ్వరుడు ‘మితాక్షరి’ పేరుతో ఓ వ్యాఖ్యానం రాశాడట. దానినే తనా తెలిగిస్తున్నానని కేతన స్పష్టంగా చెప్పాడు. ‘మురికినాటి వాళ్లు మొరకు మనుషులు - అరవ్వాళ్లు కబ్జాకోర్లు - బ్రాహ్మలకి యావ ఎక్కువ’ అంటూ కులాలనీ ప్రాంతాలనీ దేశభాషల్నీ తిట్టేవాళ్ల గురించి కేతన ఈ ‘అనువాదం’లో రాశాడు. అయితే, ఇవన్నీ యాజ్ఞవల్క్య విజ్ఞానేశ్వరులకి తెలిసే అవకాశం లేదు. కనక కేతన సొంతంగా చేసిన వ్యాఖ్యలేనని ఆరుద్ర అన్నారు.

-మందలపర్తి కిషోర్ 81796 91822