రాష్ట్రీయం

పోలవరం కేంద్రం బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెండింగ్ ఇంకా 68 అంశాలు
ఎర్రచందనం వేలానికి అనుమతి
వర్షాల సాయం 3వేల కోట్లు
తెలంగాణలో బయ్యారం స్టీల్‌ప్లాంట్
పార్లమెంట్‌లో గట్టిగా ప్రశ్నించండి
ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం

విజయవాడ, నవంబర్ 24: పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపథ్యంలో, సకాలంలో పూర్తి చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని పార్టీ ఎంపీలకు సిఎం చంద్రబాబు సూచించారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని నేరుగా కేంద్రమే చేపట్టినా ఇబ్బంది లేదన్నారు. లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి నిధులివ్వాలంటూ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై ముప్పేట దాడికి సిద్ధం కావాలని సూచించారు. కేంద్రం వద్ద ఆంధ్రకు చెందిన 68 అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిల్లో ప్రాధాన్యతా అంశాల అమలుకు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందన్నారు. నిర్ణీత కాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నేరుగా కేంద్రమే బాధ్యతలు తీసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో మంగళవారం రెండు రాష్ట్రాల తెదేపా, భాజపా ఎంపీలతో సమావేశమయ్యారు. ముంపు మండలాలను రాష్ట్రంలో విలీనం చేసినంత స్పీడుగా పనులు కూడా ప్రారంభించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తంలో రావాల్సిన రూ.274 కోట్లు విడుదల చేసే అంశాన్నీ ప్రస్తావించాలని కోరారు. 2015-16లో ప్రాజెక్టు నిర్మాణం కింద రూ.2,051.78 కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నారు. పోలవరం నిర్మాణానికున్న పర్యావరణ ఆంక్షలు, నిషేధాలను శాశ్వతంగా కేంద్రం రద్దుచేయాల్సి ఉందన్నారు. తనవరకు న్యాయస్థానాల్లో ఉన్న కేసులను రైతులతో చర్చించి పరిశీలించగలిగానని చెప్పారు.
ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఇప్పటికే ప్రభుత్వం వద్ద 3,308 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఉందని, దీన్ని విదేశాల్లో విక్రయించేందుకు కేంద్రం నుంచి అనుమతులు సాధించేలా ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించాలని చంద్రబాబు గట్టిగా చెప్పారు. పెట్రోలియం యూనివర్సిటీ, గిరిజన వర్శిటీల స్థాపనకు కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేలా ఎంపీలు ప్రయత్నించాలన్నారు. సముద్రం వలన ఆంధ్రకు నష్టాలతోపాటు లాభాలు కూడా ఉన్నాయంటూ, కాకినాడ, మచిలీపట్నం ఓడరేవుల అభివృద్ధితోపాటు ఓడ్రేవు (చీరాల), భావనపాడు, నక్కపల్లి, దుగ్గరాజుపట్నం, నరసాపురం, రామాయపట్నం పోర్టుల అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం కోరాలని గట్టిగా ఆదేశించారు. సముద్ర విహార పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఓడరేవుల్లో కంటైనర్ షిప్పింగ్, కోబటేజ్‌లను సరళీకరించే అంశాన్ని కేంద్రానికి గుర్తు చేయాలన్నారు. భారత్ మాల ప్రయోజనం కింద బీచ్ కారిడార్, ఇంటిగ్రేషన్‌పై నిధులు కోరాలని, విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి అవుటర్ నిర్మాణానికీ నిధులు సాధించాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకూ ఒత్తిడి తేవాలని, రైల్వేజోన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం పొందేలా చూడాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వలన నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా 3వేల కోట్లు సాయాన్ని కేంద్రాన్ని కోరటం జరిగిందని, నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. తక్షణ సహాయంగా వెయ్యి కోట్లు కోరామని, అయితే నేటివరకు రాలేదని, తమిళనాడుకు 50కోట్లు మంజూరైన విషయాన్ని సిఎం గుర్తుచేసారు.
తెలంగాణ సమస్యలు ప్రస్తావన
తెలంగాణ ప్రాంతంలో అపరిష్కృతంగా నిలిచిన సమస్యల పరిష్కారానికి ఆంధ్ర ఎంపీలు కూడా తెలంగాణ ఎంపీలకు సహకరించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని గట్టిగా చెప్పారు. బయ్యారం స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. ఉద్యాన పంటలకు సాయం కోరాలని, తెలుగు రాష్ట్రాల్లో ధాన్యానికి మద్దతు ధర ప్రకటించేలా కేంద్ర వ్యవసాయ మంత్రిపై ఒత్తిడి తేవాలని, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటుచేసి వేలాదిమందికి ఉపాధి కల్పించేలా ఒత్తిడి తేవాలని కోరారు. ఆంధ్రలో 300 కరువు మండలాలు ప్రకటించామని, కరువు నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ప్రత్యేక సహాయం అందజేయాల్సి వున్న హామీని కూడా నెరవేర్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. సమావేశంలో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, తెలంగాణ ఎంపీ మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపి కంభంపాటి హరిబాబు, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు, రాష్ట్ర ఆర్ధిక జలవనరుల ప్రణాళిక వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (చిత్రం) ఎంపీల సమావేశంలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు