డైలీ సీరియల్

పూలకుండీలు - 15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాంతో ఇంక చేసేదేం లేక తక్షణమే హాస్పిటల్లో చేరిపోయింది శాంతమ్మ.
తను వచ్చేటప్పుడు ఓ కాగితంమీద రాయించుకొచ్చిన పక్కింటివాళ్ళ ల్యాండ్ ఫోన్ నెంబర్ హాస్పిటల్ ముందున్న డబ్బా ఫోన్ వాళ్ళకిచ్చి ఫోన్ చేయించి అత్తమామలను పిలిపించుకొని జరిగిన విషయమంతా వివరించి ‘‘నేను వచ్చిందాకా పిల్లగాండ్లను జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పింది.
చెప్పిన సమయానికే పిల్లకు ఆపరేషన్ అయ్యింది.
ఆపరేషన్ తరువాత పిల్ల కోలుకొని, శాంతమ్మ ఇల్లు చేరేసరికి దాదాపుగా పది రోజులు పట్టింది.
ఆ పదిరోజులూ శాంతమ్మ అత్తామామలు అక్కడక్కడ బదులు, సదుళ్ళు తెచ్చి పిల్లకింత వండిపెడుతూ ఆమెకోసం ఆదుర్దాగా ఎదురుచూస్తూ రోజులు ఎల్లమార్చారు.
పదిరోజులు హాస్పిటల్లో వుండడంవల్ల శాంతమ్మకు ఇండ్లలో పనులకు వెళ్ళడం కుదరలేదు. దాంతో ఆ నెల జీతం డబ్బులు పూర్తిగా రాకపోవడంతో పాటు ఇటు ఇంట్లో తిండిగింజలకు అటు పిల్ల మందులకు డబ్బులేక సాలీడు గూట్లో చిక్కిన రెక్కల పురుగు మాదిరిగా విలవిల్లాడసాగింది.
భర్త ఊళ్లో లేకున్నా కాయకష్టం చేసుకుని ఇల్లు ఎల్లదీసుకుంటూ తను తిన్నా తినకున్నా ప్రతినెలా వడ్డీలు కట్టుకొస్తున్న శాంతమ్మ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేకపోయిన అప్పులవాళ్ళు లగీ లగీ అంటూ వడ్డీ డబ్బులకోసం ఇంటిచుట్టూ తిరుగుతూ గొడవచేయసాగారు.
వచ్చినవాళ్ళందరికీ పిల్ల పరిస్థితి వివరించి చెబుతూ ‘‘మా ఆయనకు ఫోన్ చేసి ఇక్కడి విషయమంతా చెప్పాను. వారం పది రోజుల్లో డబ్బులు పంపిస్తానన్నాడు. ఆ డబ్బులు చేతికందగానే నేనే మీ ఇండ్లకొచ్చి ఇస్తాను. నా పిల్ల మొకం జూసి నాలుగు రోజులు ఓపిక పట్టండి!’’ ఆపద్ధర్మంగా అబద్దం ఆడుతూ వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకొని బ్రతిమాలసాగింది శాంతమ్మ.
అదుగో ఇదుగో అంటూనే మరో నెల గడిచిపోయినా ఎల్లయ్య దగ్గర్నుండి డబ్బులు కాదు గదా కనీసం ఓ ఫోన్ గూడా రాలేదు. దాంతో శాంతమ్మకు వడ్డీల వాళ్ళ ఒత్తిడి మరీ ఎక్కువైపోయింది.
ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో ఏ మాత్రం పాలుపోక నిస్సహాయంగా అప్పులవాళ్ళ మాటలు భరిస్తూ దిన దిన గండంగా రోజులు గడపసాగింది శాంతమ్మ.
భర్త ఊరువెళ్లింది మొదలు శాంతమ్మ పరిస్థితిని ఓ కంట కనిపెడుతూ వస్తున్న ఆర్‌ఎంపి లింగయ్య బుర్రలో క్రమంగా ఆమె పట్ల ఓ ఆలోచన చోటుచేసుకుంది. తను అనున్నట్టే ఆ ఆలోచనను వెంటనే అమల్లో పెట్టాడు.
***
ఓ రోజు పొద్దునే్న శాంతమ్మ వాళ్ళింకా నిద్ర లేవకముందే వాళ్ళ ఇంటికిపోయిన ఆర్‌ఎంపి లింగయ్య ‘‘ఆ ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు వడ్డీ డబ్బులు కట్టమంటూ ఫోన్లమీద ఫోన్లు చేస్తున్నారు. నువ్వు ఇబ్బందుల్లో వున్నావని ఈ రెండు నెల్లనుండీ వాళ్ళకు నా జేబులో డబ్బులు కడుతున్నాను. ఇపుడు వాళ్ళకేదో అర్జంట్ అవసరమొచ్చిందంట, మొత్తం డబ్బులు వెంటనే కావాలంటున్నారు’’’ తాటిచెట్టుమీద పిడుగు పడ్డట్టుగా చెప్పుకొచ్చాడు.
పొద్దుపొద్దునే్న అతన్ని చూస్తూనే వణికిపోయిన శాంతమ్మ ఆ మాటలు వింటూనే మరింతగా వణికిపోతూ ‘‘అన్నా! నా పరిస్థితేందో తెలిసి నువ్వు కూడా అట్ల మాట్లాడితే ఎట్లన్నా!’’ అంటూ పాతకాలం నాటి ఓ చెక్క కుర్చీ తెచ్చి వేసి కూర్చోమన్నట్టుగా కొంగుతో తుడ్చింది.
ఆ కుర్చీమీద కూర్చుంటూనే ‘‘ఈ మర్యాదలకేమొచ్చెగాని డబ్బుల సంగతేంటో చెప్పు. నువ్వన్నట్లు నీ పరిస్థితి ఆలోచించుకుంటూ కూర్చుంటే నా పరిస్థితి సున్నమయ్యేటట్టుంది’’ అంటూ ముఖం చూడకుండా మాట్లాడాడు ఆర్‌ఎంపి లింగయ్య.
గల గలమంటూ మాట్లాడుతున్న అతని మాటల చప్పుడుకు, గద్దరెక్కల చప్పుడు విన్న కోడిపిల్లల మాదిరిగా దిగ్గున లేచి కూర్చున్న పిల్లలు నలుగురూ తల్లిదగ్గరకొచ్చి ఆమెను గట్టిగా పట్టుకుని నిలబడి బెదురు బెదురుగా అతని వంక చూడసాగారు.
‘‘అయ్యా! ఆడిమనిషి ఒక్కతీ ఈ సంసారం ఈదలేక నానా తిప్పలు పడుతుంది. ఇన్ని రోజులాగినోళ్లు ఇంకొంచెం పెద్ద మనసు చేసుకొని ఇంకో పది రోజులాగండి? ఈలోపునే్న మా కొడుకు పైసలు పంపిస్తాడు. ఆ పైసలు రాంగనే మా కోడలు అందరికంటే ముందల నీకే తెచ్చిస్తది. నువ్వే ఆ ఫైనాన్సోల్లకు ఎట్లనో సర్దిసెప్పు’’ పిల్లలతోపాటు లేచి కూర్చున్న శాంతమ్మ అత్తమామలు ఆర్‌ఎంపి లింగయ్య చేతులు పట్టుకుని బ్రతిమాలుతూ కన్నీళ్ళు పెట్టుకున్నారు.
‘‘ఆ ఆ మీ కొడుకు బొంబాయినుంచి కట్టలు కట్టలు డబ్బులు పంపిస్తడు. మీరు ఆ కట్టలను అట్లనే తెచ్చి నాకిస్తారు. ఏం మాట్లడుతున్నారమ్మా! అతను నిజంగా డబ్బులు పంపేవాడైతే ఎప్పుడో పంపేవాడు. ఏదో పెద్దమనుషులు మీరింతగనంగా అడుగుతున్నరు కాబట్టి ఓ వారం రోజులు గడువిస్తున్నా, ఆ లోపల డబ్బులు తెచ్చి కట్టారా సరేసరి, లేదంటే ఫైనాన్స్ వాళ్ళొచ్చి మీ ఇంటిని స్వాధీనం చేసుకుంటారు. ఆపైన మీ ఇష్టం. ఈమాటే చెప్పిపోదామని ఇంత పొద్దునే్న మీ ఇంటికొచ్చాను’’ అంటూ వచ్చినంత వేగంగా కుర్చీలోనుండి లేచివెళ్లిపోయాడు ఆర్‌ఎంపి లింగయ్య.
‘‘ఎన్నిసార్లు చేసినా పోనెత్తి మాట్లాడడాయె, పట్టుమని పది పైసలు పంపించడాయె! మీదినుంచి ఈ జింజికానా అంతా నా మెడకు తగిలించిపోయిండు. ఆ అయినా ఆయన్నదేముందిలే, ఆ డబ్బుల కోసమనేగా తనూ కానని రాజ్యం బోయింది. అసలిదంతా నావల్లనే వచ్చింది. అయ్యాల ఇంటిల్రాజులు డాబా ఇల్లొద్దు పాడొద్దని నాకు చిలక్కి చెప్పినట్టు చెప్పినా ఇనకుండా ఇంతకాడికి తెచ్చిన. ఈ ఊబిలోంచి బయపడాలంటే నేనే ఏదో ఒకటి చెయ్యల, అదే ఏం చెయ్యాల? ఎటుపోవాల?’’ పిల్లల్ని మరింత దగ్గరికి తీసుకుంటూ తన్లో తను కొట్టుమిట్టాడ సాగింది శాంతమ్మ.
- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు