ప్రసాదం

సాధకుడు వేయాల్సిన తొలి అడుగులివే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అనుకున్నామని జరగవు అన్ని
అనుకోలేదని ఆగవుకొన్ని
జరిగేవన్నీ మంచికని
అనుకోవడమే మనిషి పని’’-
ఓ చిత్రగీతం చరణంలోని పాదాలే అయినప్పటికీ, అసలైన ఆధ్యాత్మిక తత్త్వాన్ని ఆలోచన విధానం ఎలా వుండాలో విశదీకరించే తత్త్వమది. జీవన పథాన్ని నిర్దేశించే మార్గమిది. ఆధ్యాత్మిక మార్గాన్ని, సాధకుడు అనుసరించాల్సిన చిత్తవృత్తిని ఇంత సరళంగా వివరంగా చెప్పటం, చెప్పగలటం అంత ఆషామాషీ వ్యవహారం కాదు.
ఏది ఏమైనా ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తున్న సాధకుడు ఆచరణలో పెట్టాల్సిన యధార్థమిది. ఎందుకంటే- నేడు ఎందుకు ఇలా జరిగిందో చెప్పలేం. రేపు ఇలా జరుగుతుందని కూడా ఏ మాత్రం ఊహించలేం. జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎలా ఏమి జరుగుతుందో- అంతా అగమ్యగోచరం. అగమ్యగోచరమైన వాటికోసం, అనూహ్యమైన వాటికోసం తలలు బద్ధలుకొట్టుకోవడం, ఆందోళన చెందటం, అశాంతిని పెంచుకోవటం విజ్ఞతేనా? సానుకూల ఆలోచనా సాధనా మార్గమేనా?? నడక ఇచ్చినవాడు, నడిపించేవాడు ఒక్కడు ఉన్నాడనే విశ్వాసంతో, భారమంతా ఆయనమీద పెట్టడం, తన పని తాను చేసుకుపోతుండటం సాధకుని ప్రథమ కర్తవ్యం. జరిగినవాటిని ముందు ఆమోదించి, అంతా మన మంచికే జరుగుతున్నాయి అని అనుకోవాలి. అనుకోగలగాలి. ఆ తత్త్వాన్ని ఆమోదించాలి. అనుభవంలోకి తెచ్చుకోగలగాలి.
ఓసారి- ఓ మహారాజు చెరుకు ముక్కని కత్తితో కొట్టాలనుకున్నాడు. పొరపాటున కత్తిదెబ్బ రాజు వ్రేలిపై పడింది వేలు తెగిపోయింది. రక్తం కారుతోంది. పక్కనే వున్న మంత్రి ‘‘మహారాజా! ఇది మీ మంచి కోసమే’’ అన్నాడు. రాజుకి కోపం వచ్చింది. తన చెడు మంత్రి కోరుతున్నాడు అనుకుని మంత్రిని కారాగారానికి పంపేడు. బందీగా కారాగారానికి వెళ్తున్న మహామంత్రి ‘‘మహారాజా! ఇది కూడా నా మంచికోసమే’’ అన్నాడు. మహారాజుకి మంత్రి చెబుతున్నది ఏ మాత్రం అర్థమవలేదు. కొంతకాలం గడిచింది. రాజు ఒక్కడే వేటకి అడవికి వెళ్ళేడు. మంత్రి జైల్లో ఉండటంవల్ల రాజు అలా ఒంటరిగా వెళ్లవలసి వచ్చింది. బాగా అలసిపోయి మహారాజు ఓ చెట్టుకింద విశ్రమించేడు. అప్పుడు ఆ ప్రదేశం చుట్టుప్క్రల ఆటవికుల కులదేవత పండుగ జరుగుతోంది.
కులదేవతకు పండగ సందర్భంగా నరబలి ఇవ్వాలనుకున్నారు. నరబలి ఇవ్వటంకోసం నరుడి కోసం వెతుకుతున్న ఆటవికులకి మహారాజు కనిపించేడు. మహారాజుని తమ నాయకుడి దగ్గరకి తీసుకువెళ్ళేరు. ఆటవికుల నాయకుడు మహారాజుని చూసి మంచి బలిష్ఠుడైన వాడు దొరికినందుకు మహా సంతోషించేడు. నరబలికి ప్రయత్నాలు చేయమని అనుచరులను ఆదేశించాడు.
మహారాజుని బలి ఇవ్వటానికి రాజు శరీరానికి కుంకుమ పూసేరు. వేపాకులు వగైరాలతో అందంగా ఆటవిక పద్ధతిలో ముస్తాబు చేసేరు. మేళతాళాలతో కులదేవతకు బలి ఇవ్వాలని రాజుని తీసుకువెళ్ళేరు.
బలి ఇచ్చేముందు బలి ఇస్తున్న వ్యక్తి పూర్ణాంగాలతో వున్నాడా లేదా అని పరీక్షించాలన్నాడు బలి తంతు నిర్వహించే పూజారి. ఆటవికులంతా మహారాజును పరీక్షించేరు. పరిశీలనగా చూసేరు. మహారాజు తెగిపోయిన చేతివేలు కనిపించింది. అంగవైకల్యం వున్నవానిని అమ్మ ఒప్పుకోదు. ఛీ ఛీ అని అంతా అనుకుని మహారాజుని వదలిపెట్టేశారు ఆటవికులు.
అప్పుడు రాజుకి మహామంత్రి అన్నమాటల సారం అర్థమయ్యింది. ఈ వేలు లేకపోవడంవల్లనే ఈనాడు నా ప్రాణం దక్కింది అనుకున్నాడు. వేలు తెగినపుడు ‘ఇది మీ మంచికే’ అన్న మహామంత్రి మాటల్లోని సత్యం అర్థమయ్యింది. మంత్రి తాను జైలుకి వెళ్తూ, ఇది నా మంచికే అన్నాడు కదా. అదెలా సాధ్యం? అదెలా సత్యం? తెలుసుకోవాలనుకున్నాడు మహారాజు.
తిన్నగా అడవినుంచి జైలుకి వెళ్ళేడు. మహామంత్రిని కలిసేడు. జరిగిందంతా చెప్పేడు. మరి నీకు జరిగిన మంచి ఏమిటి? అని ప్రశ్నించేడు. దానికి సమాధానంగా మంత్రి ‘‘మహారాజా! నేను జైల్లో ఉండి ఉండకపోతే, మీ వెంట మీతో అరణ్యానికి వచ్చి ఉండేవాడిని. మీకు అంగవైకల్యం ఉంది కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టి, అన్ని అవయవాలు సరిగా ఉన్న నన్ను వాళ్ళ కులదేవతకు బలి ఇచ్చేవారు. నన్ను జైల్లో పెట్టడంవలన నా ప్రాణం నిలబడింది. ఇదీ నాకు జరిగిన మంచి. కాబట్టి ఏది జరిగినా మన మంచికే అనిసెలవిచ్చాడు మహామంత్రి. పూర్తిగా తత్త్వం అర్థమయ్యింది మహారాజుకి.
వేదాలు, వేదాంతాలు, ఉపనిషత్తులు, మహాకావ్యాలు, ఉపదేశ సారాలు, సాధనా మార్గాలు, సాధనా పద్ధతులు, మహనీయుల బోధలు, మహాతత్త్వ ప్రబోధకులు- వెరసి మానవాళికి, సాధకులకి అందిస్తన్న మహోపదేశం. జీవితంలో ఏం జరిగినా, అదంతా మన మంచికే అనే మనస్తత్వాన్ని అలవరచుకోవడం, ఆచరణలోనికి తెచ్చుకోవడం- అనుభవానికి తెచ్చుకోగలగడం. ఇదే ఆధ్యాత్మిక మార్గంలో పయనించే సాధకుడు వేయాల్సిన తొలి అడుగు. *

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669