రాష్ట్రీయం

ఇక నిరంతర విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్షణంకూడా ఆగడానికి వీల్లేదు
అమెరికా తరహాలో సరఫరా
పరిశ్రమలకు ప్రత్యేక హెచ్‌టి లైన్లు
అధికారులను ఆదేశించిన సిఎం బాబు

హైదరాబాద్, నవంబర్ 23: రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిరాటంకంగా సాగాలని, క్షణం కూడా అంతరాయం కలిగేందుకు వీల్లేదని ఇంధన శాఖ అధికారులను సిఎం చంద్రబాబు ఆదేశించారు. కొత్త రాష్ట్రం, కొత్త రాజధానిలో అన్ని రంగాలు అంతర్జాతీయస్థాయిలో ఉండాలని, పోటీతత్వంతో పనిచేయాలని సూచించారు. విజయవాడలో ఒకటి రెండు రోజుల్లో జరగనున్న అత్యున్నతస్థాయి సమావేశంలో ఇంధన శాఖ పనితీరు, భవిష్యత్ లక్ష్యాలపై సమీక్షించనున్నారు. ఈ సమీక్షలో విద్యుత్ సామర్థ్యం, సంప్రదాయేతర ఇంధన వనరులు, డిస్కమ్‌లకు లబ్దిచేకూర్చే ‘ఉదయ్’ పథకం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ విద్యుద్ధీకరణ పథకం, జైకా, ప్రపంచ బ్యాంకు రుణాలపై చంద్రబాబు సమీక్షిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంధన రంగాభివృద్ధి, సేవల విషయంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. నవ్యాంధ్రలో పరిశ్రమలు రావాలన్నా, వాణిజ్యపరంగా వృద్ధి సాధించాలన్నా నిరంతర విద్యుత్‌తో పాటు అంతర్జాతీయస్థాయిలో అత్యంత నాణ్యమైన విద్యుత్ అందించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అమెరికాలో విద్యుత్ ప్రసార, పంపిణీ తీరును అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అమెరికాలో నిరంతర విద్యుత్ సరఫరా ఉంటుందని, ఎప్పుడైనా విద్యుత్ అంతరాయం ఏర్పడేది క్షణకాలమేనని, కరెంటు పోయిందన్న ధ్యాసలోకి వచ్చేలోగానే వచ్చేస్తుందని సిఎం చెప్పుకొచ్చారు. ఆవిధంగా విద్యుత్ పంపిణీ జరగాలంటే పోటీతత్వం పెరగాలన్నారు. విద్యుదుత్పత్తి, పంపిణీ ప్రసారాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలన్నారు. ఈ దిశగా ప్రణాళికలు రూపొందించి అమలు చేసేందుకు ప్రయత్నాలు చేయాలని, సరికొత్త కార్యాచరణ సిద్ధం చేయాలని సిఎం ఆదేశించారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే విద్యుత్ మిగులు సాధించి, కోరినవెంటనే నాణ్యమైన విద్యుత్ అందించేస్థాయికి చేరుకోవాలని సూచించారు. విద్యుత్ పంపిణీ, ప్రసారాల్లో నష్టాలను మరింతగా సింగిల్ డిజిట్‌కు తగ్గించుకోవాలని సూచించారు. అన్ని రంగాల్లోనూ రెండంకెల వృద్ధి సాధించేందుకు కృషి చేస్తున్నట్టుగానే విద్యుత్ రంగంలోనూ ఇదే వృద్ధి సాధించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే 24 గంటలూ విద్యుత్ ఇస్తున్న రాష్టమ్రే కదా అని చైనా, జపాన్, సింగపూర్, మలేషియా దేశాల పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు ఉన్న సమయంలో నిరంతర విద్యుత్ పథకాన్ని ప్రారంభించి దేశానికే ఆదర్శప్రాయంగా 24 గంటల విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఇదంతా అధికారుల కృషి ఫలితమేనని పేర్కొన్నారు. విద్యుత్ రంగాన్ని సుస్థిరం చేసేందుకు ఒక మహాయజ్ఞం చేపడుతున్నట్టుగా రేయింబవళ్లు శ్రమించాలన్నారు. మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీలతోపాటు విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం, విజయవాడ, శ్రీసిటీ, అన్ని హెచ్‌టి లైన్లు, అత్యధిక విలువలు కలిగి పరిశ్రమలు, ప్రధాన నగరాలు, ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అంచెలంచెలుగా నూరుశాతం అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
ప్రపంచబ్యాంకు ఆంధ్రలో వౌలిక సదుపాయాల కల్పనకు 3200 కోట్ల ఆర్ధిక రుణ సాయం అందించేందుకు అంగీకరించారని, అదనంగా 750 కోట్లతో విశాఖ నగరంలో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ నిర్మాణానికి ఖర్చు చేస్తున్నట్టు ఇంధన పెట్టుబడులు కార్యదర్శి అజయ్ జైన్ చెప్పారు. ఈ ఆర్థిక సాయానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు సానుకూల స్పందన వచ్చిందని పేర్కొన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థకు సంబంధించి వౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోందని, దీన్ దయాళ్ గ్రామజ్యోతి పథకం ద్వారా 950 కోట్లు, సమీకృత విద్యుత్ అభివృద్ధి పథకం ద్వారా 650 కోట్లు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ రంగ అభివృద్ధికి ఈ నిధులు వెచ్చించనున్నట్టు అజయ్ జైన్ తెలిపారు. కేంద్ర పథకాల్లో భాగంగా మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర సాయాన్ని 60 శాతం గ్రాంట్‌గా, మిగిలిన 40 శాతం రుణం రూపంలో అందుతోందని జైన్ వివరించారు. పెండింగ్‌లో ఉన్న హెచ్‌టి-ఎల్‌టి కనెక్షన్ల దరఖాస్తులను వెంటనే మంజూరు చేయాలని డిస్కాంలను సిఎం ఆదేశించారు. ఇంతవరకూ 500 మెగావాట్ల లోడ్‌కు సంబంధించిన హెచ్‌టి కనెక్షన్ల దరఖాస్తులు 1932 పెండింగ్‌లో ఉండగా, వీటిని యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేస్తున్నట్టు కూడా జైన్ చెప్పారు.