ఆటాపోటీ

క్రీడా స్ఫూర్తికి ‘పిచ్’ గండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెస్టు క్రికెట్‌కు మరో గ్రహణం పట్టింది. ‘జంటిల్మన్ గేమ్’ క్రికెట్‌కు నిర్వచనం చెప్పేలా ఐదు రోజులు జరిగే టెస్టు క్రికెట్ ఇప్పుడు కొత్త ఒరవడిలో కొట్టుకుపోతున్నది. బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం సహకరించని పిచ్‌లపై ఐదు రోజుల జరగాల్సిన మ్యాచ్‌లకు మూడు రోజులు కూడా పూర్తికాకుండానే తెరపడుతున్నది. తమతమ ఆటగాళ్లకు అనువునా, వారికి సహకరించే రీతిలో పిచ్‌లను తయారు చేసుకోవడం కొత్త కాదు. అనాదిగా వస్తున్న సంప్రదాయమే. అయితే, మితిమీరిన స్వార్థమే క్రీడాస్ఫూర్తికి గండికొడుతున్నది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టుకు వేదికైన నాగపూర్ పిచ్‌పై చెలరేగిన దుమారం యావత్ క్రికెట్‌ను ముంచెత్తుతున్నది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) అధికారుల నుంచి మాజీ క్రికెటర్ల వరకూ ప్రతి ఒక్కరూ భారత్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగడుతున్నారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల్లో పిచ్‌లను సీమర్లకు అనుకూలంగా తీర్చిదిద్దితేలేని తప్పు భారత్‌లో స్పిన్‌కు అనుకూలంగా మార్చుకుంటే వచ్చిందా? అన్న ప్రశ్నతో విమర్శల నోళ్లు మూయించడానికి టీమిండియా మేనేజ్‌మెంట్ ప్రయత్నిస్తున్నది. ఈ వాదన ఎలావున్నా క్రీడాస్ఫూర్తికి గండి కొట్టడానికి క్రికెట్ దేశాలు పిచ్‌లను ఆయుధంగా ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా మన దేశం కూడా పిచ్‌లను స్పిన్‌కు అనుకూలంగా మార్చేసి, దక్షిణాఫ్రికాను దెబ్బతీసింది. ప్రతి దేశం ఇదే తరహాలో పిచ్‌లను తమకు అనుకూలంగా మార్చుకుంటూ పోతే, క్రికెట్ మూల సూత్రానికి గండిపడే ప్రమాదం పొంచి ఉంది.
మాటలు నేర్చిన టీమిండియా
టీమిండియా మాటలు నేర్చింది. సమయానుకూలంగా మాటలు మార్చేస్తున్నది. నిన్న ఏం చెప్పిందీ, ఇవాళ ఏం చెప్తున్నది అన్నది పట్టించుకోకుండా ఏ రోటికాడ ఆ పాట పాడుతున్నది. దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఏ విధంగా సిద్ధం కావాలో తెలియక అల్లాడుతున్న సమయంలో జట్టు మేనేజ్‌మెంట్ కొత్తకొత్త వివాదాలను తెరపైకి తెచ్చింది. అంతకు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన టి-20 సిరీస్‌లో చిత్తుగా ఓడింది. వనే్డ సిరీస్‌ను 2-3 తేడాతో చేజార్చుకుంది. చివరి వనే్డలో అత్యంత దయనీయ పరిస్థితిని ఎదుర్కొంది. ఏమాత్రం ప్రభావం చూపని భారత బౌలింగ్‌పై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ విరుచుకుపడ్డారు. ముగ్గురు శతకాలు సాధించిన ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లకు 438 పరుగులు చేసింది. ఈ ఉదంతంలో భారత బౌలర్ల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. పేసర్ భువనేశ్వర్ కుమార్ తన కెరీర్‌లోనే అత్యంత చెత్త బౌలింగ్ విశే్లషణను నమోదు చేశాడు. మొత్తం ఏడుగురు బౌలర్లను కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రంగంలోకి దింపినా ఫలితం లేకపోయింది. ఫీల్డింగ్ వైఫల్యాలు కూడా దక్షిణాఫ్రికా భారీ స్కోరుకు సహకరించాయి.
టి-20 సిరీస్ నుంచి మొదలుపెడితే, చివరి వనే్డ వరకూ భారత బౌలర్లపై ప్రత్యర్థులు ఏ విధంగా ఆధిపత్యాన్ని చెలాయించారన్నది బహిరంగ రహస్యమే. అయితే, లోపాలను గుర్తించి, సరిదిద్దాల్సిన టీమిండియా డైరెక్టర్ రవి శాస్ర్తీ ఆ దిశగా ఏమాత్రం కృషి చేయలేదు. చివరి మ్యాచ్ జరిగిన వాంఖడే స్టేడియం పిచ్ క్యూరేటర్ సుధీర్ నాయక్‌ను నోటికొచ్చినట్టు తిట్టిపోశాడు. నాయక్ కేవలం క్యూరేటరే కాదు. మాజీ క్రికెటర్ కూడా. భారత జాతీయ జట్టుకు ఓపెనర్‌గా మ్యాచ్‌లు ఆడాడు. అంతేగాక, ఇటీవలే కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన జహీర్ ఖాన్‌కు కోచ్‌గా కూడా వ్యవహరించాడు. అంత అనుభవం ఉన్న అతనిపై రవి శాస్ర్తీ విరుచుకుపడడం విచిత్రం. టి-20, వనే్డ ఫార్మెట్స్‌లో భారత బౌలింగ్ విభాగం బలహీనంగా ఉందన్నది అందరికీ తెలిసిన వాస్తవం. పిచ్ బౌలింగ్‌కు ఏమాత్రం అనుకూలించకని కారణంగానే దక్షిణాఫ్రికా అంత భారీ స్కోరు సాధిస్తే, అదే పిచ్‌పై భారత జట్టు 224 పరుగులకే ఎలా ఆలౌటైంది? బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్లకు పిచ్ అనుకూలంగా లేకపోవడం అన్నది ఒక జట్టుకే పరిమితం కాదు. ఆ సమస్య ఇరు జట్లను వేధిస్తుంది. అంతేగానీ దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేసే సమయంలో ఒక రకంగా, ఆతర్వాత మరో రకంగా మారిపోదు. ఒక సెషన్‌తో పోలిస్తే మరో సెషన్‌లో పిచ్ స్వభావం కొద్దిగా మారడం సహజం. కానీ, నూటికి నూరుశాతం మారదు. విపరీతంగా మంచు కురుస్తున్నప్పుడు దాని ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అపారమైన అనుభవం ఉన్న రవి శాస్ర్తీకి ఆ మాత్రం తెలియదా? పొరపాటు ఎక్కడ ఉందో అర్థం చేసుకోలేడా? లోతుగా ఆలోచిస్తే రవి శాస్ర్తీ ఆంతర్యం ఏమిటో స్పష్టమవుతుంది. ప్రస్తుతం భారత జట్టుకు రెగ్యులర్ కోచ్ లేడు. ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ టోర్నీకి ముందే టీమిండియా డైరెక్టర్‌గా రవి శాస్ర్తీ బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి కోచ్ డంకన్ ఫ్లెచర్‌ను ఓవర్‌టేక్ చేసిన అతను టీమిండియాను అంతా తానై నడిపించాడు. ప్రపంచ కప్‌లో భారత్ సెమీస్ నుంచి వైదొలగినప్పుడు, దానిని ఫ్లెచర్ వైఫల్యంగానే అంతా చూశారు. ఆ టోర్నీతోనే ఫ్లెచర్‌తో బిసిసిఐ కాంట్రాక్టు ముగిసింది. కొత్త కోచ్‌ని ఎంపిక చేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్న బిసిసిఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా చీఫ్ కోచ్ లేకుండానే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు పరాజయాన్ని మూటగట్టుకొని తిరిగొచ్చింది. దక్షిణాఫ్రికా టూర్‌కు ముందే కొత్త కోచ్‌ని నియమిస్తారన్న వార్తలు వినిపించినప్పటికీ బిసిసిఐ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీ్ధర్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్‌తో నెట్టుకురావాలని బోర్డు