ప్రకాశం

రైతులకు అండగా నిలుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, ఫిబ్రవరి 20: వైసిపి అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 93వ రోజు మంగళవారం పొన్నలూరు మండలంలోని విప్పగుంట,చౌటపాలెం, లింగంగుంట, మాలెపాడు, తిమ్మపాలెం వరకు 13.5 కిలోమీటర్లు జగన్ పాదయాత్ర సాగింది. విప్పగుంట శివారు నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్రకు రైతులు, వృద్దులు, మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. జగన్ వారికి అభివాదం చేస్తూ చౌటపాలెంలోని రామాలయం సెంటర్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం లింగంగుంట, మాలెపాడు గ్రామాల్లో పాదయాత్ర జరిగింది. ఈసందర్భంగా పొగాకు రైతులు జగన్‌ను కలిసి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రైతులను ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ దేవుడు దయవల్ల మనందరి ప్రభుత్వం వచ్చాక రైతులకు వ్యవసాయాన్ని పండుగలా మారుస్తానని, అందుకోసం వ్యవసాయానికి పగలు 9 గంటలు విద్యుత్ సరఫరా, పాడి పరిశ్రమ అభివృద్దికి లీటరు పాలకు రూ.4లను అదనంగా ప్రోత్సాహక ధర చెల్లిస్తామన్నారు. రైతులకు పశువులను పంపిణీ చేయడంతోపాటు వాటి వైద్య సహాయం కోసం 102 సర్వీసులు నిర్వహిస్తామన్నారు. వేరుశనగ రైతులు జగన్‌ను కలిసి క్వింటాకు రూ.5,600 ధర ఉండగా, రైతులకు రూ.3600 కూడా దక్కడం లేదని మినుములది ఇదే పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేసారు. జామాయిల్ మద్దతు ధర రూ.4,600 కాగా టన్ను రూ.1800 మాత్రమే అడుగుతున్నారని, ఈ ప్రాంతంలో పేపరు మిల్లును ఏర్పాటు చేయాలని జగన్‌ను కోరారు. బత్తాయి రైతు ఎన్ నరసారెడ్డి మాట్లాడుతూ మూడేళ్లుగా వర్షాలు లేక తనకున్న 4 ఎకరాల బత్తాయి తోట ఎండిపోయిందని, తోటనే నమ్ముకున్న తాను ఎలా జీవించాలని జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసారు. స్పందించిన జగన్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చాక రూ.4వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయనిధిని ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామన్నారు. అంతే కాకుండా రైతుల పొలాల్లో పనిచేస్తూ పాములు, విషకీటకాలు కరవడం వల్ల రైతులు చనిపోతున్నారని, వారిని ఆదుకోవాలని రైతులు కోరగా వైఎస్‌ఆర్ భీమా పేరుతో కొత్త పధకాన్ని అమలు చేసి తద్వారా రైతులను ఆదుకుంటామని, అవాంఛనీయ సంఘటనలు వల్ల లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షలు అందిస్తామన్నారు. పొగాకు రైతు సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పొగాకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో సాగు తగ్గించామని, బ్యారన్‌కు రూ.10లక్షలు సహాయం చేస్తే పొగాకు సాగును వదిలి వేస్తామని రైతులు జగన్‌ను కోరారు. తాము అధికారం లోకి వస్తే బ్యారన్‌ను మంచి ధరలకు కొనుగోలు చేస్తామని వెల్లడించారు. ఈసందర్భంగా జగన్‌ను మాలెపాడుకు చెందిన మహిళలు సమస్యలపై వినతిపత్రం అందజేసారు. ముఖ్యంగా గ్రామంలో బెల్టుషాపులు ఎత్తివేయాలని, సమస్యలపై పోరాడిన తమపై అన్యాయంగా కేసులు నమోదు చేసారని జగన్ దృష్టికి తీసుకుని వచ్చారు. మనందరి పార్టీ వచ్చాక మీకందరికీ న్యాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపి వైవి సుబ్బారెడ్డి, వైసిపి జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనువాసులరెడ్డి, కందుకూరు, కైకలూరు ఇన్‌ఛార్జులు తూమాటి మాధవరావు, నాగేశ్వరరావు, నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎంఎం కొండయ్య, పిచ్చిరెడ్డితోపాటుగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.