అమృత వర్షిణి

సకల జన సమ్మోదిని.. ఆకాశవాణి భక్తిరంజని (‘అమతృవర్షిణి’)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బహుజన హితాయ, బహుజన సుఖాయ..’ ఆకాశవాణి లోగోలో కనిపించే మాటలు. గత శతాబ్దపు ఐదో దశలో తెలుగుదేశానికి మరపురాని దశకు కారణం అప్పటి ఆకాశవాణి సంగీత వైభవమే. అందులో ముఖ్యంగా భక్తిరంజని.
నిజానికి ఆ కార్యక్రమాన్ని భక్తిరజని అనాలని చాలామంది అనుకునేవారు. కారణం ఆ వైభవానికి మూల పురుషుడు డా.బాలాంత్రపు రజనీకాంతరావు. రేడియో భాషలో ప్రసార ప్రారంభంలో ఉదయం వినిపించే వాద్య సంగీతాన్ని ‘సిగ్నేచర్ ట్యూన్’ 1934 సం.లో నాజీల నుండి భారతదేశం వచ్చి చేరిన యూదు శరణార్థులలో భారతీయ సంగీతానికి ఆకర్షితుడైన ఓ సంగీత ప్రయోక్త ‘సెజ్‌మన్ వాల్టర్ కాఫ్‌మన్’ కంపోజ్ చేశాడు. తంబురా శ్రుతిలో శివరంజని రాగంలోని ఈ ట్యూన్ వయొలిన్‌పై వినిపించిన కళాకారుడు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన జుబెన్ మెహతా తండ్రి. ఆ తర్వాత ప్రారంభమయ్యే మొదటి కార్యక్రమం ‘్భక్తిరంజని’.
1948లో విజయవాడ రేడియో కేంద్రం ఆవిర్భవించిన తర్వాత సంగీత సాహిత్య కోవిదులెందరో ఈ కేంద్ర ప్రాభవానికి తమ వంతు కృషి చేశారు.
తెల్లవారేసరికి ఆ రోజుల్లో ప్రతి యింట్లోనూ, బయట కాఫీ హోటళ్లలోనూ భక్తరంజని పాటలే చెవుల్లో గింగుర్లెత్తించేవి.
తూము నరసింహదాసు, ప్రయాగ రంగదాసు (బాలమురళీ కృష్ణ మాతామహుడు), నరసదాసు, నారాయణతీర్థులు, రామదాసు, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు, హనుమాన్ చాలీసా, సూర్యస్తుతి మొదలైనవి శ్రోతలకు అత్యంత ప్రియమవుతూ, మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉండేవి.
ధనుర్మాసంలో డాక్టర్ మంగళంపల్లి, శ్రీరంగం గోపాలరత్నం పాడిన తిరుప్పావై, సప్తపది ఎంత ప్రసిద్ధి చెందినదో అందరికీ తెలుసు. ప్రభాతవేళ ఈ పాశురాలు చెవిని పడుతూంటే శ్రీరంగంలో స్వామి ఎదురుగా కూర్చున్న అనుభూతి కల్గుతుంది. ప్రతిరోజూ వోలేటి వెంకటేశ్వర్లు గానం చేసిన హనుమాన్ చాలీసా, పెమ్మరాజు సూర్యారావు, ఎం.వి.రమణమూర్తి పాడిన సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు ‘సర్వం బ్రహ్మమయం, నహిరే నహి శంక, భజరే గోపాలం’ ఎప్పుడు విన్నా మొదటిసారి విన్నట్లు అనిపించడం ఓ దివ్యమైన అనుభవం.
వింజమూరి లక్ష్మి, వి.బి.కనకదుర్గ, పాకాల సావిత్రీదేవి, ఎన్‌సివి జగన్నాథాచార్యులు గానం చేసిన సుప్రభాతాలు, శ్రావ్యమైన లలిత గీతాలు, దేశభక్తిని ప్రచోదనం చేసే పాటలు, ఎన్‌సివి జగన్నాథాచార్యులు, కనకదుర్గ పాడిన ‘శ్రీ సత్యనారాయణ స్వామి సుప్రభాతం’ రేడియోకే దివ్యాభరణాలై లక్షలాది శ్రోతలను అలరిస్తున్నాయి.
మంగళంపల్లి బాలమురళీకృష్ణ విజయవాడ కేంద్రంలో లలిత సంగీత శాఖకు ప్రొడ్యూసర్‌గా ఉన్న రోజుల్లో మధురంగా పాడిన ‘పిబరే రామరసం, స్థిరతా నహిరే, చేతః శ్రీరామం’ శ్రోతలు ఈ రోజుకీ ఎంతో ఆసక్తిగా వింటారు. అన్నమయ్య కీర్తనలు అప్పటికింకా వెలుగులోకి రాలేదు. భక్తిరంజని కోసం, బాలమురళీ పాడిన ‘ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది’ అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుల వారు రాసిన కీర్తనతో విజయవాడ కేంద్రం నుంచి అన్నమాచార్య కీర్తనల ప్రచారం ప్రారంభమైందంటారు.
మాయతో కూడిన పరమాత్మ పాలలో నెయ్యిలా ప్రతి జీవిలోనూ అంతర్యామిలా ఉంటాడు. ఆ స్వామికి జీవుల ఆవేదనలు చెప్పి వాటికి శరణాగతి మార్గాన్ని సూచించే ఈ ఉత్తమ రచన ‘రేవగుప్తి’ రాగంలో బాలమురళీకృష్ణ కంపోజ్ చేసి పాడి ప్రసిద్ధం చేశారు.
రజనీగా ప్రసిద్ధుడైన సంగీత సాహిత్య సవ్యసాచి బాలాంత్రపు రజనీకాంతరావు రేడియో కోసమే పుట్టిన వ్యక్తి. రేడియో ప్రాభవానికి ముఖ్య కారకుడై ‘యింతింతై, వటుడింతయై మఱియు తానింతై నభోవీధిపై నంతై, జాతీయ అంతర్జాతీయ పురస్కారాలందుకున్న వాగ్గేయకారుడు. జాతీయ స్థాయిలో రేడియో పురస్కారాలందుకున్న మొదటి వ్యక్తి ఆయనే. ‘శ్రీ సూర్యనారాయణా మేలుకో’ ఎం.వి.రమణమూర్తి, శ్రీరంగం గోపాలరత్నం పాడిన ఈ సూర్యస్తుతికి సంగీత మాధుర్యం నింపినది రజనీయే.
ఒకవైపు మల్లిక్, మరోవైపు పాలగుమ్మి విశ్వనాథం భక్తిరంజని కోసం చేసిన వాటిలో ‘రాజరాజేశ్వరీ మంత్రమాతృకాస్తవం, ఉపాసనా గీతాలు (దేవులపల్లి) ఎంతో ప్రజాదరణ పొందాయి. చిత్తరంజన్, మంచాల జగన్నాథరావు హైదరాబాద్ రేడియో కేంద్రానికి చేసిన సంగీత సేవ అనుపమానం.
‘నా నోట నీ మాట గానమయ్యే వేళ
నా గుండె నీవుండి మ్రోగించవా వీణ
రాగమెరుగని వీణ రక్తినెరుగని వీణ
తీగపై నీ చేయి తీయకే గడియేని
అంతరాంతరము నీ అమృతవీణే యైన
మాట కీర్తనవౌను మనికి నర్తనవౌను’
దేవులపల్లి కృష్ణశాస్ర్తీ రేడియోలో ప్రొడ్యూసర్‌గా వుండే రోజుల్లో రాసిన ప్రార్థనా గీతమిది. తుదిలేని యాత్ర యిది, ఎటులనేనీ లీల కీర్తింతు, దరిద్ర నారాయణ లోకేశ, జయముజ్ఞాన ప్రభాకరా.. లాంటివెన్నో భక్తిరంజనిలో ప్రసారవౌతూ శ్రోతలను రంజింప జేస్తున్నాయి.
మన దేశంలో రేడియో ప్రసారాలు, ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చి చూస్తే ఏ మాత్రం ఆలస్యం కాకుండానే మొదలయ్యాయి. నిజం చెప్పాలంటే ప్రజల్లో రేడియో ప్రసారాలను వినే ఆసక్తిని రేకెత్తించిన మొదటి కార్యక్రమం ‘్భక్తిరంజని’యే. క్రమంగా రేడియో శ్రోతలను పెంచిన కార్యక్రమం ఇదే. 1947లో దేశ విభజన జరిగే సమయానికి ఢిల్లీ, ముంబై, కలకత్తా, లక్నో, మద్రాసు, తిరుచ్చిరాపల్లి, విడిపోయిన పాకిస్తాన్‌లో కొన్ని కేంద్రాలున్నాయి. దక్షిణ భారతదేశంలో మొదటిది మద్రాసు ఆలిండియా రేడియో కేంద్రమే. అప్పట్లో తెలుగు భాషా ప్రసారాలు మద్రాసు కేంద్రం నుంచి ప్రసారవౌతూండేవి. భక్తి రంజని.. రజని తెలుగు విభాగంలో వుండే రోజుల్లో శుక్రవారాల్లో రాత్రి 10 గంటల నుండి 10.30 వరకు ప్రసారమవుతూండేవి. విజయవాడ కేంద్రం నుండి ఉదయ సమయాల్లో ఈ భక్తిరంజని 6.20 నుండి 7 గంటల వరకూ ప్రసారమవుతూండేది. తర్వాత సమయాలు మారాయి. కీర్తనలే గాకుండా దండకాలు, వచనాలు, స్తోత్రాలు, మేలుకొలుపులు ప్రసారమవుతూ శ్రోతల్లో రేడియో పట్ల గౌరవాన్ని పెంచాయి. విశేషమేమంటే భక్తిరంజనిలో ప్రసారమయ్యే కీర్తనలన్నీ సంప్రదాయ సంగీత పరిధిలో ఉంటూ శ్రోతల్లో సంగీతాభిరుచిని కూడా కలిగించటం గమనార్హం.
మద్దిరాల వెంకట రాయకవి (పిఠాపురం) రచించిన ‘ఏకాంతసేవా విలాసం’ (కుక్కుటేశ్వర రాజరాజేశ్వరీ విలాసం) వోలేటి వేంకటేశ్వర్లు, రజని కలిసి తయారుచేశారు.
దీనికోసం పిఠాపురం నుంచి ఆలయ పూజారిని రప్పించి ఆయన పఠనం చేస్తున్నప్పుడు వినిపించే రాగాలు, స్వరాలు తీసి తయారుచేశారు.
భద్రాచలం, యాదగిరి, వేములవాడ సుప్రభాతాలను రజని సంగీతంతో రికార్డయ్యాయి.
రజని, వింజమూరి వరద రాజయ్యంగారు కలిసి ‘యాదగిరి సుప్రభాతం’ రికార్డు చేశారు. ‘రహస్యం’ చిత్రానికి ఘంటసాల వెంకటేశ్వర్రావు కంపోజ్ చేసిన ‘గిరిజా కల్యాణం’ యక్షగానం హైదరాబాద్ ఆలిండియా రేడియో కేంద్రంలో రికార్డు చేశారు. ఘంటసాలే పాడటం విశేషం. విజయవాడలో ‘సువార్త వాణి’ అనే రికార్డింగ్ స్టూడియో వుండేది. 1971-76 ప్రాంతాల్లో రెవరెండ్ సాల్మన్ రాజు ఆ ప్రసార కేంద్రానికి డైరెక్టర్‌గా ఉంటూ ఎన్నో క్రైస్తవ భక్తిగీతాలు కంపోజ్ చేసి పాడిస్తూ వుండేవారు. ఆ పాటలు రేడియో కేంద్రానికిచ్చేవారు.
చంద్రకాంత కొట్నీస్, ఎ.పి.కోమల, జి.ఆనంద్, గోవిందాచార్యులు (శ్రీరంగం గోపాలరత్నం అన్నగారు) పాడిన ‘కొనియాడ తరమా.. కోమల హృదయా’ అనే క్రైస్తవ భక్తిగీతం బహుళ ప్రసిద్ధమైంది.
ఆదివారాల్లో ప్రసారమయ్యే క్రైస్తవ భక్తిగీతాలకూ, శుక్రవారాల్లోని నాత్-ఎ నబీ, నాతియా కలాం వంటి భక్తిరస ప్రధానమైన రచనలకు ఆకర్షణ ఇంతవరకూ తగ్గలేదు. ఇళ్లల్లో, పూజా మందిరాల్లో ప్రశాంతమైన చక్కని ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించటానికి కారణం ఆకాశవాణి భక్తిరంజనియే అంటే అతిశయోక్తి కాదు. ఆ కాలంలో ప్రొడ్యూసర్లు ఎంతో అంకిత భావంతో కార్యక్రమాలు రూపొందించేవారు. తు.చ అమలు చేయటం వరకే కార్యనిర్వహణాధికారి బాధ్యత. ఆదివారాల్లో విధిగా ప్రసారవౌతుండే ఆధాత్మ రామాయణ కీర్తనలు’ భక్తిరంజనికే తలమానికం. కాళహస్తి సంస్థానంలోని మునిపల్లె సుబ్రహ్మణ్య కవి ఈ ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలకో ప్రత్యేకతను అందించారు. శుద్ధ సంప్రదాయ సంగీత ధోరణితో ఉండే ఈ కీర్తనలు ఒకప్పుడు మన ఇళ్లల్లో మన అమ్మమ్మలు, బామ్మలు పాడుతూండేవారు.
శివపార్వతుల సంవాదంతో ప్రధానంగా ‘రామాయణ కథ’ చక్కని వరుసలలో పాడటం వీటి ప్రత్యేకత. జొన్నలగడ్డ శివశంకర శాస్ర్తీ ఈ కీర్తనలను పాడి ప్రచారం చేశారు. నారాయణతీర్థుల తరంగాలు, రామదాసు కీర్తనలు మాదిరిగా రాగభావంతో నిండి, సరళమైన తెలుగు భాషలో రచించిన ఈ కీర్తనలు వినటానికి ఎంతో హృద్యంగా ఉంటాయి. సంప్రదాయ సంగీత సౌరభంతో నిండిన ఈ కీర్తనలు పాడిన శివశంకర శాస్ర్తీని విజయవాడ కేంద్రానికి పిలిచి రికార్డు చేసి, వాటికి నొటేషన్ తయారుచేసి నేదునూరి కృష్ణమూర్తి, ఎ.వి.ఎస్. కృష్ణారావు, నూకల చిన సత్యనారాయణ, ఎం.ఎస్.బాలసుబ్రహ్మణ్య శర్మ, ఎన్.సి.వి. జగన్నాథాచార్యులు, బలిజేపల్లి రామకృష్ణ శాస్ర్తీ (బలిజేపల్లి సీతారామయ్య పుత్రుడు, త్యాగరాజుకు సమకాలీనుడు) గోపాలరత్నం, వి.బి.కనకదుర్గ, వింజమూరి లక్ష్మి మొదలైన సమర్థులైన విద్వాంసులతో 4,5 రోజులపాటు బాగా రిహార్సల్స్ చేయించి, పాడించిన ఘనత వోలేటి వేంకటేశ్వర్లుకే దక్కుతుంది.
ఉర్దూలో మెసదీ హసన్ వంటి మహాగాయకుల నాత్ ఎ - నబీలు, యువతరం గాయకుల భక్తిరస ప్రధానమైన రచనలు శుక్రవారాల్లో ప్రసారవౌతూ రేడియో పట్ల భక్తి భావాన్ని పెంచుతూ వస్తున్నాయి.
కాలం మారిపోయింది. అభిరుచులలో తేడా. రేడియో తప్ప మరే యితర మాధ్యమాలు లేని రోజుల్లో నేను రేడియోలో చేరేనాటి పరిస్థితులు ఇప్పుడు లేవు.
అనేక టీవీ ఛానెళ్లు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. స్థిమితంగా కూర్చుని వినటం పోయింది. రేడియో అధికారుల సంఖ్యలో మార్పు లేదు. కాని దక్షులైన ప్రొడ్యూసర్లు లేరు. మంచికంటే చెడు చూసేందుకూ వినేందుకూ అలవాటు పడిపోతున్న జనం దృష్టిని మరలించటంలో ఆలిండియా రేడియో పాత్ర చాలా వరకూ పరిమితమై పోయింది. నాలుగు రోడ్ల కూడలిలో విస్తుపడి చూస్తోంది.
కానీ ఆనాటి వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా మహామహులు పాడిన పాటలు, పద్యాలు, కీర్తనలు అదృష్టం కొద్దీ ప్రసార యోగ్యతతో వుంటూ రేడియో ఉనికిని కాపాడుతున్నాయి. అక్కడికదే పదివేలు.
అధికారులెందరో వస్తూ పోతూంటారు. కానీ ఆర్టిస్టులు కొందరే పుడ్తారు. గత వైభవాన్ని దృష్టిలో ఉంచుకుంటూ ఎన్నో కొత్త కార్యక్రమాలు రూపొందిస్తే రేడియో నేస్తాన్ని ఇంకా వదలకుండా వినే శ్రోతలు లేకపోలేదు. కానీ ఏం ప్రయోజనం? ఆర్థిక వనరులు తగ్గిపోయాయి. సృజనాత్మకతతో, వైవిధ్య భరిత కార్యక్రమాల రూపకల్పన చేయగలిగిన నిష్ణాతులైన ప్రొడ్యూసర్ వ్యవస్థ లేకపోవటం రేడియోకు ఒక పెద్ద లోపం, శాపం.
*

చిత్రాలు..భక్తిరంజని సృష్టికర్త బాలాంత్రపు రజనీకాంతరావును ఇటీవలే కలసి
గతస్మృతులను ముచ్చటించిన మల్లాది సూరిబాబు

*నిల్చున్నవారు (ఎడమనుంచి) : దత్తాడ పాండురంగరాజు, ఎంసివి జగన్నాథశర్మ, ఎస్‌వి గోవిందాచార్యులు (శ్రీరంగం
గోపాలరత్నం సోదరుడు), ఓలేటి వేంకటేశ్వర్లు, ఆయన తరువాత రెండోవ్యక్తి బందా కనక లింగేశ్వర రావు, బాలమురళీకృష్ణ, ఎన్.వి.రమణమూర్తి, ప్రయాగ నరసింహశాస్ర్తీ
కూర్చున్నవారు (కుడినుంచి) : వి.బి.కనకదుర్గ, వింజమూరి లక్ష్మి (మూడవ వ్యక్తి), శ్రీరంగం గోపాలరత్నం, వింజమూరి సరస్వతి, కౌతం ప్రియంవద, వి.బాలత్రిపుర సుందరి

- మల్లాది సూరిబాబు 9052765490