ప్రకాశం

రాబోయే రెండురోజుల్లో తీవ్ర వడగాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 14: జిల్లాలో రాబోయే రెండురోజుల్లో ఎండ తీవ్రత, వడగాల్పులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చూడాలని జిల్లా కలెక్టర్ వి వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం స్థానిక సిపిఒ కాన్ఫరెన్స్‌హాలులో వడగాలులు, ఎండ తీవ్రతపై జిల్లా రెవెన్యూఅధికారి ఎన్ ప్రభాకర్‌రెడ్డి, సిపిఒ కెటి వెంకయ్యలతోకలిసి ఆయన నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు, డ్వామా, డిఆర్‌డిఎ, జడ్‌పి సిఇఒ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఎంపిడిఒలు, తహశీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లతో సుదీర్ఘంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆదివారం కందుకూరులో అత్యధికంగా 44.74 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్నారు. మార్టూరులో 44.56 డిగ్రీలు, సంతనూతలపాడులో 44.06, పొదిలిలో 44. 05డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయన్నారు. రానున్న రెండురోజులు కూడా అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ఉండే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియచేసి అప్రమత్తం చేయాలని సూచించారు. మధ్యాహ్నం 12గంటల నుండి సాయంత్రం నాలుగుగంటల వరకు ఎవరు రహదారులమీదకు రాకుండా, బయట ఎండలో తిరగకుండా చూడాలన్నారు. ప్రధానంగా పిల్లలు, వృద్ధులు, రోగులు వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాల్సివస్తే వెంట గొడుగు, మంచినీరు తీసుకుని వెళ్లాలన్నారు. సమీపంలోని చలివేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. ఎండతీవ్రత గురించి విలేఖర్లకు కూడా తెలియచేసి వారివారి సహకారాన్ని తీసుకోవాలన్నారు. చలివేంద్రాలను ఏర్పాటు చేసి మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలన్నారు. ముఖ్యంగా పట్టణాలు, ఎక్కువుగా జనసంచారం ఉండే మేజర్ పంచాయతీల్లో ప్రధాన కూడళ్ళల్లో చలివేంద్రాలను ఏర్పాటుచేయాలన్నారు. గ్రామపంచాయతీల్లో అన్ని మంచినీటి పథకాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా సరే ఎవరైనా ఒంటిలో నీరు కోల్పోయికాని, అత్యధికవేడివలన కాని వడదెబ్బవలనకాని ప్రమాదానికి గురైతే సంబంధిత బాధ్యులను సస్పెండ్ చేయటం ఖాయమన్నారు. విధినిర్వహణలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అన్ని ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు, ఉపకేంద్రాల్లో కావాల్సిన మందులు, ఒఆర్‌ఎస్ ప్యాకెట్లు, ఐవి ఫ్లూయిడ్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డాక్టర్లు లేనందున ఏమైనా అనుకోని సంఘటనలు జరిగితే మాత్రం బాధ్యులైన వారిపై క్రిమినల్‌కేసులు బనాయిస్తామని హెచ్చరించారు. ఆశాకార్యకర్తలు, ఎఎన్‌ఎంలు, ఆరోగ్యపర్యవేక్షకులు తదితర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ముందు ఉండి వడదెబ్బ తగిలిన వ్యక్తులకు సరైన వైద్యాన్ని సకాలంలో అందించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఉపాధికూలీలు ఎండబారినపడకుండా చూడాలని సూచించారు. కూలీలకు అందుబాటులో నీడనిచ్చే షెల్టర్లు, మంచినీరు, ఎలక్టోరల్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. మజ్జిగ ప్యాకెట్లు సోమవారం ఉదయం పదిగంటలకు కూలీలకు తప్పనిసరిగా పంపిణీకావాలన్నారు. వడదెబ్బవలన కూలీలకు ఏమి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉదయం త్వరగా పనులకు వచ్చి త్వరగా ముగించాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు టెలికాన్పరెన్స్ ద్వారా ఆదివారం సాయంత్రమే అప్రమత్తం చేసి పట్టణాలు, గ్రామాల్లో వేడిగాలులు, ఎండతీవ్రతపై వేగంగా సమాచారం అందరికి చేరవేయాలన్నారు. తోపుడుబండ్లు, సైకిల్, మోటారుమెకానిక్‌లు తదితర అసంఘటిత కార్మికులను కూడా ఎండతీవ్రతపై అప్రమత్తం చేయాలన్నారు. సంబంధిత యాజమాన్యాలతో మాట్లాడి కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో డ్వామా, డిఆర్‌డిఎ, మెప్మా పిడిలు పోలప్ప, మురళీ, అన్నపూర్ణమ్మ, ఒంగోలు, కందుకూరు, మార్కాపురం ఆర్‌డిఒలు శ్రీనివాసరావు, మల్లికార్జున్, కొండయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జె యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు.