పెరటి చెట్టు

సకల భాష భూషణుడు సాహిత్య రస పోషణుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పరివాదాస్పద వాదమోద మదిరా పానంబుచే మత్తులై/ హరిమేలంచు, హరుండు మేలనుచు నాహా కొందరీ పొందెరుం/ గరు కైలాస నగంబునందు మునులేకత్వంబు భావించి రా/ మురవైరిం బురవైరి బావుట మహా మోహంబు ద్రోహంబగున్’
-తిక్కన గారి శిష్యుడినని పదేపదే చెప్పుకుని, గర్వించి, గురువుగారి బాటలోనే తన ‘ఉత్తర హరివంశం’ కావ్యాన్ని కూడా హరిహరనాథుడికే అంకితం చేసిన నాచన సోమనాథుడు రాసిన పద్యమిది. పాల్కురికి తదితర సోమనాథులకూ తనకీ తేడా తెలియడం కోసమని, తండ్రి పేరుతో కలిపి తనను తాను నాచన సోమనాథుడిగా ప్రస్తావించుకున్నాడీ కవి. ఆరు ఆశ్వాసాల ‘ఉత్తర హరివంశం’లో అరడజను ఆశ్వాసాంత గద్యలు రాసిన ఈ కవి, అన్ని సందర్భాల్లోనూ, ‘శ్రీమదుభయకవిమిత్ర’ ‘కొమ్మనామాత్య పుత్ర’ ‘బుధారాధన విరాజి’ ‘తిక్కన సోమయాజి’ అంటూ గురుస్మరణ చేశాడు. ఈ లక్షణాన్ని గురుభక్తిగా చెప్పుకోనూవచ్చు - ఒక మహాకవి తన తర్వాతి తరం కవులపై ప్రసరించిన ప్రగాఢ ప్రభావంగానూ అనుకోవచ్చు. తన గురించి తాను చెప్పుకుంటూ ‘సకల భాషా భూషణుడి’ననీ, ‘సాహిత్య రస పోషణుడి’ననీ కూడా అన్నాడు సోమన. బాగానే ఉంది కానీ, ఈ ‘సాహిత్య రసం’ ఏమిటో మరి?
తిక్కనగారు - పూర్వ రామాయణాన్ని వదిలిపెట్టి - నిర్వచనోత్తర రామాయణం ఎందుకు రాశాడనే ప్రశ్నకి ఇంతవరకూ ఆమోదయోగ్యమయిన సమాధానం దొరకనట్లే, సోమన ‘ఉత్తర హరివంశం’తోనే ఎందుకు మొదలుపెట్టాడన్నది కూడా జవాబు లేని ప్రశ్నగానే మిగిలి ఉంది. పూర్వ హరివంశాన్ని సయితం సోమన రాశాడని నడకుదుటి వీర్రాజు, చాగంటి శేషయ్య, ఓగిరాల జగన్నాథ కవి లాంటి పెద్దలు కొందరు వాదించారు. అయితే, వాళ్లు ‘శత తాళ దఘ్న హ్రదమున నుఱికెన్’ అనే పద్యపాదాన్ని మాత్రమే ఉదాహరించారు తప్ప, అంతకుమించిన - బలమయిన - ఉపపత్తి ఒక్కటి కూడా చూపించలేక పోయారు. సోమన కాకపోతే మరో భీమన ఎవరయినా అలాంటి కావ్యం - కేవలం పూర్వ హరివంశం - రాశాడా అంటే అదీ కనిపించదు. సోమనకి సమకాలికుడని భావిస్తున్న ఎర్రాప్రెగ్గడ మాత్రం హరివంశం మొత్తంగా అనువాదం చేసిన సంగతి చరిత్ర కెక్కింది. హరివంశాన్ని మహాభారతానికి అనుబంధంగా చెప్పుకునే సంగతి అందరికీ తెలిసిందే. తెలుగునాట పురాణ శ్రవణ సంప్రదాయంలో భారతంతోపాటు, హరివంశాన్ని కూడా చదివించుకునే ఆనవాయితీ శతాబ్దాలుగా ఉంది. బహుశా అందుకే, అరణ్య పర్వ శేషాన్ని పూరించి, ఎర్రన నేరుగా హరివంశం ఎత్తుకుని ఉంటాడు.
