ప్రకాశం

ప్రతి మహిళ ఆర్థికాభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూన్ 23: ప్రతి పేదమహిళ నెలకు కనీసం పదివేల రూపాయల ఆదాయం పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమని జిల్లాకలెక్టర్ వి వినయ్‌చంద్ అన్నారు. శనివారం స్థానిక భాగ్యనగర్‌లోని టిటిడిసి సముదాయంలో 80లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన జిల్లా సమాఖ్య భవనాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్‌తో కలిసి జిల్లాకలెక్టర్ ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ విలేఖర్లతో మాట్లాడుతూ మహిళలు తమకాళ్ళమీద తాము నిలబడి స్వయంశక్తి సాధికారిత సాధించాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అన్నారు. అందుకే ప్రతి 35కుటుంబాలకు ఒక సాధికార మిత్రను నియమించి వారికి ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు చేరవేసేందుకు కృషి జరుగుతోందన్నారు. ప్రతి చిన్న కుటుంబానికి ప్రభుత్వ పథకాల సమాచారం తెలియచేసి సద్వినియోగం చేసుకునే పక్కా వ్యవస్థను ఏర్పాటుచేసిందన్నారు. రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సిఇఒ కృష్ణమోహన్, డిఆర్‌డిఎ పిడి ఎంఎస్ మురళీ, సెర్ప్ సలహాదారు విజయభారతి కృషి అభినందనీయమన్నారు. జిల్లాకే తలమానికంగా, అద్భుతంగా జిల్లా సమాఖ్య భవనం రూపుదిద్దుకుందన్నారు. రాబోయే రోజుల్లో ఈభవనం వెలుగు, డిఆర్‌డిఎ శాఖల ప్రగతిశీల కార్యక్రమాలు, సమావేశాలకు వేదిక కానుందన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలందరికీ ఈసందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ మహిళలు ఆర్ధికంగా బలోపేతం కావటానికి ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు. ముఖ్యంగా గ్రామీణ మహిళల జీవన విధానంలో పెద్దఎత్తున మార్పులు తీసుకువచ్చేందుకు అనేక జీవనోపాధులు కల్పిస్తున్నామన్నారు. అందులోభాగంగానే మహిళలు, విద్యార్థులకు పలురకాల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చే మహిళలు, విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఈ భవనంలో కల్పించడం అభినందనీయమన్నారు. ప్రతినెలా జాబ్‌మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించటం జరుగుతోందన్నారు. ప్రభుత్వం కల్పించే వసతులను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధించాలన్నారు. సెర్ప్ సలహాదారులు విజయభారతి మాట్లాడుతూ రాష్ట్రంలో కోటిమంది మహిళలు సంఘటిత శక్తిగా తయారయ్యారని, మరే రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. జిల్లా సమాఖ్య భవనంలో మహిళలు, విద్యార్థులకు అన్ని వౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. అంతకుముందు దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకం కింద శిక్షణ పొందుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు జిల్లాకలెక్టర్ వినయ్‌చంద్, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రత్యేకంగా రూపొందించిన కిట్లను పంపిణీచేశారు. అనంతరం డిఆర్‌డిఎ పిడి, జిల్లాకలెక్టర్, ఒంగోలు శాసనసభ్యులు సలహాదారు విజయభారతిని ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి ఎంఎస్ మురళీ, జిల్లామహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఈశ్వరమ్మతోపాటు, స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.