ప్రకాశం

అష్టకష్టాల్లో ఒంగోలు డెయిరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 22:పూలు అమ్మిన చోటనే కట్టెలు అమ్మే సామెత అక్షరాల ఒంగోలు పాలడెయిరీకి వర్తిస్తుందనే చెప్పవచ్చు. పాల ఉత్పత్తులు, పాల ప్యాకెట్లు, పాల వాహనాలతో నిత్యం కలకళలాడే ఒంగోలు డెయిరీ నేడు బోసిపోయి దర్శనమిస్తోంది. నిన్నమొన్నటి వరకు ప్రైవేటు డెయిరీల పాలతో నెట్టుకువచ్చిన ఒంగోలు డెయిరీ నేడు పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిందనే చెప్పవచ్చు. ప్రైవేటు డెయిరీలు కూడా ఒంగోలు డెయిరీకి పాలను సరఫరా చేయలేని పరిస్ధితులు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆదివారం ఒంగోలు డెయిరీకి రెండువేల లీటర్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెండువేల లీటర్లతోనే సిబ్బంది పాలప్యాకెట్లు చేసినట్లు సమాచారం. పాల సరఫరా లేకపోవటంతో డెయిరీలోని ఒక సెక్షన్‌లో పని ఆగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో రోజుకు 80వేల లీటర్ల వరకు రైతులు పాలు సరఫరా చేసేవారు. నిత్యకళ్యాణం పచ్చతోరణంలా ఉండే ఒంగోలు డెయిరీ నేడు పాలు లభించక వెలవెలబోతున్నా రాష్ట్రప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.
ఇదిలాఉండగా ఒంగోలు డెయిరీ చైర్మన్ ఎన్నిక రాజకీయంగా రచ్చరచ్చగా మారుతోంది. ఇటీవల డెయిరీ చైర్మన్ ఎన్నికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులపై తీవ్రస్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. మాజీ డెయిరీ చైర్మన్ చల్లాశ్రీనివాసరావుపై ముఖ్యమంత్రి మండిపడటంతో కథ మొదటికొచ్చింది. కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శిద్దా వెంకటేశ్వరరావుకు ఆ బాధ్యతలు అగ్నిపరీక్షగా మారాయి. చైర్మన్ పదవి విషయంలో ముఖ్యమంత్రి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తరువాతనే డెయిరీపై పట్టుసాధించాలనే ఉద్ధేశ్యంతో వెంకటేశ్వర్‌రావు ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఒంగోలు డెయిరీని అన్ని విధాలా ఆదుకుంటానని, పూర్వవైభవం తీసుకువస్తానని చైర్మన్ గతంలో ప్రకటించారు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఆర్థికంగా డెయిరీకి నిధులు మంజూరు చేయించటంలో వెనకంజ వేస్తున్నారా అనే చర్చ డెయిరీ వర్గాల్లో మొదలయింది. బ్యాంకుల ద్వారా తన ష్యూరిటీతో నిధులు మంజూరు చేయించి డెయిరీని గట్టెక్కించాలని శిద్దా భావించినట్లు తెలుస్తోంది. కానీ ముఖ్యమంత్రి ఇటీవల డెయిరీ వ్యవహరంపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో శిద్దా యూటర్న్ తీసుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం.
ఇదిలా ఉండగా ప్రభుత్వం కూడా బ్యాంకుల ద్వారా రుణాలను మంజూరు చేయించేందుకు గతంలో చర్యలు చేపట్టింది. కానీ నూతన చైర్మన్‌గా శిద్దాను నియమించిన తరువాత ప్రభుత్వం ఆవైపుగా దృష్టి సారించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఇన్‌చార్జ్ మంత్రి నారాయణ, మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ సైతం ఒంగోలు డెయిరీ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. కానీ ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవటంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గ్రానైట్ రంగంలో విశేష అనుభవం ఉన్న శిద్దా వెంకటేశ్వరరావు ఒంగోలు డెయిరీకి పూర్వవైభవం తీసుకువస్తారని సిబ్బంది, రైతులు ఆశించారు. కానీ ఆచరణ అందుకు భిన్నంగా ఉండటంతో ఆ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒంగోలు డెయిరీ చైర్మన్ వ్యవహరం ముఖ్యమంత్రి కోర్టులో ఉండటంతో అన్ని వర్గాలు ఏం జరుగుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.