ప్రకాశం

ముఖ్యమంత్రి పర్యటనకు భారీగా పోలీసు బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 17 : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం కందుకూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా గుంటూరు రేంజి ఐజి వేణుగోపాల్, జిల్లా ఎస్‌పి సత్య ఏసుబాబు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా విజయవంతంగా ముగియడంతో పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు మొత్తం 1400మందికి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఇందులో గుంటూరు రేంజి వేణుగోపాల్, జిల్లా ఎస్‌పి సత్య ఏసుబాబు, జిల్లా అడిషనల్ ఎస్‌పి ఎబిటి ఉదయరాణిలతోపాటు డీఎస్పీలు 10 మంది, సిఐలు 30 మంది, ఎస్‌ఐలు 90 మంది, ఎఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు కలిపి 150 మంది, పోలీసు కానిస్టేబుళ్లు 700 మంది, హోంగార్డులు 370 మంది, మరికొంత మంది పోలీసులు ఉన్నట్లు జిల్లా పోలీసు అధికారుల ద్వారా సమాచారం. నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు కందుకూరు నియోజకవర్గంలోని పోకూరు, నూకవరం, బడేవారిపాలెం గ్రామాలలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు. అదేవిధంగా కందూరులో నీరు-ప్రగతి కార్యక్రమంలో భాగంగా కందూరు ఎమ్మెల్యే పోతుల రామారావు అధ్యక్షత భారీ బహిరంగ సభ జరిగింది. చంద్రబాబు పర్యటించే ప్రతి కార్యక్రమం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వీరు ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి ఆ తరువాతనే చంద్రబాబు పర్యటనలో ఏర్పాటుచేసిన గ్యాలరీలోకి వెళ్లనిచ్చారు. ప్రస్తుతం వేసవికాలం కావడంతో ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికి వారు గురువారం ఉదయం 7 గంటల నుంచే మండుటెండను సైతం లెక్క చేయకుండా తమ విధులు నిర్వర్తించారు. ఇది చూసిన ప్రజలు అయ్యో పాపం పోలీసులు మండుటెండను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్నారంటూ కొనియాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాల్గొన్న సభలో సైతం పలువురు నాయకులు పోలీసులు తమ డ్యూటీలను సక్రమంగా నిర్వహించడాన్ని అభినందించడం విశేషం. ఇదిలాఉండగా ఒకరిద్దరు పోలీసులు డ్యూటీలో ప్రజల పట్ల అతిగా వ్యవహరించడం పట్ల జిల్లా ఎస్‌పి సత్య ఏసుబాబు సైతం వారిని హెచ్చరించినట్లు సమాచారం .

సజావుగా సాగిన ముఖ్యమంత్రి పర్యటన
* ఊపిరిపీల్చుకున్న అధికారులు
కందుకూరు, మే 17: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన గురువారం ప్రశాంతంగా, సజావుగా ముగిసింది. ముఖ్యమంత్రి పర్యటనను ఎమ్మెల్యే పోతుల రామారావు, రాష్ట్ర అటవీ అభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ దివి శివరాం తోపాటుగా జిల్లాలోని మంత్రులు, జిల్లా కలెక్టర్ , ఇతర అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని సీఎం పర్యటనను విజయవంతం చేశారు. ఉదయం 12.05 నిమిషాలకు పోకూరు చెరువు వద్దకు ముఖ్యమంత్రి చేరుకోగానే ఎమ్మెల్యే పోతుల రామారావుతోపాటుగా మంత్రులు, కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పోకూరు చెరువులో నీరు-ప్రగతి కార్యక్రమంలో పాల్గొని స్వయంగా ముఖ్యమంత్రి జెసిబి యంత్రంతో పోకూరు చెరువు పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వ్యవసాయసానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఇందులో భాగంగానే నీరు-చెట్టు, నీరు-ప్రగతి కార్యక్రమాలు ద్వారా చెరువులో పూడికతీత పనులను పెద్దఎత్తున చేపట్టామన్నారు. పోకూరు చెరువు 1000 ఎకరాల్లో ఉందని 1200 ఎకరాల ఆయకట్టు ఉందని తెలిపారు. అలాగే రాళ్లపాడు ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు ఇది వరుకే రూ.45కోట్లు నిధులు మంజూరు చేసామని, ప్రాజెక్టు నుంచి పోకూరు చెరువుకు రూ.6.30కోట్లతో పైపులైను ఏర్పాటు చేస్తే నీరు వచ్చి రెండు పంటలు పండే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం నూకవరం ఎస్సీ కాలనీలో పర్యటించి విభిన్న ప్రతిభావంతుడు డి కోటయ్యను పరామర్శించి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకుని తక్షణమే రూ.25వేల పారితోషకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా కాలనీలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోగా సానుకూలంగా స్పందించారు. అనంతరం ఎస్సీ సబ్‌ప్లాన్, ఉపాధిహామీ నిధులతో కలిపి రూ.61.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల ఏర్పాటుకు, ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా 41 గృహాల నిర్మాణానికి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అలాగే బడేవారిపాలెంలో రూ.37.50 లక్షల వ్యయంతో అంతర్గత రోడ్లకు, రూ.70లక్షలతో ఎస్సీ సబ్‌ప్లాన్ అభివృద్ధి పనులకు శిలా ఫలకాలను ఆవిష్కరించారు. అలాగే కాకుటూరు చెరువులో నీరు-ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం బడేవారిపాలెంలో రచ్చబండలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఎలా అందుతున్నాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా గ్రామానికి చెందిన ఇంటూరి నరసయ్య రాజధాని నిర్మాణానికి రూ.5లక్షలు విరాళాన్ని ముఖ్యమంత్రికి అందజేసారు. అనంతరం కందుకూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నారు. సీఎం సభ విజయవంతం అయింది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు.

‘విద్యార్థులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి’
మద్దిపాడు, మే 17 : విద్యార్థులు ఆత్మస్థైర్యంతో పని చేస్తే ఏ పనినైనా సాధించవచ్చని స్థానిక పీహెచ్‌సీ వైద్యులు శ్రీవాణి పేర్కొన్నారు. గురువారం స్థానిక శాఖ గ్రంథాలయంలో విద్యార్థులకు వేసవి శిక్షణా తరగతుల్లో ఆమె పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటే విద్యలో రాణింపు పొందుతారని, ముఖ్యంగా వేసవి కాలంలో మజ్జిగ, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆటలు, పాటలు, ఇంగ్లీష్ గేయాలు తదితర అంశాలపై విశ్రాంత ఉపాధ్యాయులు కలాం, డి యలమంద , కె సుబ్బారావు, ఎం సుబ్బారావు, రిటైర్డ్ గ్రంథ పాలకులు జి నరసింహారావు వివరించారు. ఈ శిక్షణలో పాల్గొన్న వారందరికీ గ్రంథ పాలకులు జి శ్యాంసన్ కృతజ్ఞతలు తెలిపారు.