డైలీ సీరియల్

పూలకుండీలు - 21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమయానికి వాయిదాలు కట్టడం లేదంటూ ఆ ఫైనాన్స్ కంపెనీవాళ్ళు ఓ రోజు ఆవిడ ఇంటిమీద బడి ఇల్లంతా పొక్కిలి, పొక్కిలి చేసి ఇంట్లోని కంచాలు, మంచాలతో సహా దొరికింది దొరికినట్టు ఊడ్చుకపోయారు. దాంతో బస్తీవాళ్ళ ముందు తన పరువు పోయిందని చెప్పి తెల్లారిపాటికి ఇంటి వెనుకనున్న బావిలోకి దూకి చచ్చిపోయింది?
ఇంటికోసం అప్పులు చేసి కస్తూరికి అవి తీర్చేదారి కనబడక పరువు కోసం చచ్చిపోయింది. అయితే మూడు నెల్లు తిరక్కముందే ఆవిడ మొగుడు మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. మారుమనువు వచ్చిన ఆడది వేరే అమ్మ కన్నబిడ్డలను తన బిడ్డలుగా ఎందుకు చూసుకుంటుంది. కస్తూరి పిల్లలను గాలికి వదిలేసింది. దాంతో ఆ పిల్లలు ఊరుమీద బలాద్దూర్ తిరిగి చెడు సావాలు పట్టి ఆగమైపోయారు.
ఆ కస్తూరి మాదిరిగా కుటుంబాన్ని ఆగం చేసుకునేదానికన్నా మూడో కంటికి తెలియకుండా హైదరాబాద్ వెళ్లి వాళ్ళు చెప్పిన పని చేసుకొని వస్తే చక్కగా బాగుపడతావు. అందుకే ఇంకే ఆలోచనలూ గీలోచనలూ పెట్టుకోకుండా ఆ ఆర్‌ఎంపి లింగయ్య దగ్గరికి పొయ్యి ఊ అను చాలు మిగతా కథంతా వాళ్ళే చూసుకుంటారు’’ అంటూ మనసు ఓ మార్గం చూపించసాగింది.
‘‘మరి ఈ ముచ్చట మా ఆయనకు చెబితే ఏమంటాడో?’’ తన ఆలోచనా ధోరణిలో తనకు తెలియకుండానే కొంత సడలింపు వస్తుంటే అనుకుంది శాంతమ్మ.
‘‘ఏ మగాడైనా ఇలాంటి విషయాల్లో సాధారణంగా ఏమంటాడు? విన్న వెంటనే ముందు నీ మీద బడి కొడతాడు. ఆ పైన ఇందాక నువ్వన్నట్టే పరువు పోగొట్టుకొని బతికేదానికంటే అందరం కలిసి ఇంత విషం దాగి చద్దాం పదండి అంటాడు. అందుకే ఈ విషయంలో నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా ఎల్లయ్యకు తెలియకుండానే తీసుకోవాలి. తరువాత అతనికి తెలిసినా పెద్ద కొంపలు మునిగిపోయేదేముండదు. నాలుగు రోజులు గులుగుతాడు. తరువాత నువ్వు తెచ్చే డబ్బులు చూసి మెదలకుండా వూరుకుంటాడు. ముందు నువ్వు హైదరాబాద్ బయలుదేరడం మంచిది’’ అంటూ మనసు పదే పదే శాంతమ్మను ప్రోత్సహించింది.
‘‘నేను హైదరాబాద్ పోతే మరీ పిల్లలను, ముసలోల్లనూ ఎవరికొప్పచెప్పి పోవాల? ఎవరికొప్పజెప్పిపోయినా వాళ్ళు మాత్రం పదినెల్లపాటు ఎందుకు జూసుకుంటారు?’’’ ఒక్కసారి కొండమీద నుండి కిందకు జారడం మొదలుపెట్టిన మనిషి తను ఊహించినదానికన్నా మరింత వేగంగా నేలకు జారిపోవడం జరుగుతుందన్న నిజాన్ని నిజంగా నిజం చేస్తూ శాంతమ్మ ఆలోచనల్లో మార్పు వేగంగా వస్తుంటే అనుకుంది.
శాంతమ్మ మెల్లగా తన దారిలోకి వచ్చేస్తుందన్న నిజాన్ని గ్రహించిన మనస్సు ‘‘ఓ పని చేస్తే’’ అంది మరింత ఉత్సాహంగా.
‘‘ఏంటది?’’ ఆత్రంగా అడిగింది శాంతమ్మ ఆలోచన.