అధికారులు నిర్ణయించారు. రవి శాస్ర్తీ పేరుకు డైరెక్టర్‌గా వ్యవహరించినా, పరోక్షంగా కోచ్ బాధ్యతలను కూడా అతను నిర్వర్తిస్తాడని వారి అభిప్రాయం. అంతకు ముందే పరోక్షంగా జట్టు బాధ్యతను అతని భుజాలపై పెట్టేసిన అధికారులు దక్షిణాఫ్రికా వంటి పటిష్టమైన జట్టు భారత్‌కు వస్తున్నప్పటికీ సరైన కసరత్తు చేయలేదు. ఫలితంగా రవి శాస్ర్తీ బాధ్యత మరింత పెరిగింది. అతనిపై అభిమానుల అంచనాలు రెట్టింపయ్యాయి. సహజంగా ఆ పరిస్థితిల్లో అతను ఒత్తిడికి గురై ఉండవచ్చు. టి-20తోపాటు వనే్డ సిరీస్‌లోనూ భారత్ ఓడడం రవి శాస్ర్తీని తీవ్ర అసంతృప్తికి, అసహనానికి గురి చేసింది. క్యూరేటర్ నాయక్‌పై మండిపడడం, బూతులు తిట్టడం అతను ఎంత ఒత్తిడికి గురవుతున్నాడన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ క్యూరేటర్ ప్రబీర్ ముఖర్జీపై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇదే విధంగా నోరు చేసుకొని వివాదంలో చిక్కుకున్నాడు. బ్యాటింగ్‌కు అనుకూలించేలా పిచ్‌ని తయారు చేయాల్సిందిగా అతనిని ఆదేశించి పరువు పోగొట్టుకున్నాడు. టీమిండియాను శాసిస్తున్న తనకు ఒక క్యూరేటర్ నుంచి ధిక్కారమా అంటూ మండిపడ్డాడు. కానీ, చివరికి ప్రబీర్ పంతమే నెగ్గింది. పిచ్ తీరుతెన్నులపై ఆటగాళ్లు, కెప్టెన్ల పెత్తనం ఉండకూడదన్న అతని వాదనకే మద్దతు లభించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో ధోనీ రాజీ మార్గాన్ని ఎంచుకున్నాడు. రవి శాస్ర్తీ కూడా ధోనీ అడుగుజాడల్లోనే నడిచాడు.
ఇంత హంగామా చేసిన రవి శాస్ర్తి టెస్టు సిరీస్‌లో భారత స్పిన్నర్లు చెలరేగిపోవడంతో మాట మార్చేశాడు. పిచ్‌లు అద్భుతమని కొనియాడాడు. బ్యాట్స్‌మెన్ విఫలమవుతున్నారే తప్ప పిచ్‌లను తప్పుపట్టడానికి ఏమీ లేదని తేల్చి చెప్పాడు. అంతకు ముందు టి-20, వనే్డ సిరీస్‌లలో భూతాల్వా కనిపించిన పిచ్‌లు అతనికి టెస్టు సిరీస్ సమయానికి దేవతల్లా గోచరించాయ. క్రికెట్‌లో నైతిక విలువలు ఎంతగా పతనమవుతున్నాయో చెప్పడానికి ఇదో ఉదాహరణ.
పిచ్‌ని తమ బౌలర్లకు అనుకూలించేలా తయారు చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయమైనప్పటికీ, కనీస ప్రమాణాలను కూడా పాటించకపోవడం ఆందోళన కలిగిస్తున్న విషయం. మాటలు మారుస్తూ, పిచ్‌లపై భారత మేనేజ్‌మెంట్ ఒక్కోసారి ఒక్కో ప్రకటన చేయడం ఈ తతంగం మొత్తం క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా జరుగుతున్నదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నది. పొరపాటు చేయకపోతే, వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఏందుకొచ్చిందన్న ప్రశ్నకు సమాధానం రావాలి. బిసిసిఐ కూడా పిచ్‌లను మార్చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విచారకరం. బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం క్రికెట్ పతనానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు.

- శ్రీహరి