సోమన కాలం గురించి నిర్ధారించడానికి ప్రధానంగా ఉపకరిస్తున్న ఆకరాలు రెండు. మొదటిది ‘కవిస్తోమైక చింతామణి’గా పొగడ్తలు పొందిన మాచయ బ్రహ్మయ కాల నిర్ణయం చెయ్యడానికి ఉపయోగపడిన 1330 నాటి శాసనం. ఈ మాచయ బ్రహ్మయకి సోమన ‘వసంత విలాస’మనే కావ్యం అంకితమిచ్చాడని లక్షణ గ్రంథాలు కొన్ని పేర్కొన్నాయి. అయితే, ఈ వసంత విలాసంలో పద్యాలు ఉటంకించే సందర్భంగా ఈ లాక్షణికులు - పిసినారితనంతో పోల్చదగినంత - పొదుపరితనం పాటించారు. ఫలితంగా, మనకీ కావ్యం గురించి ఏమీ తెలియకుండా పోయింది. ఇక, మొదటి బుక్కరాయలు సోమనాథుడికి పెంచుకల దినె్న అనే గ్రామాన్ని ధారపోయడానికి సంబంధించిన క్రీ.శ.1344 నాటి శాసనం ఇతగాడి కాలం గురించి నిర్ధారిస్తోంది. ‘ఉత్తర హరివంశం’ రాసినందుకు బుక్కరాయలు మెచ్చి పెంచుకల దినె్న గ్రామాన్ని మన కవికి ధారాదత్తం చేశాడట. ఈ శాసనం గుత్తి దుర్గంలో ఉందట. ఇతగాణ్ణి, బుక్కరాయల ఆస్థాన కవిగా చెప్తున్నాయి కొన్ని పుస్తకాలు. కానీ, సోమన ఆ మాట ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం.
ఉత్తర హరివంశమే కాకుండా సోమన ‘వసంత విలాసం’ తదితర రచనలు కూడా చేశాడని కొన్ని లక్షణ గ్రంథాలు పేర్కొనడాన్నిబట్టి తన కాలానికి అతగాడు ప్రముఖ కవేనని తెలుస్తోంది. ఈ రెండే కాక, ‘హరి విలాసము’ ‘హర విలాసము’ ‘ఆది పురాణము’ అనే పౌరాణిక కావ్యాలను కూడా సోమన రాశాడని పరిశోధకులు నమ్ముతున్నారు. అప్పకవీయంలోని ‘ఒకనాడిందు ధరుండు పార్వతియు లీలోద్యాన కేళీసరి..’ అనే పద్యభాగం - స్వల్పమయిన మార్పులతో - ఉత్తర హరివంశంలో కనిపిస్తోంది. ఆ పద్య భాగాన్ని ‘ఆది పురాణం’ నుంచి తీసుకున్నానని అప్పకవి స్పష్టంగా పేర్కొని వుండడంతో, ‘హరివంశమున కాది పురాణమను పేరునున్నదా?’ అంటూ శతావధాని వేలూరి శివరామశాస్ర్తీ ప్రశ్న లేవనెత్తారు. దానికి అలాంటి పేరు లేదని పెద్దలకు తెలియనిదా? దాంతో, ‘సోమన ఆది పురాణం’ అనే కావ్యం కూడా రాసే ఉంటాడని కొందరు భావించారు. ఇక ‘రంగరాట్ఛందము’లో సోమన ‘హరివిలాసం’ నుంచి ఉటంకించినవంటూ నాలుగు పద్యాలు చూపించాడు కస్తూరి రంగకవి. కానీ అవి శివుడి గురించిన పద్యాలని చాగంటి శేషయ్య అభ్యంతరం వెలిబుచ్చారు! దాంతో, ‘సోమన ‘హరి విలాసము’ ‘హర విలాసము’ అనే మరో రెండు కావ్యాలు కూడా రాసి ఉంటాడని మరికొందరు భావించసాగారు.
అటు నన్నయ్య శైలికీ, ఇటు తిక్కన శైలికీ వారధిలా ఉండే రీతిలో ఎర్రన అరణ్య పర్వ శేషాన్ని పూరించాడని నిపుణులు విశే్లషిస్తారు. అంటే, ఎర్రనపైన నన్నయ్య, తిక్కనల ఇద్దరి ప్రభావాలూ ప్రసరించాయని అర్థం. కాగా, కవిత్రయంలోని ముగ్గురి ధోరణులనూ నాచన సోమన వొంటబట్టించుకున్నాడని ప్రశంసిస్తూ ‘సర్వోన్నతి తెచ్చె సోముడు మహోదధినా జను నాంధ్రభాషకున్’ అన్నారు తిరుపతి వెంకట కవులు. ఈ పద్యంలో ఈ జంట కవులు కవిత్రయం ముగ్గుర్నీ కీర్తిస్తూ సోమనను కూడా అభినందించారు. కానీ, కందుకూరి వీరేశలింగం నేరుగా సోమన ఘనత గురించే ప్రస్తావించి, ‘్భరతమును రచించిన కవిత్రయములో ననేకుల కవిత్వమును గొన్ని విషయములలో సోముని కవిత్వముతో సరిరా’దన్నారు. ‘ఒకడు నాచన సోమన’ అనే శీర్షికతో విశ్వనాథ సత్యనారాయణ గొప్ప వ్యాసం రాశారు. సోమన గురించిన పరిశోధనలన్నీ పరికిస్తే, ‘ఒకే ఒక్కడు నాచన సోమన!’ అనిపించకుండా ఉండదు.

-మందలపర్తి కిషోర్ 81796 91822