‘‘ఏముంది ముసలోళ్ళకు బత్తెం బెట్టి ఇక్కడే వుండమని చెప్పి, పిల్లల్ని నలుగురినీ తీసుకుపోయి మీ అమ్మగారి ఇంట్లో వుంచితే సరి’’ మరింత ఉత్సాహంగా చెప్పుకొచ్చింది మనసు.
‘‘వాళ్ళేమంటారో!?’’ సందిగ్ధంగా అనుకుంది శాంతమ్మ.
‘‘ఏమంటారు? తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి మెదలకుండా పిల్లలను తీసుకొని ఇంటికిబొయ్యి ఎప్పటిమాదిరిగానే కాయకష్టం జేసుకుంటూ పిల్లల్ని సాదుకో, ఇయ్యాల గాకుంటే ఇంకా యాడాదికైనా ఎల్లయ్య రాకపోతాడా? అతనొచ్చిందాకా ఏదో విధంగా ఇప్పటిమాదిరిగానే రోజులు ఎల్లదియ్యి. నీవల్లగాదనుకుంటే పిల్లగాల్లు నువ్వూ ఇక్కడ మా దగ్గరే వుండండి. అక్కడ చేసుకునే పనేదో ఇక్కడ నాలుగిండ్లలో చేసుకుందువుగాని. అప్పటికీ నువ్వు కాదు, కూడదు నేను హైదరాబాద్ వెళ్లాల్సిందే అన్నావనుకో వెంటనే నీ కాళ్ళూ చేతులూ విరగొట్టి ఇంట్లో ఓ మూలకు కూర్చోబెడతారు’’ మనసు తన మనసులోని మాటను నిర్మొహమటంగా తెలియజేసింది.
‘‘పోనీ ఏదో విధంగా మా అమ్మా నాయినలను ఒప్పించినా ఈ విషయం తెలిస్తే నన్నూ నాతోపాటు వాళ్ళనూ ఊళ్ళో వాళ్ళు ఎంత లోకువగా చూస్తారో?’’ అనుకుంది శాంతమ్మ.
‘‘చూస్తే చూణ్ణియ్యి, అనుకునేవాళ్ళంతా మీ కష్టాలను ఆర్చేవాళ్ళా? తీర్చేవాళ్ళా? నువ్వు ఏది చేసినా నీ సంసారం కోసం, నీ పిల్లలకోసం చేస్తున్నావు అంతేగా. ఆ అనేవాళ్ళలో ఏ ఒక్కరైనా నీ పిల్లకు ఆకలేస్తుందంటే ఓ పూట పట్టెడన్నం పెట్టేవాళ్ళున్నారా? ఆలోచించూ’’ అంటూ శాంతమ్మ మీద ఇంతెత్తున లేచింది మనసు.
‘‘ఔను ఆ మాట మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజం’’ అనుకుంది శాంతమ్మ.
‘‘అసలు ఆ ఆర్‌ఎంపి లింగయ్యకు బస్తీలో మీకన్నా పేదవాళ్ళు ఎంతోమంది వుండగా నీమీదనే ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో వచ్చింది, వచ్చినందుకు అతనికి నువ్వు పొద్దునే్న లేచి దండం పెట్టుకోవాలి.
అతను చూపించిన ఆ అవకాశాన్ని వినియోగించుకుంటేనే మీరు బాగుపడతారు. అనుకునేవాళ్ళు మనం ఏది చేసినా ఏదో ఒకటి అనుకుంటూనే వుంటారు. అవన్నీ పట్టించుకుంటే బ్రతకడమే చాలా కష్టమవుతుంది. మహా అయితే నాలుగు రోజులు అనుకుంటారు లేదంటే నాలుగు వారాలనుకుంటారు ఆ తరువాత వాళ్ళే మర్చిపోతారు.
ఇంత జరిగాక ఈ బస్తీలో వుండడం ఇబ్బంది అన్పిస్తే ఇంకో బస్తీ- అసలింకా గట్టిగా మాట్లాడితే ఈ వూరుగాకపోతే మరో వూరు బొయ్యి బ్రతకొచ్చు. బ్రతకడానికి దేశమేమన్నా గొడ్డుబొయిందా? ఏది ఏమైనా మీ ఆయనకు ముందుగా చెబితే మాత్రం ఖచ్చితంగా పోనివ్వడు. అట్లా అని ఇన్ని డబ్బులు అతను జీవితమంతా కష్టం చేసినా సంపాదిస్తాడనేది వట్టిమాట. అప్పులు తీరుతాయనేదీ కల్ల. అందుకే ధైర్యం చేసి అడుగు ముందుకెయ్యి’’ అంటూ మనసు పదే పదే ఆమెను ప్రోత్సహించింది.
- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు