అమృత వర్షిణి
మనుజుడై ఫలమేది! మరి జ్ఞానిదాక! (అమృతవర్షణి)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వాల్మీకి రామాయణం ఎవరో ఓ మహారాజు చరిత్రలా వుండి వుంటే ఈపాటికి జనం ఆ కథను మరిచిపోయి ఉండేవారు. కానీ రామాయణం ఒక ఆధ్యాత్మిక జ్ఞాననిధి. కాబట్టే పరమ శాశ్వతమైన మహా కావ్యమయింది.
ముఖ్యంగా త్యాగయ్య తరించడానికి కారణం రామకథే. సంగీత మూర్తిత్రయంలో త్యాగరాజు అనుసరించిన మార్గమే చాలా భిన్నం.
మిగిలిన యిద్దరూ ఉపాసనా మార్గంలో నడిస్తే త్యాగయ్య మాత్రం తనని తాను ఉద్ధరించుకుంటూ మనల్ని ఉద్ధరించే ప్రయత్నం చేశాడు. ఆయన కీర్తనల అంతరార్థం పూర్తిగా తెలియకపోయినా, వాటిలోని రాగమాధుర్యానికి లొంగిపోయిన తమిళ విద్వాంసులు ఆయన్ని అందలమెక్కించుకుని పరవశించి పాడేశారు. సంగీతానికి భాషా భేదం లేదని మాతృభాష కాకపోవటం వల్ల చెదురుమదురుగా ఉచ్ఛారణలో దోషాలున్నా శ్రోతలు పట్టించుకోలేదు. కానీ పద్యానికైనా, పాటకైనా కొన్ని విరుపులుంటాయి. కొన్ని మాటలు ఏకబిగిని కలిపి పాడాలి. మరికొన్ని విడిగా పాడాలి. భాష తెలిసిన వారికి మాత్రమే యిందులోని మర్మం అర్థమవుతుంది.
బమ్మెర పోతరాజు తర్వాత తెలుగు సాహిత్యానికి భక్తి భాగ్య సమృద్ధిని పుష్కలంగా అందించిన మహానుభావుడు త్యాగరాజు. పోతన తన గద్య పద్యాలతో ఎటువంటి భక్తిని ప్రదర్శించాడో త్యాగయ్య కూడా అటువంటి స్థితినే దర్శించాడు’ అనటానికి ఆయన కీర్తనలే సాక్ష్యం.
రామాయణంలోని పాత్రలన్నీ త్యాగయ్య దర్శించాడు కాబట్టే ప్రతి పాత్రా జీవంతో నిండి, కీర్తన రూపంలో వెలువడింది.
కీర్తన అంటే రాగభావంతో నిండిన సంగతులూ, విద్వత్ప్రదర్శన కోసం చేసే నెఱవు, ఒక్కోచోట మాటలను పదేపదే పాడుతూ స్వరకల్పనాది విన్యాసాలతో ఆ కీర్తనలను నింపేయటంతో త్యాగరాజు ఆత్మ విచారమేమిటో లోకానికి తెలియలేదనే అభిప్రాయం ఉంది.
కానీ సుతిమెత్తగా చెప్పే విషయాలు, అవసరమైన చోట మోతాదుకు మించి, చెంప ఛెళ్లుమనేలా మందలించటం లాంటివెన్నో త్యాగయ్య కీర్తనల్లో కనిపిస్తాయి.
గానం చేస్తూ ఈ భావాలను ఆవిష్కరించడం కష్టం. దీనికి చాలా పరిణతితో కూడిన సంగీత జ్ఞానం అవసరం.
పూర్తిగా రాగం మీదనే దృష్టి పెట్టకుండా, ఈ విషయంలో సాహిత్య భావం హృదయానికి చేరువ చేయటంలో డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి విద్వాంసులు కృతకృత్యులయ్యారు. ఆ కీర్తనల్లోని సంప్రదాయ సంగీత మాధుర్యాన్ని పండితులకూ, పామరులకూ పంచారు. సంగీత లోకంలో ఆయనకు బాగా కీర్తి రావడానికి యిదో కారణం. వేలాది త్యాగరాజ కీర్తనలలో మనసును సంబోధించే కీర్తనలు ఎక్కువ. చెవిటి వాళ్లకు ఉపదేశాలిస్తే ఎంత ప్రయోజనమో రాముణ్ణి తలుచుకోకుండా విషయ లంపటాల్లో చిక్కుకుంటే అంతే ప్రయోజనమని మందలిస్తాడు త్యాగయ్య.
యిలా ప్రతి కీర్తనలోనూ అనాహతమైన ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది కాబట్టే ఆ కీర్తనలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. నాదానుభవం, రాగానుభవాలతోబాటు అర్థానుభవం కూడా సమకూడితే అది దివ్యమైన గానమవుతుంది. అటువంటి గాయకులు చాలా అరుదుగా ఉంటారు.
మనసా! ఆలోచించు! కాసేపు స్థిమితంగా కూర్చుని ఏకాగ్రమైన మనసుతో, నిశ్చల బుద్ధితో పరమాత్మ ధ్యానం చేయలేవా?
గుళ్లూ గోపురాలంటావ్! తీర్థయాత్రలంటావ్! పోనీ అక్కడైనా మనస్సును నియంత్రించుకో గలుగుతున్నావా? అంటే అదీ లేదు. ఎందుకీ చపలత్వం? జపమంటావ్! తపమంటావ్ పూజలంటావ్!
ఎదురుగా బుట్టల కొద్దీ పువ్వులుంటాయి - తట్టల కొద్దీ ఆలోచనలతో వుంటావ్? నిన్ను పుట్టించి, ఈ భూమీద వదిలిన వాడు నీ గురించి ఆలోచించకుండా ఉంటాడా? చెప్పు?
‘మనసునిల్ప శక్తి లేకపోతే, మధుర ఘంట విరుల పూజేమి చేయును?’ అనే కీర్తనలో త్యాగయ్య పడే ఆవేదన ఇదే.
సంకల్ప వికల్పాలకు నిలయం మనస్సు. స్థిరత్వం లేని మనసు మీద అదుపు లేకపోతే చేసేదంతా వృథాయే!
ఎంతో నిగ్రహంగా ఉంటూ నియంత్రణతో కూడిన జీవితాన్ని గడుపుదామనుకునే వాళ్లకే అనేక విఘ్నాలు.
ఎప్పటికప్పుడు హెచ్చరిక చేస్తూ పోతే తప్ప మనస్సు ఓ పట్టాన లొంగదు. మనసును సంబోధించి పాడుకున్న త్యాగరాజ కీర్తనలన్నీ వేటికవే సాటి.
నయానా, భయానా చెప్తే తప్ప లొంగని మనస్సు చేసే వికారాలను ఆయన వర్ణించినట్లు మరే వాగ్గేయకారుడూ వర్ణించలేదేమో! పైగా ఉన్నదున్నట్లు చెప్పటం ఆయనకే తగు!
చంచలంగా పరుగెట్టే మనస్సును అరికట్టగలగడమే ధ్యానం. అదే యోగం. చేయకూడనివి చేస్తూ (చేయవలసినవి ప్రక్కనబెట్టి) క్రొవ్వెక్కి, నా అంతటివాడు లేడని, వేలు ఖర్చు పెట్టి తీర్థయాత్రల పేరుతో పుణ్య క్షేత్రాలన్నీ తిరుగుతూ కనిపించిన పుణ్యనదుల్లో ముక్కుముంచి స్నానం చేస్తే వస్తుందా ఫలితం?
చిత్తవృత్తి నిరోధమే ఓ పెద్ద తపస్సు. శుభకార్యాల్లోనూ లేదా యజ్ఞ యాగాది క్రతువుల్లోనూ భార్యాభర్తలిద్దరూ పీటల మీద కూర్చునే సంకల్పం చేస్తారు. పక్కనే కూర్చున్న భార్యకు తప్పుడు ఆలోచనలుంటే కర్తకు పుణ్యకార్యం చేసిన ఫలితం దక్కుతుందా?
జీవితానిక్కావలసిన కనీసావరాలను కూడా వదిలేసి ఏ చెట్టు కిందో వుంటూ, ఏ తల్లి పెట్టిన పదార్థమో తింటూ, చలిని తట్టుకోవడానికి ఎండలో నిలబడో, చితుకులతో మంటలు వేసుకుని ముడుచుకుని కూర్చున్న సన్యాసిని కూడా ఆశాపాశం వదలదు.
ఆత్మజ్ఞానం లేని సన్యాసులకే యిది వర్తిస్తుంది. అలాంటి వాళ్లకు అప్పుడప్పుడు సన్యాసం తీసుకున్నందుకు పశ్చాత్తాపం కలుగుతూంటుంది.
తన వయసులో వున్న మనిషి అనుభవించే సుఖం చూసి అసూయ పుడ్తుంది. కోరికలు లేస్తాయి. అణచుకోవడం వల్ల అవి యింకా పెరుగుతాయి. అందుకే కోరికల్ని దగ్గరకు రానీయకుండా జాగ్రత్త పడాలి. అలౌకికమైన సుఖాన్ని ఒక్క వైరాగ్యమే యిస్తుందంటూ లోకహితం కోరి చెప్పే మాటలీ కీర్తనలో కనిపిస్తాయి.
ఎంత నిగ్రహిద్దామన్నా లొంగని ఇంద్రియాలను అభ్యాస వైరాగ్యంతోనే లొంగతీసుకోవాలంటాడు. సంగీతమూర్తిత్రయంలో త్యాగయ్య ఒక్కడే సంగీతాన్ని ఆధ్యాత్మికంగా దర్శించి కళగా ప్రదర్శించారు. సంగీతాన్ని శాస్త్రంగా దీక్షితర్ దర్శించాడు. శ్యామశాస్ర్తీ దేవీ ఉపాసకుడు.
సంగీతానికి ‘గ్రామర్’ శరీరమనుకుంటే ‘నాదం’ ఆ శరీరానికి ఆత్మ. మనస్సు, ఆత్మ వేరువేరు పదార్థాలు. సత్సంకల్పానికీ, దుస్సంకల్పానికీ మనస్సే కారణం. ఆచరణలో పెట్టేది శరీరం. అందుకే త్యాగయ్య మనస్సును వేరు చేసి తనను ఆత్మగా భావించాడు. జాగ్రత్త పడమని హెచ్చరించాడు. కోరికలు నెరవేరకపోతే విజృంభించే కోపతాపాలన్నీ లోపలే ఉంటాయి. పైకి మాత్రం ఏమీ తెలియనట్లుగా నటన. అందుకే.. అనుపల్లవిలో
‘ఘనదుర్మదుడై తామునిగితే
కావేరి మందాకిని ఎటుబ్రోచును?’
అంటూ రెండు వాక్యాల్లో తేల్చి చెప్పేశాడు.
యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం లోపిస్తే మనిషి ఎవరి మాటనూ లక్ష్యపెట్టడు. ఉన్న మాటంటే అందరికీ ఉడుకే. కానీ దాపరికం లేకుండా చెప్పగలిగినవాడు త్యాగయ్య.
న్యాయాన్యాయాలు అందరికీ తెలుసు. కానీ ఆచరణలో కనిపించవు. వుంటే న్యాయస్థానాలు అవసరం లేదు. సున్నితంగా మందలిస్తూ సాగిన ఈ కీర్తనలో త్యాగయ్య మనోభావాన్ని గ్రహిస్తూ పాడగలగాలి. ఆ భావం ఆవిష్కరింపబడాలి.
పల్లవిలో అనుపల్లవిలో ఎన్ని సంగతులున్నాయి? ఎనే్నసి గమకాలు పలికించాలి? (కేవలం విద్వత్ప్రదర్శన కోసం) ఏయే మాటలను చిత్ర విచిత్ర విన్యాసాలతో నింపాలి? అనే భావంతో కాకుండా త్యాగయ్య మనోవేదనను ఆవిష్కరించే దిశగా వుండాలి. అలా గానముంటే చాలు. ఆయన లక్ష్యం నెరవేరినట్లే?
శోభిల్లే సప్త స్వర సుందరులను దర్శించిన మహానుభావుడు త్యాగయ్య.
ఆయన పాడినవన్నీ కేవలం పొడిపొడిగా వున్న స్వరాలు కాదు - సుందరమైన దేవతలు. నాభి నుంచి బయల్దేరి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ దశలన్నీ దాటి, వైఖరియే వాక్కుగా మారి భగవంతుడి అనుగ్రహంతో పాటగా రూపాంతరం చెంది, హృదయాంతర్గతమైన సంస్కారాన్ని మేలుకొల్పే దిశగా పరిణమించి కీర్తన రూపం దాల్చి, త్యాగరాజ కీర్తనగా భాసిల్లింది.
ఒక ‘నగ’ తళతళమని మెరిసిపోతూ కనిపించడానికి కారణం దానిని చెక్కబడిన తీరు, అంత చక్కగా తన శిష్యులను కూడా అలాగే తీర్చిదిద్దిన త్యాగరాజు, కారణజన్ముడు కాదా మరి? అంతే కాదు.
సంగీతమే నరాకృతియై శ్రీరాముడి రూపమైందని నిరూపించాడు. రాముడి కోదండానికి అమర్చిన గంటలు ఏడు. ఆయన కోదండమే రాగం.
రాగానికి నిర్దిష్టమైన గమనం ఉంటుంది. అలాగే రాముడు కోదండానికి అమర్చిన వింటి నారికి కూడా తుర, నయము, దౌశ్యము అని మూడు గుణాలున్నాయి. ఈ కూర్పులన్నీ రాముడి గుణాలుగా త్యాగయ్య దర్శించాడు. నామ కుసుమాలతో అర్చించి తరించాడు. జ్ఞానియై భాసిల్లాడు.
కొన్ని మాటలకు అనేక అర్థాలుంటాయి. ఆ సందర్భాన్ని గ్రహిస్తూ గానంలో ఆ అర్థాన్ని ప్రతిబింబించేలా గమకాలు పలకవలసి ఉంటుంది.
‘అర్కం’ అంటే జిల్లేడుకు అర్థం. సూర్యుణ్ణి కూడా అలాగే పిలుస్తారు.
యిలా గానం చేస్తున్నప్పుడు ఉచ్చరించే మాటల్లోని పరమార్థాన్ని గ్రహించి పాడితేనే ఆ విద్వాంసుడికి తగిన గౌరవం లభిస్తుంది.
మాతృభాష తెలుగు కాకపోయినా, త్యాగరాజ కీర్తనల సాహిత్యంలోని భావాన్ని విజ్ఞులను అడిగి తెలుసుకుంటూ ఏ మాటను ఎక్కడ విరిచి పాడాలో అలా పాడుతూ, పరమానందంగా పరవశిస్తూ, పాడిన కర్ణాటక సంగీత విద్వాంసురాలు భారతరత్న శ్రీమతి సుబ్బులక్ష్మి - రాగభావం, శృతి శుద్ధత, ఒక్కటే కాదు. త్యాగరాజు హృదయాన్ని తన గానంలో ఆవిష్కరింపజేస్తూ, జనరంజకంగా పాడిన విదుషీమణి ఆమె.
సంగీతమూర్తి త్రయంలో ‘సద్గురువు’ అనే మాట త్యాగయ్యకే వర్తిస్తుందనేది పరమ సత్యం. ఆయన కీర్తనలలో సాహిత్య భావాన్ని అర్థం చేసుకుంటూ సంగీతాన్ని ఆస్వాదించాలి.
సాహిత్యమంతమైన చోట సంగీతం ఆరంభవౌతుంది. సాహిత్య రసభావ అనుసరణాత్మకమైనదే.. ఆపాత మధురమైన సంగీతానందం.
తలపులకు తలుపులుండవు. ఆశలకు ద్వారాలుండవు. క్షణం విరామం లేకుండా ఏవేవో ఆకాశ హర్మ్యాలే. దీనికి పెట్టుబడి అక్కర్లేదు. ఎటొచ్చీ క్షణం తిరిగిరాని బంగారం లాంటి కాలం మాత్రం గాలిపాలు.
వీటికి తుదా లేదు. మొదలూ లేదు. తస్మాత్! జాగ్రత్త! అని హెచ్చరించిన సద్గురువే.. త్యాగరాజు.