శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

భానుడి భగ భగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 23: గత వారం రోజులుగా జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు విజృంభించాడు. దీంతో జనం అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. జిల్లాలో గత వారం రోజుల వ్యవధిలో వంద మందికి పైగా వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా శుక్ర, శనివారాల్లోనే 20 మంది వరకు జిల్లావ్యాప్తంగా వడదెబ్బకు గురై మరణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు నగరంలో శనివారం 44.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఇదేవిధంగా మరో నాలుగు రోజులపాటు ఎండలు కాయనున్నట్లు వాతావరణ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇళ్లల్లోంచి బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ఒకవేళ తప్పనిసరై బయటకు వచ్చినా సినిమా థియేటర్లు, ఐస్‌క్రీం పార్లర్లలో నగరవాసులు సేద తీరుతున్నారు. ఇటువంటిచోట్ల జనాలు కిక్కిరిసి కనిపిస్తున్నారు. నగరంలోని రోడ్లు మాత్రం పగటిపూట అందులోనూ మధ్యాహ్నం సమయంలో బోసిపోయి దర్శనమిస్తున్నాయి. జిల్లాలోని మెట్ట ప్రాంత మండలాల్లో పల్లెవాసులు ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారు. వృద్ధులు మృత్యువాత పడుతున్నారు. వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కూలీల పరిస్థితయితే చెప్పనలవికాని విధంగా ఉంది. అధిక ఉష్ణోగ్రతలో పనిచేయలేక, పొట్టకూటి కోసం పాటుపడక తప్పనిసరి స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉపాధి కూలీల కోసం ప్రభుత్వం మజ్జిగ చలింద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ రోళ్లు పగిలేలా ఉన్న ఎండల ముందు వారు సేద తీరడంలేదు. దీంతో చాలాచోట్ల ఉపాధి పనులను తెల్లవారుజాము నుంచే ప్రారంభించి మధ్యాహ్నం సమయంలో విరామం ఇస్తున్నారు. ఇప్పటికే ఎండకు తాళలేక పోతున్న జిల్లావాసులకు ఈ పరిస్థితి మరో నాలుగు రోజులపాటు తప్పదనే అధికారుల హెచ్చరికలు మరింత భయం పుట్టిస్తున్నాయి. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటకు వచ్చేందుకు సాహసించడంలేదు. అయితే ఇదే సమయంలో పెళ్లిళ్లకు చివరి ముహూర్తాలు కావడంతో విధిలేని పరిస్థితుల్లో హాజరవుతున్నారు. పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలపై ప్రభుత్వం ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ తగు చర్యలు తీసుకుంటోంది. ఇదిలావుండగా గత నాలుగు రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలిలా ఉన్నాయి. బుధవారం 40 డిగ్రీలు, గురువారం 41, శుక్రవారం 43, శనివారం 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదివారం కూడా 44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఓటర్ల జాబితాను పారదర్శకంగా తయారుచేయాలి
అధికారులకు కలెక్టర్ జానకి ఆదేశం
నెల్లూరుసిటీ, ఏప్రిల్ 23: ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు ప్రక్రియతో పాటు కొత్తగా ఓటర్ల ప్రక్రియ సమర్థవంతంగా నిబంధనల మేరకు నిర్వహించి త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం జానకి తెలిపారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశం హాలులో నెల్లూరుసిటీ, రూరల్ నియోజకవర్గాల పరిధితో ఓటర్ల జాబితా సవరణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నెల్లూరుసిటీ, రూరల్ నియోజకవర్గ పరిధిలో ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిందన్నారు. ఈ సందర్భంగా ఆ నియోజకవర్గ పరిధిలో ట్యాబ్ అప్లికేషన్ ద్వారా ఓటర్ల నమోదు ప్రక్రియ ఆయా పోలింగ్‌స్టేషన్ల పరిధిలోని ఓటర్ల నమోదు, చేర్పులు, మార్పులకు సంబంధించిన వివరాలను కచ్చితంగా ఎలాంటి సమస్యలు లేకుండా పటిష్టంగా ఫారం 6, 8, 8ఏ లలో పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియలో ఆయా పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఉన్న సూపర్‌వైజర్లు, బూత్‌లెవల్ ఆఫీసర్లు సమన్వయంతో నిబంధనల మేరకు సక్రమంగా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రధానంగా పోలింగ్ స్టేషన్ల పరిధి దాటకుండా సూచించిన మ్యాప్‌ల ప్రకారం ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఈ ప్రక్రియలో సూపర్‌వైజర్లు రోజు వారిని పర్యక్షించడంతో పాటు సమీక్షించుకుని సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ఈ ప్రక్రియలో బూత్‌లెవల్ అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మ్యాప్‌లో చూపిన ప్రకారంగా రోడ్ నెంబర్లు గుర్తించి ఓటర్ల జాబితాలో నమోదు చేయాలన్నారు. సూపర్‌వైజర్లు తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ఓటర్ల జాబితా సవరణలో లోటుపాట్లను తెలుసుకుని క్వాలిటీ డేటా వస్తుందన్నారు. అలాగే ఓటర్ల జాబితా తయారుచేసే సిబ్బందికి బూత్‌లెవల్ ఆఫీసర్లకు అవసరమైన శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం సుదర్శన్‌రెడ్డి, నెల్లూరు డివిజనల్ అధికారి వెంకటేశ్వర్లు, నెల్లూరుసిటీ, రూరల్ నియోజకవర్గ పరిధిలోని సూపర్‌వైజర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస
చిల్లకూరు, ఏప్రిల్ 23: మండలంలోని మోమిడి గ్రామంలో 136.94 హెక్టార్లలో ఉన్న భూముల్లో సిలికా తరలించడానికి కుమారస్వామిరెడ్డి మైన్స్ అండ్ మినరల్ అనుమతుల కోసం ఏర్పాటుచేసిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా సాగింది. శనివారం పర్యావరణ పరిరక్షణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రమోద్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ముందుగా మోమిడి గ్రామానికి చెందిన హరికృష్ణారెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగా చింతవరం సర్పంచ్ బుర్లా విష్ణువర్ధన్‌రెడ్డి ఆగ్రహించి హరికృష్ణారెడ్డితో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఒక్కసారిగా సభలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జెసి ఇంతియాజ్ అహ్మద్, గూడూరు సబ్ కలెక్టర్ గిరీషా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్‌జిఓ డి చంద్రవౌళి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం సిలికా తవ్వకాలను చేపట్టాలన్నారు. భారీ యంత్రాలతో సిలికా తవ్వకాలు చేపట్టినందున భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. జెవివి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి మాట్లాడుతూ సిలికా మైన్లన్నీ రద్దుచేసి భూమి లేని నిరుపేదలకు భూములను పంపిణీ చేస్తే సహజ సిద్ధంగా ఏర్పడిన సొనకాలువల ద్వారా నీటిని పంపింగ్ చేసుకుని జీడిమామిడి, చవక, జామాయిల్ పంటలు పండించుకొని ఆర్థికంగా స్థిరపడతారన్నారు. కెఎన్‌పిఎస్ జిల్లా అధ్యక్షుడు కె బాలయ్య మాట్లాడుతూ సిలికా మైన్లలో యంత్రాలు ఉపయోగించరాదన్న నిబంధనలను తుంగలో తొక్కి భారీ యంత్రాలతో సిలికా తవ్వకాలు చేపట్టి అనతికాలంలోనే లక్షలాధికారులుగా ఎదుగుతున్నారన్నారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఎస్సీ, ఎస్టీ భూములు సైతం లీజు కింద తీసుకొని ఆ భూముల్లో 30 అడుగుల మేర తవ్వకాలు చేపడుతున్నారన్నారు. అనంతరం పర్యావరణ కన్వీనర్ ఎన్ జనార్ధన్ మాట్లాడుతూ సిలికా గుంతల్లో అనుభవం లేని వారు స్థానానికి వెళ్లినా, నోరు లేని పశువులు తమ దాహార్తి తీర్చుకొనేందుకు వెళ్లి మృత్యువాత పడుతున్నాయన్నారు. నిబంధనలు పాటించని అన్ని సిలికా మైన్లపై చర్యలు తీసుకోవాలన్నారు. వరగలి, మోమిడి, మనే్నగుంట, చింతవరం సర్పంచ్‌లు వెంకటశేషమ్మ, మూగా శంకరయ్య, ఇరగరాజు సుబ్రహ్మణ్యం, విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ మైన్లలో స్థానిక మహిళలు కూలీలుగా పనిచేస్తూ తమ జీవనాధారం సాగిస్తున్నారన్నారు. ఈ మైన్ల వల్ల శబ్ద, వాయు, నీటి కాలుష్యం సంక్రమించవన్నారు. ఈసందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందుగా 60 మందిని బందోబస్తు నిమిత్తం ఏర్పాటు చేశారు. స్థానిక తహశీల్దార్ ప్రసాద్, సిఐ శ్రీనివాసరెడ్డి సభను పర్యవేక్షించారు. పలువురు చేసిన వ్యాఖ్యలను రికార్డు రూపంలో భద్రపరిచి అనుమతుల కోసం కేంద్రానికి పంపుతామని జెసి ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు.

పిఆర్ కండ్రిగలో అసంపూర్తి పనులు వెంటనే పూర్తిచేయాలి
అన్ని శాఖల అధికారులకు జెసి ఆదేశం
గూడూరు, ఏప్రిల్ 23: సన్‌సద్ ఆధార్ యోజన పథకం కింద క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దత్తత గ్రామమైన పుట్టంరాజువారి కండ్రిగ గ్రామంలో అసంపూర్తిగా మిగిలి ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అహ్మద్ ఆదేశించారు. శనివారం ఆయన గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పిఆర్ కండ్రిగ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అసంపూర్తిగా ఉన్న పనులపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టంరాజువారి కండ్రిగ గ్రామంలో దాదాపుగా వౌలికసదుపాయాలు పూర్తయ్యాయని అన్నారు. గొల్లపల్లి, నెర్నూరు గ్రామాల్లో వౌలిక సదుపాయాలు ఇంకా ఏమైనా చేయాల్సి ఉంటే వెంటనే పూర్తిచేయాలన్నారు. ఈ గ్రామాల్లో ఇంకా ఎక్కడైనా తాగునీటి సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. నెర్నూరు, గొల్లపల్లి గ్రామాలకు నీటి పథకం కింద 89 లక్షల రూపాయలు నిధులు మంజూరయ్యాయన్నారు. ఎన్‌టిఆర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు 248 గృహాలు మంజూరైనట్లు చెప్పారు. ఇప్పటికే పుట్టంరాజువారి కండ్రిగ గ్రామంలో ఎన్‌టిఆర్ పథకం కింద 45 గృహాలు పూర్తయ్యాయన్నారు. దీనదయాళ్ పథకం కింద విద్యుద్దీకరణ పనులు పూర్తయ్యాయిని అన్నారు. గొల్లపల్లి, నెర్నూరు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ పనులు 15 రోజుల్లో పూర్తిచేయాలని ట్రాన్స్‌కో ఎఇని ఆదేశించారు. పుట్టంరాజువారి కంఢ్రిగలో గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లను, చెరువులను వెంటనే పూర్తిచేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వ్యవసాయానికి సంబంధించి అక్కడ తక్కువ విస్తీర్ణంలో భూములు ఉన్నాయన్నారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో 3 అంగనవాడీ కేంద్రాలు నిర్వహిస్తుండగా వాటికి నీటి సౌకర్యం, ప్రహరీ వంటి వాటిని ఏర్పాటు చేయాలన్నారు. కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను పంపాల్సిందిగా ఎంపిడివోను ఆదేశించారు. సర్పంచ్ బుజ్జా నాగేశ్వరరావు ఎస్టీ కాలనీలో కాలువలు దాటేందుకు గ్రావెల్ రోడ్లు వేయించాలని జెసిని కోరారు. ఈ సమావేశంలో గూడూరు సబ్ కలెక్టర్ గిరీషా, ఇతర అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.

భారీగా బురిడీ
ఆత్మకూరు రైతులకు ఇదో దెబ్బ
వెయింగ్ మిషన్, రైస్‌మిల్లర్ల కుమ్మక్కు
ఆత్మకూరు, ఏప్రిల్ 23: గిట్టుబాటు ధర కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునే రైతాంగానికి ఎడాపెడా ఇక్కట్లు ఎదురవుతున్నాయి. శనివారం ఆత్మకూరు సాంబశివ, కామాక్షి వెయింగ్ బ్రిడ్జిల్లో జరుగుతున్న ఘరానా మోసాన్ని రైతులు సాక్ష్యాధారాలతో సహా స్థానిక తహశీల్దార్ బికె వెంకటేశులుకు ఫిర్యాదు చేసిన వైనమిది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధ్రువీకరణ పరీక్ష అనంతరం రైతులు తమ రాశిని వెయింగ్ బ్రిడ్జిలో తూకం వేయించి అక్కడి రసీదును జతపరుస్తూ రైసుమిల్లుకు అందజేయాలి. అయితే ఆత్మకూరు పట్టణం నెల్లూరుపాళెం వద్ద ఉన్న సాంబశివ, కామాక్షి వెయింగ్ బ్రిడ్జిల్లో 22 టన్నుల రాశిని ట్రాక్టర్‌లో తీసుకెళ్లగా, 440 కిలోల వరకు ధాన్యం తేడాను గుర్తించారు. అదే లారీని యధాప్రకారం నెల్లూరు నగరంలోని మరో వెయింగ్‌బ్రిడ్జికి తీసుకెళ్తే 440 కిలోల వరకు అధికంగా వచ్చిందని రైతులు గుర్తించారు. ఇదంతా రైస్‌మిల్లులు, వెయింగ్ బ్రిడ్జి యాజమాన్యం ముందస్తుగా కుమ్కక్కై ఇలా అన్నదాతలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై తహశీల్దార్ విలేఖర్లతో మాట్లాడుతూ దీనికి సంబంధించి తూనికలు, కొలతల శాఖకు సమాచారం అందిస్తామని వివరించారు. ముందుగానే లారీల డ్రైవర్లు తమకు ఐదు వందల రూపాయల మొత్తాన్ని నజరానాగా ఇస్తేనే రైతుల ధాన్యం తరలిస్తామంటూ మొండికేస్తున్నారు. ఆ తరువాత మిల్లుల వద్ద వెళ్లగానే అన్‌లోడ్ చేయకుంటే రోజుకు రెండువేల రూపాయల వంతున రైతుల నుంచి సొమ్ము ఆశిస్తున్నారు. వాస్తవంగా పౌరసరఫరాల శాఖ తరపునే రైతుల పొలాల నుంచి మిల్లులకు తరలించేందుకై రవాణా చార్జీలు అందుతాయని తహశీల్దార్ వివరిస్తున్నారు. అయినాసరే రోజుకు రెండువేలు, డ్రైవర్ 500 రూపాయల మామూళ్లపై కూడా తహశీల్దార్ తప్పుబట్టారు. ఇలా వెయింగ్ బ్రిడ్జిల్లో మోసం ఆ తరువాయి రైసుమిల్లుల యజమానులు బస్తాకు నాలుగు కిలోల వంతున ఆశించడంతోపాటు లారీలకు, డ్రైవర్లకు ఖర్చులన్నీ కలగలిపితే దళారులకే తమ ధాన్యం అమ్ముకోవడం మేలని రైతులు లెక్క తేలుస్తున్నారు. ఈ వ్యవహారమే చాలా సులువుగా ఉంటుందని కూడా దింపుడు కళ్లెం ఆశతో ఆవేదనగా చెబుతున్నారు. తేడాలు పసిగట్టి ఫిర్యాదు చేసిన రైతుల్లో సిరాజ్, పి ఇంద్రసేనారెడ్డి, ఎ రమణయ్య, తదితరులున్నారు.

సంగం బ్యారేజీ పనులను పరిశీలించిన నిపుణుల బృందం
సంగం, ఏప్రిల్ 23: సంగం బ్యారేజీ వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను శనివారం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ నిపుణులు మల్లికార్జున బృందం పరిశీలించింది. క్షేత్రస్థాయిలో ప్రత్యేక పరిశీలనలు చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పరీక్షలు నిర్వహించారు. సంగం బ్యారేజి నిర్మాణం రాష్ట్రంలోనే విభిన్నంగా జరుగుతోందని వారు పేర్కొన్నారు. ఇక్కడ పెన్నా నదిలో 35 మీటర్ల ఇసుకపొరలు మాత్రమే ఉన్నాయని వారు తెలిపారు. రాష్ట్రంలో పలు రకాల నదులున్నాయని వాటిలో పరిమితి స్థాయిలో ఇసుక పొరలున్నాయని అన్నారు. అందుకనుగునంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. నిర్మాణ పనులు నాణ్యతతో జరుగుతున్నాయని తెలిపారు. ఈ బృందం వెంట తెలుగుగంగ ఈఈ రమణ, ఏఇలు ఉన్నారు.

చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
కెవిఐసి సౌత్ జోన్ చైర్మన్ చంద్రవౌళి హామీ
వెంకటగిరి, ఏప్రిల్ 23: వెంకటగిరి ప్రాంతంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని కెవిఐసి సౌత్‌జోన్ చైర్మన్ చంద్రవౌళి తెలిపారు. శనివారం పట్టణంలోని పద్మశాలీ కల్యాణ మండపంలో నేదురుమల్లి ఫౌండేషన్ ఆద్వర్యంలో నిర్వహించిన చేనేత సదస్సుకు చంద్రవౌళి ముఖ్యఅతిధిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ చేనేతల పరిస్థితులు అధ్యయనం చేసి నూతన మార్పులు తీసుకొచ్చేందుకు ఈ సదస్సును ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ పరిస్థితులు అధ్యయనం చేశామని, మగ్గాలను పరిశీలించామని చెప్పారు. చేనేతకు పాత పద్ధతుల్లోనే పూర్తిగా నిమగ్నమైపోయారని దీంతో వారి ఆదాయం కూడా తగ్గుతోందని అన్నారు. నూతన పోకడలు, అధునాతన టెక్నాలజీ అలవర్చుకుంటే చేనేతకు లాభం రెట్టింపుగా ఉంటుందన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పనా పథకం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా చేనేత, చేతివృత్తుల వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వెంకటగిరిలో సిల్క్ క్లస్టర్‌ను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఖాదీ బోర్డు పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. 200 కోట్ల రూపాయల మేర నష్టాల్లో ఉన్నా పట్టించుకునేవారు లేరన్నారు. వెంకటగిరి పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హ్యాండ్‌లూమ్ టెక్నాలజీకి ఆర్‌వో సిస్టమ్‌ను నేదురుమల్లి ఫౌండేషన్ ద్వారా తక్షణమే ఏర్పాటు చేస్తున్నట్లు రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నేదురుమల్లి ఫౌండేషన్ అధ్యక్షులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి, జిల్లా చేనేత సెల్ కన్వీనర్ సుధాకర్, ఆల్ ఇండియా చేనేత సంఘం అధ్యక్షులు చక్రదారి, స్థానిక నాయకులు ఎల్ కోటేశ్వరరావు, కాల్తిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పులి ప్రసాద్‌రెడ్డి, రాజారెడ్డి, శ్రీహరికోట కృష్ణయ్య, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

ఎంత ధాన్యమైనా కొనుగోలు చేస్తాం
జెసి ఇంతియాజ్ అహ్మద్ వెల్లడి
మనుబోలు, ఏప్రిల్ 23: జిల్లాలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి 1.20 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేశామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహమ్మద్ వెల్లడించారు. శనివారం ఆయన స్ధానిక పిఏసిఎస్‌లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే జిల్లాలో ఆత్యధిక స్థాయిలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఎంత ధాన్యమైన కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో 168 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మిల్లర్ల వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులతోపాటు మరో ఐదుగురు డిప్యూటీ తహశీల్దార్లతో కలిసి స్పెషల్ టాస్క్ఫోర్స్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. రైతులు మిల్లర్ల వద్ద ఇబ్బందులు పడుతుంటే కంట్రోల్ రూం నెం. 2306651 ఫోన్‌కు సమాచారం అందిస్తే వెంటనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు కెవి రమణయ్య, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు చిట్టమూరు వెంకటశేషారెడ్డి, ఉపసర్పంచ్ దండు చంద్రశేఖర్‌రెడ్డి, విఆర్‌వో నాగార్జునరెడ్డి, సిఇఓ చెంచుఓబులు తదితరులు పాల్గొన్నారు.