ప్రకాశం

జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 11 : జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంపొందించేందుకు, జర్నలిజం విలువలను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రెస్‌అకాడమీ కృషి చేస్తుందని ఆ అకాడమి చైర్మన్ వి వాసుదేవదీక్షితులు తెలిపారు. గురువారం స్థానిక ఐఎంఎ హాలులో రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టులతో ముఖాముఖి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ పదో షెడ్యూల్‌లో ఉందని, రాష్ట్ర విభజన వలన అకాడమీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం అకాడమీ కార్యాలయం హైదరాబాద్‌లో ఉందని, త్వరలో విజయవాడకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కడప, కర్నూల్ జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పర్యటించి ప్రెస్ అకాడమీ తరపున తొలి పరిచయ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జర్నలిస్టులు ఎంతో అదృష్టవంతులని, 1967లో తాను జర్నలిజం వృత్తిలో చేరినప్పుడు ఏ కోర్సు లేదని, ఏ పత్రికలో చేరితే అదే విశ్వ విద్యాలయం అని, సీనియర్లే ప్రిన్సిపాల్స్ అని, ఉపాధ్యాయులని, పత్రికా రచన వారి నుండే నేర్చుకున్నామన్నారు. తాను జర్నలిజంలో రావడానికి కారణం ప్రకాశం జిల్లా వాసి సాహితీవేత్త నీలంరాజు వెంకటశేషయ్య గారని గుర్తుకు తెచ్చుకున్నారు. సంచలన వార్తలు ముఖ్యం కాదని, సమాజంలో చలనం కలిగించే వార్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్బోధించారు. ప్రతి జర్నలిస్టు అక్షర దోషాలు లేకుండా వార్తలు రాయాలని, ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలన్నారు. త్వరలో జర్నలిస్టులకు పునఃశ్చరణ శిక్షణా తరగతులు, సెమినార్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అలాగే జర్నలిస్టులకు సంబంధించిన వివిధ రకాల పుస్తకాలు ప్రచురించి అందజేస్తామన్నారు. పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం లేదని, ఎంత వరకు చొచ్చుకుపోయి ప్రభావం చూపిందో ముఖ్యమన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందించి విజయవంతం చేయాలన్నారు. రచన జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్ ఆర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పత్రికా రంగానికి రాష్ట్ర ప్రెస్ అకాడమీ అందజేస్తున్న సేవలు చాలా గొప్పవన్నారు. చాలా రాష్ట్రాల్లో ప్రెస్ అకాడమీలు లేవన్నారు. జర్నలిజం వృత్తిలో 50 సంవత్సరాలు అనుభవం కలిగిన వాసుదేవ దీక్షితులు ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించడం జర్నలిస్టులకే గర్వకారణమన్నారు. సాహితీ విలువలు కలిగిన వ్యక్తి అధ్యక్షులు కావడంతో వారి మార్గ నిర్దేశంలో జర్నలిస్టులు నైపుణ్యాలు పెంపొందించుకోగలరన్నారు. వార్తలు నాణ్యతగా ఉండాలని, సబ్‌ఎడిటర్ చాలా బాధ్యతగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని స్వయంకృత తప్పులు దొర్లకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుందన్నారు. ఒక వార్త సబ్‌ఎడిటర్ చేత ఎలాంటి మార్పు లేకుండా ప్రచురితమైన విలేఖరి అంతబాగా రాసినట్లు లెక్కని చెప్పారు. గ్రామీణస్థాయి విలేఖరులు విలువలతో కూడిన నైపుణ్యం సంపాదించకోవడానికి ప్రెస్ అకాడమీ శిక్షణ తరగతులు నిర్వహిస్తుందని, ఆ అవకాశాలు అంది పుచ్చుకుని పైకి ఎదగాలన్నారు. పత్రికా చట్టం గురించి కూడా తెలుసుకుని వృత్తిని కాపాడుకోవాలన్నారు. జర్నలిజం వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను సాధించేందు కోసం అకాడమి శిక్షణ నిస్తొందన్నారు. డాక్టరు కన్నా జర్నలిస్టు వృత్తి ఎంతో పవిత్రమైనదని జర్నలిస్టు ఒక్కసారి తప్పు చేసినా సమాజం యావత్తు దెబ్బతింటుందని, సున్నితమైన బంధాలు తెగిపోకుండా వార్తలు ప్రచురితం కావాలన్నారు. అందుకే వార్తలు రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలన్నారు. జర్నలిస్టులు సమాజానికి మార్గదర్శకులుగా పనిచేస్తున్నారన్నారు. జర్నలిస్టులు మారుతున్న కాలానుగుణంగా విజ్ఞానాన్ని అవగాహన ను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా వివిధ జర్నలిస్టు సంఘాలు ప్రతినిధులు జర్నలిస్టుల సమస్యలపై అకాడమీ చైర్మన్‌కు విజ్ఞాపన పత్రాలు అందజేశారు. అనంతరం చైర్మన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ కార్యదర్శి డి శ్రీనివాస్, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఎన్ వెంకటేష్ , సహాయ సంచాలకులు ఎం వెంకటేశ్వర ప్రసాద్ , పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.